కాపు రుణాలు కొందరికే! | kapu loans in andrapradesh | Sakshi
Sakshi News home page

కాపు రుణాలు కొందరికే!

Published Mon, Apr 18 2016 9:33 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

kapu loans in andrapradesh

  అడిగిన వారందరికీ రుణాలిస్తామన్న ప్రభుత్వం
  ఒక్కశాతం మందికే రుణాలు
  రాష్ట్రవ్యాప్తంగా రుణం కోసం వచ్చిన దరఖాస్తులు  3,53,479
  ఎంపికయినవారు 30,822 మంది
  మంజూరు చేసింది 27,789 మందికి
  సబ్సిడీ ఇచ్చింది 10,955 మందికే 

సాక్షి, చిత్తూరు: కాపు కార్పొరేషన్ ద్వారా అడిగిన కాపులందరికీ రుణాలిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. మొక్కుబడిగా రుణాలిచ్చి చేతులు దులుపుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రుణాల కోసం 3,53,479 మంది కాపులు దరఖాస్తులు చేసుకోగా 1,05,000 మందికి మాత్రమే రుణాలివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చిన దరఖాస్తుల్లో 30,822 మంది రుణాలకు అర్హులంటూ తేల్చింది. చివరకు 27,789 మందికి మాత్రమే రుణాలను మంజూరు చేసింది. వారిలో  కేవలం 10,955 మందికి మాత్రమే ఒక్కొక్కరికి రూ. 35వేల చొప్పున సబ్సిడీ విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు... శ్రీకాకుళం జిల్లాలో 4,970 మంది దరఖాస్తు చేసుకోగా 266 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 15 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చింది.

విజయనగరంలో 5,409 మంది దరఖాస్తుచేసుకోగా 389 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 24 మందికి, విశాఖపట్నంలో 19,763 మందికిగాను 412 మందికి రుణాలు మంజూరు చేసి 56 మందికి సబ్సిడీ ఇచ్చింది. కాపులు ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి 1,00,759 మంది దరఖాస్తు చేసుకోగా 3,124 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 399 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అర్హులైన కాపులందరికీ  రుణాలివ్వాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష సందర్భంగా డిమాండ్ చేయగా ప్రభుత్వం అంగీకరించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించింది.  అర్హులైన కాపులందరూ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. దీంతో ఎంతో ఆశతో కాపులు  ఆన్‌లైన్‌లో రుణాల కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. చివరకు ఒక్కశాతం మందికి కూడా రుణాలు అందలేదు. వచ్చిందికూడా సబ్సిడీ మాత్రమే.

‘టీడీపీ’ కమిటీలతో అర్హులకు ఎసరు...
లబ్ధిదారుల ఎంపిక టీడీపీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీలు చేపట్టడంతో ఆదిలోనే కాపు రుణాలు వివాదాస్పదంగా మారాయి. అర్హులందరికీ కాకుండా ఆ పార్టీవారు సిఫారసు చేసిన వారికే రుణాలు అందాయి. వాస్తవంగా పేరుకు లబ్ధిదారుల ఎంపిక మండలస్థాయిలో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ప్రతిపాదించిన ముగ్గురు సోషల్ వర్కర్లు, బ్యాంకు మేనేజర్, కాపు కార్పొరేషన్, డీఆర్‌డీఏ, మండల మహిళా సమాఖ్య నుంచి ఒక్కొక్క సభ్యుడితో కూడిన కమిటీ ఎంపిక చేయాలి. జిల్లా కలెక్టర్, డీఆర్‌డీఏ పీడీ, బీసీ కార్పొరేషన్ ఈడీ, అగ్రికల్చర్, పశుసంవర్థక శాఖ జేడీలు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం, ఆర్టీఓ, డ్వామా పీడీ, ఎల్‌డీఎం, జిల్లా సమాఖ్య అధ్యక్షులు, కాపు కార్పొరేషన్ సభ్యులతో కూడిన జిల్లా ఉన్నతాధికారుల బృందం రుణాల మంజూరును పర్యవేక్షించాల్సి ఉంది. కానీ జన్మభూమి కమిటీల మితిమీరిన పెత్తనంతో అధికారులు తమకేమీపట్టనట్లు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో  కాపు రుణాలు అర్హులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకే కట్టబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి.  మిగిలిన వారికి మొండిచేయి చూపారని అవగతమవుతోంది. కాపులను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement