సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పత్తి పంటకు ‘పచ్చ’ తెగులు పట్టింది. వాస్తవాలను మరుగున పరిచి ఈనాడు రామోజీరావు విషం కక్కారు. వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన 56 నెలల్లో రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుంటే, పత్తి రైతులకు అన్యాయం జరిగి పోయిందంటూ ‘వి‘పత్తి’పై.. నిర్లక్ష్యపు కత్తి’ అంటూ ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేశారు. ఈ కథనంలో వాస్తవాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం..
ఆరోపణ: సగానికి తగ్గిన సాగు, దిగుబడులు
వాస్తవం: పత్తి సాధారణ విస్తీర్ణం 15.26 లక్షల ఎకరాలు కాగా, ఖరీఫ్ – 2023లో 10.35 లక్షల ఎకరాల్లో సాగయింది. 12 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంతర్జాతీయంగా పత్తి ధరలు తగ్గడం వల్ల పత్తి రైతులు మిరప, మొక్కజొన్న, ఆముదం, సోయాబీన్, జామ, డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ వంటి పంటలకు మళ్లారు. దీంతో పాటు దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు, కోత దశలో మిచాంగ్ తుపాను ప్రభావం ఖరీఫ్–2023 సీజన్‌పై పడింది.
పత్తి రైతులు ఇతర పంటలవైపు మళ్లడంతో మిరప 3.90 లక్షల ఎకరాల నుంచి 6.54 లక్షల ఎకరాలకు, మొక్కజొన్న 6.57 లక్షల ఎకరాల నుంచి 8.05 లక్షల ఎకరాలకు, ఆముదం 90 వేల ఎకరాల నుంచి 1.63 లక్షల ఎకరాలకు, సోయాబీన్ 2 వేల ఎకరాల నుంచి 22 వేల ఎకరాలకు పెరిగింది.
పోనీ చంద్రబాబు హయాంలో ఏమైనా పెరిగిందా అంటే అదీ లేదు. 2014–15 లో 20.37 లక్షల ఎకరాల్లో సాగవగా, 27.51 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అదే 2018–19కి వచ్చేసరికి సాగు విస్తీర్ణం 15లక్షల ఎకరాలకు పడిపోయింది. దిగుబడులు 14.91 లక్షల టన్నులకు దిగజారిపోయాయి.
ఆరోపణ: క్వింటాకు రూ.1,000 కంటే తక్కువకే అమ్మకాలు
వాస్తవం: చంద్రబాబు హయాంలో ఏనాడూ పత్తి క్వింటాకు రూ.6,400 మించి పలకలేదు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో దాదాపు అన్ని సీజన్లలో ఎమ్మెస్పీకి మించి ధర పలికింది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.13 వేలు పలికింది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ లేకపోయినప్పటికీ, రాష్ట్రంలో క్వింటా పొడుగు పత్తి గింజ ఎమ్మెస్పీ రూ.7020 కాగా, ఆదోని మార్కెట్‌లో బుధవారం రూ.7029 పలికింది.
మధ్యస్థ గింజ ఎమ్మెస్పీ రూ.6,800 కాగా, రూ.6,620 పలికింది. మరొక వైపు ధరలు పతనమైన ప్రతిసారీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ద్వారా పత్తిని కొంటోంది. ఇలా 4.5 ఏళ్లలో 83,413 మంది రైతుల నుంచి రూ.1,789 కోట్ల విలువైన 3.21 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేసింది.
ఆరోపణ: నకిలీ విత్తనాలతో దోపిడీ
వాస్తవం: నాసిరకం విత్తన తయారీ, విక్రయదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. 351 నాసిరకం విత్తనాల ఉత్పత్తిదారులపై చర్యలు తీసుకుంది. మరో 168 నాసిరకం విత్తన ఉత్పత్తిదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. 2,702 డీలర్‌షాపులను తనిఖీ చేసి రూ.40.97లక్షల విలువైన 34.20 లక్షల క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకొంది.
రూ.12.84 లక్షల విలువైన 2,255 క్వింటాళ్ల విత్తనాల విక్రయాలను నిలిపివేసింది. బాధ్యులైన 16 మంది డీలర్లపై 6ఏ కేసులు, నలుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌్సలో పరీక్షించి, సర్టిఫై చేసిన విత్తనాలను ఆర్బీకేల ద్వారా సరఫరా చేస్తోంది. ఇలా 2022–23లో 108.44 క్వింటాళ్లు, 2023–24లో 18 క్వింటాళ్ల సర్టిఫైడ్ పత్తి విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది.
ఆరోపణ: తెగుళ్లు, చీడపీడల నియంత్రణ చర్యలేవీ?
వాస్తవం: గులాబీ రంగు పురుగు ఉ«ధృతికి అడ్డుకట్ట వేసేందుకు శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించింది. 6,820 హెక్టార్లలో 682 క్షేత్ర స్థాయి ప్రదర్శనలు నిర్వహించి, గులాబీ పురుగు నివారణకు అవసరమైన వనరులను 50 శాతం సబ్సిడీపై ఇచ్చింది. ఫలితంగా 2023–24 సీజన్‌లో ఈ పురుగు ఉధృతి గణనీయంగా తగ్గింది.
నాణ్యమైన దిగుబడులు లక్ష్యంగా 3,895 పొలంబడుల ద్వారా 1.17లక్షల మంది రైతులకు శిక్షణనిచ్చింది. ఇలా అడుగడుగునా పత్తి రైతుకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తుంటే వాస్తవాలకు ముసుగేసి విష ప్రచారం చేయడం ఈనాడుకు తగదని రైతులు హితవు పలుకుతున్నారు.
ఆరోపణ: ప్రభుత్వ ప్రోత్సాహమేది?
వాస్తవం: ప్రభుత్వ ప్రోత్సాహం లేదనడమే అసంబద్ధం. వైఎస్ జగన్ ప్రభుత్వం అడగడుగునా రైతులకు అండగా ఉంది. అన్ని రకాలుగా ప్రోత్సాహాన్నిస్తోంది. రైతులపై పైసా భారం పడకుండా పత్తి పంటకు పంటల బీమా వర్తింపజేసింది. గత 4.5 ఏళ్లలో 8,33,989 మందికి రూ.1,045.40 కోట్ల బీమా పరిహారం చెల్లించింది. వాతావరణ ఆధారిత పథకం కింద అన్ని జిల్లాల్లో ఒకే రీతిలో బీమా వర్తింపజేస్తోంది.
ఈ 4.5 ఏళ్లలో వైపరీత్యాల వల్ల నష్టపోయిన 1.28 లక్షల మందికి రూ.123.56 కోట్లు పంట నష్ట పరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) అందించింది. ఖరీఫ్–2023లో వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన 2.23 లక్షల మందికి రూ.337.17 కోట్లు, మిచాంగ్ తుపాన్ వల్ల దెబ్బతిన్న 2,513 మంది రైతులకు రూ.2.32కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని త్వరలో జమ చేయనుంది. చంద్రబాబు హయాంలో ఒక్క రైతుకు కూడా బీమా పరిహారం ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment