‘ప్రక్షాళన’ మలిదశ షురూ! | Revenue department examining land records | Sakshi
Sakshi News home page

‘ప్రక్షాళన’ మలిదశ షురూ!

Published Sat, Dec 30 2017 1:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

Revenue department examining land records - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భూరికార్డుల ప్రక్షాళనలో మలిదశ ప్రక్రియ మొదలైంది. దాదాపు 100 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భూముల రికార్డులను పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం.. జిల్లాలవారీగా రెండోసారి గ్రామసభలను ప్రారంభించింది. ఇప్పటివరకు సరిచేసిన భూరికార్డులతో కూడిన పహాణీలను ఈ గ్రామసభల్లో ప్రదర్శించి.. అభ్యంతరాలేమైనా ఉంటే స్వీకరిస్తారు. అవసరమైతే రికార్డులను సరిచేసి, పూర్తి స్థాయి గ్రామ పహాణీలను సిద్ధం చేస్తారు. వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఆన్‌లైన్‌ పహాణీ  ఆధారంగానే వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందజేయనున్నారు. సెప్టెంబర్‌ 15వ తేదీన ప్రారంభమైన భూరికార్డుల ప్రక్షాళనలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్వే నంబర్ల పరిధి లోని భూముల రికార్డులను 1బీ కాపీల ఆధారంగా పరిశీలించారు.

రాష్ట్రంలోని మొత్తం 1.7 కోట్ల సర్వే నంబర్లలో 2.4 కోట్ల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డుల పరిశీలన పూర్తయింది.  పలు తప్పులను సరిచేశారు. వారసుల పేరిట రికార్డులు మార్చారు. సర్వేనంబర్ల వారీగా ఉన్న భూముల విస్తీర్ణాన్ని సరిపోల్చి.. రైతులకిచ్చిన సబ్‌డివిజన్‌ సర్వే నంబర్లలోని భూముల విస్తీర్ణాన్ని సరిచేశారు. దీంతోపాటు క్లరికల్‌ తప్పిదాలు, పేర్లలో మార్పులు వంటి సవరణలు చేశారు.  కొత్త  పహాణీలను పకడ్బందీగా రూపొందించాలన్న ఆలోచనతో అన్ని జిల్లాల్లో గ్రామాలు, సర్వే నంబర్ల వారీగా కచ్చితంగా మాన్యువల్‌ పహాణీలు రాయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

ఈనెల 31లోపు భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని అధికారికంగా పూర్తి చేయాల్సి ఉన్నందున.. మాన్యువల్‌ పహాణీలు తయారు కాకపోయినా ఎల్‌ఆర్‌యూపీ రికార్డుల ఆధారంగా సాఫ్ట్‌కాపీలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కాపీలను మూడు సెట్లు తీసుకుని.. వీఆర్వో, తహసీల్దార్, కలెక్టర్‌ కార్యాలయాల్లో భద్రపరచాలని ఉన్నతాధికారులు నిర్దేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement