చెరకు రైతుకు చేదు గుళిక
- అంతుచిక్కని తెగుళ్లు
- తగ్గిపోతున్న దిగుబడి
- వరివైపు మొగ్గుతున్న వైనం
మునగపాక, న్యూస్‌లైన్ : ఒకవైపు చెరకు తోటలకు అంతుపట్టని తెగుళ్లు, మరోవైపు బెల్లం దిగుబడులు తగ్గిపోవడంతో చెరకు రైతు ఆవేదన చెందుతున్నాడు. గతంలో భారీ విస్తీర్ణంలో చెరకు పంట సాగు చేసే రైతులు ఇప్పుడు వాతావరణం అనుకూలించకపోవడంతో గత్యంతర లేక వరిసాగుపట్ల మక్కువ చూపుతున్నారు. శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని తెగుళ్లు చెరకుకు సోకడంతో దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. మునగపాక మండలంలోని చెరకు సాధారణ విస్తీర్ణం 2,476 హెక్టార్లు కాగా ఈ ఏడాది 2300 హెక్టార్లకు పడిపోయింది.
అలాగే రబీలో వరి సాధారణవిస్తీర్ణం 55 హెక్టార్లు కాగా అదిప్పుడు రెట్టింపయింది. ముసిలితల్లి మూల సంఘంతోపాటు గెడ్డవతల అధిక విస్తీర్ణంలో తోటలకు తెగులు సోకుతున్నాయి. దీంతో తోటంతా ఎండిపోతుంది. ఇప్పటికే పలు మార్లు శాస్త్రవేత్తలు సైతం పర్యటించినా ఈ తె గుళ్లపై అంచనాకు రాలేకపోతున్నారు. సాధారణంగా ఎకరాకు 30-35 పాకాల వరకు బెల్లం దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధరల ప్రకారం ఈ లెక్కన సుమారు రూ.లక్ష వరకు ఆదాయం రావాల్సి ఉంటుంది.
అయితే తోటలకు సోకిన తెగుళ్ల కారణంగా 6 పాకాలకు మించి దిగుబడులు రావడం లేదు.ప్రస్తుతం అనకాపల్లి బెల్లం మార్కెట్‌లో మొదటిరకం పదిమణుగులు రూ.2,600 కాగా రెండో రకం 2,400, మూడోరకం రూ.2,190 పలుకుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తెగుళ్ల కారణంగా బెల్లం ఆరకపోవడం, సరిగా రంగు రాకపోవడం రైతులను కుంగదీస్తుంది. అంతేకాకుండా గత ఏడాది పలు మార్లు తుఫాన్‌లు సంభవించడంతో తోటలన్నీ నీటముంపునకు గురికావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతోబాటు నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి సర్కారు సైతం ముందుకురాకపోవడం గమనార్హం.