సాక్షి, హైదరాబాద్: బీజీ–2 పత్తి విత్తన ధరలు పెంచేందుకు పలు కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. ఈ మేరకు కేంద్రంపై ఒత్తిడి పెంచా యి. ఆయా పత్తి విత్తన కంపెనీలు చేస్తున్న ఒత్తిడికి కేంద్రం తలొగ్గిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 22న కేంద్ర పత్తి విత్తన ధరల నిర్ణాయక కమిటీ సమావేశంలో ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటారు.
దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నందున ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై చర్చ జరుగుతోంది. గతేడాది కంటే ఈసారి బీజీ–2 విత్తన ధరను రూ.170 అదనంగా పెంచాలని కంపెనీలు కేంద్రానికి విన్నవించాయి. ఇదిగాక రాయల్టీని వేరుగా వేస్తే రైతులకు అదనపు భారమే కానుంది. వాస్తవానికి గులాబీ రంగు పురుగుతో పత్తి నాశనం అవుతున్నా మళ్లీ బీజీ–2నే అదీ అధిక ధరకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తుండటం విస్మయం కలిగిస్తోంది.
రూ.169 కోట్ల భారం
రాష్ట్రంలో అన్ని పంటల కంటే పత్తినే అధికంగా సాగవుతోంది. గత ఖరీఫ్‌లో ఏకంగా 47.72 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అంటే మొత్తం సాగు విస్తీర్ణంలో సగం పత్తి పంటే ఉంది. ఆ ప్రకారం రాష్ట్రంలో కోటి విత్తన ప్యాకెట్లు అవసరమవుతాయి. గతేడాది బీజీ–2 విత్తన ప్యాకెట్ (450 గ్రాములు) ధర రూ.781, కాగా దానికి రాయల్టీ రూ.49 కలిపి గరిష్ట చిల్లర ధర (ఎంఆర్‌పీ) రూ.830గా ఖరారు చేశారు.
ఈసారి కంపెనీలు రాయల్టీ కాకుండా రూ.950గా ప్రతిపాదించాయి. గతేడాదితో పోలిస్తే రూ.169 అదనంగా విక్రయించేందుకు సిద్ధమయ్యాయి. రాయల్టీ విషయాన్ని ఎక్కడా ప్రతిపాదించకున్నా గతేడాది ప్రకారం రాయల్టీ ఇచ్చినా ఒక్కో ప్యాకెట్ రూ.999 కానుంది. ఇలా రాష్ట్ర రైతాంగాన్ని దోపిడీ చేసేందుకు పత్తి కంపెనీలు కుట్రలు పన్నాయి. ధరలు పెంచడం ద్వారా ఏకంగా రూ.169 కోట్లు అదనంగా రాబట్టాలని నిర్ణయించుకున్నాయి.
రైతుకు గత్యంతరం లేదనేనా?
రైతుకు గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. జీవ వైవిధ్యానికి ముప్పు కారణంగా బీజీ–3కి అనుమతి లేదు. బీజీ–2 వేసినా గులాబీ రంగు పురుగు సోకి రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంట సర్వనాశనమైంది. అయినా వచ్చే ఖరీఫ్ సీజన్‌కు అదే విత్తనాన్ని రైతులకు అంటగట్టేందుకు విత్తన కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. రానున్న ఖరీఫ్‌లో రైతులు పత్తి వేయాలంటే విఫలమైన ఈ విత్తనాలే గత్యంతరమయ్యాయి. వాటికి ప్రత్యామ్నాయంగా ఏ విత్తనమూ రాలేదు. ఏ విత్తనం వేయాలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వడంలేదు.
Comments
Please login to add a commentAdd a comment