మోయలేని భారంగా ఓవర్ డ్రాఫ్ట్ బకాయి
యూనియన్ బ్యాంకులో రూ.400 కోట్ల ఓడీ
ప్రతినెలా వడ్డీ కిందనే రూ.3 కోట్లు చెల్లింపు
ప్రస్తుతం బ్యాంకు బ్యాలెన్స్ రూ.3.66 కోట్లు
విత్తన సంస్థలకు ఇవ్వాల్సిన బకాయి రూ.80 కోట్లు
సంస్థకు మిగిలిన ఓడీ పరిమితి రూ.2 వేలు మాత్రమే
సాక్షి, హైదరాబాద్: దేశానికి అవసరమైన విత్తనాల్లో 70 శాతం తామే అందిస్తున్నామని, విత్తన భాండాగారంగా వెలుగొందుతున్నామని చెప్పుకుంటున్న రాష్ట్రంలో ప్రభుత్వ విత్తనాభివృద్ధి సంస్థ దివాళా అంచున నిలబడింది. ప్రైవేటు విత్తన సంస్థలు ఏటా రూ.కోట్లు ఆర్జిస్తుంటే, విత్తనాభివృద్ధి సంస్థ మాత్రం ఏటికేడు నష్టాల్లో కూరుకుపోతోంది. సంస్థ 2016లో యూనియన్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) కింద రూ.100 కో ట్లు తీసుకుంది. ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించకపోవడం, ఏటా మరింత మొత్తం తీసుకోవటంతో ప్రస్తుతం అది రూ.400 కోట్లకు చేరింది.
దీనికి ప్రతినెలా రూ.3 కోట్ల చొప్పున వడ్డీని సంస్థ చెల్లిస్తోంది. అప్పుల భారం పెరగడంతో ఉద్యోగుల జీతాలకు కూడా ఇబ్బందిపడే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం సంస్థ బ్యాంకు ఖాతాలో రూ.3.66 కోట్ల మేర నిల్వ లు ఉండగా, ఫిబ్రవరి ఒకటో తేదీ తరువాత అందులో నుంచి రూ.3 కోట్లు వడ్డీ కింద బ్యాంకు జమ చేసుకుంటుంది. మిగిలే రూ.66 లక్షలను ఉద్యోగులకు వేతనాల కింద సర్దుబాటు చే యాల్సి ఉంటుంది. పోనీ మళ్లీ ఓడీ తీసుకుందామంటే.. సంస్థకు ఇప్పుడున్న క్రెడిట్ అవకాశం రూ.2 వేల వరకు మాత్రమే.
స్వయంకృతం
విత్తనాల కోసం అభివృద్ధి చేసిన వరి, ఇతర పప్పు ధాన్యాలను సకాలంలో రైతులకు విక్రయించకపోవడం సంస్థకు ఏటా రివాజుగా మారింది. దాంతో సీజన్ దాటగానే సీడ్ (విత్తనాలు)ను నాన్ సీడ్‌గా మార్చి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. 2023లో 50 వేల క్వింటాళ్ల వరి విత్తనాలను నాన్‌సీడ్‌గా మార్చి విక్రయించటంతో రూ.94 కోట్ల నష్టం వచ్చింది. 2015–16 నుంచి విత్తన సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల్లో ఇంకా రూ.80 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్నేళ్లుగా ప్రభుత్వం విత్తనాలకు సబ్సిడీని విడుదల చేయడం లేదు. ఈ సబ్సిడీ మొత్తం రూ.450 కోట్లవరకు రావాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. 9 ప్రాసెస్ యూనిట్లు, ఆగ్రోస్ విక్రయ కేంద్రాలు, సొసైటీల ద్వారా విత్తనాలను విక్రయించే సంస్థ సరైన ప్రణాళిక లేక దివాళా దశకు చేరిందని వ్యవసాయ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
బోర్డు ఆమోదం లేకుండానే టెండర్లు
వచ్చే 2025–26లో వానాకాలం, యాసంగి సీజన్‌లలో రైతులకు అందించేందుకు 2.73 లక్షల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాల కోసం సంస్థ టెండర్లు పిలిచింది. అందుకు కార్పొరేషన్ బోర్డు ఆమోదం తీసుకోనేలేదు. 1.78 లక్షల క్వింటాళ్ల 8 రకాల వరి విత్తనాలు, 50 వేల క్వింటాళ్ల సోయాబీన్.. పెసర, కంది, శనగ, వేరుశనగ, జొన్న మొదలైన 2,73,500 క్వింటాళ్ల విత్తనాల కోసం సంస్థ తరఫున ఇన్‌చార్జి ప్రొడక్షన్ మేనేజర్ నోటిఫికేషన్ ఇచ్చారు. జనవరి 27వ తేదీ టెండర్ల దాఖలుకు చివరి తేదీ కాగా, ఒక్క విత్తన సంస్థ కూడా టెండర్ వేయకపోవటంతో గడువు తేదీని ఫిబ్రవరి 11 వరకు పొడిగించారు.
గత సర్కారు నిర్ణయాల వల్లే ఈ పరిస్థితి
బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయాలే విత్తనాభివృద్ధి సంస్థ నష్టాలకు కారణం. సంస్థకు రావాల్సిన సబ్సిడీని విడుదల చేయలేదు. సీడ్‌ను నాన్ సీడ్‌గా మార్చి విక్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాసెస్ చేసిన విత్తనాలను పూర్తిస్థాయిలో విక్రయించే ఏర్పాట్లు చేశాం. 2024లో ఆ ఫలితాలు కనిపించాయి. కొత్త టెండర్లకు బోర్డు ఆమోదం అవసరం లేదు. ఇది రెగ్యులర్‌గా జరిగే ప్రక్రియ. – అన్వేశ్‌రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment