‘కంది’పోతున్న రైతులు
గిట్టుబాటు కాని ధర
► గతేడాది రూ.9600.. ఇప్పుడు రూ.5050
► జిల్లాలో 5,862 ఎకరాల్లో సాగు
సిరిసిల్ల : రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా కంది పంట వేసుకోవాలని ఖరీఫ్ ఆరంభంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలామంది రైతులు పత్తికి బదులు కందిని సాగుచేశారు. ప్ర స్తుతం గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 5862 ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు. ఖరీ ఫ్ సీజన్ లో వేసిన కంది పంట ఇప్పుడు చేతికందుతుండగా.. మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
పెరిగిన పెట్టుబడులు..
ఈ ఏడాది కాలం మంచిగా కావడంతో వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి. భూమి దున్నడం నుంచి విత్తనాలకు, విత్తుకోవడం, ఎరువులు, కలుపుతీత వరకు అన్ని కూలీలు పెరిగాయి. ఎకరం కంది సాగుకు రూ. 8వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చులయ్యాయి. నల్లరేగడి భూముల్లో ఎకరానికి 4 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. తేలిక నేలల్లో మూడు క్వింటాళ్ల మేరకు దిగుబడి వచ్చింది. అటు దిగుబడి లేక.. ఇటు గిట్టుబాటు ధర లేక కంది రైతులు దిక్కులు చూస్తున్నారు.
అరకొర మద్ధతు ధర..
కంది గింజలకు గత ఏడాది బహిరంగ మార్కెట్‌లోనే క్వింటాలు ధర రూ.8800 నుంచి రూ. 9600 వరకు పలికింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధర రూ 4625 ప్రకటించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.425 బోనస్ ప్రకటించింది. దీంతో కందులకు రూ.5050 మద్ధతు ధర ఉంది. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ యార్డు, రుద్రంగి మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎకరానికి మూడు, నాలుగు క్వింటాళ్ల దిగుబడి రావడంతో ఈ లెక్కన కంది రైతులకు పెట్టుబడులు సైతం చేతికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అదే పత్తి వేసుకున్న రైతులకు ధర బాగా పలికింది.