మార్కాపురం : ‘జిల్లాలో పత్తి పంట మొలకెత్తే దశ నుంచి తీత దశలో సాగులో ఉంది. ప్రస్తుతం పంటను కాపాడుకోవడానికి రైతులు అనుసరిస్తున్న పద్ధతులు మారాలి. అధిక దిగుబడి కోసం విచక్షణా రహితంగా ఎరువులు వాడితే మొదటికే మోసం వస్తుంద’ని చెబుతున్నారు మార్కాపురం వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు కేఐ సుదర్శనరాజు(8886613189). పత్తిలో సస్యరక్షణ, ఎరువుల వాడకం గురించి ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్ర : పత్తిలో ఎరువుల యాజమాన్యం ఎలా?
జ : దుక్కిలో 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ వేయాలి. పైపాటుగా నత్రజనిని 12 కిలోల చొప్పున మూడు దఫాలుగా వేసుకోవాలి. 30 రోజుల వ్యవధిలో ఒకసారి, 45 రోజుల వ్యవధిలో రెండోసారి, 60 రోజుల వ్యవధిలో మరోసారి వేసుకోవాలి. 60 రోజుల తర్వాత పొటాష్ 12 కిలోలు వే యాలి. రైతులు భాస్వరంను దుక్కిలో మాత్రమే వేసుకోవాలి.
ప్ర : రైతులు పంటల సాగులో పొరపాట్లు చేస్తున్నారా?
జ : అవును. అధిక దిగుబడి కోసం తమ ఇష్టమొచ్చిన రీతిలో ఎరువులను వాడుతున్నారు. దీనివల్ల భూసారం దెబ్బతినడంతో పాటు పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. భాస్వరం ఎక్కువగా వాడితే నేలకు చేటు చేస్తుంది. సూక్ష్మ పోషకాలను మొక్కకు అందకుండా నిలిపేస్తుంది. నత్రజని ఎరువును ఎక్కువగా వాడితే మెత్తదనం పెరిగి పురుగులు, తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రైతులు పొటాష్‌ను ఎక్కువగా వాడటం లేదు. దీనిని వాడకపోవడం వల్ల మొక్కకు రావాల్సిన గట్టిదనం రాదు. గింజల్లో, దూదిలో నాణ్యత తగ్గుతుంది.
ప్ర : పత్తిలో పోషక లోపాలను గుర్తించారా?
జ : మార్కాపురం ప్రాంతంలో సాగు చేస్తున్న పత్తిలో మెగ్నీషియం, బోరాన్ లోపం కనిపిస్తోంది. 10 గ్రా. మెగ్నిషీయం సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. బోరాన్ లోపం నివారణకు 1.25 గ్రా. బోరాక్స్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ప్ర : పత్తిలో రసం పీల్చే పురుగులను ఎలా నివారించాలి?
జ : రసం పీల్చేటువంటి పేనుబంక, పచ్చదోమ, తామర పురుగులను పత్తి మొక్క కాండానికి మందును బొట్టు పెట్టే పద్ధతిలో నివారించవచ్చు. ఈ పద్ధతిలో దశలను బట్టి మోనోక్రోటోఫాస్ మందును 1:4 నిష్పత్తిలో నీటిలో కలుపుకోవాలి. ఇదే మందును పిచికారీ చేస్తే మిత్ర పురుగులు చనిపోయి పైరు దెబ్బతింటుంది. పూతపూసే విధానం వల్ల ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. బ్రష్‌ను రైతులు ఇంటి వ ద్దే రూ.150 ఖర్చుతో తయారు చేసుకోవచ్చు.
అధిక భాస్వరంతో పంటకు అనర్థం
Published Mon, Sep 8 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement
Advertisement