ఈ-పాస్ ద్వారా విత్తన వేరుశనగ పంపిణీ
ఏప్రిల్ మొదటికి 3.90 లక్షలక్వింటాళ్లు సేకరించాలి
కలెక్టర్ కోన శశిధర్
అనంతపురం అగ్రికల్చర్ : ఈ సారి ఖరీఫ్‌లో ఈ-పాస్ విధానం ద్వారా రైతులకు రాయితీ విత్తన వేరుశనగ పంపిణీకి అవసరమైన ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కోనశశిధర్ వ్యవసాయ శాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తిని ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక రెవెన్యూభవన్‌లో విత్తన సేకరణ, పంపిణీ అంశంపై జేసీ-2 సయ్యద్ ఖాజామొహిద్దీన్‌తో కలిసి వ్యవసాయశాఖ, సేకరణ ఏజెన్సీలు, ఎన్‌జీవోలతో సమీక్షించారు. అర్హులైన ప్రతి రైతుకూ 33 శాతం రాయితీతో 90 కిలోల(మూడు బస్తాలు) చొప్పున విత్తనకాయలు అందజేసేందుకు ఈ సారి కొత్త పద్ధతి అవలంబించనున్నట్లు తెలిపారు. ఎఫ్‌పీ షాపుల్లో మాదిరి ఆన్‌లైన్ బయోమెట్రిక్, ఈ -పాస్ పద్ధతి ద్వారా చేపట్టేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.
ఈ సారి జిల్లాకు కేటాయించిన 3.90 లక్షల క్వింటాళ్ల కే-6, కే-9, ధరణి రకాల విత్తనకాయలను ఏప్రిల్ మొదటి నాటికి నిల్వ చేయాలని సేకరణ ఏజెన్సీలైన ఏపీ సీడ్స్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్‌లను ఆదేశించారు. గతేడాది విత్తన సేకరణ ఆలస్యం కావడంతో పంపిణీ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. ఈసారి అవి పునరావృతం కాకుండా ఉండాలంటే ముందస్తుగా సరఫరా చేయాలన్నారు.
ప్రస్తుత రబీలో కమ్యూనిటీ మేనేజ్‌మెంట్ సీడ్ సిస్టం (సీఎంఎస్‌ఎస్) కింద సాగు చేసిన వేరుశనగ ద్వారా 63,900 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ఇది జిల్లా సరిహద్దులు దాటకుండా ఇక్కడే కొనుగోలు చేయాలని ఆదేశించారు. విత్తన సేకరణ, పంపిణీ ప్రక్రియ ఈ సారి సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీడీఏలు, ఏడీఏలు, ఏవోలు, సేకరణ ఏజెన్సీల అధికారులు, ఎన్‌జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు.