ఆదిలాబాద్ అగ్రికల్చర్ : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలతో పంటల్లో చీడపీడల బెడద ఎక్కువైంది. వీటి నివారణకు రైతులు మందులు పిచికారీ చేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. చీడపీడల నుంచి పంటలను కాపాడుకోవాలనే ప్రయత్నంలో మందులు పిచికారీ చేస్తూ స్వీయ రక్షణకు విస్మరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఇటీవల లోకేశ్వరం మండలం హవర్గా గ్రామానికి చెందిన యువ రైతు లస్మన్న రక్షణ చర్యలు లేకుండా మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ చనిపోయాడు. శనివారం నార్నూర్ మండలం కొత్తపల్లి(హెచ్) ఝాడే రాజ్‌కుమార్(25) పత్తి పంటకు మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై చనిపోయాడు.
ఈ క్రమంలో మందు పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏరువాక కోఆర్డినేటర్, శాస్త్రవేత్త రాజశేఖర్ వివరించారు.
సూచనల మేరకే పిచికారీ చేయాలి..
పైరును ఆశించిన తెగుళ్లు, పురుగుల నిర్మూలనకు ఇష్టమొచ్చిన విధంగా పిచికారీ చేస్తే ఉపయోగం కన్నా నష్టమే అధికంగా ఉంటుంది. సూచనల మేరకు పిచికారీ చేయాలి.
ఒక పంటకు పిచికారీ చేసిన మందు డబ్బాను మరో పంటకు ఇతర(కలుపు) మందును కలిపి పిచికారీ చేస్తే పంటలో ఏదైనా మార్పు, ఆకులు ముడుచుకుపోవడం కనిపిస్తే వెంటనే 20గ్రాముల యూరియా, 20గ్రాముల చక్కెర కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు.
మందులు అధికంగా వాడడం మూలంగా పంటకు మేలు చేసే సాలీడు, అక్షింతల పురుగులు, మిడతలు, తూనీగలు తదితర మిత్ర పురుగులు మృత్యువాత పడుతాయి. మిత్ర పురుగులు పొలంలో లేకుంటే పంటకు కీడు చేసే పురుగు పెరుగుతుంది.
అవసరమైనవే..
పంటలకు పురుగు మందులు వాడడానికి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు సూచించిన స్ప్రేలను జాగ్రత్తగా వాడాలి. పంటలో మొక్కల స్థాయిని బట్టి స్ప్రే డబ్బాలు ఉపయోగించాలి. పత్తిలో హ్యాండ్‌స్ప్రేయర్, పవర్ స్ప్రేయర్ల కంటే తైవాన్ స్ప్రేయర్ల ద్వారా మొక్కలకు నేరుగా మందు పిచికారీ చేసే వీలుంటుంది.
అవగాహన అవసరం
పంటలను ఆశించే చీడపీడల నివారణకు ఉపయోగించే పురుగు మందులపై రైతులు అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా దుకాణాల్లో పురుగు మందులు నాలుగు రంగుల్లో నీలి, పసుపు రంగులతో కూడిన డబ్బాలుంటాయి. పుర్రె గుర్తుతో కూడిన ఎర్ర రంగు ఉంటే అత్యంత విషపూరితమని గుర్తించాలి. ఆకుపచ్చ రంగు చిహ్నంతో ఉంటే తక్కువ విషపూరితమని గ్రహించాలి.
మందు ప్రభావానికి గురైతే..
పురుగుల మందు ప్రభావానికి గురైన వ్యక్తికి ముందు నోటిలోకి వేలు పెట్టి వాంతి చేయించాలి.
మూర్ఛపోయిన సందర్భంలో మూతికి గాయం కాకుండా రెండు దవడల మధ్య గుడ్డను ఉంచాలి.
శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు తడిబట్టతో నెమ్మదిగా తుడవాలి. ఉష్ణోగ్రత తగ్గితే దుప్పటి కప్పి వెచ్చగా ఉంచాలి.
సకాలంలో ఆస్పత్రికి తీసుకవెళ్లాలి, అనారోగ్యానికి కారణమైన రసాయనాల వివరాలు డాక్టర్‌కు తెలపాలి.
మందు పిచికారీ చేస్తున్నారా..? జాగ్రత్త..
Published Mon, Sep 15 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 PM
Advertisement
Advertisement