‘తెల్ల’ బంగారం.. విత్తు కలవరం! | white gold seed disturbing | Sakshi
Sakshi News home page

‘తెల్ల’ బంగారం.. విత్తు కలవరం!

Published Wed, May 24 2017 10:59 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM

‘తెల్ల’ బంగారం.. విత్తు కలవరం!

‘తెల్ల’ బంగారం.. విత్తు కలవరం!

నకిలీ పత్తి విత్తనాల అడ్డా కర్నూలు
- బీటీ విత్తనాలపై లోపించిన నిఘా
- ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచే రవాణా
- ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతుండటంతో జోరుగా విక్రయాలు
- గ్రామాల్లో కిలోల చొప్పున దందా
- మౌనం వీడని వ్యవసాయ శాఖ
 
  •  గత ఏడాది ఏప్రిల్‌ నెలలో కర్నూలు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో వ్యవసాయ, విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి ప్రాసెసింగ్‌ చేసి గ్రామాలకు తరలించేందుకు సిద్ధం చేసిన  268 కిలోల నకిలీ బీటీ పత్తి విత్తనాలు సీజ్‌ చేశారు.
  • హొళగుంద మండలంలో గత ఏడాది మేలో వ్యవసాయ, పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించి 148 కిలోల బీటీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
  • గత ఏడాది ఏప్రిల్‌ నుంచి జూలై వరకు వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి దాదాపు రూ.కోటి విలువ చేసే బీటీ పత్తి విత్తనాలపై స్టాప్‌ సేల్‌ విధించారు.
  • ఈ సీజన్‌లో మొదటిసారి ఎమ్మిగనూరులో 60 నకిలీ బీటీ విత్తన ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.
  •  వాస్తవానికి గ్రామాల్లో ఇప్పటికే నకిలీ బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల విక్రయం జోరుగా సాగుతున్నా అధికారులు తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది.
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ ముంచుకొస్తున్న తరుణంలో నకిలీ పత్తి విత్తనాల బెడద రైతులను కలవరపరుస్తోంది. గత ఏడాది జిల్లాలో 1.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. నకిలీల కారణంగా మొక్కలు ఏపుగా పెరిగినా పూత, కాయ రాకపోవడంతో రైతులు పంట నష్టపోయారు. పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల్లో దాదాపు 5వేల హెక్టార్లలో పంటలు దెబ్బతినడం గమనార్హం. ఈ నకిలీ వ్యాపారంలో కొందరు టీడీపీ నేతలు క్రియాశీలకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదోని రెవెన్యూ డివిజన్‌లో దాదాపు 80 శాతం గ్రామాల్లో టీడీపీ వర్గీయులు ఈ వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం. అందువల్లే వ్యవసాయాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. గత ఏడాది మొత్తం మీద పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండటం, గులాబి రంగు పురుగు బెడద తగ్గడం.. ధరలు కూడా మెరుగ్గా ఉండటంతో ఈ ఏడాది పత్తి భారీగా సాగయ్యే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం 2.05 లక్షల హెక్టార్లలో పత్తి సాగు కావచ్చని అంచనా వేసింది. ప్రభుత్వం జిల్లాకు వివిధ కంపెనీలకు చెందిన 10.15 లక్షల బీటీ విత్తన ప్యాకెట్లు కేటాయించింది. అయితే ఇంతవరకు బీటీ విత్తన ప్యాకెట్లు పొజిషన్‌ కాలేదు. ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తుండటంతో నకిలీ బీటీ పత్తి విత్తనాల బెడద అధికమైంది. ఇటీవల ఎమ్మిగనూరు మండలంలో 60 ప్యాకెట్ల నకిలీ విత్తన ప్యాకెట్లు పట్టుబడ్డాయి. తాజాగా పత్తికొండ మండలం కనకదిన్నెలో నాలుగు క్వింటాళ్ల నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోనే కాకుండా.. గుంటూరు, ఒంగోలు జిల్లాలకూ ఈ నకిలీలు తరలివెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
ఆకర్షణీయమైన ప్యాకింగ్‌
నకిలీ విత్తనాలపై రైతులకు అనుమానం రాకుండా పేరొందిన కంపెనీలు, వాటి విత్తన రకాల పేర్లతో ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో విక్రయిస్తుండటం గమనార్హం. కర్నూలు సబ్‌ డివిజన్‌తో పాటు ఆదోని డివిజన్‌లోని దాదాపు ప్రతి గ్రామంలో నకిలీ విత్తన వ్యాపారులు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుని విక్రయించుకోవచ్చు. కానీ కొందరు అక్రమార్కులు పత్తి జిన్నింగ్‌ మిల్లుల నుంచి విత్తనాలు సేకరించి ప్రాసెసింగ్‌ చేసే రంగులు అద్ది, అందగా ప్యాక్‌ చేసి బీటీ–2 పేర్లతో మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా కూడా నకిలీ బీటీ విత్తనాలు ఇతర జిల్లాలకు తరలుతున్నట్లు సమాచారం.
 
కొరవడిన తనిఖీలు
ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తున్నా నకిలీ విత్తనాలపై ఇటు వ్యవసాయ శాఖ, అటు విజిలెన్స్‌ అధికారులు దృష్టి సారించడం లేదు. గత ఏడాది జనవరి నెల నుంచే నకిలీ బీటీ విత్తనాలపై దాడులు చేసి నకిలీ విత్తనాలను సీజ్‌ చేశారు. ఈసారి తనిఖీలు కొరవడ్డాయి. నిఘా లేకపోవడంతో అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా నకిలీ విత్తనాలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
 
అనధికార విత్తనాలు కొనొద్దు
రైతులు గ్రామాల్లో విక్రయించే అనధికార విత్తనాలు కొనుగోలు చేయరాదు. లైసెన్స్‌ కలిగిన డీలర్‌ వద్దనే విత్తనాలు కొనుగోలు చేసి బిల్లు తీసుకోవాలి. నకిలీ విత్తనాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నాం. అనధికారికంగా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు.
- ఉమామహేశ్వరమ్మ, జేడీఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement