Potash
-
నకిలీ పొటాష్‌తో అప్రమత్తంగా ఉండాలి
ఒంగోలు: నకిలీ పొటాష్ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అదనపు ఎస్పీ ఎం.రజని సూచించారు. శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అదనపు ఎస్పీ రజని మాట్లాడుతూ ప్రస్తుతం తాము సీజ్ చేస్తున్న పొటాష్‌కు అసలు పొటాష్‌ను సరిపోల్చడం కష్టంగా ఉందని చెప్పారు. బ్యాగుపై అన్ని రకాల ముద్రలు ఒకే రకంగా ఉన్నాయని, రెండు బ్యాగులను పక్కపక్కన ఉంచితే నకిలీది ఏదో గుర్తించడం కష్టమన్నారు. బ్యాగు లోపలి పొటాష్ నకిలీనా...కాదా అనేది నిర్థారించేందుకు చిన్న పరీక్ష ఉందన్నారు. పొటాష్ బ్యాగు కొనాలనుకుంటున రైతులు అందులోని కొద్దిపాటి పొటాష్‌ను ముందుగా ఒక గ్లాసుడు నీటిలో పరీక్షించుకోవాలని సూచించారు. గుర్తించింది ఇలా.. ప్రతినెలా కొన్ని షాపులపై తనిఖీలు నిర్వహించి శాంపిల్స్ తీస్తుంటామని, అందులో భాగంగా ఈ సారి త్రిపురాంతకం మండలంలో శాంపిల్స్ తీసినట్లు రజనీ వివరించారు. ఈ నెల 3న వెంకట రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్, బాల త్రిపుర సుందరి ఫెర్టిలైజర్స్, శ్రీవెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్‌పై తనిఖీలు చేసినప్పుడు రికార్డులో ఉండాల్సిన నిల్వలకు, షాపులో ఉన్న వాస్తవ నిల్వలకు వ్యత్యాసాలపై 6(ఎ) కేసులు నమోదు చేశామన్నారు. శ్రీవెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్‌పై తనిఖీలు చేసి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని వివరించారు. ఈ మూడు షాపుల్లో సీజ్చేసిన మొత్తం 54.40 మెట్రిక్ టన్నుల్లో పొటాష్‌తో పాటు డీఏపీ తదితర ఎరువులు కూడా ఉన్నాయన్నారు. 6వ తేదీ గుంటూరులో నకిలీ పొటాష్ విషయం వెలుగులోకి రావడంతో ఆ తర్వాత తాము పొటాష్పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 7వ తేదీ త్రిపురాంతకంలోని శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్‌లో 40 బ్యాగుల పొటాష్, 8వ తేదీ శ్రీలక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీస్‌లో 80 బ్యాగుల పొటాష్, 9వ తేదీ త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో దూళ్ల పెద సుబ్బారావు దుకాణంలో 484 బ్యాగుల పొటాష్, అదే గ్రామంలో నీలంపాటి అమ్మవారు పెస్టిసైడ్స్‌లో 140 బ్యాగులు, శ్రీ వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్‌కు చెందిన రెండు గోడౌన్లలో తనిఖీలు నిర్వహించి 170 బ్యాగుల పొటాష్, శ్రీమథ్ బాల త్రిపుర సుందరి దుకాణంలో 70 బ్యాగుల పొటాష్‌ను సీజ్ చేశామని రజని వివరించారు. మొత్తంగా 984 బ్యాగుల పొటాష్‌ను సీజ్ చేసి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, ల్యాబ్ నుంచి నివేదికలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. కేసుల నమోదు రిజిస్టర్ ప్రకారం వాస్తవ నిల్వలకు తేడా ఉన్న వెంకట రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్, బాలత్రిపుర సుందరి, శ్రీ వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీలక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీలపై 6(ఎ) కేసులు నమోదు చేశామని, వాటిలో శ్రీ వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీలక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీల వద్ద ఉన్న పొటాష్ నిల్వల శాంపిల్స్ కూడా తీసి ల్యాబ్‌కు పంపామని వివరించారు. దూళ్ల పెద్ద సుబ్బారావు ఇంట్లో గుర్తించిన 24.20 మెట్రిక్ టన్నుల ఎరువులకు సంబంధించి దోగిపర్తి సోమసుందరగుప్తా, ముసునూరి కనకయ్యలపై, నీలంపాటి అమ్మవారు పెస్టిసైడ్స్‌కు సంబంధించి దోగిపర్తి సుబ్బారావు, దోగిపర్తి సోమసుందర గుప్తాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఏఎస్పీ వివరించారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్‌కు సంబంధించి, లడ్డు శ్రీను గోడౌన్‌ను లీజుకు తీసుకొని అందులో అక్రమంగా ఎరువులు నిల్వ ఉంచిన అన్న సుబ్రహ్మణ్యంపై, శ్రీమథ్బాల త్రిపుర సుందరి దుకాణానికి సంబంధించి తమ్మినేని మల్లికార్జునరెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామన్నారు. మొత్తంగా సీజ్ చేసిన ఎరువుల్లో కేవలం పొటాష్ పరిమాణం 984 బ్యాగులు ఉందని, వాటి విలువ రూ.20,16,980లుగా ఉందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అదనపు ఎస్పీ ఎం.రజని వివరించారు. రైతులు ముందుకు రావాలి ఇప్పటి వరకు దుకాణాల్లో ఉన్న నిల్వలను మాత్రమే సీజ్ చేశామని, పరారీలో ఉన్న నిందితుల గుట్టురట్టు కావాలంటే రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు తాము ఎవరి వద్ద ఎంత సరుకు కొనుగోలు చేశామనేది వివరిస్తే నిందితుడి ఆచూకీ త్వరగా బహిర్గతం అవుతుందని భావిస్తున్నామన్నారు. పొటాష్‌ను ఎక్కువుగా వరి పండే ప్రాంత రైతులు వినియోగిస్తారని, సాగర్ ప్రాంతంలో వరిపండించే త్రిపురాంతకం, కృష్ణా వెస్ట్రన్ డెల్టా ప్రాంతంలో పొటాష్‌ను విక్రయించేందుకు దృష్టి సారించారన్నారు. గతంలోలా ధరలో కూడా వ్యత్యాసం రాకుండా బ్రాండెడ్, నకిలీ రెండింటిని ఒకే ధరకు విక్రయిస్తుండటంతో రైతులు అనుమానించలేకపోయారని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మైసూరు కేంద్రంగా ఈ రాకెట్ నడుస్తోందని భావిస్తున్నామని, ప్రధాన నిందితుడి కోసం దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. నకిలీ పొటాష్ వ్యవహారంపై విచారణ ఒంగోలు సబర్బన్: జిల్లాలో సంచలనం రేపిన నకిలీ పొటాష్ వ్యవహారంలో డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ (విచారణ)కి కమిటీని నియమించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ పీవీ శ్రీరామ్మూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. త్రిపురాంతకం మండలంలో నకిలీ పొటాష్‌కు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని భూ సంరక్షణ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నన్న విజయ నిర్మల, జేడీ కార్యాలయంలో ఏడీఏ(పీపీ)గా పనిచేస్తున్న ఈ.మాలకొండారెడ్డిని విచారణాధికారులుగా నియమించామన్నారు. అక్రమాలకు పాల్పడిన డీలర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కమిటీ విచారణ చేపడుతుందన్నారు. డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వ్యవసాయ అధికారులకు నకిలీ పొటాష్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయా అన్న దానిపై లోతుగా విచారణ చేపడుతున్నామని జేడీ వివరించారు. నకిలీ పొటాష్పై కొనసాగుతున్న విచారణ త్రిపురాంతకం: నకిలీ పొటాష్ కోసం గోడౌన్లపై దాడులు కొనసాగుతున్నాయి. వ్యవసాయశాఖ డీడీఏ ఎం. విజయనిర్మల వివిధ షాపుల్లో శనివారం తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు పట్టుబడిన సరుకు, నకిలీ, అసలు బస్తాలను పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. వివిధ షాపుల్లో సుమారు తొమ్మిది లక్షల రూపాయల ఖరీదు చేసే 988 నకిలీ పొటాష్ బస్తాలను ఆమె నిర్ధారించారు. సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, రాఘవేంద్ర ట్రేడర్స్, నడిగడ్డ మాధవి ట్రేడర్స్‌కు చెందిన హోల్‌సేల్ డీలర్ల వద్ద ఎక్కువ స్టాకు గుర్తించారు. శ్రీలక్ష్మి శ్రీనివాస ట్రేడర్, శ్రీమత్ బాలాత్రిపురసుందరీ ట్రేడర్స్ రిటైల్ డీలర్లు వద్ద స్టాకు గుర్తించి అమ్మకాలు పూర్తిగా నిలిపేసినట్లు ఆమె తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని, డీలర్ల అమ్మకాలపై ఆరా తీస్తున్నట్లు వివరించారు. అసలు, కల్తీ పొటాష్ల నమూనాలను రెండు గ్లాసుల నీటిలో వేసి పరీక్ష చేశారు. అదే విధంగా ఐపీఎల్ కంపెనీ బ్యాగ్‌లు పరిశీలించారు. కేవలం నీటిలో వేసిన అనంతరం మాత్రమే దీన్ని నిర్థారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాగ్‌లు పరిశీలించినా అసలు, నకిలీలు తేల్చలేని పరిస్థితి కనిపిస్తుంది. విజిలెన్స్ అధికారులు, వ్యవసాయశాఖ అధికారుల దాడులతో ఎరువుల దుకాణాలు వారం రోజులుగా మూతపడుతున్నాయి. పొటాష్ అమ్మకాల కారణంగా ఎరువుల వ్యాపారుల్లో భయం నెలకొంది. హోల్‌సేల్ వ్యాపారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. పూర్తిస్థాయిలో దాడుల్లో పట్టుబడిన నకిలీ పొటాష్ గోడౌన్లు అధికారుల ఆధీనంలోనే ఉన్నాయి. అసలు సరఫరా దారుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీల్లో వ్యవసాయశాఖ ఏడీఏ సుదర్శనరాజు, ఏఓ బాలాజీనాయక్, జవహర్లాల్ నాయక్ ఉన్నారు. విచారణ చేయిస్తాం: జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ అధికారులు నకిలీ గుట్టు బట్టబయలు చేస్తే వ్యవసాయశాఖ ఏం చేస్తోందంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ జేడీ టీవీ శ్రీరామ్మూర్తి తర్జనభర్జన పడ్డారు. తమ అధికారులు ఫీల్డులో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరి ఎందుకు నకిలీని గుర్తించలేకపోయారు, దీనివల్ల ఇప్పటికే పొటాష్‌ను పెద్ద మొత్తంలో వినియోగించి మోసపోయిన రైతాంగానికి ఏం స«మాధానం చెబుతారంటూ ప్రశ్నించడంతో డిపార్టుమెంట్ పరంగా కూడా విచారణ జరుపుతామని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ డీఎస్పీ అంకయ్య, సీఐలు టీఎక్స్ అజయ్‌కుమార్, బీటీ నాయక్, ఎంపీడీవో నారాయణరెడ్డి, ఏఓ ఉమాపతి, తహసీల్దార్ పాల్ పాల్గొన్నారు.శ్రీరామ్మూర్తి, జేడీ, వ్యవసాయ శాఖ -
నకిలీ పొటాష్ కలవరం..!
త్రిపురాంతకం/ ఒంగోలు సబర్బన్: జిల్లాలో నకిలీ పొటాష్ వ్యవహారం కలవరం సృష్టిస్తోంది. వందల టన్నుల నకిలీ పొటాష్ నిల్వలు బయటపడుతుండటం రైతులను ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్నాయి. ఈ నకిలీ పొటాష్ అక్రమ నిల్వలు అటు జిల్లాలోని వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారుల పనితీరుకు దర్పంగా నిలిచింది. నకిలీ పొటాష్ కర్ణాటక రాష్ట్రం మైసూరు, బళ్ళారి ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా జిల్లాకు వచ్చినట్లు అధికారులు పరిశీలనలో తేలింది. పొటాష్ ఎరువు క్వింటా ధర రూ.950 ఉండటంతో రైతులు తక్కువ ధరకు వచ్చే నకిలీ పొటాష్ కొనుగోలు చేసి నిలువునా మోసపోయారు. కొనసాగుతున్న దాడులు ఎరువుల దుకాణాల గోడౌన్లపై ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా దాడులను నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్ ఏఎస్పీ రజనీ, వ్యవసాయశాఖ జేడీఏ శ్రీరామమూర్తి తెలిపారు. ప్రకాశం, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో ఈ నకిలీ పొటాష్ అమ్మకాలు భారీగా జరిగినట్లు గుర్తించారు. ఈ నకిలీ పొటాష్ కుంభకోణంలో రైతులు భారీగా నష్టపోయారు. తనిఖీల్లో నకిలీ పొటాష్‌ను విక్రయించిన త్రిపురాంతకంలోని సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, రాఘవేంద్ర ట్రేడర్స్ హోల్‌సేల్ డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆరు షాపులపై కేసులు నమోదు చేసి ఎరువుల అమ్మకాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 799 నకిలీ పొటాష్ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఐపీఎల్ కంపెనీ వారితో పాటు రసాయన పరీక్షల ద్వారా నిర్ధారించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మార్కాపురం, దోర్నాల, చీరాల తదితర ప్రాంతాల్లో ఇప్పటికే దాడులు నిర్వహించామని తెలిపారు. గుంటూరు జిల్లాలో అమ్మకాలు జరుగుతున్న పొటాష్‌ను ముందుగా గుర్తించడంతో అక్కడ డీలర్లు త్రిపురాంతకం నుంచి సరఫరా అయినట్లు నిర్ధారించారని, దీంతో ఈ ప్రాంతంలో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలో ఈ అమ్మకాలు జరగడంతో విజిలెన్స్ డీజీ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని వివరించారు. ఈ పొటాష్ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ ప్రాంతం నుంచి సరఫరా అవుతున్నట్లు విచారణలో తెలిసిందని, వ్యవసాయ శాఖ కమిషనర్ ద్వారా ఆ రాష్ట్ర కమిషనర్‌తో చర్చించినట్లు అధికారులు తెలిపారు.నకిలీ పొటాష్ సరఫరా చేసిన వారి వివరాలు విచారణలో తేలుతాయన్నారు. దాడుల్లో విజిలెన్స్ సీఐలు బీటీ నాయక్, భూషణంలు, జాని, ఉమాపతి, ఏడీఏ సుదర్శనరాజు ,ఏఓ బాలాజీనాయక్, జవహర్ ఉన్నారు. పెద్దల ప్రమేయంపై విమర్శలు నకిలీ పొటాష్ ఎరువుల వ్యవహారంలో వ్యవసాయ శాఖ అధికారులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎరువులు, పురుగుమందుల దుకాణాలను తరచూ తనిఖీ చేయాల్సిన అధికారులు నకిలీ ఎరువులు ఉన్నాయన్న సమాచారం వ్యవసాయ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ప్రచారమూ సాగుతోంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో నకిలీ పొటాష్ వ్యవహారం బయట పడటంతో త్రిపురాంతకం వ్యవసాయ అధికారితో పాటు పలువురు అధికారులపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అక్రమ నిల్వలు ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో కాకుండా బయట గోడౌన్లు తీసుకొని అక్రమంగా నిల్వలు చేపట్టారు. కనీసం మండల వ్యవసాయాధికారులకు ఏఏ గ్రామంలో అక్రమ గోడౌన్లు ఉన్నాయి, రైతులు ఎక్కడెక్కడ ఎరువులు తీసుకెళుతున్నారన్న పూర్తి సమాచారం వ్యవసాయ అధికారులకు తెలుసు. కానీ మామూళ్లకు తలొగ్గి తెలిసీ, తెలియనట్లు వ్యవహరించటం వల్లనే వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా దాడులు జరుగుతున్న సమయంలో అధికార పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అధికారులకు ఫోన్ కాల్స్ వచ్చినట్లు విమర్శలు ఉన్నాయి. తాళాలు పగులుగొట్టి గోడౌన్లు తెరిచి .. త్రిపురాంతకంలో ఐదు గోడౌన్లు, సోమేపల్లిలో మూడు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన పొటాష్ 799 బస్తాలను గుర్తించినట్లు తెలిపారు. నకిలీ పొటాష్ నిల్వలపై అధికారులు దాడులు కొనసాగిస్తుండటంతో వ్యాపారులు అందుబాటులో లేరు. వ్యాపారుల కోసం ప్రయత్నం చేసిన అధికారులు గోడౌన్లను రెవెన్యూ శాఖ ద్వారా తాళాలు పగులగొట్టి తనిఖీ చేశారు. నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నకిలీ పొటాష్‌తో మటాష్ నకిలీ పొటాష్ రైతులను నిలువునా ముంచింది. అధిక ధరలు చెల్లించి నకిలీ పొటాష్‌ను కొనుగోలు చేసి మోసపోయామని రైతులు వాపోతున్నారు. సాగర్ నీటి వసతి ఉన్న ప్రాంతంలో అన్ని జిల్లాల్లోనూ ఈ పొటాష్ అమ్మకాలు జరిగినట్లు నిర్ధారించారు. దీన్ని బట్టి ఈ స్కాం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తవ్విన కొద్ది నకిలీ పొటాష్ విక్రయాల్లో కొత్త కోణాలు బయటపడటం అధికారులనే విస్మయానికి గురిచేస్తుంది. గుంటూరు, ప్రకాశంతో పాటు చుట్టు ఉన్న రాయలసీమ జిల్లాల్లోను ఈ అమ్మకాలు జోరుగా సాగాయి. చిత్తూరు జిల్లాల్లో ఈ పొటాష్ వాడిన చేపల చెరువులో చేపలు చనిపోయినట్లు అధికారులకు సమాచారం. ఇక వరి పంటలో అధిక దిగుబడుల కోసం దీనిని వినియోగిస్తుంటారు. ఈ దిగుబడులు పూర్తిగా తగ్గిపోవడానికి ఈ నకిలీ పొటాషే కారణమని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ పొటాష్‌ను రైతులకు భారీగా విక్రయించినట్లు తెలుస్తోంది. -
నువ్వుల సాగు ఇలా..
విత్తన మోతాదు, శుద్ధి చేసే విధానం.. ఎకరానికి 1.5 నుంచి 2 కిలోల విత్తనం అవసరం. విత్తన పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి విత్తనానికి ఐదింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తనాన్ని 2 నుంచి 3 సెం.మీ. లోతు మించకుండా వేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా మాంకోజెబ్ లేదా కార్బండిజమ్‌తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10-15 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. ఎరువుల యాజమాన్యం.. రబీలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. నత్రజని సగభాగం, భాస్వరం, పొటాష్ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియ దున్నాలి. మిగిలిన సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెలరోజులకు కలుపుతీసి వేయాలి. భాస్వరం ఎరువు సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో పడినపుడు అదనంగా క్యాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. నీటి యాజమాన్యం.. విత్తిన వెంటనే మొదటి త డి ఇవ్వాలి. పూత, కాయ, అభివృద్ధి, గింజ కట్టు దిగేట్లు తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35-40 రోజుల నుంచి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. కలుపు నివారణ.... విత్తే ముందు పుక్లొరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గానీ, మరుసటి రోజున గానీ పిచికారీ చేయాలి. చీడపీడల నివారణ.. సస్యరక్షణ చర్యలు.. ఈ పంటకు ఎక్కువగా కాయ తొలిచే పురుగు ఆశిస్తుంది. దీని లార్వా లేత ఆకుపచ్చ రంగులో ఉండి నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. తొలి దశలో చిన్న లార్వాలు కలిసి గూడు కట్టి లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని కొరుక్కు తింటాయి. తద్వారా ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగు ఉద్ధృతి అంతగా ఉండదు. పురుగు ఆశించిన ఆకులను లార్వాలతో సహా ఏరి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా క్లోరోపైరిపాస్ 2.5 మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
నేడు ‘తాండవ’ మహాజనసభ
పాయకరావుపేట : తాండవ చక్కెర కర్మాగారం 2014-15 క్రషింగ్ సీజన్ నవంబర్ మూడో వారంలో ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా శుక్రవారం ఫ్యాక్టరీ మహాజన సభ జరగనుంది. ఈ కర్మాగారం 2013-14 సీజన్లో 1,78,361 టన్నులు చెరకు క్రషింగ్ చేసి 1,74,985 బస్తాల పంచదార దిగుబడి సాధించింది. 9.9 రికవరీతో రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో 2 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చెరకు సాగు ప్రోత్సహించేందుకు 5,870 మందిై రెతులకు రూ.1.73 కోట్ల విలువ చేసే చెరకు విత్తనం, రూ.1.70 కోట్ల యూరియా, 2,500 టన్నుల సూఫర్ ఫాస్పేట్, పొటాష్లను వడ్డీ లేని అప్పు కింద సరఫరా చేశారు. 