కాపుజాతి ఆఖరి పోరు
► చంద్రబాబుకు ముద్రగడ లేఖ
► కాపు ఐక్య గర్జన సభ జరిపి తీరుతాం
► అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవు
సాక్షి కాకినాడ: ఆకలితో రగిలిపోయి, విసిగిపోయిన కాపుజాతి ఆఖరి పోరాటానికి సిద్ధమవుతోందని ప్రముఖ కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తాము మోసపోవడానికి సిద్ధంగా లేమని, తూర్పు గోదావరి జిల్లాలో ఎన్ని ఆంక్షలు విధిం చినా ర్యాలీలు, కాపు ఐక్య గర్జన సభ జరిపి తీరుతామని చెప్పారు. జిల్లాలో సెక్షన్ 30 అమలు చేస్తూ ఈ నెలాఖరు వరకూ ముందస్తు అనుమతి లేనిదే ర్యాలీలు, ధర్నాలు, సభలు నిర్వహించరాదంటూ పోలీసు శాఖ జారీ చేసిన ఆదేశాలపై ఆయన తీవ్రంగా స్పందించారు. వీటిని నిరసిస్తూ సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. వి.కొత్తూరులో కాపు ఐక్యగర్జన వేదిక ప్రాంతానికి మంగళవారం వచ్చిన ముద్రగడ ఈ లేఖను విడుదల చేశారు.
ఈ నెల 31న నిర్వహించ తలపెట్టిన కాపుల సభ ను ఆంక్షలతో అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి పుట్టగతులుండవని హెచ్చరించారు. ‘‘మీరు కుల సభలను కోటీశ్వరులు, అపర కోటీశ్వరులతో పెట్టుకోవచ్చా? మా జాతి తప్ప ఎవరైనా కుల సభలు పెట్టుకోవచ్చా? 2014 ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలను మీకు గుర్తు చేయడం, నిలదీయడం నేరమా? ఆ హామీల అమలుపై కార్యాచరణ రూపకల్పనకు సభ పెట్టుకునే హక్కు కాపు జాతికి లేదా?’’ అని ఆ లేఖలో ప్రశ్నించారు. కాపు జాతి ఓట్లతో నెగ్గి, ఇప్పుడు వారిని పాతాళానికి తొక్కేయాలనే ఆలోచన మహా ఘోరమని దుయ్యబట్టారు. లాఠీలు ఝళిపించినా, తుపాకులు ఎక్కుపెట్టినా భయపడేది లేదని చెప్పారు. కాపు సభకు అడ్డు తగలవద్దంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసి గౌరవం కాపాడుకోవాలని సీఎంకు సూచించారు.