development corporation
-
సహారా లైఫ్ విలీనం కాదు.. పాలసీల బదిలీ
న్యూఢిల్లీ: సహారా లైఫ్‌ను తాము విలీనం చేసుకోవడం లేదని ఎస్బీఐ లైఫ్ స్పష్టం చేసింది. బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) ఆదేశాల మేరకు సహారా లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహణలోని పాలసీ దారుల ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకుంటున్నట్టు తెలిపింది. సహారా లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో సంస్థ జారీ చేసిన పాలసీలు, వాటి ఆస్తులు, అప్పులను స్వాధీనం చేసుకోవాలంటూ గత శుక్రవారం ఐఆర్డీఏఐ ఎస్బీఐ లైఫ్‌ను ఆదేశించడం గమనార్హం. మెరుగైన సేవలు అందిస్తామని సహారా లైఫ్ పాలసీదారులకు ఎస్బీఐ లైఫ్ అభయమిచ్చింది. ‘‘సహారా లైఫ్ పాలసీలను మా వ్యవస్థతో అనుసంధానించేందుకు వేగవంతమైన చర్యలు మొదలు పెట్టాం. పూర్తి స్థాయి ఏకీకరణకు కొంత సమయం పడుతుంది. సహారా లైఫ్ పాలసీదారులు 1800 267 9090 టోల్ ఫ్రీ నంబర్లో లేదా ట్చజ్చిట్చ జీజ్ఛఃటbజీ జీజ్ఛ. ఛిౌ. జీn మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని ఎస్బీఐ లైఫ్ సూచించింది. సహారా లైఫ్ కొత్తగా పాలసీలను విడుదల చేయరాదని కూడా ఐఆర్డీఏఐ ఆదేశించడం గమనార్హం. తగినంత సమయం, తగినన్ని అవకాశాలు కల్పించినప్పటికీ తమ ఆదేశాలను పాటించడంలో., పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంలో సహారా లైఫ్ ఇన్సూరెన్స్ విఫలమైందని ఆఆర్డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది. -
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ, అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ)కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను ఎఫ్డీసీకి జర్మనీ ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్ సర్టిఫికెట్ దక్కింది. సేంద్రియ పద్ధతిలో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి లాంటి అటవీ ఉత్పత్తు(ముడిసరుకు)ల నుంచి తయారయ్యే వస్తువులకు ఐదేళ్లపాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్డీసీకి కౌన్సిల్ అనుమతినిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి చెట్లను ఉన్నత ప్రమాణాలతో సాగు చేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కిందని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు మంత్రికి వివరించారు. దీనివల్ల అంతర్జాతీయంగా ఎఫ్డీసీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ఐకియా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లకు జర్మన్ కౌన్సిల్ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందని వెల్లడించారు. ఐదేళ్లలో రూ.10 కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని, కంపోజిట్ వుడ్‌పేపర్, ప్యాకింగ్ పరిశ్రమల కోసం ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు అధికధర లభిస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల నుంచి చేసిన కాగితం, టెట్రాప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్ఎస్సీ ఆమోదం లభించిందని తెలియజేశారు. గుర్తింపు రావడం గొప్ప విషయం: మంత్రి అరణ్యభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో భాగంగా ఇలాంటి గుర్తింపు రావడం గొప్ప విషయమన్నారు. మెరుగైన పద్ధతుల్లో సాగు చేస్తుండటం వల్ల మన అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌తోపాటు 30 శాతం రెవెన్యూ పెరిగిందని తెలిపారు. భవిష్యత్‌లో అటవీ ఉత్పత్తులను మరింత పెంచుకుని, వీటితో వచ్చిన ఆదాయంతో అడవుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.యం.డొబ్రియల్, అటవీ శాఖ అదనపు కార్యదర్శి ఎం. ప్రశాంతి, ఎఫ్డీసీ వైస్ చైర్మన్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్పీఎస్, ఏపీవై ఆస్తులు రూ.6.99 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల పరిధిలోని ఆస్తుల విలువ రూ.6.99 లక్షల కోట్లను అధిగమించినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) మంగళవారం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి ఈ రెండు పథకాల పరిధిలో ఇన్వెస్టర్లకు చెందిన ఆస్తులు రూ.6,99,172 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. 2021 మార్చి 31 నాటికి ఈ ఆస్తులు రూ.5,78,025 కోట్లుగా ఉండడం గమనార్హం. 9 నెలల్లో 20 శాతం వృద్ధి చెందాయి. అసంఘటిత రంగంలోని వారికి ఉద్దేశించిన ఏపీవైలోని ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.19,807 కోట్లుగా ఉన్నాయి. ఎన్పీఎస్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పింఛను నిధులతోపాటు.. ప్రైవేటు రంగం ఉద్యోగుల పింఛను నిధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే, పౌరులు ఎవరైనా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్పీఎస్ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ ఉద్యోగుల ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.3,52,217 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు రూ.2,11,656 కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ రంగం ఉద్యోగుల ఆస్తులు రూ.82,190 కోట్లుగా ఉన్నట్టు పీఎఫ్ఆర్డీఏ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరుల విభాగంలోని ఆస్తులు రూ.28,657 కోట్లుగా ఉన్నాయి. ఈ రెండు పథకాలను పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షిస్తుంటుంది. -
‘డబుల్’కు డబ్బుల్లేవ్...
ఇది నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం బస్ డిపో సమీపంలోని రెండు పడక గదుల గృహ సముదాయం పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వం 192 ఇళ్లను మంజూరు చేసింది. 2018లో రూ.12 కోట్లతో పనులు ప్రారంభించారు. పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు నాలుగు బ్లాకులుగా నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కానీ ప్రస్తుతం నిధులు లేక పనులు ఆగిపోయాయి. దాదాపు మూడు నెలలుగా ఎక్కడి పనులు అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి బ్రేక్ పడింది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిధుల కొరత కారణంగా చాలాచోట్ల కొన్ని నెలలుగా పనులు జరగడం లేదు. కాంట్రాక్టర్లకు దాదాపు రూ.850 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వారు పనులు నిలిపివేశారు. బకాయిలు చెల్లిస్తేనే తిరిగి పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేస్తున్నారు. కొందరు పెద్ద కాంట్రాక్టర్లు మాత్రం, తెచ్చిపెట్టుకున్న సిమెంటు పాడవుతుందన్న ఉద్దేశంతో ఏవో కొన్ని పనులు చేస్తున్నా.. చిన్న కాంట్రాక్టర్లు మాత్రం దాదాపు అన్ని చోట్లా పనులు ఆపేశారు. దీంతో అసలుకే ప్రారంభం కాని ఇళ్లతో పాటు ప్రారంభమై వివిధ దశల్లో ఉన్న ఇళ్ల నిర్మాణం సందిగ్ధంలో పడింది. నిండుకున్న నిధులు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) రుణంపై ఆధారపడి జరుగుతోంది. కాగా ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి రూ.10,500 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. హడ్కో నుంచి రావాల్సిన రూ.8 వేల కోట్ల నిధులు దాదాపుగా వచ్చేశాయి. కేవలం రూ.120 కోట్లు మాత్రమే విడుదల కావాల్సి ఉంది. మరోవైపు గృహనిర్మాణ శాఖ వద్ద నిధులు లేకుండా పోయా యి. ఫలితంగా కాంట్రాక్టర్లకు కొత్తగా బిల్లులు చెల్లించలేకపోతుండటంతో పనులు జరిగే కొద్దీ బకాయిలు పేరుకుపోతూ వస్తున్నాయి. ఆరు నెలలుగా ఇదే పరిస్థితి. చూస్తుండగానే బకాయిలు రూ.850 కోట్లకు చేరుకున్నాయి. అప్పటి నుంచి కాంట్రాక్టర్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గృహనిర్మాణశాఖ అధికారులేమో ఆర్థిక శాఖ చుట్టూ తిరుగుతున్నారు. కానీ నిధులు అందకపోవడంతో కాంట్రాక్టర్లకు సర్దిచెబుతూ పనులు చేయించేందుకు ఒత్తిడి తెస్తున్నారు. అయితే చిన్న కాంట్రాక్టర్లు తమ వల్ల కాదని చేతులెత్తేశారు. అసలే అసంతృప్తి .. ఆపై బిల్లుల సమస్య ఈ పథకం యూనిట్ కాస్ట్ విషయంలో కాంట్రాక్టర్లలో అసంతృప్తి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలను యూనిట్ కాస్ట్‌గా నిర్ధారించారు. ఇంత తక్కువ మొత్తంతో రెండు పడక గదుల ఇళ్లను నిర్మించటం సాధ్యం కాదంటూ కాంట్రాక్టర్లు తొలినాళ్లలో టెండర్లలో పాల్గొనలేదు. చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు వారితో సమావేశాలు నిర్వ హించి, భవిష్యత్తులో అవసరమైతే ఇతర పనులు అప్పగించటంలో ప్రాధాన్యం ఇస్తామని చెప్పటం, ఇళ్ల డిజైన్లలో స్వల్పమార్పులు చేయటంతో వారు ఎట్టకేలకు అంగీకరించారు. ఈ పరిస్థితుల్లోనే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన లేకపోవటంతో ఆయా చోట్ల పనులు ప్రారంభించలేదు. కాగా ఇప్పుడు చేసిన పనికి బిల్లులు సకాలంలో రాకపోవడంతో పనులు చేయలేమని కాంట్రాక్టర్లు మొండికేస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో యూనిట్ కాస్ట్ రూ.7 లక్షలుగా ఉండటం, అంతస్తుల వారీగా నిర్మించే వాటికి మరింత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. నలిగిపోతున్న అధికారులు సెప్టెంబర్ రెండో వారంలో సుమారు 70 వేల ఇళ్లు చివరి దశకు చేరుకుని చిన్నచిన్న పనులు చేస్తే పూర్తయ్యే పరిస్థితికి చేరుకున్నాయి. కేవలం 20 రోజుల పాటు పనులు చేస్తే అవన్నీ పూర్తయ్యేవి. కానీ వాటిల్లో నాలుగు వేలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావన్నీ అలాగే ఉండిపోయాయి. అప్పటివరకు చేసిన పనులకు బిల్లులు రాకపోవటంతో, ఫినిషింగ్ పనులు చేసేందుకు కూడా కాంట్రాక్టర్లు అంగీకరించటం లేదు. ఆ పనులు పూర్తయితే ఇళ్లను కేటాయిస్తారని కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న ప్రజలకు నిరాశే మిగిలింది. కాగా కొన్ని చోట్ల బలవంతంగా ఇళ్లను ఆక్రమిం చుకుని గృహప్రవేశాలు చేసేసుకుంటున్నారు. చిన్నచిన్న పనులు పెండింగులో ఉన్నా.. అలాగే ఉంటామని చెబుతున్నారు. కానీ లబ్ధిదారుల ఎంపిక అధికారికంగా జరగకపోవటంతో అధికారులు వారిని బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. దీంతో వారు అధికారులతో గొడవకు దిగుతుండగా.. కాంట్రాక్టర్లు వాగ్వివాదానికి దిగుతున్నారు. -
కాపు రుణాలు కొందరికే!
అడిగిన వారందరికీ రుణాలిస్తామన్న ప్రభుత్వం ఒక్కశాతం మందికే రుణాలు రాష్ట్రవ్యాప్తంగా రుణం కోసం వచ్చిన దరఖాస్తులు 3,53,479 ఎంపికయినవారు 30,822 మంది మంజూరు చేసింది 27,789 మందికి సబ్సిడీ ఇచ్చింది 10,955 మందికే సాక్షి, చిత్తూరు: కాపు కార్పొరేషన్ ద్వారా అడిగిన కాపులందరికీ రుణాలిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. మొక్కుబడిగా రుణాలిచ్చి చేతులు దులుపుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రుణాల కోసం 3,53,479 మంది కాపులు దరఖాస్తులు చేసుకోగా 1,05,000 మందికి మాత్రమే రుణాలివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చిన దరఖాస్తుల్లో 30,822 మంది రుణాలకు అర్హులంటూ తేల్చింది. చివరకు 27,789 మందికి మాత్రమే రుణాలను మంజూరు చేసింది. వారిలో కేవలం 10,955 మందికి మాత్రమే ఒక్కొక్కరికి రూ. 35వేల చొప్పున సబ్సిడీ విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు... శ్రీకాకుళం జిల్లాలో 4,970 మంది దరఖాస్తు చేసుకోగా 266 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 15 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. విజయనగరంలో 5,409 మంది దరఖాస్తుచేసుకోగా 389 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 24 మందికి, విశాఖపట్నంలో 19,763 మందికిగాను 412 మందికి రుణాలు మంజూరు చేసి 56 మందికి సబ్సిడీ ఇచ్చింది. కాపులు ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి 1,00,759 మంది దరఖాస్తు చేసుకోగా 3,124 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 399 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అర్హులైన కాపులందరికీ రుణాలివ్వాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష సందర్భంగా డిమాండ్ చేయగా ప్రభుత్వం అంగీకరించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించింది. అర్హులైన కాపులందరూ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. దీంతో ఎంతో ఆశతో కాపులు ఆన్లైన్లో రుణాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. చివరకు ఒక్కశాతం మందికి కూడా రుణాలు అందలేదు. వచ్చిందికూడా సబ్సిడీ మాత్రమే. ‘టీడీపీ’ కమిటీలతో అర్హులకు ఎసరు... లబ్ధిదారుల ఎంపిక టీడీపీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీలు చేపట్టడంతో ఆదిలోనే కాపు రుణాలు వివాదాస్పదంగా మారాయి. అర్హులందరికీ కాకుండా ఆ పార్టీవారు సిఫారసు చేసిన వారికే రుణాలు అందాయి. వాస్తవంగా పేరుకు లబ్ధిదారుల ఎంపిక మండలస్థాయిలో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రతిపాదించిన ముగ్గురు సోషల్ వర్కర్లు, బ్యాంకు మేనేజర్, కాపు కార్పొరేషన్, డీఆర్డీఏ, మండల మహిళా సమాఖ్య నుంచి ఒక్కొక్క సభ్యుడితో కూడిన కమిటీ ఎంపిక చేయాలి. జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ పీడీ, బీసీ కార్పొరేషన్ ఈడీ, అగ్రికల్చర్, పశుసంవర్థక శాఖ జేడీలు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం, ఆర్టీఓ, డ్వామా పీడీ, ఎల్డీఎం, జిల్లా సమాఖ్య అధ్యక్షులు, కాపు కార్పొరేషన్ సభ్యులతో కూడిన జిల్లా ఉన్నతాధికారుల బృందం రుణాల మంజూరును పర్యవేక్షించాల్సి ఉంది. కానీ జన్మభూమి కమిటీల మితిమీరిన పెత్తనంతో అధికారులు తమకేమీపట్టనట్లు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో కాపు రుణాలు అర్హులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకే కట్టబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మిగిలిన వారికి మొండిచేయి చూపారని అవగతమవుతోంది. కాపులను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి.