50 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ సాగు
► అందులో పత్తి సాగే 30.85 లక్షల ఎకరాలు
► ఇంకా మొదలుకాని వరి నారు...
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ జోరుమీదుంది. అధిక వర్షాలు నమోదు కావడంతో పంటల సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిపోతోంది. రుతుపవనాలు మొదల య్యాక ఇప్పటివరకు 20 రోజుల వ్యవధిలోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి.
ఈ ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు కాగా, ఏకంగా 46 శాతం విస్తీర్ణంలో పంటలు సాగు కావడం ఇటీవల కాలంలో ఇదే రికార్డు. గతేడాది ఖరీఫ్ సీజన్‌లో ఇదే సమయానికి 35 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. ఈసారి ఒక పత్తి సాగే 30.85 లక్షల ఎకరాల్లో జరిగింది. సాధారణ పత్తి సాగు విస్తీర్ణం 41.9 లక్షల ఎకరాలు కాగా, 74 శాతం విస్తీర్ణంలో సాగు చేశారు. ఈసారి సాధారణం కంటే అధికంగా పత్తి సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
పడిపోతున్న పప్పుధాన్యాల సాగు...
రైతులు పెద్దఎత్తున పత్తి వైపే మరలిపోతుం డటంతో పప్పుధాన్యాల సాగు గణనీ యంగా పడిపోతోంది. ఖరీఫ్‌లో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం 10.55 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సమయానికి 7.62 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. కానీ ఈసారి కేవలం 4.82 లక్షల ఎకరాలకే వాటి సాగు పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 6.95 లక్షల ఎకరాలు కాగా, గతేడాది ఇదే కాలానికి 4.97 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి 3.20 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగింది.
గతేడాది కంది పంటకు గణనీయంగా మార్కెట్లో ధరలు పతనం కావడంతో రైతులు ఆ పంట వైపు వెళ్లడానికి జంకుతున్నారు. మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.20 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 5.90 లక్షల ఎకరాల్లో సాగైం ది. సోయాబీన్ 5.80 లక్షల ఎకరా లకు ఇప్పటివరకు 3.05 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వరి నార్లకు ఇంకా సమయం ఉండ టంతో సాగు పుంజుకోలేదు. సాధారణంగా ఖరీఫ్‌లో 23.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. ఇప్పటివరకు బావులు, బోర్ల కింద లక్షన్నర ఎకరాల్లో నార్లు వేశారని వ్యవ సాయ శాఖ వెల్లడించింది.
మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు...
వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో లక్సెట్టిపేటలో 6 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. మంథని, కోయిదా, జూలపల్లిల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డయింది.