సాక్షి, అమరావతి: వేరుశనగ రైతులకు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తీపి కబురు అందించింది. బెట్ట పరిస్థితులు.. ఆకుమచ్చ తెగులును తట్టుకోవడమే కాకుండా.. 15 శాతం అదనంగా గింజ దిగుబడినిచ్చే కొత్త వంగడం టీసీజీఎస్–1694 (విశిష్ట) రకాన్ని రానున్న ఖరీఫ్ నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. గతేడాది విడుదల చేసిన టీసీజీఎస్–1694 (విశిష్ట) ప్రయోగాత్మక సాగు విజయవంతం కావడంతో ఖరీఫ్ నుంచి పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారం కింద కదిరి–6 (కే–6), నారాయణి, ధరణి, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో టీఏజీ–24, కే–6 రకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. కానీ.. ఈ రకాలు బెట్ట (నీటి ఎద్దడి)ని తట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు వీటి దిగుబడులపై టిక్కా ఆకుమచ్చ తెగులు తీవ్ర ప్రభావం చూపుతోంది. తెగుళ్ల నివారణకు రెండు, మూడుసార్లు ఖరీదైన శిలీంధ్ర నాశిని మందులను పిచికారీ చేయాల్సి రావడం రైతులకు భారంగా పరిణమించింది.
గింజ శాతంలో కదిరి లేపాక్షిని మించి..
రాష్ట్రంలో ఖరీఫ్‌లో 16.85 లక్షల ఎకరాలు, రబీలో 2.35 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగవుతోంది. వర్షాధార భూముల్లో బెట్ట, తెగుళ్లను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడంలో భాగంగా.. అధిక దిగుబడి ఇచ్చేలా తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం టీసీజీఎస్–1694 (విశిష్ట) వంగడాన్ని రూపొందించింది. కదిరి–6, ఐసీజీ (ఎఫ్‌డీఆర్‌ఎస్)–79 రకాలను సంకరపరచడం ద్వారా దీనిని అభివృద్ధి చేశారు.
2022లో విడుదల చేసిన ఈ విత్తనాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలను సాధించారు. ఇది 25 రోజుల వరకు బెట్టను తట్టుకోగలదు. జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం పొందిన కదిరి లేపాక్షి హెక్టార్‌కు 20నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా.. గింజ దిగుబడి 60 శాతం దాటడం లేదు. కొత్తగా అభివృద్ధి చేసిన విశిష్ట రకం మాత్రం బెట్ట, ఆకుమచ్చ తెగులును తట్టుకోవడంతోపాటు గింజ దిగుబడి శాతం 72నుంచి 75 శాతం నమోదవడం రైతులకు లాభించే అంశం.
దీని విశిష్టతలివీ
♦ పంటకాలం 100–105 రోజులు (ఖరీఫ్), 105–110 రోజులు (రబీ).
♦పొడవు 31–37 సెం.మీ. (ఖరీఫ్), 28–30 సెం.మీ. (రబీ).
♦హెక్టారుకు సగటు దిగుబడి 22–25 క్వింటాళ్లు (ఖరీఫ్), 25–30 క్వింటాళ్లు (రబీ).
♦ 100 గింజల బరువు 42–45 గ్రాములు. గింజ శాతం 72–75.. నూనె శాతం 50.
♦ పైరు లేత ఆకుపచ్చ రంగులో సన్నగా పొడవుగా ఉంటుంది.
♦ఊడలు ఒకేసారి దిగడం వల్ల కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి.
♦ గింజలు లేత గులాబీ రంగులో గుండ్రంగా నున్నగా ఉంటాయి.
బెట్ట, తెగుళ్లను తట్టుకుంది
మాది సముద్ర తీర ప్రాంతం. ఇప్పటివరకు టీఏజీ–24 రకాన్ని ఎక్కువగా సాగు చేశా. కాయల దిగుబడి 16–20 క్వింటాళ్లకు మించి రాలేదు. దాదాపు ప్రతి సీజన్‌లో ఆకుమచ్చ తెగులు బారినపడటంతో సాగు ఖర్చులు భారంగా ఉండేవి. విశిష్ట రకాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేశా.
టీఏజీ–24తో పోలిస్తే పంట కాలం 7నుంచి 10 రోజులు ఆలస్యమైనా బెట్ట, తెగుళ్లను తట్టుకుంది. గింజ నాణ్యత చాలా బాగుంది. సగటు దిగుబడి 22 క్వింటాళ్లు వచ్చింది. – మధుసూదనరావు, రామతీర్థం, నెల్లూరు జిల్లా
గింజ దిగుబడి 75 శాతం నమోదైంది
కే–6 రకం సాగు చేస్తే ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండేది. కదిరి లేపాక్షి రకాన్ని కూడా సాగు చేశా. అది ఎకరాకు 13 æక్వింటాళ్లు వచ్చింది. చీడపీడల ఉధృతి కాస్త తట్టుకున్నప్పటికీ గింజ శాతం తక్కువగా నమోదైంది. ఇప్పుడు విశిష్ట రకాన్ని సాగు చేశా. ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. కానీ.. గింజ శాతం 75గా నమోదైంది. గింజ నాణ్యత కే–6 రకాన్ని పోలి ఉండడంతో మార్కెట్ ధరకు ఢోకా లేదు. – అల్లాబక్షు, తోపుదుర్తి, అనంతపురం
వర్షాభావ ప్రాంతాలకు అనుకూలం
టీసీజీఎస్–1694 (విశిష్ట) వర్షాభావ ప్రాంతాల్లో సాగుకు ఎంతో అనువైనది. ఎకరాకు 50 కేజీల విత్తనం సరిపోతుంది. శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఎరువులు, పురుగుల మందులు వినియోగిస్తే పెట్టుబడి ఎకరాకు రూ.25 వేలకు మించదు.
పంటకాలంలో రెండుసార్లు ఎకరాకు అరకిలో సూక్ష్మ ధాతువులు వేస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు. మదర్ సీడ్ ఉత్పత్తి చేస్తున్నాం. వచ్చే ఖరీఫ్ నుంచి పూర్తిస్థాయి విత్తనం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏపీ సీడ్స్ కృషి చేస్తోంది. – డాక్టర్ ఎ.ప్రసన్న రాజేష్, ప్రధాన శాస్త్రవేత్త, వేరుశనగ పరిశోధనా కేంద్రం
Comments
Please login to add a commentAdd a comment