న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల పరిధిలోని ఆస్తుల విలువ రూ.6.99 లక్షల కోట్లను అధిగమించినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) మంగళవారం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి ఈ రెండు పథకాల పరిధిలో ఇన్వెస్టర్లకు చెందిన ఆస్తులు రూ.6,99,172 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. 2021 మార్చి 31 నాటికి ఈ ఆస్తులు రూ.5,78,025 కోట్లుగా ఉండడం గమనార్హం. 9 నెలల్లో 20 శాతం వృద్ధి చెందాయి. అసంఘటిత రంగంలోని వారికి ఉద్దేశించిన ఏపీవైలోని ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.19,807 కోట్లుగా ఉన్నాయి.
ఎన్‌పీఎస్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పింఛను నిధులతోపాటు.. ప్రైవేటు రంగం ఉద్యోగుల పింఛను నిధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే, పౌరులు ఎవరైనా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ ఉద్యోగుల ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.3,52,217 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు రూ.2,11,656 కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ రంగం ఉద్యోగుల ఆస్తులు రూ.82,190 కోట్లుగా ఉన్నట్టు పీఎఫ్‌ఆర్‌డీఏ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరుల విభాగంలోని ఆస్తులు రూ.28,657 కోట్లుగా ఉన్నాయి. ఈ రెండు పథకాలను పీఎఫ్‌ఆర్‌డీఏ పర్యవేక్షిస్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment