ఖమ్మం వ్యవసాయం: వరిలో అధిక, సుస్థిర దిగుబడులు పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ హేమంత్‌కుమార్, డాక్టర్ ఎం. వెంకట్రాములు అంటున్నారు. భూసార పరీక్ష చేయించి నేల సారాన్ని బట్టి సిఫార్సు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్, ఇతర సూక్ష్మ పోషకాలు అందించాలని అన్నారు.
రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకుని సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట ఎరువుల వాడి పైరుకు సమతుల్యంగా అందించాలని అంటున్నారు. రసాయనిక ఎరువులు మాత్రమే వాడడం వల్ల పురుగులు, తెగుళ్లు, అధికమవడమే కాక ఖర్చు పెరిగి రాబడి కూడా తగ్గుతుందని, వీటితో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని, వాతావరణం, భూమి, మనుషులకు అనర్థాలు కలుగుతాయని అంటున్నారు. ఈ సందర్భంగా రైతులకు వారు పలు సూచనలు చేశారు..
సమగ్ర పోషక యాజమాన్యం: వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైరును పెంచి కలిపి దున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. దీని వల్ల సుమారు 20 నుంచి 25 శాతం వరకు నత్రజని, భాస్వరం, పొటాష్‌లను ఆదా చేయవచ్చు.
సజీవ ఎరువులైన అజోల్లా, అజోస్పైరిల్లమ్, ఫా స్పోబాక్టీరియా తదితర జీవన ఎరువులను వా డడం వల్ల నత్రజని, భాస్వరం మోతాతులను 10 నుంచి 20 శాతం వరకు తగ్గించవచ్చు.
అజోల్లా : వరిసాగుకు ముందు దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్‌ను వేసి పలుచగా నీరు నిల్వ చేయాలి. అందులో 100 - 150 కిలోల అజోల్లా వేసి రెండు నుంచి మూడు వారాలు పెరుగనిచ్చి కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజని నేలకు చేరుతుంది.
అజటోబాక్టర్ : ఒక కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం పొలంలో చల్లాలి. లేదా ఎకరాకు 300 మి.లీ నుంచి 500 మి.లీ ద్రవరూప జీవన ఎరువును 25 - 30 లీటర్ల నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని 200 కిలోల వర్మి కంపోస్టుకు లేదా బాగా చివికిన పశువుల ఎరువుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఒక రోజు ఉంచి మరుసటి రోజు ఒక ఎకరా పొలంలో సమానంగా వెదజల్లాలి. ఈ జీవన ఎరువును వరి నాటిన వారం రోజుల్లో వేయాలి.
ఫాస్పోబ్యాక్టీరియా: ఫాస్పోబ్యాక్టీరియా ద్రవరూప జీవన ఎరువును 25 - 30 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని 200 కిలోల వర్మి కంపోస్టుకు లేదా బాగా చివికిన పశువుల ఎరువుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఒక రోజు ఉంచి మరుసటి రోజు ఒక ఎకరా పొలంలో సమానంగా వెదజల్లాలి. ఈ జీవన ఎరువును వరి నాటిన వారం రోజుల్లో వేయాలి. (ఈ జీవన ఎరువులు వ్యవసాయ పరిశోధనా సంస్థ అమరావతి (ఫోన్ నంబర్ 08654-288245)లో లభ్యమవుతాయి).
భూసారాన్ని బట్టి రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్ నిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడాలి. సిఫారసు చేసిన ఎరువుల మోతాదు ప్రకారం ఒక ఎకరాకు 40 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వాడాలి.
నత్రజనిని మూడు సమ భాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోనూ, దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశలోనూ, బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 36 - 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి.
50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండి లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది.
మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి.
పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చలక(తేలిక) భూముల్లో ఆఖరి దమ్ముల్లో సగం, అం కురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి.
కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలోగాని అంకురం ఏర్పడే దశలోగాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది.
ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి.
భాస్వరం ఎరువుతో పాటు జింక్ సల్ఫేట్‌ను కలి పి వేయకూడదు. కనీసం మూడు రోజుల వ్య వధి ఉండాలి. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురు గు లేదా తెగుళ్ల మందులను కలుపకూడదు.
ఇనుము లోప లక్షణాలు కనిపించినప్పుడు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు, కలిపి పిచికారీ చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కల్గిన ద్రావణాన్ని (0.5 నుంచి 1 శాతం) వాడాలి.