ఇలా చేయండి
లోతు దక్కుల వల్ల నేల గుల్లబారి, తేమను బాగా నిల్వ ఉంచుకుంటుంది. ఇలా చేస్తే వేసిన ఎరువు ఎక్కువ శాతం మొక్క తీసుకునే అవకాశం ఉంటుంది.
ఎరువులు వేసే ముందు తప్పనిసరిగా కలుపును నిర్మూలించాలి. అంతేగాక పొలంలో తగినంత తేమ ఉన్నప్పుడే ఎరువులు వేయాలి.
అన్ని పోషకాల్లో నత్రజని వృథా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యూరియాను వేపపిండితో లేక పలకలపై వేప నూనెతో కలిపి వాడితే నత్రజని నెమ్మదిగా విడుదలై వృథా తగ్గుతుంది.
యూరియాను కోల్‌తార్‌తో కలిపి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక కిలో కోల్‌తార్‌ను 2 లీటర్ల కిరోసిన్‌లో కలిపి.. దానిని రెండు బస్తాల యూరియాకు పట్టించి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
అర బస్తా యూరియాను ఒక బస్తా తడిపొడి మట్టితో కలిపి 24 గంటలు నీడలో ఉంచి, ఆ తర్వాత పొలంలో చల్లితే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.
ఎరువు వేసే పద్ధతులు
సిఫార్సు మేరకు ఎరువులు వాడటమే కాదు.. సరైన పద్ధతిలో పొలానికి వేయాలి. సాధారణంగా ఎరువులు రెండు పద్ధతుల్లో వేస్తారు.
వెదజల్లే పద్ధతి :
మొక్కలు పొలం నిండా దగ్గర.. దగ్గరగా ఉండి వరుసల్లో సక్రమంగా లేని మొక్కలకు, వేళ్లు భూమిలో అల్లుకుని ఉండే పైర్లకు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. మాగాణి వరికి ఇది చాలా అనువైన పద్ధతి.
మొదళ్ల దగ్గర ఎరువు వేసే పద్ధతి
మొదళ్ల వద్ద ఎరువు వేయడం వల్ల పోషక వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. వృథా చాలా వరకు తగ్గుతుంది. నిర్ణీత వరుసల్లో మొక్కలు ఉండి, నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు.. గొర్రు, గుంటక లేదంటే చేతితో 2 అంగుళాల లోతులో పడేలా మొక్కల మొదళ్ల దగ్గర ఎరువు వేయాలి. చేతితో చిన్నచిన్న గుంటలు తీసి వేసుకునేటప్పుడు ఎరువు వేసిన వెంటనే గుంటను మట్టితో కప్పేయాలి.
పైరుపై పోషకాల పిచికారీ
ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు నేలలో తగినంత తేమ లేనప్పుడు, సమస్యాత్మక నేలలకు పోషకాలు అందించడానికి, పోషక లోపం కనిపించిన పైర్లకు ఈ పద్ధతి ద్వారా పోషకాలు అందించవచ్చు.
ధరలపై అవగాహన ఉండాలి
ఎరువులు వేసే పద్ధతులు, వేయాల్సిన మోతాదు తెలుసుకోవడం ఎంత ముఖ్యమో.. పోషకాల ధరలను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయడం అంతే అవసరం. ప్రతి ఎరువు బస్తా మీద ఆ ఎరువులో ఉన్న పోషక విలువ శాతం స్పష్టంగా రాసి ఉంటుంది. అయితే బస్తా మీద సూచించిన పోషక విలువల్లో సగం మాత్రమే ఆ బస్తా ఎరువులో ఉందని గమనించాలి. ఎందుకంటే సూచించిన పోషక శాతం 100 కిలోల రసాయన ఎరువుకు సంబంధించినది.
ఎరువు.. కాకూడదు బరువు
Published Thu, Sep 4 2014 1:57 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM
Advertisement
Advertisement