నువ్వుల సాగు ఇలా.. | Sesame cultivation as this type | Sakshi
Sakshi News home page

నువ్వుల సాగు ఇలా..

Published Wed, Oct 1 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

Sesame cultivation as this type

 విత్తన మోతాదు, శుద్ధి చేసే విధానం..
ఎకరానికి 1.5 నుంచి 2 కిలోల విత్తనం అవసరం. విత్తన పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి విత్తనానికి ఐదింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి. విత్తనాన్ని 2 నుంచి 3 సెం.మీ. లోతు మించకుండా వేయాలి.
కిలో విత్తనానికి 3 గ్రాముల థైరమ్ లేదా మాంకోజెబ్ లేదా కార్బండిజమ్‌తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
 వరుసల మధ్య 30 సెం.మీ., మొక్కల మధ్య 10-15 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి.
 
ఎరువుల యాజమాన్యం..
 రబీలో ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 24 కిలోల నత్రజని, 8 కిలోల పొటాష్, 8 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. నత్రజని సగభాగం, భాస్వరం, పొటాష్ ఇచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియ దున్నాలి. మిగిలిన సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెలరోజులకు కలుపుతీసి వేయాలి.
 భాస్వరం ఎరువు సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో పడినపుడు అదనంగా క్యాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది.
 
నీటి యాజమాన్యం..
 విత్తిన వెంటనే మొదటి త డి ఇవ్వాలి. పూత, కాయ, అభివృద్ధి, గింజ కట్టు దిగేట్లు తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35-40 రోజుల నుంచి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి.
 
కలుపు నివారణ....
 విత్తే ముందు పుక్లొరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి కలియదున్నాలి. పెండి మిథాలిన్ 30శాతం లేదా అలాక్లోర్ 50శాతం ఎకరాకు లీటరు చొప్పున విత్తిన వెంటనే గానీ, మరుసటి రోజున గానీ పిచికారీ చేయాలి.
 
చీడపీడల నివారణ.. సస్యరక్షణ చర్యలు..
 ఈ పంటకు ఎక్కువగా కాయ తొలిచే పురుగు ఆశిస్తుంది. దీని లార్వా లేత ఆకుపచ్చ రంగులో ఉండి నల్లటి మచ్చలు కలిగి ఉంటుంది. తొలి దశలో చిన్న లార్వాలు కలిసి గూడు కట్టి లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని కొరుక్కు తింటాయి. తద్వారా ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగు ఉద్ధృతి అంతగా ఉండదు. పురుగు ఆశించిన ఆకులను లార్వాలతో సహా ఏరి నాశనం చేయాలి. మోనోక్రోటోపాస్ 1.6 మి.లీ. లేదా క్లోరోపైరిపాస్ 2.5 మి.లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement