కామారెడ్డి: వర్షాల్లేక పత్తి రైతు కళ్లు తేలేస్తున్నాడు. ఆపై తెగుళ్లు దాడి చే స్తుండడంతో పంట చేతికొచ్చే పరిస్థితులు కానరావడం లేదు. గడచిన 45 రోజులుగా వర్షాలు లేకపోవడంతో తెగుళ్లు పట్టుకుంటున్నాయి. తెగుళ్ల నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నా కనీసం పెట్టుబడులు కూడా దక్కే పరిస్థితులు కనిపించడం లేదు.
వర్షాలపై ఆధారపడి పత్తి సాగు చేసిన రైతులు తమ కళ్లముందే పంట నాశనమవుతుండడంతో కంటతడి పెడుతున్నారు. ఎకరా పత్తి సాగుకు రూ. 20 వేలకు పైగా రైతులు ఖర్చు చేశారు. ఈ యేడు జిల్లాలో 20 వేల ఎక రాల్లో పత్తిపంట సాగైంది. విత్తనం నాటిన నుంచి ఎంతో శ్రద్ధతో పంటను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా విత్తనం మొలకెత్తిన తరువాత కలుపు మొక్కలు తీసేయడం నుంచి మొక్కకు కావలసిన ఎరువులు, పురుగు మందులను క్రమం తప్పకుండా అందించారు. అయితే సరైన వర్షాలు లేకపోవడం వల్ల పంటకు రకరకాల తెగుళ్లు సోకుతున్నాయి.
పత్తి చెట్టు ఆకులు ఎర్రబడి రాలిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తికి సోకిన తెగుళ్లను పోగొట్టడానికి రైతులు రకరకాల క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు. అయినా లాభం లేకుండాపోయింది. చాలా చోట్ల మొక్కలు కాయ కాసే దశలో వర్షాలు కురవకపోవడంతో తెగుళ్లు దాడి చేస్తున్నాయి. వర్షాలు పడి ఉంటే తెగుళ్లు తక్కువగా ఉండేవని రైతులు పేర్కొంటున్నారు.
దిగుబడిపై ప్రభావం..
పత్తికి అవసరమైన సమయంలో వర్షాలు కురవకపోవడం వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. పంట బాగుంటే ఎకరాకు 12 క్వింటాళ్ల నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చేది. క్వింటాళుకు పత్తి ధర రూ. 4 వేల వరకు పలుకుతుండడంతో కనీసం ఎకరాకు రూ. 50 వేల వరకు ఆదాయం వచ్చేది.
పెట్టుబడులకు అన్ని కలిపి ఎకరాకు రూ. 30 వేలు ఖర్చయినా తక్కువలో తక్కువ రూ. 20 వేలు మిగిలేవి. అయితే ఈ సారి వర్షాభావ పరిస్థితులతో తెగుళ్లు దాడి చేస్తుండడంతో దిగుబడిపై ప్రభావం చూపుతోంది. కొన్ని గ్రామాల్లో పత్తి పంట బాగానే ఉన్నా కాయకాసే సమయంలో వర్షాలు లేక కాయ రాలిపోయే ప్రమాదం ఉంది.
పత్తి రైతు చిత్తు!
Published Tue, Oct 7 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 PM
Advertisement