రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న విత్తన సాగు
7.5 లక్షల ఎకరాల్లో.. 3.5 లక్షల మంది రైతుల కృషి
దేశ అవసరాల్లో 55 శాతం విత్తనాలు ఇక్కడినుంచే..
నీరు, నేల, వాతావరణం, రైతు వనరులు అనుకూలం
సాధారణ పంటలకంటే రెట్టింపు ఆదాయం
విదేశాలకు సైతం తెలంగాణ విత్తనాలు ఎగుమతి
(యెన్నెల్లి సురేందర్) గజ్వేల్: భారత్ ఇప్పటికీ వ్యవసాయాధారిత దేశమే. కోట్లమంది రైతులు, కోట్ల ఎకరాల్లో అనేక రకాల పంటలు పండిస్తున్నారు. మంచి పంట రావాలంటే అతి ప్రధానమైనది విత్తనం. పంటలు పండే ప్రతి చోటా విత్తనాన్ని ఉత్పత్తి చేయటం సాధ్యం కాదు. అందుకు సమృద్ధిగా నీరు ఉండాలి.. మంచి నేలలు కావాలి. అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి.. వీటన్నింటినీ చక్కగా వాడుకోగల నిపుణులైన రైతులు ఉండాలి.
ఈ వనరులన్నింటికీ ఇప్పుడు తెలంగాణ ఆలవాలమైంది. అందుకే రాష్ట్రం నుంచి ఏటా విత్తన ఎగుమతులు పెరుగుతున్నాయి. దేశానికి అవసరమైన మొత్తం విత్తనాల్లో 55 శాతం తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని తెలంగాణ విత్తనాభివృద్ధి కార్పొరేషన్ అధికారులు తెలిపారు. నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయటం ఎంత ముఖ్యమో.. దానిని పాడవకుండా దీర్ఘకాలం నిల్వచేయటం కూడా అంతే ముఖ్యం.
తెలంగాణ వాతావరణం విత్తన నిల్వకు చక్కగా సరిపోతోంది. అందుకే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన విత్తనాలను కూడా తెలంగాణకు తరలించి నిల్వ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విత్తనోత్పత్తి పరిశ్రమను ప్రోత్సహిస్తూ దేశంలోనే తొలిసారి ఇక్కడే సీడ్ పార్కును ఏర్పాటుచేసింది. ఏటా విత్తనోత్పత్తి పంటల సాగు పెరుగుతున్న తీరుపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్..
ఒక్కో జిల్లాలో ఒక్కో విత్తనం
విత్తనోత్పత్తి రాష్ట్రంలోని దాదాపు అన్ని ఉమ్మడి జిల్లాలకు విస్తరిస్తోంది. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌తోపాటు సిద్దిపేట జిల్లా విత్తనోత్పత్తికి హబ్‌గా అవతరించాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, భూత్పూర్ ప్రాంతాల్లో పత్తి విత్తనోత్పత్తి భారీగా జరుగుతోంది. ముఖ్యంగా గద్వాల జిల్లాలో విత్తన పత్తి పంట దాదాపు 35 వేల ఎకరాల్లో సాగవుతోంది.
మిగితా జిల్లాల్లో వరి, మొక్కజొన్న, సోయా, సజ్జలు, పచ్చ జొన్న తదితర పంటల విత్తనోత్పత్తి జోరుగా సాగుతోంది. నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాల్లో సజ్జ విత్తనాల ఉత్పత్తి అధికంగా ఉంది. 2014–15లో వరి విత్తన ఉత్పత్తి 3 లక్షల కిలోలకుపైగా ఉండగా, ఇప్పుడు రెట్టింపైంది. ఇలా అన్ని రకాల విత్తనోత్పత్తి పెరుగుతూనే ఉన్నది. ఈ ఏడు మరింత పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.
విత్తనోత్పత్తితో మంచి ఆదాయం
నాకు పదెకరాల భూమి ఉంది. సాధారణ పద్ధతిలో ఎంత కష్టపడినా ఎకరాకు 25–30 క్వింటాళ్లకు మించి దిగుబడి రాదు. ఆ వడ్లను అమ్మితే ఖర్చులు పోను రూ.20–25 వేలు కూడా మిగిలేవి కాదు. అందువల్ల విత్తనోత్పత్తి వైపు వచ్చాను. ఖ ర్చులు పోను ఒక సీజన్‌లో ఎకరాలో రూ.60–80 వేల వరకు ఆదాయం వస్తోంది.
చిమ్ముల సీతారాంరెడ్డి, వేలూరు, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా
మూడేళ్లుగా సజ్జ విత్తనోత్పతి చేస్తున్న
మూడేళ్లుగా సజ్జ పంటలో విత్తనోత్పత్తి చేస్తున్న. ఖర్చులు పోను ఎకరాకు రూ.50 వేలకుపైనే ఆదాయం వస్తోంది. ఇప్పటివరకు మంచి ఫలితాలే వచ్చినయ్. – చంద్రం, దండుపల్లి, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా
విత్తనోత్పత్తికి తెలంగాణ నేలలు అనుకూలం
తెలంగాణలో విత్తనోత్పత్తికి అనుకూలమైన నేలలు ఉన్నాయి. చౌడు నేలలు మినహా మిగితా నేలల్లో విత్తన సాగు చేపట్టవచ్చు. విత్తన సాగు రైతులకు లాభదాయకమే అయినప్పటికీ కంపెనీలతో సరిగ్గా అగ్రిమెంట్లు చేసుకోకపోతే నష్టపోవడం ఖాయం. – డాక్టర్ విజయ్‌కుమార్, సిద్దిపేట జిల్లా డాట్ సెంటర్ శాస్త్రవేత్త
లక్షల టన్నులవిత్తనాల ఎగుమతి
రాష్ట్ర వ్యవసాయశాఖ, తెలంగాణ సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారుల లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,400లకు పైగా గ్రామాల్లో 3.10 లక్షల మంది రైతులు 7.5 లక్షల ఎకరాల్లో విత్తనోత్పత్తి చేస్తున్నారు. విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏటా 80 వేల టన్నుల విత్తనోత్పత్తి జరుగుతోంది.
20 లక్షల టన్నుల విత్తనాల నాణ్యతను ఈ సంస్థ ధ్రువీకరించి ఎగుమతి చేస్తోంది. ప్రైవేట్ కంపెనీలు మరో 11.200 లక్షల టన్నుల విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మొత్తంగా రాష్ట్రంలో 12 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నట్లు అంచనా. మరో 12 లక్షల టన్నుల విత్తనాలను ప్రాసెసింగ్ చేస్తున్నారు.
దేశంలో సుమారుగా 44 లక్షల టన్నులకుపైగా విత్తనాల అవసరం ఉండగా.. తెలంగాణ నుంచే 24 లక్షల టన్నులు సరఫరా అవుతుండటం విశేషం. చైనా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, వియత్నాం తదితర 20 దేశాలకు తెలంగాణ విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి.
విత్తన సాగుపై రైతుల ఆసక్తి
సాధారణ పంటలకంటే విత్తనోత్పత్తి పంటల సాగులో ఆదాయం అధికంగా వస్తుండటంతో రైతులు అటువైపు మొగ్గుచూపుతున్నారు. సాధారణ పద్ధతిలో ఎకరా విస్తీర్ణంలో వరి సాగుచేస్తే పెట్టుబడి ఖర్చులుపోను రూ.20–30 వేలు మిగలడమే గగనం. కానీ విత్తనోత్పత్తి పంటలు వేస్తే ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్షకుపైగా ఆదాయం వస్తోంది.
ఈ పంటల సాగు క్లిష్టమైనదే అయినప్పటికీ.. నిష్టాతులైన కూలీలతో సులువుగా సాగు చేపడుతున్నారు. విత్తన వడ్లకు క్వింటాలుకు వివిధ కంపెనీలు రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు ధర చెల్లిస్తున్నాయి. ఒకవేళ 10 క్వింటాళ్లలోపు మాత్రమే దిగుబడి వస్తే సదరు కంపెనీ రైతుకు పరిహారం కింద ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.1 లక్ష చెల్లిస్తోంది. ఇదే తరహాలో పంట రకాలను బట్టి ధరను చెల్లిస్తున్నారు.
మంచి లాభం ఉండటంతో ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 5 వేల ఎకరాల్లో వరితోపాటు ఇతర విత్తన పంటల సాగు చేస్తూ ఏటా రూ.80 కోట్లకుపైగానే లాభం పొందుతున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ సేకరించే విత్తనాలపై క్వింటాల్‌కు కనీస మద్దతు ధ రకంటే వరికి 20 శాతం అధికంగా ఇన్సెంటివ్స్ ఇ స్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తృణధా న్యాలకు 17 శాతం, సోయాబీన్స్‌కు 25 శాతం, ఇతర పంటలకు 15 శాతం ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు.
విత్తనోత్పత్తిలో అగ్రిమెంట్లే కీలకం
విత్తనోత్పత్తి విధానంలో రైతులు, కంపెనీలతో కుదుర్చుకునే ఒప్పందాలు సక్రమంగా లేకుంటే నష్టాలు తప్పవు. అగ్రిమెంట్లు సరిగా లేకపోతే కంపెనీ ముందుగా చెప్పే దిగుబడుల కంటే తక్కువ వస్తే పరిహారం ఇవ్వటంలేదు. అందువల్ల రైతులు విత్తనోత్పత్తి చేపట్టే సందర్భంలో ప్రాంతీయ విత్తన అధికారి వద్ద తమ పంటకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
అయితే, ప్రైవేటు కంపెనీలు భారీ ఎత్తున విత్తనోత్పత్తి చేపడుతున్నా.. ప్రభుత్వం వైపు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. విత్తనోత్పత్తికి సంబంధించి రైతుల్లో స్వయం ప్రతిపత్తిని పెంపొందించడానికి ఆరేళ్ల క్రితం వరకు వ్యవసాయశాఖ అధ్వర్యంలో గ్రామ విత్తనోత్పత్తి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకాన్ని పునరుద్ధరించాలని రైతుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment