సీఐసీఆర్ రూపొందించిన ఏఐ స్మార్ట్ ట్రాప్‌తో పంజాబ్ రైతు జగదేవ్ సింగ్
ఏఐతో నడిచే సోలార్ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్‌కు సిఐసిఆర్ రూపుకల్పన..
పంజాబ్‌లో పైలట్ ప్రాజెక్ట్ అమలు
పురుగుల తీవ్రతపై గంటకోసారి మొబైల్‌కు క్షేత్రస్థాయి సమాచారం..
సకాలంలో స్పందించి గులాబీ పురుగు నష్టాలను తగ్గించుకుంటున్న రైతులు
దేశవ్యాప్తంగా పత్తి పంటకు పెనునష్టం కలిగిస్తున్న గులాబీ పురుగును సమర్థంగా అరికట్టే కృషిలో నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశో«దనా సంస్థ (ఐసిఎఆర్–సిఐసిఆర్) పెద్ద ముందడుగు వేసింది. కృత్రిమ మేధ (ఎఐ)తో నడిచే హైటెక్ ఫెరమోన్ ట్రాప్‌లను పంజాబ్ రైతులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చింది. పంటలపై పురుగుల నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను దేశంలోనే మొట్టమొదటి సారిగా వాడిన ఘనతను సిఐసిఆర్ దక్కించుకుంది.
సంప్రదాయ లింగాకర్షక బుట్టలతోపోల్చితే ఈ అత్యాధునిక సాంకేతికతతో కూడిన ట్రాప్‌లు చాలా మెరుగైన ఫలితాలను అందిస్తున్నాయని పంజాబ్ పత్తి రైతులు సంతోషిస్తున్నారు. పురుగుల తీవ్రతపై ప్రతి గంటకు రైతుల మొబైల్‌కు, కంప్యూటర్‌కు సమాచారం అందించటం ఈ ఎఐ ఫెరమోన్ ట్రాప్ ప్రత్యేకత. దీని ప్రకారం వ్యవసాయ విస్తరణాధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వెంటనే నియంత్రణ చర్యలు సూచిస్తున్నారు.
అదే రోజు ఆ చర్యలను రైతులు అమలు చేస్తుండటం వల్ల గులాబీ పురుగు వల్ల నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతున్నానని పంజాబ్ రైతు జగదేవ్‌సింగ్ చె΄్పారు. 2021 నుంచి వరుసగా మూడేళ్లుగా ఉగ్రరూపం దాల్చిన గులాబీ పురుగు బారిన పడి పంటను తీవ్రంగా నష్ట΄ోయిన రైతుల్లో ఈయన ఒకరు. ఎకరంన్నరలో బీజీ2 పత్తి సాగు చేస్తున్నారు. మూడు జిల్లాల్లో మరో 17 మంది రైతులు సిఐసిఆర్ పైలట్ ప్రాజెక్టు వల్ల ఈ ఏడాది పత్తి పంటపై దిగులు లేకుండా గడుపుతున్నారు.
పత్తి పంటలో గులాబీ పురుగు తీవ్రతను గుర్తించడానికి హెక్టారుకు 5 చొప్పున లింగాకర్షక బుట్టలు పొలంలో వేలాడగడతారు. గాసిప్లూర్ అనే రసాయనిక ల్యూర్‌ను ఈ బుట్టలో పెడతారు. అది అడ పురుగుల వాసనగా పొరపడి ఆకర్షితులై వచ్చే మగ పురుగులు ఆ బుట్టలో చిక్కుకుంటాయి. వీటి సంఖ్యను బట్టి గులాబీ పురుగు తీవ్రతను అంచనా వేసి, క్రిమిసంహారకాలు చల్లుతారు.
స్మార్ట్ ట్రాప్ ఎలా పనిచేస్తుంది?
డిజిటలీకరించిన ఈ స్మార్ట్ ట్రాప్ సోలార్ విద్యుత్‌తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ట్రాప్ వ్యవస్థలో సింగిల్ బోర్డ్ కంప్యూటర్, కెమెరా మోడ్యూల్, వాతావరణ సెన్సార్, సోలార్‌తో నడిచే జిఎస్‌ఎం ట్రాన్స్‌మిటర్, రీచార్జిబుల్ బ్యాటరీ ఉంటాయి. ట్రాప్‌లోకి వచ్చి అతుక్కు΄ోయిన పురుగులను నిరంతరం ఈ కెమెరా ఫొటోలు తీసి, క్లౌడ్‌లోని రిమోట్ సర్వర్‌కు ఎప్పటికప్పుడు పంపుతుంది. ఆ ఫొటోలను మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను ఉపయోగించి ఏయే రకాల పురుగులన్న విశ్లేషణ జరుగుతుంది. గులాబీ పురుగునకు చెందిన రెక్కల పురుగులు ఎన్ని అనే విషయం ఇలా నిర్థారణ అవుతుంది. ఈ సమాచారంతో పాటు వాతావరణ వివరాలు స్మార్ట్ ట్రాప్‌కు అనుసంధానించిన మొబైల్/కంప్యూటర్లకు సంక్షిప్త సందేశాల రూపంలో చేరుకుంటాయి. ఈ విధంగా రైతులు సకాలంలో పురుగు తీవ్రతను గుర్తించి, క్రిమిసంహారాలు వాడి పత్తిని గులాబీ పురుగు నుంచి రక్షించుకుంటున్నారు.
‘గతంలో సాధారణ లింగార్షక బుట్టలను పత్తి పొలంలో పెట్టి, ప్రతి 3 రోజులకోసారి స్వయంగా పొలానికి వెళ్లి చూసేవాడిని. నేను వెళ్లి చూసినప్పుడు పురుగులు పెద్దగా లేక΄ోవచ్చు. కానీ, తర్వాత రెండు రోజులు అటు వెళ్లను. ఆ తర్వాత రోజు వెళ్లేటప్పటికే పురుగు ఉధృతితో పంటకు తీవ్ర నష్టం జరిగి΄ోతూ ఉండేది. ఏ రోజు, ఏయే వేళలో పురుగు ఎక్కువ పంటను ఆశించిందీ మాకు తెలిసేది కాదు. కానీ, ఇప్పుడు ఆ సమస్యల్లేవు. ప్రతి గంటకు మెసేజ్ వస్తుంది. అవసరమనిపిస్తే వెంటనే స్పందించి పిచికారీలు చేసి పంటను కాపాడుకుంటున్నాం..’ అన్నారు రైతు జగదేవ్‌సింగ్.
సకాలంలో గులాబీ పురుగుకు చెక్..
పత్తి పొలంలోని లింగాకర్షక బుట్టల్లో వరుసగా 3 రోజులు రోజుకు 8 చొప్పున గులాబీ రెక్కల పురుగులు కనిపిస్తే.. పంట దిగుబడిని భారీగా నష్టపరిచే స్థాయిలో పురుగు ఉందని అర్థం. అయితే, సాధారణ లింగాకర్షక బుట్టలను రైతులు పొలంలో పెట్టుకున్నప్పటికీ.. వాటిలో ఎన్ని పురుగులు పడుతున్నాయో గమనించే రైతులను మేం గతంలో చాలా అరుదుగా చూశాం. ఎందుకంటే, ఆ పని చేయటానికి వారికి చాలా సమయం అవసరం పడుతుంది. రైతు లు పత్తితో పాటు ఇతర పంటల పనులు కూడా చూసుకోవాల్సి ఉంటుంది కదా.
ఈ కొత్త వ్యవస్థ వారి సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుంది. ఫోన్‌లోకి వచ్చే సమాచారంతో పత్తి రైతులు గులాబీ పురుగు ఉనికిని సకాలంలో గుర్తించగలుగుతారు. తగిన సమయంలో క్రిమిసంహారకాలను చల్లి, పంట నష్టాన్ని సమర్థవంతంగా తగ్గించుకుంటున్నారు. కృత్రిమ మేధతో రూపొందించిన ఈ స్మార్ట్ ఫెరమోన్ ట్రాప్ తక్కువ ఖర్చుతోనే గులాబీ పురుగును సమర్థవంతంగా అరికడుతోంది. ఇవి రైతులు స్వయంగా పొలాల్లో ఏర్పాటు చేసుకోవటానికి ఉద్దేశించి రూపొందించినవి కాదు. తహసిల్ స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు పురుగు తీవ్రతను సకాలంలో గుర్తించి, రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వటానికి డిజిటల్ సాధనాలుగా వాడుకోవడానికి స్మార్ట్ ట్రాప్స్ ఉపయోగపడుతాయి. తక్కువ సాంద్ర గ్రిడ్ పద్ధతిలో రైతుల పొలాల్లో ప్రభుత్వం ఈ స్మార్ట్ ట్రాప్‌లను ఏర్పాటు చేయవచ్చు.
– డా. వై.జి. ప్రసాద్, డైరెక్టర్, కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ, నాగపూర్
Comments
Please login to add a commentAdd a comment