ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమలిపురిలో ఎండిపోయిన రైతు వాగ్యా మిరప తోట
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/ సాక్షి ప్రతినిధి, వరంగల్: మిర్చి సాగు ఈ ఏడాది రైతులను అతలాకుతలం చేసింది. తెగుళ్లు సోకడంతో లాభాలు పక్కనపెడితే చాలాచోట్ల పెట్టుబడులు కూడా దక్కలేదు. అప్పటికే ఉన్న అప్పులకు కొత్త అప్పులు తోడయ్యాయి. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతులు బతుకు చాలిస్తున్నారు. తెగుళ్లను నివారించలేని ఆ పురుగుల మందులనే తాగి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి వరంగల్‌లో ఏడుగురు, ఖమ్మం జిల్లాలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తోంది.
50 శాతానికి పైగా దెబ్బతిన్న పంటలు
తెలంగాణలో 3,58,558 ఎకరాల్లో రైతులు మిర్చి పంటలు వేశారు. అత్యధికంగా వరంగల్, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో 2,82,598 ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారుల గణాంకాలు చెప్తున్నాయి. అయితే అంతుబట్టని తెగులుతో 50 శాతానికి పైగా పంటలు దెబ్బతిన్నాయి.
ఎకరాకు రూ.1.72 లక్షల మేర పెట్టుబడి ఖర్చు చేస్తుండగా.. తెగుళ్ల కారణంగా దిగుబడి గణనీయంగా పడిపోయింది. పంటను కాపాడుకునేందుకు విపరీతంగా పురుగుల మందులు వాడినా ఫలితం లేకపోవడంతో ఎకరాకు 35 క్వింటాళ్ల మేర దిగుబడి రావాల్సి ఉండగా ఐదు క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి నెలకొంది.
లొంగని తెగుళ్లతో తీవ్ర నష్టాలు
రాష్ట్రవ్యాప్తంగా సాగైన పంటలో 2 లక్షల ఎకరాలకు పైగా తెగుళ్లు ఆశించాయి. ఇందులో 1.70 లక్షల ఎకరాల్లో పూర్తిగా పంట నష్టం జరిగింది. జెమిని (గుబ్బ తెగులు), తామర, వేరు కుళ్లు వంటి తెగుళ్ల దాడితో పంట రైతుల చేతికి అందడం లేదు. ఈ తెగుళ్లు వదిలించేందుకు రైతులు రూ.వేలు వెచ్చించి పురుగుల మందు పిచికారీ చేస్తున్నా ఫలితం కానరాలేదు.
మిర్చి సాగుకు ప్రసిద్ధి చెందిన వరంగల్ జిల్లాలో 30 నుంచి 40 బస్తాలు దిగుబడి వస్తుందని భావిస్తే తెగుళ్ల కారణంగా 8 నుంచి 10 బస్తాలకు పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్, జనవరి మాసాల్లో వచ్చిన తీవ్ర చలిగాలులు కూడా కొంత దెబ్బతీశాయి
కేరింతల ఇల్లు రోదిస్తోంది!
మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన నారమళ్ల సంపత్ (25)కు మూడేళ్ల కూతురు ఉండగా ఇటీవలే మరో పాప పుట్టింది. చిన్నారి కేరింతలు కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తాయి. అంతలోనే ఆ యువరైతు సాగు చేసిన మిర్చికి తెగులు సోకింది. పంట దెబ్బ తినడంతో అప్పటికే ఉన్న అప్పుల భారం ఆత్మహత్యకు ప్రేరేపించింది. మిరప చేనులోనే కలుపు మందు తాగి బలవన్మరణం చెందాడు.
సంపత్‌కు మూడున్నర ఎకరాల భూమి ఉంది. ఇందులో అర ఎకరంలో వరి సాగు చేశాడు. మిగతా మూడెకరాలతో పాటు, మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. గతంలోనే ఇతనికి పంట కోసం చేసిన రూ.3 లక్షల అప్పు ఉంది. తాజాగా మిర్చి సాగు చేసి అప్పు తీర్చేద్దామనుకున్నాడు. మరో రూ.5 లక్షలు అప్పు చేశాడు. కానీ తామర తెగులు సోకి పంటంతా దెబ్బతినడం, అప్పులు మీద పడడంతో తీవ్ర ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది.
ఈసారైనా లాభం వస్తుందని..
ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని నెమలిపురి గ్రామానికి చెందిన భూక్య వాగ్యా తనకున్న మూడెకరాలతోపాటు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేశాడు. గత ఏడాది ఇదే పంట సాగు రూ.3.50 లక్షల నష్టం మిగిల్చింది. ఈసారైనా లాభం వస్తుందని ఆశించాడు. తొలుత రూ.40 వేల విలువైన విత్తనాలు విత్తినా నారు చేతికి రాలేదు. దీంతో రూ.లక్ష పెట్టి నారు కొనుగోలు చేశాడు. పంట చేతికి వచ్చే సమయానికి తెగుళ్లు, తామర పురుగు, వైరస్ సోకడంతో దెబ్బతింది.
ఎన్ని మందులు పిచికారీ చేసినా పంట చేతికి రాలేదు. మొత్తం మీద ఈ ఏడాది రూ.4 లక్షలు, గత ఏడాది ఉన్న అప్పు మొత్తం రూ.8 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన వాగ్యా తన తోటలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయనకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. అల్లుడు గత నాలుగేళ్ల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో కూతురూ పుట్టింట్లోనే ఉంటోంది. వాగ్యా మృతితో ఈ కుటుంబం ఇప్పుడు దిక్కులేనిదైంది.
రూపాయి వచ్చే పరిస్థితి లేక..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు దగ్గు సంపత్‌రావు (48). ఈయనది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం శ్యాంనగర్ గ్రామం. భార్య సుమతి, కుమార్తెలు దివ్య, నవ్య ఉన్నారు. తనకున్న ఏడెకరాల భూమిలో నాలుగెకరాలు మొదటి కుమార్తె దివ్యకు ఇచ్చి 2011లో వివాహం చేశాడు. మిగిలిన మూడెకరాలతో పాటు కుమార్తె భూమిని సైతం తానే సాగు చేస్తున్నాడు. గతేడాది ఈ ఏడెకరాలతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని, ఎనిమిదెకరాల్లో మిర్చి, రెండెకరాల్లో వరి సాగు చేశాడు.
అకాల వర్షాలతో మిర్చి దిగుబడి తగ్గడంతో సుమారు రూ. 4 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది తనకున్న ఏడెకరాల్లో మిర్చి పంట వేశాడు. పూతదశలో పంటను తామర పురుగు ఆశించింది. ఎన్ని రకాల క్రిమి సంహారక మందులు కొట్టినా ఫలితం లేకపోయింది. అన్నీ కలిపి పెట్టుబడికి సుమారు రూ.7 లక్షల ఖర్చు అయింది. పంటతో రూపాయి వచ్చే అవకాశం కూడా కన్పించలేదు. అప్పు చెల్లిం చడం ఎలా అన్న ఆవేదనతో ఈ నెల 20న మిర్చి తోటలోనే పురుగుమందు తాగాడు.
ఈ రెండు పట్టికలూ చాలు.. తెగుళ్ల కారణంగా మిర్చి దిగుబడి ఎంత దారుణంగా తగ్గిపోతోందో, రైతులు భారీ నష్టాలు ఎలా మూట గట్టుకుంటన్నారో తెలుసుకునేందుకు.
Comments
Please login to add a commentAdd a comment