kapu welfare
-
కాపు సంక్షేమం సీఎం జగన్ ద్వారానే సాధ్యం
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారానే కాపుల సంక్షేమం సాధ్యమని పెన్నేరు శ్రీకాంత్ చెప్పారు. కాపుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం జగన్‌ను కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామజోగయ్య విమర్శించడాన్ని నిరసిస్తూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ జంక్షన్ సమీపంలోని తన కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తాను రెండున్నరేళ్లుగా ఆ పదవిలో ఉన్నానని.. కాపులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలను హరిరామజోగయ్య ఏనాడు సీఎం దృష్టికి తీసుకెళ్లలేదని చెప్పారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా కాపులకు ఏమీ చేయడం లేదని విమర్శించడంలో అర్థం లేదన్నారు. కాపు కులానికి చెందిన పేద విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం సాయం చేయాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషును కోరిన వెంటనే స్పందించి ఆర్థి క సాయం అందించారని తెలిపారు. సీఎంపై పవన్‌కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. జనసేన పార్టీకి మేనిఫెస్టో లేదన్నారు. కాపుల సేవలను టీడీపీ వినియోగించుకుని అధికారంలోకి వచ్చాక వారిని కరివేపాకులా పక్కన పెట్టేసిందని గుర్తుచేశారు. సీఎం జగన్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాల్లో 99 శాతం అమలు చేశారని, ఈ అంశంపై తాను టీడీపీ నేతలతో ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
‘బీసీ రిజర్వేషన్ వల్ల కాపులకు ఉపయోగం లేదు’
అమరావతి: బీసీ రిజర్వేషన్ వల్ల కాపులకు ఉపయోగం లేదని తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేయొద్దని తాను చెప్పిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు రామ్మోహనరావు. కాపు ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రామ్మోహనరావు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ బీసీ రిజర్వేషన్ అనేది కాపుల సంక్షేమానికి కంటితుడుపు చర్యే తప్ప.. సామాజికంగా ఎటువంటి ప్రయోజనం లేదు. రాజకీయాల వల్ల కాపు అనే కులం డైవర్ట్ అయ్యింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం వల్ల బీసీలకు కాపులు దూరమవుతున్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కాపులకు బీసీ రిజర్వేషన్ సాధ్యం కాదు. తునిలో పెట్టిన బీసీ రిజర్వేషన్ సభతో కాపులను అల్లరి మూకలుగా ముద్ర వేశారు. ఒకే సామాజికి వర్గానికి చెందిన వారు ఏపీ నుంచి ముగ్గురు సుప్రీం కోర్టు జడ్జిలయ్యారు. వారికేమీ రిజర్వేషన్లు లేవు’ అని వ్యాఖ్యానించారు రామ్మోహనరావు. -
కాపులకు సీఎం జగన్ వెన్నుదన్నుగా నిలిచారు
సాక్షి, అమరావతి/కరప: కాపులకు వెన్నుదన్నుగా నిలిచిన ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాపు ఉద్యమ సమయంలో కాపు నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంకు కాపు జాతి రుణపడి ఉంటుందన్నారు. గురువారం ఆయన తూర్పుగోదావరి జిల్లా కరపలో మీడియాతో మాట్లాడారు. పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాపుల విషయంలో టీడీపీ పాలకులు దుర్మార్గంగా వ్యవహరించారని గుర్తుచేశారు. కాపులను అసాంఘిక శక్తులుగా చిత్రీకరించి చిత్రహింసలకు గురిచేశారన్నారు. కాకినాడ ఎస్ఈజెడ్ రైతులను కూడా ఇదే రీతిలో అవమానాలకు గురిచేసారన్నారు. వారిపై అన్యాయంగా కేసులు బనాయించి జైలులో పెట్టించడమే కాకుండా.. చివరకు బాత్రూమ్లను కూడా రైతులతో కడిగించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇక కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని వేధించి, అవమానాలకు గురిచేశారని, మహిళలపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే కాపులపై అక్రమ కేసులన్నీ ఎత్తివేస్తామని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చారని, ఆ మాటప్రకారం 2020లోనే 163 కేసులు ఉపసంహరించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. తాజాగా మరో 161 కేసులు ఎత్తివేస్తూ జీవో జారీ చేశారని తెలిపారు. తుని రైలు ధ్వంసం కేసులు కూడా ఎత్తివేయాలని కోరుతూ సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారన్నారు. కొద్దిరోజుల్లోనే అవి కూడా ఎత్తివేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్ఈజెడ్ రైతులపై గత ప్రభుత్వ హయాంలో బనాయించిన కేసులను ఉపసంహరించాలన్న తమ అభ్యర్థనపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే ఈమేరకు జీవో రానుందని చెప్పారు. కాపులను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన చరిత్ర చంద్రబాబుది: అడపా శేషు కాపు ఓట్లతో 2014లో గద్దెనెక్కిన తర్వాత చంద్రబాబు ఆ సామాజిక వర్గాన్ని రోడ్డునపడేశాడని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఆరోపించారు. సీఎం జగన్ కాపులకు వెన్నుదన్నుగా నిలిచి వారి సంక్షేమానికి పాటుపడుతున్న విషయాన్ని కాపు జాతి మర్చిపోదన్నారు. ఐదుగురు కాపులను మంత్రులను చేయడమే కాకుండా.. 50 మందికిపైగా కాపులను కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లను చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అప్పట్లో తునిలో బహిరంగ సభకు పిలుపునిస్తే పవన్, చంద్రబాబు పత్తాలేకుండా పోయారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే నాటి ఉద్యమానికి మద్దతు ప్రకటించారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు కేసులను మాఫీ చేసి చిత్తశుద్ధి చాటుకున్నారన్నారు. కాపు మహిళలకు ఆర్థిక చేయూత కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. కాపు మహిళల సంక్షేమం కోసం వైఎస్సార్ కాపు నేస్తాన్ని అమలు చేస్తూ ఏటా ఒక్కొక్కరికీ రూ. 15 వేల చొప్పున ఆర్థిక చేయూతనందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మతాలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యత ఇస్తుందని, ఆలయాలు, మసీదులు, చర్చిల నిర్మాణానికి కృషి చేస్తుందన్నారు. పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరతలేదని, కొంతమంది సృష్టించే పుకార్లను రైతులు నమ్మవద్దని మంత్రి కోరారు. -
నవరత్నాలతో కాపుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: నవరత్నాలు, కాపు నేస్తం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం కాపులకు భారీగా లబ్ధి చేకూర్చింది. వివిధ పథకాల ద్వారా దాదాపు 35 లక్షల మంది కాపులు ప్రయోజనం పొందారు. ఇదివరకు ఇలాంటి సహాయం ఎవరూ చేయలేదని, ఇంతగా లబ్ధి పొందుతామని తాము ఊహించనే లేదని ఈ సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ప్రశంసిస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం కాపులను ఓటు బ్యాంకుగానే చూసిందని, రిజర్వేషన్లు కల్పిస్తామని మభ్యపెట్టి పబ్బం గడుపుకుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి జగన్ సర్కారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా తమను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాల ద్వారా కాపులకు కేవలం రెండేళ్ల పాలనలోనే ముఖ్యమంత్రి వైఎస్.జగన్ భారీ ఆర్ధిక ప్రయోజనం కల్పించారు. కాపు నేస్తంతో పాటు నవరత్నాల్లోని ఇతర పథకాల ద్వారా 2019 జూన్ నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 34.82 లక్షల మంది కాపులకు రూ.9,672.25 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఇందులో 30.85 లక్షల మందికి నవరత్నాల పథకాల ద్వారా నేరుగా రూ.7,368.20 వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. నగదేతర బదిలీ పథకాల ద్వారా మరో 3.96 లక్షల మంది కాపులకు రూ.2,304.05 కోట్లు లబ్ధి చేకూర్చారు. కాపు నేస్తం కింద 3.27 లక్షల మంది అక్కలకు రూ.491.79 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. -
కాపు రుణాలు కొందరికే!
అడిగిన వారందరికీ రుణాలిస్తామన్న ప్రభుత్వం ఒక్కశాతం మందికే రుణాలు రాష్ట్రవ్యాప్తంగా రుణం కోసం వచ్చిన దరఖాస్తులు 3,53,479 ఎంపికయినవారు 30,822 మంది మంజూరు చేసింది 27,789 మందికి సబ్సిడీ ఇచ్చింది 10,955 మందికే సాక్షి, చిత్తూరు: కాపు కార్పొరేషన్ ద్వారా అడిగిన కాపులందరికీ రుణాలిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట తప్పింది. మొక్కుబడిగా రుణాలిచ్చి చేతులు దులుపుకునేందుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రుణాల కోసం 3,53,479 మంది కాపులు దరఖాస్తులు చేసుకోగా 1,05,000 మందికి మాత్రమే రుణాలివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చిన దరఖాస్తుల్లో 30,822 మంది రుణాలకు అర్హులంటూ తేల్చింది. చివరకు 27,789 మందికి మాత్రమే రుణాలను మంజూరు చేసింది. వారిలో కేవలం 10,955 మందికి మాత్రమే ఒక్కొక్కరికి రూ. 35వేల చొప్పున సబ్సిడీ విడుదల చేసి చేతులు దులుపుకుంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు... శ్రీకాకుళం జిల్లాలో 4,970 మంది దరఖాస్తు చేసుకోగా 266 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 15 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. విజయనగరంలో 5,409 మంది దరఖాస్తుచేసుకోగా 389 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 24 మందికి, విశాఖపట్నంలో 19,763 మందికిగాను 412 మందికి రుణాలు మంజూరు చేసి 56 మందికి సబ్సిడీ ఇచ్చింది. కాపులు ఎక్కువగా ఉన్న తూర్పుగోదావరి 1,00,759 మంది దరఖాస్తు చేసుకోగా 3,124 మందికి రుణాలు మంజూరు చేసి కేవలం 399 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చింది. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అర్హులైన కాపులందరికీ రుణాలివ్వాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష సందర్భంగా డిమాండ్ చేయగా ప్రభుత్వం అంగీకరించింది. అన్ని జిల్లా కేంద్రాల్లో కార్పొరేషన్‌కు సంబంధించి ప్రత్యేక కార్యాలయాలను ప్రారంభించింది. అర్హులైన కాపులందరూ రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. దీంతో ఎంతో ఆశతో కాపులు ఆన్లైన్లో రుణాల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. చివరకు ఒక్కశాతం మందికి కూడా రుణాలు అందలేదు. వచ్చిందికూడా సబ్సిడీ మాత్రమే. ‘టీడీపీ’ కమిటీలతో అర్హులకు ఎసరు... లబ్ధిదారుల ఎంపిక టీడీపీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీలు చేపట్టడంతో ఆదిలోనే కాపు రుణాలు వివాదాస్పదంగా మారాయి. అర్హులందరికీ కాకుండా ఆ పార్టీవారు సిఫారసు చేసిన వారికే రుణాలు అందాయి. వాస్తవంగా పేరుకు లబ్ధిదారుల ఎంపిక మండలస్థాయిలో ఎంపీడీవో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ప్రతిపాదించిన ముగ్గురు సోషల్ వర్కర్లు, బ్యాంకు మేనేజర్, కాపు కార్పొరేషన్, డీఆర్డీఏ, మండల మహిళా సమాఖ్య నుంచి ఒక్కొక్క సభ్యుడితో కూడిన కమిటీ ఎంపిక చేయాలి. జిల్లా కలెక్టర్, డీఆర్డీఏ పీడీ, బీసీ కార్పొరేషన్ ఈడీ, అగ్రికల్చర్, పశుసంవర్థక శాఖ జేడీలు, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం, ఆర్టీఓ, డ్వామా పీడీ, ఎల్డీఎం, జిల్లా సమాఖ్య అధ్యక్షులు, కాపు కార్పొరేషన్ సభ్యులతో కూడిన జిల్లా ఉన్నతాధికారుల బృందం రుణాల మంజూరును పర్యవేక్షించాల్సి ఉంది. కానీ జన్మభూమి కమిటీల మితిమీరిన పెత్తనంతో అధికారులు తమకేమీపట్టనట్లు మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో కాపు రుణాలు అర్హులకు కాకుండా అధికార పార్టీ కార్యకర్తలకే కట్టబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మిగిలిన వారికి మొండిచేయి చూపారని అవగతమవుతోంది. కాపులను ప్రభుత్వం నిలువునా మోసం చేసిందని ఆయా వర్గాలు ఆరోపిస్తున్నాయి.