2,415 ఎకరాల్లో ఉడుపు,7478 ఎకరాల్లో కార్శితోటల్లో 2.4 లక్షల టన్నుల చెరకు సరఫరా చేసేందుకు రైతులతో ఫ్యాక్టరీ అధికారులు అగ్రిమెంట్లు తీసుకుంటున్నారు. మూడు నెలల క్రితం చేపట్టిన ఓవర్ హాలింగ్ పనులు దాదాపు పూర్తికావచ్చాయి. గత సీజనులో క్రషింగ్‌కు అంతరాయం ఏర్పడిన మిల్లులో లోపాలు సరిచేశారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో 90 వేల బస్తాల పంచదార నిల్వలు ఉన్నాయి. చెరకుకు ధర లభించక తాండవ సుగర్స్ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పెరిగిన పెట్టుబడులకనుగుణంగా గిట్టుబాటు ధర లేకపోతే భవిష్యత్తులో చెరకు సాగు సాధ్యం కాదని అంటున్నారు. గత ఏడాది ఫ్యాక్టరీ యాజమాన్యం టన్నుకు రూ.1870లు ఇవ్వగా ప్రభుత్వం రూ.160లు ప్రోత్సాహం ప్రకటించింది. దీంతో టన్నుకు రూ.2030 గిట్టుబాటు కల్పించారు. రైతులకు రూ.7.90 కోట్లు చెల్లింపులు చేశారు. జిల్లాలో ఏటికొప్పాక, చోడవరం ఫ్యాక్టరీల్లో టన్నుకు రూ.2200 నుంచి 2400 వరకూ మధ్దతు ధర చెల్లిస్తున్నారు. ‘తాండవ’ యాజమాన్యం కూడా అదే ధర చెల్లించాలని రైతులు కోరుతున్నారు. రెండేళ్ల తరువాత మహాజన సభ.. ఏటా క్రషింగ్ ప్రారంభానికి రెండు నెలల ముందు మహాజనసభ నిర్వహించడం ఆనవాయితీ. ఫ్యాక్టరీకి పాలకవర్గం లేక రెండేళ్లుగా రైతు మహాజన సభ నిర్వహించలేదు. కొత్త పాలకవర్గం పగ్గాలు చేపట్టడంతో ఈ నెల 26న మధ్యాహ్నం మూడు గంటలకు రైతు మహాజన సభ జరగనుంది. ఇందులో టన్నుకు ఎంత ధర ప్రకటిస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు. -
పంట దిగుబడిని శాసించే జింక్
పంటలో జింక్ లోపం ఉంటే నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మొక్కలు సమర్థవంతంగా ఉపయోగించుకోలేవు. దీనివల్ల ఎరువుల ఖర్చు భారంగా మారుతుందే తప్ప దిగుబడి పెరగదు. మొక్క పెరుగుదలలో జింక్ వివిధ క్రియలను నిర్వర్తిస్తుంది. మొక్కల పెరుగుదల కోసం వివిధ రసాయనిక క్రియల్లో అవసరమయ్యే ఎంజైముల చురుకుదనాన్ని పెంచడానికి, ఉత్తేజపరచడానికి, రసాయనిక క్రియల్లో కావాల్సిన హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన రసాయన పదార్థాల తయారీకి జింక్ ఉపయోగపడుతుంది. పంటపై జింక్ లోపం కనిపిస్తే.. జింక్ లోప లక్షణాలు పంటపై కనిపిస్తే.. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల జింక్‌ను కలిపి పిచికారీ చేయాలి. ఎకరానికి 200 లీటర్ల ద్రావణం సరిపోతుంది. ఇలా వారం రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారీ చేస్తే ఫలితం ఉంటుంది. రెండు క్వింటాళ్ల పశువుల ఎరువు, కంపోస్టు, కోళ్ల వ్యర్థాలు, ఫిల్టర్ మడ్డి లాంటి సేంద్రియ ఎరువులతో 15 కిలోల జింక్‌ను కలిపి ఒక నెల మగ్గబెట్టాలి. ఈ మిశ్రమాన్ని పైరు వేసే ముందు దుక్కిలో చల్లితే అధిక దిగుబడిలో మార్పు కనిపిస్తుంది. వరిలో జింక్ లోపం జింక్ లోపం వరి పైరుకు ఇబ్బందిగా మారింది. నారుమడిలోనూ.. నారు నాటిన తర్వాత కూడా జింక్ లోపం కనిపిస్తోంది. సాధారణంగా నాట్లు వేసిన తర్వాత రెండు నుంచి నాలుగు వారాల మధ్య, నాలుగు నుంచి ఆరో వారం వరకు జింక్ లోపం లక్షణాలు బయటపడతాయి. గుర్తించడం ఇలా.. జింక్ లోపం ఉన్నప్పుడు ప్రధాన పోషకాలు తగినంత వేసినా పంట సరిగా పెరగదు. పిలకలు పెట్టదు. పంట గుంపులు గుంపులుగా చనిపోయి ఖాళీగా కనిపిస్తుంది. పొలమంతా పసుపు పచ్చగా కనిపిస్తుంది. దగ్గరగా చూస్తే మొక్కల్లో పైనుంచి మూడు లేదా నాలుగు ఆకుల మధ్య ఈనె మొదలు భాగం ఆకుపచ్చ రంగు కోల్పోయి పసుపు లేక పసుపుతో కూడిన తెలుపు రంగులోకి మారుతుంది. ఆకులోని మిగతా భాగమంతా ఆకుపచ్చగానే ఉంటుంది. ఇటుక రంగు మచ్చలు కనిపిస్తాయి. నివారణ చర్యలు పంట వేసే ముందు మట్టి పరీక్ష చేయించుకోవాలి. జింక్ తగినంత ఉందో లేదో తెలుసుకోవాలి. జింక్ లోపమున్నట్లు తేలితే తప్పని సరిగా ముందుగానే సరైన మోతాదులో జింక్ సల్ఫేట్‌ను వేసుకోవాలి. వరి పంటకైతే ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను దుక్కిలో నాటే ముందు వేసుకోవాలి. మూడు పంటలకు ఒకసారి గానీ, రెండేళ్లకోసారి గానీ ఇలా చేయాలి. ఏటా వరి వేసుకోవాలనుకుంటే మాత్రం రబీలోనే జింక్ వేసుకోవాలి. సమస్యాత్మక నేలలు అంటే క్షార, చవుడు, సున్నపు, నేలలైతే జింక్ సల్ఫేట్‌ను ఎకరానికి 40 కిలోల చొప్పున వేసుకోవాలి. -
సమగ్రపోషణ ముఖ్యం..
ఖమ్మం వ్యవసాయం: వరిలో అధిక, సుస్థిర దిగుబడులు పొందాలంటే సమగ్ర పోషక యాజమాన్యం ముఖ్య పాత్ర పోషిస్తుందని ఖమ్మం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ హేమంత్‌కుమార్, డాక్టర్ ఎం. వెంకట్రాములు అంటున్నారు. భూసార పరీక్ష చేయించి నేల సారాన్ని బట్టి సిఫార్సు చేసిన నత్రజని, భాస్వరం, పొటాష్, ఇతర సూక్ష్మ పోషకాలు అందించాలని అన్నారు. రసాయనిక ఎరువుల మోతాదు తగ్గించుకుని సేంద్రియ, జీవన, పచ్చిరొట్ట ఎరువుల వాడి పైరుకు సమతుల్యంగా అందించాలని అంటున్నారు. రసాయనిక ఎరువులు మాత్రమే వాడడం వల్ల పురుగులు, తెగుళ్లు, అధికమవడమే కాక ఖర్చు పెరిగి రాబడి కూడా తగ్గుతుందని, వీటితో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని, వాతావరణం, భూమి, మనుషులకు అనర్థాలు కలుగుతాయని అంటున్నారు. ఈ సందర్భంగా రైతులకు వారు పలు సూచనలు చేశారు.. సమగ్ర పోషక యాజమాన్యం: వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట పైరును పెంచి కలిపి దున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. దీని వల్ల సుమారు 20 నుంచి 25 శాతం వరకు నత్రజని, భాస్వరం, పొటాష్లను ఆదా చేయవచ్చు. సజీవ ఎరువులైన అజోల్లా, అజోస్పైరిల్లమ్, ఫా స్పోబాక్టీరియా తదితర జీవన ఎరువులను వా డడం వల్ల నత్రజని, భాస్వరం మోతాతులను 10 నుంచి 20 శాతం వరకు తగ్గించవచ్చు. అజోల్లా : వరిసాగుకు ముందు దమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్ను వేసి పలుచగా నీరు నిల్వ చేయాలి. అందులో 100 - 150 కిలోల అజోల్లా వేసి రెండు నుంచి మూడు వారాలు పెరుగనిచ్చి కలియదున్నాలి. ఇలా చేయడం వల్ల ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట, 12 కిలోల నత్రజని నేలకు చేరుతుంది. అజటోబాక్టర్ : ఒక కిలో కల్చరును 20 కిలోల పశువుల ఎరువుతో కలిపి ఎకరం పొలంలో చల్లాలి. లేదా ఎకరాకు 300 మి.లీ నుంచి 500 మి.లీ ద్రవరూప జీవన ఎరువును 25 - 30 లీటర్ల నీటిలో కలిపి, ఆ ద్రావణాన్ని 200 కిలోల వర్మి కంపోస్టుకు లేదా బాగా చివికిన పశువుల ఎరువుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఒక రోజు ఉంచి మరుసటి రోజు ఒక ఎకరా పొలంలో సమానంగా వెదజల్లాలి. ఈ జీవన ఎరువును వరి నాటిన వారం రోజుల్లో వేయాలి. ఫాస్పోబ్యాక్టీరియా: ఫాస్పోబ్యాక్టీరియా ద్రవరూప జీవన ఎరువును 25 - 30 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని 200 కిలోల వర్మి కంపోస్టుకు లేదా బాగా చివికిన పశువుల ఎరువుకు పట్టించాలి. ఈ మిశ్రమాన్ని నీడలో ఒక రోజు ఉంచి మరుసటి రోజు ఒక ఎకరా పొలంలో సమానంగా వెదజల్లాలి. ఈ జీవన ఎరువును వరి నాటిన వారం రోజుల్లో వేయాలి. (ఈ జీవన ఎరువులు వ్యవసాయ పరిశోధనా సంస్థ అమరావతి (ఫోన్ నంబర్ 08654-288245)లో లభ్యమవుతాయి). భూసారాన్ని బట్టి రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింక్ నిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడాలి. సిఫారసు చేసిన ఎరువుల మోతాదు ప్రకారం ఒక ఎకరాకు 40 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్‌నిచ్చే ఎరువులను వాడాలి. నత్రజనిని మూడు సమ భాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోనూ, దుబ్బు చేసే దశలోనూ, అంకురం దశలోనూ, బురద పదునులో మాత్రమే సమానంగా వెదజల్లి 36 - 48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి. 50 కిలోల యూరియాకు 10 కిలోల వేపపిండి లేదా 250 కిలోల తేమ కలిగిన మట్టిగాని కలిపి, 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులను రేగడి నేలల్లో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. చలక(తేలిక) భూముల్లో ఆఖరి దమ్ముల్లో సగం, అం కురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలోగాని అంకురం ఏర్పడే దశలోగాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది. ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి. లేదా పైరుపై జింకు లోపం కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి 5 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేయాలి. భాస్వరం ఎరువుతో పాటు జింక్ సల్ఫేట్‌ను కలి పి వేయకూడదు. కనీసం మూడు రోజుల వ్య వధి ఉండాలి. జింక్ సల్ఫేట్ ద్రావణంలో పురు గు లేదా తెగుళ్ల మందులను కలుపకూడదు. ఇనుము లోప లక్షణాలు కనిపించినప్పుడు లీటరు నీటికి 20 గ్రాముల అన్నభేది, 2 గ్రాముల నిమ్మ ఉప్పు, కలిపి పిచికారీ చేయాలి. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువ గాఢత కల్గిన ద్రావణాన్ని (0.5 నుంచి 1 శాతం) వాడాలి. -
అధిక భాస్వరంతో పంటకు అనర్థం
మార్కాపురం : ‘జిల్లాలో పత్తి పంట మొలకెత్తే దశ నుంచి తీత దశలో సాగులో ఉంది. ప్రస్తుతం పంటను కాపాడుకోవడానికి రైతులు అనుసరిస్తున్న పద్ధతులు మారాలి. అధిక దిగుబడి కోసం విచక్షణా రహితంగా ఎరువులు వాడితే మొదటికే మోసం వస్తుంద’ని చెబుతున్నారు మార్కాపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కేఐ సుదర్శనరాజు(8886613189). పత్తిలో సస్యరక్షణ, ఎరువుల వాడకం గురించి ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్ర : పత్తిలో ఎరువుల యాజమాన్యం ఎలా? జ : దుక్కిలో 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ వేయాలి. పైపాటుగా నత్రజనిని 12 కిలోల చొప్పున మూడు దఫాలుగా వేసుకోవాలి. 30 రోజుల వ్యవధిలో ఒకసారి, 45 రోజుల వ్యవధిలో రెండోసారి, 60 రోజుల వ్యవధిలో మరోసారి వేసుకోవాలి. 60 రోజుల తర్వాత పొటాష్ 12 కిలోలు వే యాలి. రైతులు భాస్వరంను దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. ప్ర : రైతులు పంటల సాగులో పొరపాట్లు చేస్తున్నారా? జ : అవును. అధిక దిగుబడి కోసం తమ ఇష్టమొచ్చిన రీతిలో ఎరువులను వాడుతున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. భాస్వరం ఎక్కువగా వాడితే నేలకు చేటు చేస్తుంది. సూక్ష్మ పోషకాలను మొక్కకు అందకుండా నిలిపేస్తుంది. నత్రజని ఎరువును ఎక్కువగా వాడితే మెత్తదనం పెరిగి పురుగులు, తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రైతులు పొటాష్‌ను ఎక్కువగా వాడటం లేదు. దీనిని వాడకపోవడం వల్ల మొక్కకు రావాల్సిన గట్టిదనం రాదు. గింజల్లో, దూదిలో నాణ్యత తగ్గుతుంది. ప్ర : పత్తిలో పోషక లోపాలను గుర్తించారా? జ : మార్కాపురం ప్రాంతంలో సాగు చేస్తున్న పత్తిలో మెగ్నీషియం, బోరాన్ లోపం కనిపిస్తోంది. 10 గ్రా. మెగ్నిషీయం సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ లోపం నివారణకు 1.25 గ్రా. బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్ర : పత్తిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి? జ : రసం పీల్చేటువంటి పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులను పత్తి మొక్క కాండానికి మందును బొట్టు పెట్టే పద్ధతిలో నివారించవచ్చు. ఈ పద్ధతిలో దశలను బట్టి మోనోక్రోటోఫాస్ మందును 1:4 నిష్పత్తిలో నీటిలో కలుపుకోవాలి. ఇదే మందును పిచికారీ చేస్తే మిత్ర పురుగులు చనిపోయి పైరు దెబ్బతింటుంది. పూతపూసే విధానం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. బ్రష్‌ను రైతులు ఇంటి వ ద్దే రూ.150 ఖర్చుతో తయారు చేసుకోవచ్చు. -
మొక్కజొన్న సాగు..రైతులకు బహుబాగు..
జిల్లాలో నీటి వసతి కింద సాగు చేస్తున్న మొక్కజొన్న పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో ఈ పంట ఏపుగా పెరగాలంటే మంచి ఎరువులు, సరైన నీటి యాజమాన్య పద్ధతులు తప్పనిసరి. పంట దశను బట్టి నీటి తడులు ఇచ్చినట్లయితే పంటను కాపాడుకోవడమేకాక మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. రైతులు దీన్ని దృష్టిలో ఉంచుకుని పంటను కాపాడుకోవాలని నిజామాబాద్ డాట్ సెంటర్ కో ఆర్డినేటర్ కే.పవన్‌చంద్రారెడ్డి సూచిస్తున్నారు. -నిజామాబాద్ వ్యవసాయం ఎరువుల యాజమాన్యం ఖరీఫ్‌లో మొక్కజొన్న సంకర రకాలకు సిఫారసు చేసిన నత్రజని, భాస్వరము, పొటాష్ మోతాదు ఎకరానికి 72-80: 24:20 కిలోలు ఉండాలి. నత్రజని వర్షాధారం కింద సాగుచేసే పంటకు నత్రజని మూడు సమ దఫాల్లో వేసుకోవాలి. విత్తే సమయంలో 1/3వ వంతు నత్రజనిని, 1/3వ వంతు 30-35రోజుల మధ్య, మిగిలిన 1/3వ వంతు 50-55రోజుల మధ్య వేయాలి. అదే నీటి పారుదల కింద సాగు చేసే మొక్కజొన్న పంటకు నత్రజనిని నాలుగు సమ దఫాల్లో వేసుకోవాలి. 1/4వ వంతు నత్రజనిని విత్తే సమయంలో, 1/4వ వంతు 25-30 రోజుల మధ్య, 1/4వ వంతు 45-50రోజుల మధ్య మిగిలిన 1/4వ వంతు 60-65రోజుల మధ్య వేయాలి. భాస్వరం సిఫారసు చేసిన భాస్వరపు పూర్తి మోతాదును విత్తే సమయంలో వేసుకోవాలి. పొటాష్ సిఫారసు చేసిన పొటాష్‌ను రెండు సమ దఫాల్లో వేసుకోవాలి. సగం పొటాష్‌ను విత్తే సమయంలో, మిగతా సగం పొటాష్ ఎరువును పూత దశలో వేసుకోవాలి. జింకు ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్‌ను మూ డు పంటలకొకసారి దుక్కిలో వేయాలి. పై రుపై జింకు లోపం కనిపిస్తే లీటరు నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కలిపి పైరుపై పి చికారి చేయలి. ప్రధాన పోషకాలతోపాటు ద్వితీయ, సూక్ష్మ పోషకాలను కూడా అందించాలి. కాల్షియం వల్ల గింజలు బాగా గట్టి పడతా యి. మెగ్నీషియం వల్ల కండెలో ఎక్కువ వ రుసల్లో గింజలు ఏర్పడతాయి. గంధకం నూనెశాతంపెరగడానికి దోహదపడుతుంది. బోరాన్, మాంగనీస్ వల్ల కండెలో గింజలు సమృద్ధిగా ఏర్పడతాయి. ఎకరానికి 5 కిలోల సీఏ, 5 కిలోల మెగ్నీషియం(ఎంజీ), 5 కిలోల-ఎస్, 250 గ్రాముల బీ-, ఎంఎన్ను మూడు దఫాలుగా వేసుకోవాలి. దశలను బట్టి నీటి వినియోగం.. మొక్కజొన్నకు నీరు, సూర్యరశ్మిని ఉపయోగించుకునే శక్తి ఎక్కువ. అందువల్ల ఈ మొక్కలు చాలాత్వరగా, ధృడంగా పెరుగుతాయి. గింజలు విత్తే ముందు నేలలో తేమ సరైన స్థాయిలో ఉండాలి. మొక్కజొన్న అధికనీరు లేదా బెట్టె పరిస్థితులను తట్టుకోలేదు. విత్తిన మొదటి రెండు రోజులు నీటి ముంపు తట్టుకోలేదు. పైరు విత్తిన 20 రోజుల వరకు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తేమకు సున్నిత దశలు- పంట మోకాలెత్తు దశ, పూత దశ, గింజ పాలు పోసుకునే దశ, గింజ నిండే దశ. విత్తిన వెంటనే నీటి తడి ఇవ్వడం ద్వారా మంచి మొలక శాతం పొందవచ్చు. పంట లేద దశలో నీటి ఎద్దడికి గురైతే మగ, ఆడ పూలు పుష్పించే దశలు ఆలస్యమవుతాయి. పూత దశలో నీటి వినియోగం అత్యధికంగా ఉండాలి. ఈ దశ మొక్కకు నీరు అత్యంత కీలమైనది. ఈ సమయంలో మొక్కజొన్న నీటి ఎద్దడికి గురైతే మగపూలు, పీచు ఎండిపోతాయి. పరాగ సంపర్కం సరిగ్గా జరగదు. పైఆకులు ఎండిపోతాయి. దీంతో కండెలో గింజల సంఖ్య, పరిమాణం తగ్గుతుంది. దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. పూత దశ నుంచి గింజపాలు పోసుకునే వరకు పంట నీటి ఎద్దడికి గురైనట్లయితే 40 నుంచి 80 శాతం వరకు దిగుబడులు తగ్గుతాయి. గింజ కట్టే సమయంలో నీటి ఎద్దడి ఏర్పడితే పెద్దగా నష్టం ఉండదు. అందువల్ల పంట పెరిగే దశలో ఎక్కువ వ్యవధితో, పూత దశలో తక్కువ వ్యవధితో నీరు పెట్టాలి. సాధారణంగా పంట కాలంలో నల్లరేగడి నేలలో 5 నుంచి 8 తడులు, ఎర్రనేలలో 8 తడులు అవసరం. ఒకవేళ ఆరు తడులు ఇవ్వటానికి అవకాశం ఉంటే, మొదటి తడి మొలక దశలో, రెండోది మోకాలెత్తు దశలో, మూడోది పూత దశలో, నాలుగు,ఐదు తడులను పూత దశ నుంచి గింజ పాలుపోసుకునే వరకు, ఆరో తడి గింజనిండే దశలో ఇవ్వాలి. ఒకవేళ ఐదు తడులు మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటే, పంట మొలక దశను త ప్పించి మిగతా దశలో ఇచ్చుకోవాలి. కొన్నిసార్లు సాగునీరు 4 తడులు ఇవ్వాడానికి మాత్రమే సరిపోయేలా ఉంటే, మొదటి తడి పంట మోకాలెత్తు దశలో, రెండో తడి పూత దశలో, మిగతా రెండు తడులను పూత దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఇవ్వాలి.