ఖరీఫ్‌కు అరకొర కేటాయింపులు
► విత్తన గండం
► జిల్లా అధికారుల ప్రతిపాదన
► 77111.56 క్వింటాళ్లు మంజూరు 43700 క్వింటాళ్లే..
► వేరుశనగ 35వేల క్వింటాళ్లకే పరిమితం
► పెట్టుబడుల సమస్య తీవ్రం
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖ నెల రోజుల క్రితం నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా ఖరీఫ్‌కు విత్తన కొరత పొంచి ఉంది. పత్తికి ప్రత్యామ్నాయంగా రైతులు ఇతర పంటలపై మొగ్గు చూపుతున్నా.. విత్తన కేటాయింపులు అంతంత మాత్రమే కావడం ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఖరీఫ్ సాధారణ సాగు 6,21,156 హెక్టార్లు. వర్షాలు సక్రమంగా కురిస్తే 7లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది. గత ఏడాది ఎప్పుడూ లేని విధంగా పత్తిని గులాబిరంగు పురుగు తీవ్రంగా నష్టపరచడంతో ఈసారి రైతులు ఆ పంటకు దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయంగా కొర్ర, వేరుశనగ, కంది, మొక్కజొన్న తదితర పెట్టుబడి తక్కువ పంటలపై మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ సీజన్‌కు 77111.56 క్వింటాళ్ల విత్తనాలు ఇవ్వాలని జిల్లా అధికారులు వ్యవసాయ శాఖ కమిషనర్‌ను కోరగా 43,700 క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. ఖరీఫ్‌లో వరి 79,018 హెక్టార్లు.. మొక్కజొన్న 30154 హెక్టార్లు.. కంది 48,228 హెక్టార్లు.. ఆముదం 4,406 హెక్టార్లు.. పత్తి 1,92,248 హెక్టార్లు.. వేరుశనగ 1,04,237 హెక్టార్లు.. ఉల్లి 20746 హెక్టార్లు.. కొర్ర 13613 హెక్టార్లు, జొన్న 14062 హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉంది.
వేరుశనగ కేటాయింపు 35వేల క్వింటాళ్లే..
ఖరీఫ్‌లో వేరుశనగ 1.04 లక్షల హెక్టార్లు సాగవనుంది. హెక్టారుకు రెండు క్వింటాళ్ల వేరుశనగ అవసరం. గత ఏడాది వర్షాభావం వల్ల వేరుశనగ దిగుబడి తగ్గింది. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేసే వేరుశనగపైనే ఆశలు పెట్టుకున్నారు. జిల్లాకు కనీసం లక్ష క్వింటాళ్లు అవసరం కాగా.. జిల్లా వ్యవసాయ అధికారులు 62,499 క్వింటాళ్లు కావాలని కోరారు. అయితే ప్రభుత్వం కె-6 రకం 15వేల క్వింటాళ్లు, కె-9 రకం 6వేలు, ధరణి రకం 10వేలు, అనంత రకం 4వేల క్వింటాళ్ల చొప్పున మొత్తం 35వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. ఇవి 25వేల హెక్టార్లకు కూడా సరిపోని పరిస్థితి. ఇక పచ్చిరొట్ట ఎరువులయిన పిల్లిపెసర, దయంచ విత్తనాలు కూడా అంతంతమాత్రంగానే కేటాయించారు. ఖరీఫ్‌లో వేరుశనగ డిమాండ్ దృష్ట్యా కొందరు దళారీలు రైతుల వద్ద కొని సిద్ధం చేసుకున్నారు.
విత్తన సమయంలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వేరుశనగ సేకరణపై మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్, ఏపీ సీడ్స్ ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడం గమనార్హం.
ఖరీఫ్‌కు 3,32,054 టన్నుల ఎరువులు
ఖరీఫ్ సీజన్‌కు 3,32,054 టన్నుల ఎరువులు అవసరం కానున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు కమిషనర్‌కు నివేదించారు. యూరియా 111255 టన్నులు, డీఏపీ 64474 టన్నులు, ఎంఓపీ 16200 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 140125 టన్నులు అవసరం అవుతాయని ప్రతిపాదించారు.
రైతులకు పంట రుణాలు దక్కేనా..
రైతులకు ప్రధాన సమస్య పెట్టుబడులు. వరుస కరువు నేపథ్యంలో ఈసారి పెట్టుబడులకు తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి బ్యాంకులపైనే. ఖరీఫ్‌లో రూ.2794.65 కోట్లు.. రబీలో రూ.1333.25 కోట్లు పంట రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు రైతులకు రుణాలు దక్కుతాయా అనేది ప్రశ్నార్థకం.