కలసిరాని కాలం | farmers are worry to Cultivate tobacco | Sakshi
Sakshi News home page

కలసిరాని కాలం

Published Fri, Mar 10 2017 10:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కలసిరాని కాలం - Sakshi

కలసిరాని కాలం

► ఆశ నిరాశల మధ్య పొగాకు సాగు
► అక్కరకురాని లేత తోటలు
► ఆకు నాణ్యతపై రైతుల బెంగ
► ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు


కొనకనమిట్ల : వాణిజ్య పంటగా పేరుపొందిన పొగాకు సాగు ఈ ఏడాది రైతులకు కలిసి రాలేదు. రెండేళ్లుగా లక్షల్లో నష్టాలు చవిచూసిన రైతులు ఇక సాగుకు దూరమయ్యే పరిస్థతి నెలకొంది. ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు, నిలకడ లేని ధరలు మరోవైపు రైతుల ఆశల్ని నీరుగార్చాయి. ఈ ఏడాది అదునుకు వర్షాలు కురిస్తే అరకొరగానైనా పొగాకు నాట్లు పడతాయని భావించిన పలువురు స్థానికంగా నారుమళ్లు పెంచారు. పెరిగిన పొగనారును  కొనేవారు లేక మడుల్లోనే ముదిరి ఎండిపోయింది. దీంతో కొందరు రైతులు ప్రత్యామ్నయ పంటలవైపు మొగ్గు చూపగా మరికొందరు ఆశ నిరాశలతో పొగాకు సాగు చేపట్టారు.

క్యూరింగ్‌ పనుల్లో రైతన్నలు..: జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది పొగాకు సాగు విస్తీర్ణం సగానికి సగం తగ్గించారు. సాగైన పొలాల్లో ముదురు తోటలు ప్రస్తుతం ఆకు కొట్టుడుకు రావడంతో పలు గ్రామాల్లో క్యూరింగ్‌ పనులు ప్రారంభమయ్యాయి. క్యూరింగ్‌ చేసిన ఆకు నాణ్యత వస్తుందో రాదో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లేత తోటలకు పేనుబంక తెగుళ్లు..: బోర్ల కింద సాగు చేసిన లేత తోటలకు తెగుళ్లు ఆశించడంతో పంట దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడుల మాట అటుంచి, నాణ్యత తగ్గితే పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం లేదని ఆందోళన చెందుతున్నారు. ఖర్చులకు వెనుకాడకుండా నీటి తడులు అందిస్తున్నారు. ముదురు తోటలు దెబ్బతిన్నా, లేత తోటలుతోనైనా పంట ఉత్పత్తి సాధించగలమన్న ఆశతో రైతులు ఉన్నారు.

ఇతర పంటలదీ అదే దారి..: పొగాకు సాగుకు ప్రత్యామ్నాయంగా రైతులు మిర్చి, కంది, మినుము, అలసంద, పప్పుశనగ పంటలు సాగు చేపట్టారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆ పంటలు కూడా అనుకున్న మేర ఉపయోగ పడలేదని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

పదెకరాలు సాగు చేశాను.: గత సంవత్సరం 30 ఎకరాలలో పొగతోట సాగు చేశాను. ఎక్కువగా మాడు ఆకు వచ్చింది. ధరల్లేక నష్టం వచ్చింది. అయినా పంట మీద ఉన్న ఆశతో ఈ ఏడాది మళ్లీ పదెకరాల్లో సాగు చేశా. ఆకు కొట్టుడు, క్యూరింగ్‌ పనులు జరుగుతున్నాయి. వర్షాభావం, తెగుళ్ల బెడదతో పంట దిగుబడి బాగా తగ్గింది. ---పొదిలి తిరుపతయ్య, రైతు,గొట్లగట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement