atal pension yojana
-
రోజూ టీ ఖర్చుతో నెలకు రూ.5,000 పెన్షన్.. ఎలాగంటే?
ఉద్యోగం లేనివారికి, అసంఘటిత రంగాల్లోని కార్మికులు, కూలీలకు పెన్షన్ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే కేవలం రోజూ టీ తాగే ఖర్చుతో నెలకు రూ.5వేల పెన్షన్ పొందే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే 40 ఏళ్లలోపు భారతీయ పౌరులై ఉండాలి. బ్యాంకు ఖాతా అవసరం ఉంటుంది. రోజు ఒక కప్పు టీ కంటే తక్కువ పెట్టుబడి పెట్టి ప్రతినెల రూ.5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంది. ముందుగా మీరు 18 ఏళ్ల వయసులో ఈ పథకంలో చేరితే కేవలం రోజుకు రూ.7 అంటే నెలకు రూ.210 వెచ్చిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల వయసు దాటిన తర్వాత రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. అదే మీరు కొంత ఆలస్యంగా అంటే మీ ఇరవైఐదో ఏట ఈ పెన్షన్‌ను ప్రారంభిస్తే నెలకు కొంత ఎక్కువగా రూ.367 చెల్లించాలి. అలాగే 30వ ఏటా ఇన్వెస్ట్ చేయాలంటే నెలకు రూ.577 చెల్లించాలి. ఇక చివరిగా ఎవరైనా వ్యక్తి తన 40వ ఏట దీన్ని ప్రారంభించాలంటే అందుకోసం నెలకు రూ.1454 పెట్టుబడిగా పెట్టాలి. దాంతో మీ వయసు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతినెల పెన్షన్ పొందే వీలుంది. నెలవారీ, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వారీగా ఈ నగదును చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకంలో చేరాలంటే దగ్గరలోని బ్యాంకు బ్రాంచికి వెళ్లి వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇలా 18 నుంచి 40 ఏళ్ల మధ్య వ్యక్తులు తమ ఆదాయాలకు అనుగుణంగా చిన్న వయసులోనే నెలవారీ ఈ పథకాన్ని ప్రారంభిస్తే తక్కువ ఖర్చుతోనే రూ.5వేలు పెన్షన్ పొందొచ్చు. ఈ పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015-16లో ప్రారంభించింది. -
ఎన్పీఎస్, ఏపీవై పథకాలకు ఆదరణ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అటల్ పెన్షన్ యోజన (ఏపీవై), నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) పథకాలకు మంచి ఆదరణ లభిస్తోంది. చందాదారులు పెద్ద ఎత్తున ఈ పథకాల్లో చేరుతున్నారు. గడిచిన ఏడాది కాలంలో (2022 మార్చి 5 నుంచి 2023 మార్చి 4 నాటికి) ఈ రెండు పథకాల కింద చందాదారుల సంఖ్య 23 శాతం పెరిగి 6.24 కోట్లుగా ఉంది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. విడిగా చూస్తే ఏపీవై చందాదారుల్లో 28 శాతం వృద్ధి ఉంది. గతేడాది మార్చి 4 నాటికి ఈ రెండు పథకాల కింద చందారుల సంఖ్య 5.20 కోట్లుగా ఉంది. ఎన్పీఎస్ చందాదారుల్లో 23.86 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు కాగా, 60.72 లక్షల మంది రాష్ట్రాల ఉద్యోగులు కావడం గమనార్హం. కార్పొరేట్ ఉద్యోగుల సంఖ్య 16.63 లక్షలుగా ఉంది. ఏపీవై చందాదారులు 4.53 కోట్లుగా ఉన్నారు. 2015 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ఏపీవై పథకాన్ని తీసుకొచ్చింది. ఎలాంటి సామాజిక భద్రత లేని కార్మికులకు, ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే వారికి, వృద్ధాప్యంలో పింఛను సదుపాయం కోసం దీన్ని ప్రారంభించింది. సభ్యులు నెలవారీ చెల్లించిన చందానుబట్టి 60 ఏళ్లు వచ్చిన తర్వాత నుంచి ప్రతి నెలా రూ.1,000–5,000 మధ్య పింఛను లభిస్తుంది. 2022 అక్టోబర్ 1 నుంచి పన్ను చెల్లింపుదారులు ఈ పథకంలో చేరుకుండా కేంద్రం నిషేధించింది. -
అటల్ పెన్షన్ యోజనకు విశేష ఆదరణ
న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకం– అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)కు విశేష ఆధరణ లభిస్తున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికి 5 కోట్ల మందికిపైగా ప్రజలు నమోదయినట్లు తెలిపింది. ఒక్క 2022 క్యాలెండర్ ఇయర్లో 1.25 కోట్ల మంది చందాదారులుగా చేరినట్లు వివరించింది. 2021లో ఈ సంఖ్య 92 లక్షలు కావడం గమనార్హం. 2021 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీవైని ప్రకటించారు. దీని విస్తృతికి పీఎఫ్ఆర్డీఏ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ పథకం కింద ఒక చందాదారుడు (చేరిన వయస్సు, చందాపై ఆధారపడి) 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటాడు. చందాదారుని మరణానంతరం అదే పెన్షన్ చందాదారుని జీవిత భాగస్వామికి చెల్లించడం జరుగుతుంది. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినప్పుడు, చందాదారుడు 60 ఏళ్ల వరకు చెల్లించిన మొత్తం నామినీ పొందే వెసులుబాటు ఉంది. -
రూ.7 డిపాజిట్ చేస్తే నెలకు రూ.5000 పెన్షన్ పొందవచ్చు!
దేశంలో అర్హులైన పౌరులకు 60 ఏళ్ల తర్వాత స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని అందించే లక్ష్యంతో కేంద్రం 2015-16 ఆర్థిక సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రారంభించింది . ఈ పథకం పెన్షన్ ఫండ్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్డీఏ) నియంత్రణలో పనిచేస్తుంది. బెన్ఫిట్స్ ఈ పథకం కింద ఒక వ్యక్తి 60 ఏళ్లు నిండిన తర్వాత డిపాజిట్ చేసిన మొత్తాన్ని బట్టి కనీసం నెలకు రూ. 1,000, రూ. 2,000, రూ. 3,000, రూ. 4,000, గరిష్టంగా రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు. అటల్ పెన్షన్ పథకానికి అర్హులు ఇంతకుముందు ఈ పథకం అసంఘటిత రంగాల్లో పనిచేసే వ్యక్తుల కోసం మాత్రమే ప్రారంభించబడింది. ఇప్పుడు 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిటర్లు 60 ఏళ్ల తర్వాత నెల నెల పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. అయితే, పన్ను చెల్లింపుదారులు ఇకపై అక్టోబర్ 1, 2022 నాటికి ఈ ప్రభుత్వ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అన్హరులు. ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరాలనుకునేవారికి ఈ పథకాన్ని పొందేందుకు, ఒక వ్యక్తి తప్పనిసరిగా సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పోస్టాఫీస్ ఖాతాను కలిగి ఉండాలి. రూ. 5000 పెన్షన్ ఎలా పొందాలి లబ్ధిదారులు తప్పనిసరిగా నెలవారీ, త్రైమాసిక, సెమీ యాన్యవల్ డిపాజిట్ చేయాలి. ఇలా చేస్తే 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.1,000 నుండి రూ. 5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. రూ.7లతో..రూ.5000 పెన్షన్ ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో పథకంలో చేరి నెలకు రూ. 210, లేదా రోజుకు రూ.7 డిపాజిట్ చేస్తే ప్రతి నెలా రూ. 5వేలు పెన్షగా తీసుకోవచ్చు. అదేవిధంగా త్రైమాసికానికి (3నెలల కాలానికి) రూ. 626, 6 నెలలకు రూ.1239, నెలకు రూ.42 డిపాజిట్ చేస్తే నెలకు పెన్షన్ రూ. 1000 పొందవచ్చు. లేదంటే రూ.2వేలు పెన్షన్ కావాలంటే నెలకు రూ.84, రూ.3వేలు కావాలంటే నెలకు రూ.126 డిపాజిట్ చేయాలి. నెలవారీ పెన్షన్ రూ. 4000 కావాలనుకుంటే రూ.168 డిపాజిట్ చేయాలి. పన్ను ప్రయోజనాలు పథకంలో పెట్టుబడి పెట్టే వారు ఆదాయపు పన్ను చట్టం 80 సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా, కొన్ని సందర్భాల్లో రూ. 50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది. మొత్తంగా ఈ పథకం ద్వారా రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. అటల్ పెన్షన్ స్కీమ్‌లో చేరడం ఎలా? మీ బ్యాంక్ సేవింగ్ అకౌంట్ ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరమైన వివరాలతో దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. ఆధార్ కార్డు తో పాటు వ్యక్తిగత వివరాల్ని అందించాలి. యాక్టీవ్‌గా ఉన్న ఫోన్ నెంబర్‌ను అందిస్తే సరిపోతుంది. -
పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక
ట్యాక్స్ పేయర్స్‌కు అలెర్ట్. అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) సభ్యత్వం పొందేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఆగస్టు నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్ ప్రకారం..అక్టోబర్1, 2022 నుండి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఏపీవై పథకంలో చేరేందుకు అనర్హులని పేర్కొంది. ఒకవేళ అక్టోబర్ 1, 2022 న లేదా ఆ తర్వాత ధరఖాస్తు చేసుకుంటే లబ్ధి దారుల ఖాతాను మూసివేయడంతో పాటు డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని ఆ నోటిఫికేషన్లో తెలిపింది. అటల్ పెన్షన్ యోజన పథకంలో సభ్యత్వం ఎలా పొందాలి? ►18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు (తక్కువ, ఎగువ పరిమితులతో సహా) ఈ పథకంలో చేరేందుకు అర్హులు. ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చేయొచ్చు. అలాగే, ఏపీవై ఖాతాలో జీవిత భాగస్వామి వివరాలు, నామినేషన్‌ను అందించడం తప్పనిసరి. ► మీ సేవింగ్స్ ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌లో అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూర్తి చేయండి. ► ఖాతా నంబర్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మొదలైన వాటితో సహా అవసరమైన వివరాలను అందించండి. నమోదు కోసం, ఆధార్ ప్రాథమికంగా మీ కస్టమర్‌ను తెలుసుకోండి (కేవైసీ). ► ఏపీవై ఖాతా తెరిచిన తర్వాత..అందులో తగినంత సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ సేవింగ్ అకౌంట్లో అవసరమైన బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి. -
ఎన్పీఎస్, ఏపీవై ఆస్తులు రూ.6.99 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల పరిధిలోని ఆస్తుల విలువ రూ.6.99 లక్షల కోట్లను అధిగమించినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) మంగళవారం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి ఈ రెండు పథకాల పరిధిలో ఇన్వెస్టర్లకు చెందిన ఆస్తులు రూ.6,99,172 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. 2021 మార్చి 31 నాటికి ఈ ఆస్తులు రూ.5,78,025 కోట్లుగా ఉండడం గమనార్హం. 9 నెలల్లో 20 శాతం వృద్ధి చెందాయి. అసంఘటిత రంగంలోని వారికి ఉద్దేశించిన ఏపీవైలోని ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.19,807 కోట్లుగా ఉన్నాయి. ఎన్పీఎస్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పింఛను నిధులతోపాటు.. ప్రైవేటు రంగం ఉద్యోగుల పింఛను నిధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే, పౌరులు ఎవరైనా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్పీఎస్ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ ఉద్యోగుల ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.3,52,217 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు రూ.2,11,656 కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ రంగం ఉద్యోగుల ఆస్తులు రూ.82,190 కోట్లుగా ఉన్నట్టు పీఎఫ్ఆర్డీఏ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరుల విభాగంలోని ఆస్తులు రూ.28,657 కోట్లుగా ఉన్నాయి. ఈ రెండు పథకాలను పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షిస్తుంటుంది. -
అత్యంత ప్రజాదరణ పొందిన పథకంగా అటల్ పెన్షన్ యోజన
జాతీయ పెన్షన్ వ్యవస్థ కింద అత్యంత ప్రజాదరణ పొందిన సామాజిక భద్రత పథకంగా అటల్ పెన్షన్ యోజన అవతరించింది. 4.2 కోట్ల చందాదారుల గల నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్)లో 66 శాతం లేదా 2.8 కోట్లకు పైగా చందాదారులు 2020-21 చివరిలో ఎపీవైని ఎంచుకున్నారని నేషనల్ పెన్షన్ సిస్టమ్స్(ఎన్పీఎస్) ట్రస్ట్ వార్షిక నివేదిక తెలిపింది. అసంఘటిత రంగంలో ఉన్న పేద ప్రజలకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకమే ఈ అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) అటల్ పెన్షన్ యోజనను నిర్వహిస్తుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కనీసం 20 సంవత్సరాల పాటు ప్రతి నెల కొత్త మొత్తం పొదుపు చేస్తే ఆ తర్వాత వారికి నెలకు రూ.5,000 పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులకు నెలకు రూ.1000 నుంచి రూ.5000 మధ్య గ్యారెంటీడ్ కనీస నెలవారీ పెన్షన్ అందుతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించింది.(చదవండి: ఈడీ నోటీసులను కోర్టులో సవాల్ చేసిన సచిన్ బన్సాల్) దీనిలో చేరాలంటే బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే సరిపోతుంది. టెర్మినల్ వ్యాధి లేదా ఖాతాదారుడు మరణించిన పరిస్థితుల్లో మినహా పెన్షన్ ముందస్తుగా చెల్లించడం, ఏపీవై నుంచి నిష్క్రమించడం జరగదు. మీరు ముందుగా చేరితే తక్కువ మొత్తం ప్రతి నెల కట్టాల్సి వస్తుంది కాబట్టి త్వరగా మీ పేరు నమోదు చేసుకుంటే మంచిది. ప్రభుత్వ, ప్రైవేటు, గ్రామీణ బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా (ఆన్లైన్/ఆఫ్‌లైన్) ఈ పథకంలో చేరొచ్చు. -
ప్రతి రోజు రూ.40 పొదుపుతో.. నెలకు రూ.10 వేల పెన్షన్
అసంఘటిత రంగంలో ఉన్న పేద ప్రజలకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకమే అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) ద్వారా అటల్ పెన్షన్ యోజన నడుస్తుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కనీసం 20 సంవత్సరాల పాటు ప్రతి నెల కొత్త మొత్తం పొదుపు చేస్తే ఆ తర్వాత నెలకు రూ. 5,000 పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులకు నెలకు రూ.1000 నుంచి రూ. 5000 మధ్య గ్యారెంటీడ్ కనీస నెలవారీ పెన్షన్ అందుతుంది. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించింది. దీనిలో చేరాలంటే బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే సరిపోతుంది. టెర్మినల్ వ్యాధి లేదా ఖాతాదారుడు మరణించిన పరిస్థితుల్లో మినహా పెన్షన్ ముందస్తుగా చెల్లించడం, ఏపీవై నుంచి నిష్క్రమించడం జరగదు. మీరు ముందుగా చేరితే తక్కువ మొత్తం ప్రతి నెల కట్టాల్సి వస్తుంది కాబట్టి త్వరగా మీ పేరు నమోదు చేసుకుంటే మంచిది. పీఎఫ్ఆర్డీఏ పెన్షన్ స్కీంలో ఒకటి కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 సంవత్సరాలు వయస్సు గల చందాదారులు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నెలకు రూ.210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 39 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వివాహిత జంటలు విడిగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఈ జంటకు నెలకు రూ.10,000 సామూహిక పెన్షన్ లభిస్తుంది. 30 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న భార్యాభర్తలు తమ తమ ఏపీవై ఖాతాల్లో నెలకు రూ.577 పొదుపు చేయాల్సి ఉంటుంది. అంటే నెలకు ఇద్దరికీ కలిపి రూ.1154 (రోజుకి 1154/30 = రూ. 38.46) 30 ఏళ్ల వరకు పొదుపు చేస్తే 60 ఏళ్ల తర్వాత ఇద్దరికీ కలిపి ప్రతి నెల రూ. 10 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ఒకవేళ జంటకు 35 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే వారి సంబంధిత ఏపీవై ఖాతాల్లో నెలవారీ కంట్రిబ్యూషన్ రూ.902కు పెరుగుతుంది. -
రూ. 6 లక్షల కోట్లు దాటిన పింఛను నిధులు
న్యూఢిల్లీ: పింఛను పథకాల నిర్వహణలోని ఆస్తులు రూ.6లక్షల కోట్లను అధిగమించినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఇతర పింఛను పధకాల నిర్వహణతోపాటు, ఈ రంగ అభివృద్ధికి తోడ్పడేందుకు పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైందే పీఎఫ్ఆర్డీఏ. ప్రస్తుతం ఎన్‌పీఎస్‌తోపాటు అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాలను ఈ సంస్థ చూస్తోంది. ఈ రెండు పథకాల పరిధిలోని మొత్తం సభ్యుల సంఖ్య 4.28 కోట్లకు చేరుకోగా.. నిర్వహణ నిధులు రూ.6లక్షల కోట్లను దాటాయి. పీఎఫ్ఆర్డీఏ ఏర్పాటై 13 ఏళ్లు పూర్తయిన తర్వాత ఈ స్థాయి పురోగతి నమోదైంది. 2020 అక్టోబర్ నాటికి రూ.5లక్షల కోట్ల నిర్వహణ ఆస్తుల మైలురాయిని పూర్తి చేసుకోగా.. తర్వాత ఏడు నెలల్లోనే మరో రూ.లక్ష కోట్లు ఈ రెండు పథకాల పరిధిలో వృద్ధి చెందడం గమనార్హం. ఎన్పీఎస్ కింద 74.10 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వేతర విభాగం నుంచి 28.37 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. పింఛను పథకాల పట్ల సభ్యుల్లో ఉన్న విశ్వాసమే ఈ వృద్ధికి కారణమని పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా రిటైర్మెంట్ ప్రణాళిక, ఆర్థిక శ్రేయస్సు పట్ల వ్యక్తుల్లో అవగాహన పెరిగినట్టు చెప్పారు. చదవండి: ఆరేళ్లలో రూ.15లక్షల కోట్ల ముద్రా యోజన రుణాలు -
ప్రతి రోజు రూ.7 పొదుపుతో.. నెలకు రూ.5 వేల పెన్షన్
అటల్ పెన్షన్ యోజన(ఎపీవై) అనేది భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న పెన్షన్ పథకం. దీనిని బీమా రెగ్యులేటర్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఎ) నిర్వహిస్తుంది. పదవీ విరమణ సమయంలో స్థిర పెన్షన్ కోసం పెట్టుబడి పెట్టాలని చూస్తున్న వ్యక్తుల కోసం అటల్ పెన్షన్ యోజన అనేది సరైన ఎంపిక. అసంఘటిత రంగంలోని ప్రజలకు వృద్ధాప్యంలో ఆదాయ భద్రత కల్పించడానికి ప్రభుత్వం 1 జూన్ 2015న ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం మీరు ప్రతిరోజూ 7 రూపాయలు పొదుపు చేస్తే ప్రతి నెల రూ.5 వేల పెన్షన్ తీసుకోవచ్చు. ఇది 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారికి అందుబాటులో ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత లబ్ధిదారులకు రూ.1000 నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ ఇవ్వబడుతుంది. పెట్టుబడిదారుడి వయస్సు, మొత్తాన్ని బట్టి పెన్షన్ నిర్ణయించబడుతుంది. మీరు పొదుపు చేసే నగదును బట్టి ప్రతి నెల రూ.1000 నుంచి రూ.5000 వరకు పొందవచ్చు. ఈ పథకంలో చేరాలంటే సేవింగ్ బ్యాంకు అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటం తప్పనిసరి. ఈ పథకానికి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగాలు అనర్హులు. ఈ పథకం కింద ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సిసిడి(1 బి) కింద వినియోగదారులకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. చందాదారులకు నెలవారీ, త్రైమాసిక లేదా అర్ధ-వార్షిక ప్రాతిపదికన పొదుపు ఖాతా డబ్బులను జమ చేయవచ్చు. నెలకు రూ.1,000 నుంచి 5,000 రూపాయల స్థిర నెలవారీ పెన్షన్ పొందాలంటే, చందాదారుడు 18 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.42 నుంచి 210 రూపాయల వరకు ప్రీమియం చెల్లించాలి. అదే 40 సంవత్సరాల వయస్సులో చేరితే నెలకు రూ.291 నుంచి రూ.1,454 మధ్య ప్రీమియం చెల్లించాలి. ఎన్‌పిఎస్ ట్రస్ట్ వెబ్సైట్లో ఎపివై కాలిక్యులేటర్ ఉంది. దీని ద్వారా మీరు మీ వయస్సు, ప్రతి నెల పెన్షన్ ఎంత కావాలో నమోదు చేస్తే నెలకు ఎంత ప్రీమియం చెల్లించాలో చూపిస్తుంది. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం? -
మలివయసులో ఆసరా
ప్రభుత్వ ఉద్యోగి గానీ...ఈపీఎఫ్ చందాదారుడైన ప్రైవేటు కంపెనీ ఉద్యోగి గానీ పదవీ విరమణ చేసిన తర్వాత..నిర్దిష్టమైన మొత్తం పింఛన్ రూపంలో అందుతుంది. వారి జీవనానికి ఆసరా లభిస్తుంది. మరి అసంఘటిక రంగంలో ఉన్న వారి పరిస్థితి ఏమిటి..? సంపాదించే వయస్సు పూర్తయిన తర్వాత వారికి ఆసరా ఏమిటీ..? అందుకే కేంద్ర ప్రభుత్వం అలాంటి వారికోసమే అటల్‌పెన్షన్ యోజన (ఏపీవై) పథకం తీసుకువచ్చింది. ఈ సామాజిక భద్రత పథకంలో చేరిన వారికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తూ...అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ అందిస్తోంది. అనంతపురం, రాయదుర్గం టౌన్: అటల్ పెన్షన్ యోజన... గతంలో ఉన్న స్వావలంబన యోజన స్థానంలో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అటల్ పెన్షన్ యోజనను పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. అటల్ పెన్షన్ యోజనకు అర్హత (ఏపీవై) అటల్ పెన్షన్ యోజనకు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులు అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి బ్యాంకు లేదా పొదుపు ఖాతా ఉండాలి. చెల్లింపులు ఇలా... ఏపీవై చందాను ఈ పథకం లబ్ధిదారుడికి ఖాతా నుంచి నిర్ణీత తేదీన బ్యాంకులు విత్‌డ్రా చేస్తాయి. ఈ పథకం ప్రీమియం నెలవారీ/త్రైమాసిక/అర్ధ సంవత్సరం/వార్షిక చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు తేదీకి చందా మొత్తానికి సరిపడే నగదు సంబంధిత వ్యక్తి పొదుపు ఖాతాలో ఉంచాలి. రూ. 5 వేల వరకు పెన్షన్ లబ్ధిదారుడు చెల్లించే ప్రీమియాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ వస్తుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి 60 సంవత్సరాల నుంచి నెలకు రూ.వెయ్యి పెన్షన్ కోరుకుంటే ప్రతి నెల రూ.42 చొప్పున 42 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.2 వేలు పెన్షన్ కావాలనుకుంటే ప్రతి నెల రూ.84 చెల్లించాలి. రూ. 3 వేలు కావాలనుకుంటే రూ.126, రూ. 4 వేలు కావాలనుకుంటే రూ.168, రూ. 5 వేలు కావాలనుకుంటే రూ.210 చొప్పున నెల వారీ చందా చెల్లించాలి. ఏపీవై నుంచి నిష్క్రమణ సాధారణ సందర్భాల్లో ఈ పథకం నుంచి వైదొలగడానికి అవకాశం లేదు. చందాదారుడు మరణించినా..లేదా మరణానికి దారి తీసే వ్యాధికి గురైనప్పుడు మాత్రమే ఈ పథకం నుంచి వైదొలడానికి అవకాశం ఇస్తారు. ఆదాయ పన్ను ప్రయోజనం ఈ పెన్షన్ పథకంలో ఉన్న వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)కు ఉన్న ఆదాయ పన్ను ప్రయోజనాలే వర్తిస్థాయి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ(బీ1) కింద ఇది పొందవచ్చు. 2018 నాటికి ఈ పెన్షన్ కింద ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ. 50 వేలుగా నిర్ణయించారు. చందా చెల్లింపులో విఫలమైతే ఈ పథకానికి చందా చెల్లింపులో విఫలమైతే రూ.100 చందాకు నెలకు ఒక రూపాయి జరిమానా ఉంటుంది. రూ.101 నుంచి రూ.500 చందాకు రూ.2లు జరిమానా, రూ.501 నుంచి రూ.1000 చందాకు రూ.5లు, రూ.1000 పైబడిన చందా మొత్తానికి నెలకు రూ.10 చొప్పున జరిమానా వసూలు చేస్తారు. వరుసగా ఆరు నెలలు చందా చెల్లించకపోతే ఆ పింఛను ఖాతాను స్తంభింపచేస్తారు. 12 నెలలు దాటితే ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తారు. ఐదేళ్ల పాటు ప్రభుత్వ వాటా ఎలాంటి సామాజిక భద్రత పథకాల్లో సభ్యులు కాని వారు. ఈపీఎఫ్ వంటి స్కీములో లేనివారు, అవ్యవస్థీకృత రంగంలోని వారికి వార్షిక చందాలో సగం లేదా రూ.వెయ్యి ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు అందిస్తుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి రూ.5 వేల పెన్షన్ కోసం నెలనెలా రూ.210 చెల్లించినట్లయితే ఏడాదికి ఇది రూ.2,520 అవుతుంది. ఇందులో సగం వాటా అంటే రూ.1230... దీనికంటే రూ.వెయ్యి తక్కువ గనుక అంత మేర ప్రభుత్వం తన వాటా కింద ఏటా పింఛన్ జమ చేస్తుంది. 60 ఏళ్ల వయస్సు రాగానే ఎంపిక చేసుకున్న ఆప్షన్ ప్రకార నెలనెల పెన్షన్ అందుతుంది. అయితే అప్పటి వరకు సమకూరిన పెట్టుబడులను వెనక్కి ఇవ్వరు. దానిపై వడ్డీ పింఛన్‌గా అందిస్తారు. చందాదారుడు లేదా అతని భాగస్వామి జీవించి ఉన్నంత వరకు పింఛను అందుతుంది. 60 ఏళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల్లో పింఛనుదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి నెలనెల పెన్షన్ అందిస్తారు. దంపతులిద్దరూ మరణిస్తే వారికి నామినీకి కార్పస్ మొత్తాన్ని ఇచ్చేస్తారు. రూ.1000 పింఛను చందాదారుల కార్పస్ 60 ఏళ్లు వచ్చే సరికి రూ.1.7 లక్షలకు చేరుతుంది. అదే రూ.2 వేలు పింఛను అందుకునే వారికి కార్పస్ రూ.3.4 లక్షలు, రూ. 3 వేలు పెన్షన్ వారికి కార్పస్ రూ.5.1 లక్షలు, రూ. 4 వేలు పెన్షన్ అందుకునే వారికి కార్పస్ రూ.6.8 లక్షలు, రూ.5 వేలు పెన్షన్ అందుకునే వారికి కార్పస్ç ఫండ్ రూ.8.5 లక్షలు ఉంటుంది. మరణానంతరం నామినీలకు ఈ మొత్తాన్ని అందిస్తారు. -
పెన్షన్ పరిమితి నెలకు రూ.10 వేలకు పెంపు
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక లాంచ్ చేసిన పథకం అటల్ పెన్షన్ యోజన. 60వ ఏట నుంచి ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో పెన్షన్ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం దీనిని 2015-16 బడ్జెట్లో ప్రకటించింది. అయితే ఈ పథకం కింద ఇక నుంచి నెలకు 10 వేల రూపాయలు పొందవచ్చు. ఈ పరిమితిని 10 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద నెలకు 5000 రూపాయల వరకే ప్రభుత్వం ఆఫర్ చేసేది. అనధికారిక రంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ పెన్షన్ స్కీమ్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్ణయం కనుక అమల్లోకి వస్తే, ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారు, గడువు అనంతరం నెలకు 10వేల రూపాయల పెన్షన్ పొందనున్నారు. అటల్ పెన్షన్ యోజన కింద అందించే పెన్షన్ విలువ పెరగాల్సి ఉందని ఆర్థిక సేవల డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ మాద్నెష్ కుమార్ మిశ్రా చెప్పారు. పెన్షన్ రెగ్యులేటరీ పీఎఫ్ఆర్డీఏ నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నెలకు పెన్షన్‌ను రూ.10వేల వరకు అందించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకం కింద నెలకు అందించే పెన్షన్ ఐదు శ్లాబుల్లో ఉంది. ఈ విషయంపై మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున్న ఫీడ్‌బ్యాక్ తీసుకున్నామని, 60 ఏళ్ల తర్వాత అందించే రూ.5000 పెన్షన్, వచ్చే 20-30 ఏళ్లకు సరిపోదని పేర్కొన్నట్టు మిశ్రా చెప్పారు. అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడానికి కనీస వయసు 18 ఏళ్లు ఉండాలి. మూడు రకాల పద్ధతుల్లో ఏపీవైకి చెల్లించవచ్చు. ఒకటి నెలవారీ, రెండు త్రైమాసికం, మూడు అర్థ సంవత్సరంలో ఈ పెట్టుబడులు పెట్టవచ్చు. పెన్షన్ పెంపుతో పాటు మరో రెండు రకాల ప్రతిపాదనలను కూడా పెన్షన్ రెగ్యులేటరీ, ఆర్థికమంత్రిత్వ శాఖకు పంపింది. ఏపీవైకి ఆటో ఎన్రోల్మెంట్, ఈ స్కీమ్‌లో ప్రవేశానికి గరిష్ట వయసును 50 ఏళ్ల వరకు పెంచడం. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు 40 ఏళ్లే గరిష్ట వయసుగా ఉంది. మరో 10 ఏళ్ల పెంపుతో సబ్‌స్క్రైబర్ బేస్‌ను మరింత పెంచవచ్చని పెన్షన్ రెగ్యులరీ యోచిస్తోంది. ప్రస్తుతం ఈ పెన్షన్ పథకానికి 1.02 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2017-18లో కొత్తగా 50 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లు చేరారు. -
‘అటల్’ ఖాతాదారులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పేమెంట్ బ్యాంక్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కూడా ఈ సామాజికపథకం లబ్దిని పొందొచ్చని తెలిపింది. ఏపీవై ఖాతాదారుల సౌకర్యార్థం ఈ వెసులు బాటును కల్పించినట్టు ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏపీవై పథకంలో పంపిణీ ఇప్పటికే ఉన్న చానెల్స్‌ను బలోపేతం చేయడానికి, కొత్తగా చెల్లింపులు బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులను చేర్చినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో సామాన్యులకు కూడా పెన్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిన ఈ సామాజిక భద్రతా పథకం అటల్ పెన్షన్ యోజన ఫలితం పొందవచ్చని తెలిపింది. దీని ప్రకారం ఆర్బీఐ అనుమతి లభించిన పేమెంట్ బ్యాంకులు, ఇతర చిన్న ఫైనాన్స్ సంస్థల ద్వారా ఈ పథకం లబ్దిదారులు పెన్షన్ పొందవచ్చు. ప్రస్తుతం 11 చెల్లింపు బ్యాంకులు, 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదం లభించినట్టు తెలిపింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో 2018, జనవరి15న చిన్న బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులతో న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక ఓరియంటేషన్ సమావేశంలో ఈ పథకం అమలుపై చర్చించినట్టు వెల్లడించింది. -
ఏపీవై చందాదారులకు కొత్త ‘ఆధార్’ పత్రం
న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) చందాదారుల నుంచి ఆధార్ వివరాలు సేకరించేందుకు వీలుగా సోమవారం నుంచి కొత్త దరఖాస్తు పత్రాలను వినియోగించాలని పీఎఫ్ఆర్డీఏ (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) బ్యాంకులు, పోస్టాఫీసులను కోరింది. దీనిపై గతంలో అనేకసార్లు ఆర్థిక సేవల విభాగం, బ్యాంకులు, పోస్టాఫీసుల అధికారులతో చర్చలు జరిపామనీ, జనవరి 1 నుంచి అమలు చేసేందుకు నిర్ణయించామని పీఎఫ్ఆర్డీఏ వెల్లడించింది. -
అటల్ పెన్షన్‌కూ ఆధార్ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లో మదుపు చేసే సబ్స్క్రైబర్లు తప్పనిసరిగా ఆధార్ వివరాలు ఇవ్వాలని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) స్పష్టం చేసింది. సబ్స్క్రైబర్ల ఆధార్ కార్డు నెంబర్‌ను కోరుతూ పీఎఫ్ఆర్డీఏ అటల్ పెన్షన్ యోజన రిజిస్ట్రేషన్ ఫాంలో మార్పులు చేసింది. 2018 జనవరి 1 నుంచి ఏపీవైకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ పీఎఫ్ఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 1 నుంచి సవరించిన దరఖాస్తు ప్రకారం ఏపీవై ఫాంను పూర్తి చేయాలని సర్వీస్ ప్రొవైడర్లందరికీ సమాచారం పంపింది. అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్ అవసరాల కోసం మోదీ సర్కార్ 2015 మేలో అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద ప్రతి సబ్‌స్క్రైబర్ 60 ఏళ్లు నిండిన అనంతరం కనీస నెలవారీ ఫించన్‌ను అందుకుంటారు. -
హ్యాపీగా రిటైర్ అయిపోదాం!!
• స్థిరమైన ఆదాయాన్నిచ్చేందుకు రకరకాల ప్లాన్లు • కాస్త ముందు నుంచే పెట్టుబడి పెడితే ఉత్తమం • రిటైరయ్యేదాకా విత్‌డ్రా చేయకపోతే కావలసినంత నిధి అత్యధిక శాతం మంది ప్రైవేటు ఉద్యోగాల్లోనో... స్వయం ఉపాధి మీదో బతుకుతున్న మన దేశంలో రిటైర్మెంట్కు ఉండే ప్రాధాన్యం మామూలుది కాదు. ఎందుకంటే ప్రైవేటు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నుంచి పింఛను వచ్చే అవకాశం ఉన్నా... అది ఏ మూలకూ సరిపోదు. ఇక కంపెనీలైతే పెన్షన్ ఇవ్వవు. మరేంటి దారి? చాలా మందికి ఇదే సమస్య. ఉద్యోగం చేసినన్నాళ్లూ హాయిగా గడిపేసిన తాము... రిటైర్మెంట్ తరవాత పిల్లలపై ఆధారపడాలంటే వారికి సుతరామూ ఇష్టం ఉండదు. కొందరికి పిల్లలపై ఆధారపడే అవకాశమూ ఉండదు. ఇలాంటి వారు చేయాల్సింది ఒక్కటే!!. ముందుచూపుతో పెట్టుబడులు పెట్టాలి. వయసు పెరిగిన తరవాత వైద్య ఖర్చుల వంటివి కూడా జత అవుతాయి కనక... వీటికి తగ్గట్టు రిటైరీలకు తగిన ఆదాయాన్నిచ్చే మార్గాలేమైనా ఉన్నాయా? అవిచ్చే రాబడులేంటి? వాటిపై పన్నులెంత ఉంటాయి? ఈ వివరాలన్నీ తెలియజేసేదే ‘సాక్షి ప్రాఫిట్’ ప్రత్యేక కథనం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం రిటైర్మెంట్ పథకాలు ప్రధానంగా రెండు రకాలు. ఈపీఎఫ్, పీపీఎఫ్. పన్ను ఆదా బాండ్ల వంటి గ్యారంటీగా రాబడులనిచ్చేవి ఒక రకం. నేషనల్ పెన్షన్ సిస్టమ్, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు ఆఫర్ చేసే రిటైర్మెంట్ ప్లాన్లు వంటి మార్కెట్ ఆధారిత పాలసీలు రెండో రకం. మన ఆదాయం, మనం భరించగలిగే రిస్క్, ఆర్థిక అవసరాలు, మనం పనిచేసే ఉద్యోగం/స్వయం ఉపాధి వంటి అంశాల ఆధారంగా ఏ ఏ ప్లాన్లలో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి. అయితే మార్కెట్ ఆధారిత ప్లాన్లు, గ్యారంటీడ్ ప్లాన్లలో సమతూకంతో ఇన్వెస్ట్ చేస్తే చక్కని ప్రయోజనాలు పొందవచ్చన్నది నిపుణుల సలహా. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)... వేతన జీవులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఫండ్ సాధనం ఇది. ఉద్యోగి ప్రతినెలా మూలవేతనం, డీఏ కలిపితే వచ్చే మొత్తంలో 12 శాతాన్ని ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలో డిపాజిట్ చేస్తారు. నెలకు రూ.15,000 వరకూ వేతనం పొందే ఉద్యోగులకు ఇది తప్పనిసరి. అంతకు మించిన వేతనం ఉండే ఉద్యోగుల విషయంలో ఇది ఆప్షనల్. ఈ నిధిని ఈపీఎఫ్ఓ గానీ, కంపెనీకి చెందిన ట్రస్ట్ కానీ నిర్వహిస్తుంది. రాబడులు: 8 శాతం రేంజ్లో ఉంటాయి. పన్ను అంశాలు: పన్ను ప్రయోజనాల విషయంలో దీనిది అగ్రస్థానమే. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం ఏడాదికి రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. వడ్డీపై గానీ, విత్డ్రాయల్స్పై గానీ ఎలాంటి పన్ను పోటు ఉండదు. విత్‌డ్రాయల్స్: 58 సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ వీటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. అయితే ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం కొంత మొత్తంలో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్లస్ పాయింట్లు: పన్ను నియమాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు తీసుకొని ఖర్చు చేసే అలవాటున్నవారికి 58 సంవత్సరాల వరకూ ఉన్న లాకిన్ పీరియడ్ కళ్లెం వేస్తుంది. మైనస్ పాయింట్లు: ప్రభుత్వం తరచూ నిబంధనలు మారుస్తుండటం. పన్ను రహిత బాండ్లు... రిటైర్మెంట్ అవసరాల కోసం డిజైన్ చేయకపోయినా, 10/15/20 ఏళ్ల పాటు స్థిరమైన వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పన్ను రహిత బాండ్ల గురించి ఏటా అప్పటి బడ్జెట్లో ఆర్థిక మంత్రి వెల్లడిస్తారు. ఆర్ఈసీ, ఎన్హెచ్ఏఐ, పీఎఫ్సీ, ఎన్టీపీసీ, హడ్కో వంటి ప్రభుత్వ రంగ ఇన్ఫ్రా కంపెనీలు ఈ బాండ్లను జారీ చేస్తాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి 3-4 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇష్యూని బట్టి క్రెడిట్ రిస్క్‌ను మీరే మదింపు చేసుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పుడు పన్ను రహిత బాండ్లు రిటైర్మెంట్కు మంచి పోర్ట్‌ఫోలియో అని చెప్పవచ్చు. రాబడులు: సగటున 7-7.5% రేంజ్లో ఉంటాయి. పన్ను ప్రయోజనాలు: మెచ్యూరిటీ వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, ఆర్జించే వడ్డీపై పన్ను రాయితీలు లభిస్తాయి. మెచ్యూరిటీపై కూడా పన్నులేమీ ఉండవు. ప్రారంభ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్ను రాయితీలు లభించవు. మార్కెట్ ద్వారా ఈ బాండ్ల నుంచి వైదొలిగితే మాత్రం 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విత్‌డ్రాయల్స్: బాండ్ల కాలపరిమితి 10/15/20 ఏళ్లుగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతాయి. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్లు: క్రెడిట్ రిస్క్‌ను తగ్గించుకోవాలంటే ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ పన్ను రహిత బాండ్ల ద్వారా ఏటా వచ్చే వడ్డీని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే రాబడులు వస్తాయి. మైనస్ పాయింట్లు: ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని రోజులే అందుబాటులో ఉంటాయి. ఏ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించడానికి కొంత హోమ్‌వర్క్ చేయాలి. వీటికి సావరిన్ గ్యారంటీ ఉండదు. స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ బాండ్లు ట్రేడవుతాయి. కానీ లావాదేవీలు స్వల్పంగా ఉంటాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పోస్టాఫీసుల్లో కానీ, ఎంపిక చేసిన బ్యాంకుల్లో కానీ రూ.100తో ఈ ఖాతాను తెరవవచ్చు. ఏడాదికి కనీ సంగా రూ.500, గరిష్టంగా రూ.లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. తర్వాత ఐదేళ్ల కాలానికి పొడిగించుకునే వెసులుబాటు ఉంది. రాబడులు: ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీరేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 8.1 శాతంగా ఉంది. భవిష్యత్తులో తగ్గే అవకాశాలున్నాయి. పన్ను ప్రయోజనాలు: ఈపీఎఫ్‌కు వర్తించే పన్ను ప్రయోజనాలే దీనికీ వర్తిస్తాయి. విత్‌డ్రాయల్స్: ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి ఏడవ ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాయల్స్‌ను అనుమతిస్తారు. విత్‌డ్రాయల్ చేసుకుంటున్న ఏడాదికి ముందున్న బ్యాలెన్స్‌లో సగం వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్లు: పన్ను నియమాలు ఓకే. మైనస్ పాయింట్లు: మూడునెలలకొకసారి వడ్డీరేట్లను మార్చడం, ఒడిదుడుకులకు గురయ్యే ప్రభుత్వ సెక్యూరిటీలతో అనుసంధానించడం, అటల్ పెన్షన్ యోజన అసంఘటిత రంగంలోని వ్యక్తుల కోసం భారత ప్రభుత్వం గత ఏడాది అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. 18-40 ఏళ్లలోపు, ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వ్యక్తులు అర్హులు. 60 ఏళ్లు వచ్చే వరకూ నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1,000/2,000/3,000/ 4,000/.5,000 వరకూ పెన్షన్ పొందవచ్చు. వ్యక్తి చెల్లించే ప్రీమియమ్‌ను బట్టి ఈ పెన్షన్ ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.42 చొప్పున 42 సంవత్సరాలు చెల్లిస్తే నెలకు రూ.1,000, రూ.210 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. ప్రధాన మంత్రి జన ధన్ యోజన స్కీమ్ కింద ప్రారంభించిన బ్యాంక్ ఖాతాలతో ఈ స్కీమ్‌ను అనుసంధానిస్తారు. ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ(పీఎఫ్ఆర్డీఏ) నిర్వహిస్తుంది. మార్కెట్ ఆధారిత స్కీమ్‌లు... నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్) మార్కెట్ అనుసంధానిత రిటైర్మెంట్ స్కీమ్ ఇది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి రూ.1,000. ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎం తెంత ఇన్వెస్ట్ చేయాలో(అసెట్ అలొకేషన్) మనమే నిర్దేశించవచ్చు. ఈక్విటీలకు గరిష్ట పరిమితి 50 శాతంగా నిర్దేశించారు. నెలవారీ పోర్ట్‌ఫోలియో వివరాల వెల్లడి, రోజువారీ ఎన్ఏవీ ఆధారంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీకు సంతృప్తికరంగా లేకపోతే, ఫండ్ మేనేజర్‌ను, లేదా అసెట్ అలొకేషన్‌ను మార్చుకోవచ్చు. రాబడులు: మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పటివరకైతే వివిధ కేటగిరీల మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ఎన్పీఎస్ ప్లాన్లు మంచి రాబడులనే ఇచ్చాయని చెప్పొచ్చు. పన్నులు: ప్రారంభ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి రూ. 2లక్షల వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. కానీ రాబడులపై పన్ను పోటు ఉంటుందని గుర్తించాలి. ఫైనల్ మెచ్యురిటీలో 40 శాతం వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 40 శాతం సొమ్ములతో యాన్యుటీని (రిటైర్మెంట్ ప్లాన్స్‌ను) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నెల వారీ ఆదాయంపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ని అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం మీ ఆదాయానికి కలిపి పన్ను విధిస్తారు. మీరు కనుక అధిక పన్ను బ్రాకెట్లో ఉంటే మీకు పన్ను పోటు భారీగానే ఉంటుంది. విత్‌డ్రాయల్స్: ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించి పదేళ్లు పూర్తయితే 25 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంది. లేదంటే రిటైర్మెంట్ వయస్సు వరకూ మీ ఇన్వెస్ట్మెంట్స్ లాక్ అయి ఉంటాయి. ప్లస్ పాయింట్లు: వృత్తిగత ఫండ్ మేనేజర్లు దీనిని నిర్వహిస్తారు. వ్యయాలు తక్కువ. 0.25 శాతం లావాదేవీల, 0.01 శాతం ఫండ్ మేనేజ్మెంట్ ఫీజు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఇది 2-3 శాతం రేంజ్లో ఉంటుంది. రాబడులు, వ్యయాలు, పారదర్శకత విషయంలో ఇది మంచి స్కీమ్. మైనస్ పాయింట్లు: తుది నిధుల వినియోగానికి సంబంధించి నియమనిబంధనలు సంతృప్తికరంగా లేవు. మెచ్యూరిటీలో 60 శాతం వరకూ మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. బీమా సంస్థల రిటైర్మెంట్ ప్లాన్లు బీమా సంస్థలు ఆఫర్ చేసే రిటైర్మెంట్ ప్లాన్లు రెండు రకాలుగా ఉంటున్నాయి. 1.సంప్రదాయ/గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్లు 2. యులిప్‌లు రెండు ప్లాన్‌ల్లో స్థిరమైన వార్షిక ప్రీమియమ్‌లు 5/10/15 ఏళ్ల టర్మ్ (లేదా 60 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ) చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటైరైన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతుంది. రాబడులు: సంప్రదాయిక పెన్షన్ ప్లాన్లలో గ్యారంటీడ్ ఆడిషన్స్ లభిస్తాయి. వ్యయాలు అధికంగా ఉండడం వల్ల రాబడులు సగటున 4-6% రేంజ్లో ఉంటాయి. యులిప్‌లు కూడా అంతంత మాత్రం రాబడులనే ఇస్తాయి. ప్రీమియమ్ అలొకేషన్, పాలసీ నిర్వహణ, ఫండ్ మేనేజ్మెంట్, యొర్టాలిటీ చార్జీలు తదితర ఖర్చులు అధికంగా ఉంటాయి. పన్నులు: ఈ ప్లాన్లకు చెల్లించిన ప్రీమియమ్లకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. మెచ్యూరిటీపై కూడా పన్నులుండవు. నెలా నెలా తీసుకునే యాన్యుటీపై మాత్రం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. విత్‌డ్రాయల్స్: సంప్రదాయ ప్లాన్‌ల్లో ముందస్తుగా ఎగ్జిట్ కావడం ఉండదు. సరెండర్ చేస్తే చార్జీలు అధికంగా ఉంటాయి. ఇక యులిప్‌ల విషయానికొస్తే, ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు. చార్జీలు స్వల్పంగా ఉంటాయి. ప్లస్ పాయింట్లు: ప్రీమియమ్‌కు పన్ను మినహాయింపులు లభిస్తాయి. మైనస్ పాయింట్లు: ఈ ప్లాన్‌ల్లో పెద్దమొత్తంలో పోగుపడిన మీ నిధిని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండదు. ఈ మొత్తంలో మూడో వంతు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలు ఉంది. మిగిలిన దాంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ సెక్షన్ 80 సీ ప్రయోజనాలకనుగుణంగా ఉండేలా పలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ప్రత్యేక రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. యుటిఐ రిటైర్మెంట్ బెనిఫిట్ యూనిట్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్, హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ వంటి సీబీడీటీ -నోటిఫై చేసిన ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌లో ఏకమొత్తంలో గానీ, సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి, రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. రాబడులు: ఈ ఫండ్స్ రాబడులు 10-15 శాతం రేంజ్లో ఉన్నాయి. పన్నులు: స్పెషల్ రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 80సీ ప్రకారం. తుది విత్డ్రాయల్స్పై పన్నులు సాధారణ మ్యూచువల్ ఫండ్స్‌లాగానే ఉంటాయి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. డెట్ ఫండ్స్ అయితే 20 శాతం దీర్ఘకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. విత్‌డ్రాయల్స్: వీటికి లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. రిటైర్మెంట్ వయస్సుకు ముందే విత్‌డ్రా చేసుకుంటే, 1 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. రిటైరైనప్పుడు ఏక మొత్తంలో సొమ్ములు తీసుకోవచ్చు. లేదా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా సొమ్ములను విత్‌డ్రా చేసుకోవచ్చు. ప్లస్ పాయింట్లు: ఇతర మార్కెట్ అనుసంధానిత ప్లాన్లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ ప్లాన్లు ఆరోగ్యకరమైన రాబడులనిస్తాయి. లిక్విడీటీ మెరుగ్గా ఉంటుంది. పన్నులు కూడా తక్కువ. మీకు ఇష్టంవచ్చిన రీతిగా మీ సొమ్ములను వాడుకునే వీలుంటుంది. మైనస్ పాయింట్లు: ఎన్‌పీఎస్‌తో పోల్చితే వ్యయాలు, ఫీజులు అధికంగా 2.5-3% ఉండడం, కొత్త ప్లాన్ల గురించి అంచనాకు రావడానికి ట్రాక్ రికార్డ్ ఉండకపోవడం. ఈ విషయాలు గమనించండి ఆరోగ్యకరమైన రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేయాలంటే. ♦ వీలైనంత చిన్న వయసులోనే రిటైర్మెంట్ కోసం మదుపు చేయడం ప్రారంభించండి. ఇలా చేస్తే చక్రవడ్డీ ప్రభావంతో అధిక రాబడులు పొందవచ్చు. ♦ ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో క్రమశిక్షణను పాటించాలి. 60 ఏళ్లు వచ్చే వరకూ తప్పనిసరి అయితే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోకూడదు. ♦ ఒక వేళ మీరు ఉద్యోగస్తులైతే సింహభాగం ఈపీఎఫ్‌కు కేటాయించండి. మీ రిటైర్మెంట్ నిధుల్లో దాదాపు 70 శాతం దానికే కేటాయించండి. ♦ ఆ ఏడాది బడ్జెట్‌ను నిశితంగా పరిశీలించండి. పన్ను రహిత బాండ్ల గురించి ప్రకటనలు ఉన్నట్టైతే, పీపీఎఫ్‌కు తక్కువ మొత్తం కేటాయించండి. పన్ను రహిత బాండ్ల కోసం కేటాయించిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి. పన్ను రహిత బాండ్లు ఓపెన్ కాగానే వాటికి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదలాయించండి. ఒక వేళ పన్ను రహిత బాండ్ల ప్రస్తావన లేకుంటే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయండి. ♦ {దవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి. ♦ రాబడులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్నుల విషయమై అవగాహన పెంచుకోండి. ♦ ఈపీఎఫ్ అవకాశం మీకు లేకుంటే, పీపీఎఫ్, పన్ను రహిత బాండ్లలలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ♦ మీ ఇన్వెస్ట్మెంట్స్ రాబడులు తీరు గమనించండి. కనీసం మూడు నెలలకొకసారైనా మదింపు చేయండి. -
స్వావలంబన్ పేరిట స్వాహా
సాక్షి, మంచిర్యాల : స్వావలంబన్... అరవై ఏళ్లు దాటిన తర్వాత ఏ పనీ చేయకుండానే ప్రతి నెలా రూ.6 వేల నుంచి రూ.10వేలు పెన్షన్ పొందేలా 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బృహత్తర పథకం. ఇప్పుడిది జిల్లాలో పక్కదారి పట్టింది. ఐదేళ్ల వరకు అవాంతరాలు లేకుండా.. సజావుగా కొనసాగిన ఈ పథకం అమలు సరిగ్గా ఏడాది క్రితం పేరు మారగానే అటకెక్కింది. కేంద్రంలో అధికారంలో వచ్చిన బీజేపీ సర్కార్.. ఆ పథకానికి అటల్ పెన్షన్ యోజనగా పేరు మార్చి.. కొత్తగా విధి విధానాలు మార్చడమే దీనికి కారణమైంది. పథకం ప్రారంభంలో ఢిల్లీలోని అలంకిత్ అసైన్మెంట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కేంద్రం.. ఏడాది క్రితమే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. పెన్షన్ పథకాన్ని నేరుగా బ్యాంకులకు అనుసంధానం చేసింది. దీంతో అప్పటి వరకు అలంకిత్ అసైన్మెంట్ లిమిటెడ్.. రాష్ట్రంలో తనకు అనుగుణంగా నియమించుకున్న ఎన్పీఎస్ సర్వీసెస్ నిర్వాహకులు జిల్లాలో సుమారు 3 వేల మంది చందాదారుల నుంచి వసూలు చేసిన రూ.30 లక్షలు కేంద్రానికి చెల్లించకుండా ఉడాయించారు. డబ్బులు చెల్లించి పథకంలో చేరిన 60 రోజుల్లో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(పీఎఫ్ఆర్డీఏ) నుంచి చందాదారులకు చేరాల్సిన పర్మినెంట్ రిటైర్మైంట్ అకౌంట్ కార్డు(ప్రాన్) రాకపోవడంతో బిజినెస్ డెవలప్మెంట్ అధికారులు ఆరా తీశారు. ఫలితంగా.. జరిగిన మోసం వెలుగులోకి వచ్చింది. తాము ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక బీడీవోలు ఆందోళన చెందుతున్నారు. ఎన్పీఎస్ సర్వీసెస్ డబ్బులతో ఉడాయించిందని చందాదారులకు తెలిస్తే.. డబ్బుల కోసం వేధింపులు ఎక్కువవుతాయనే భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీడీవోలు ముందుకురావడం లేదు. చివరకు.. లక్సెట్టిపేటకు చెందిన బీడీవో బిరుదుల సంతోష్‌కుమార్ తమకు జరిగిన మోసం గురించి.. ఎన్పీఎస్ సర్వీసెస్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదీ పథకం.. 60 ఏళ్లు దాటిన అసంఘటిత రంగ కార్మికులకూ ప్ర భుత్వ ఉద్యోగుల(పదవీ విరమణ తర్వాత)లతో సమానంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా స్వావలంబన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014లో ప్రధానమంత్రి మోదీ పథకాన్ని స్వావలంబన్ యోజనగా మార్చారు. ఈ పథకంలో భాగంగా.. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు ఏడాదికి వెయ్యి రూపాయల చొప్పున చెల్లించిన అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్ల తర్వాత ప్రతీ నెల రూ.6 వేల నుంచి రూ.10 వే ల పెన్షన్ అందిస్తారు. ఇందులో పెన్షన్‌దారుడి వాటా రూ.వెయ్యి ఉంటే.. దానికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అదనంగా మరో వెయ్యి రూపాయలు జమ చేస్తుంది. తర్వాత జమ అయిన ఈ నిధి సదరు పెన్షన్‌దారుడికి అందుతుంది. ఒకవేళ 60 ఏళ్లలోపే పథకం నుంచి వైదొలగాలన్నా.. పలు షరతులతో.. చెల్లించిన దాన్ని బట్టి పింఛన్ ఇస్తారు. చందాదారుడు మరణిస్తే.. జమ నిధిని అతడి వారసులకు అందజేస్తారు. అయోమయం.. స్వావలంబన్ యోజన పథకాన్ని అటల్ పెన్షన్ యోజన పథకంగా మారుస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 2015లో నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో పలు మార్పులు చేసింది. అదే ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. స్వావలంబన్ యోజన పథకానికి 18-60 సంవత్సరాలలోపు ఉన్న వారు అర్హులుంటే అటల్ పెన్షన్ యోజనలో 18-40 ఏళ్లకు కుదించింది. దీంతో చందాదారులుగా చేరి.. పథకం ప్రారంభం నుంచి డబ్బులు చెల్లిస్తున్న 40 ఏళ్లకు పైబడిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 10 వేల మంది చందాదారులు పెన్షన్ పథకంలో సభ్యులుగా చేరగా... వారిలో 45 శాతం మంది 40 ఏళ్లకు పైబడిన వారే ఉండడం గమనార్హం. మరోపక్క.. పెన్షన్ స్కీం నుంచి వైదొలుగుదాం అనుకుంటే పథకాన్ని బ్యాంకులకు అనుసంధానం చేయడంతో బ్యాంకు మేనేజర్లూ గతంలో మీరు డబ్బులు చెల్లించిన ఎన్పీఎస్ సర్వీసెస్ నిర్వాహకులను సంప్రదించాలని చందాదారులకు సూచిస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు తాము చెల్లించిన డబ్బులు వస్తాయో లేదోననే చందాదారులు ఆందోళన చెందుతున్నారు. రోడ్డునపడ్డ బీడీవోలు ఎన్పీఎస్ సర్వీసెస్.. చందాదారుల డబ్బులతో ఉడాయించడంతో జిల్లాలో పనిచేస్తున్న బిజినెస్ డెవలప్మెంట్ అధికారులు రోడ్డున పడ్డారు. ఎన్పీఎస్ సర్వీసెస్... మండలానికొకరి చొప్పున 52 మందితో పాటు పెద్ద మండలాలు, పట్టణాల్లో మొత్తం 60 మందిని నియమించుకుంది. నియామకం సమయంలో ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు అడ్వాన్సు తీసుకుంది. మూడు నెలల్లో కనీసం రెండొందల మంది చందాదారులను పథకంలో చేర్పించాలంది. ఇష్టం లేని వారు విధుల నుంచి వైదొలిగే అవకాశం కల్పించిన ఎన్పీఎస్.. బీడీవోలు ఇచ్చిన దాంట్లో రూ.25 వేలు తిరిగి ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో కొన్నాళ్ల తర్వాత.. ఎన్పీఎస్పై అనుమానం వచ్చిన పలువురు బీడీవోలు తాము వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్పీఎస్ నిర్వాహకులు వారికి చెక్కులూ ఇచ్చారు. బీడీవోలు వాటిని తీసుకెళ్లి బ్యాంకులో వేశారు. దీంతో ఆ చెక్కులన్నీ బౌన్స్ అయినట్లు తేలింది. రాష్ట్రంలో ఎన్పీఎస్ సర్వీసెస్‌కు బాధ్యతలు ఢిల్లీలోని అలంకిత్ అసైన్మెంట్ లిమిటెడ్ అనే సంస్థతో కేంద్రం ఈ పథక నిర్వహణ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ రాష్ట్రంలో ఎన్పీఎస్ సర్వీసెస్‌కు ఈ బాధ్యతను అప్పగించింది. ఎన్పీఎస్ సర్వీసెస్ నిర్వాహకులు విజయ్‌కుమార్, సదానందం మండలానికొకరి చొప్పున అన్ని జిల్లాల్లో బిజినెస్ డెవలప్మెంట్ అధికారు(బీడీవో)లను, జిల్లాకో ఇన్చార్జిని నియమించుకున్నారు. బీడీవోలు మండలాల్లో తిరుగుతూ ప్రజలను పథకంలో చేర్పిస్తూ.. వారి నుంచి వసూలు చేసిన రూ.వెయ్యిని ఎన్పీఎస్ సర్వీసెస్‌కు చెల్లించి.. వెంటనే రశీదులు ఇచ్చేవారు. వసూలైన ఆ డబ్బులు రాష్ట్రస్థాయి నుంచి కేంద్రానికి అందిన 60 రోజుల్లోపు పీఎఫ్ఆర్డీఏ చందాదారుడి పేరిట పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ కార్డును జారీ చేస్తుంది. న్యాయం చేయాలి.. 2013 నుంచి స్వావలంబన్ పథకంలో పనిచేస్తున్న. ఇప్పటి వరకు వెయ్యి మంది పెన్షన్‌దారులను పథకంలో చేర్పించాను. అందులో 750 మందికి పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నంబర్(ప్రాన్) కార్డులూ ఇప్పించాను. మిగిలిన 250 నుంచి వసూలు చేసిన డబ్బులకు ఎన్పీఎన్ జారీ చేసిన రశీదులే ఇచ్చారు. డబ్బులు చెల్లించిన 60 రోజుల లోపు రావాల్సిన ప్రాన్ కార్డులు ఏడాది నుంచి రాకపోవడంతో ఏం చేయాలో తెలియడం లేదు. అసలు ఆ డబ్బులు పీఎఫ్ఆర్డీకి చేరనేలేదని తెలుసుకున్న. ఈ విషయంపై మంచిర్యాల కోర్టులో కేసు వేశాను. భవిష్యత్తు కోసం డబ్బులు జమ చేసుకుంటున్న వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో మోసపోయిన 250 మందికి వారి డబ్బులు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - శంకర్ గౌడ్, బీడీవో, జైపూర్ -
అటల్ పెన్షన్ యోజనకు పన్ను మినహాయింపు ఉందా?
నేను అవైవ యంగ్ స్కాలర్ ఆడ్వాండేజ్ ప్లాన్‌ను 2011లో తీసుకున్నాను. అప్పటి నుంచి నెలకు రూ.4,000 చొప్పున చెల్లిస్తూ వచ్చాను. ఇప్పటివరకూ మొత్తం రూ.2.6 లక్షల వరకూ చెల్లించాను. ఆ ఫండ్ విలువ ప్రస్తుతానికి రూ.2.63 లక్షలుగా ఉంది. ఆశించిన స్థాయిలో ఈ ఫండ్ పనితీరు లేదు. నేను ఇప్పుడు ఏమి చేయాలి? - సాయి కార్తీక, హైదరాబాద్ పిల్లలకు సంబంధించిన ప్లాన్లు బీమా పాలసీల్లాంటివే. వీటిల్లో మీ జీవితానికి కవర్ ఉంటుంది. నామినీగా బిడ్డ పేరు ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ ప్లాన్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సంప్రదాయబద్ధమైనవి, రెండోవి యూనిట్ లింక్డ్ ప్లాన్స్. మీరు తీసుకున్న అవైవ యంగ్ స్కాలర్ అడ్వాండేజ్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ ప్లాన్. ఈ తరహా ప్లాన్‌ల్లో సదరు సంస్థ మీరు చెల్లించిన ప్రీమియం నుంచి జీవిత బీమా (మొరాలిటీ చార్జీలు), నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజర్ చార్జీలు తదితర చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తాయి. ఈచార్జీలన్నీ పోనూ ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ తరహా ప్లాన్లు సరైన రాబడులనివ్వలేవు. మార్కెట్ బాగా ఉన్నప్పుడు కూడా తగిన రాబడులు రావు. అయితే ఏజెంట్లకు ఆకర్షణీయ కమిషన్లు వస్తాయి. కాబట్టి ఏజెంట్లు ఉన్నవి, లేనివి అన్నీ కల్పించి ఈ తరహా ప్లాన్లను ఇన్వెస్టర్లకు అంటగడతారు. ఇక మీ విషయానికొస్తే, భవిష్యత్ నష్టాలను తగ్గించుకోవడానికి గానూ, మీరు ఈ ప్లాన్‌ను తక్షణం సరెండర్ చేయండి. ఈ ప్లాన్‌కు 5 సంవత్సరాల లాక్-ఇన్-పీరియడ్ ఉంటుంది. మీ పాలసీకి ఈ లాక్-ఇన్ పీరియడ్ పూర్తయింది. కాబట్టి మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల మీపై ఎలాంటి పన్ను బాధ్యత ఉండదు. మీరు సరెండర్ చేసే నాటికి ఫండ్ విలువ ఎంత ఉంటుందో, అదే మీకు వచ్చే సరెండర్ వేల్యూ. ఇక భవిష్యత్తులో బీమా, ఇన్వెస్ట్మెంట్ కలగలసిన ఈ తరహా ప్లాన్స్ల్లో ఎన్నడూ ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా పాలసీ కోసం టర్మ్ పాలసీలు తీసుకోండి. వీటికి చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయి. బీమా కవర్ అధికంగా ఉంటుంది. పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయడమంటే, అది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కిందకు వస్తుంది. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం మంచి బ్యాలెన్స్డ్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను రెండు లేదా మూడింటిని ఎంచుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. నేను నెలవారీ వేతనం పొందే ఉద్యోగాన్ని చేస్తున్నాను. అటల్ పెన్షన్ యోజన(ఏపీవై)లో చేరితే, పన్ను ఆదా ప్రయోజనాలు లభిస్తాయా? ఆ వీలు ఉంటే ఏపీవైకు సంబంధించి ఏ ఆప్షన్ కింద ఎంత మొత్తంలో నాకు పన్ను ఆదా అవుతుందో చెప్పండి. - కరీముల్లా, నిజామాబాద్ అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) అనేది భారత పౌరులకు ముఖ్యంగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారి కోసం ఉద్దేశించినది. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభిస్తాయో, ఏపివైలో ఇన్వెస్ట్ చేసినా కూడా అలాంటి పన్ను ప్రయోజనాలే లభిస్తాయి. ఈ స్కీమ్ కింద చెల్లించిన ప్రీమియమ్‌కు ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80సీసీడీ కింద మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ కింద పన్ను మినహాయింపు రూ.50,000గా ఉంది. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల పరిమితికి అదనం. ఇక ఏపీవై విత్‌డ్రాయల్స్ పెన్షన్ రూపంలో అందుతాయి. వీటిపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఏ భారత పౌరుడైనా 18-40 సంవత్సరాల వయస్సులో ఉంటే అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు. ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ. 1,000/2,000/3,000/4,000/5,000 చొప్పున పెన్షన్ వస్తుంది (మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బట్టి). మీ వయస్సు, మీరు ఎంత పెన్షన్ కోరుకుంటున్నారు. ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు అన్న దానిని బట్టి మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలో ఆధారపడి ఉంటుంది. నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆదాయపు పన్ను చెల్లించకుండా ఉండాలంటే వాటిని ఎప్పుడు విక్రయించాలి ? - హరినాధ్, విశాఖపట్టణం మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, మీరు కొనుగోలు చేసిన ఫండ్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే, వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్ దీర్ఘకాలిక మూలధన లాభాలపై ప్రస్తుతం ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఇక వీటిని ఏడాదిలోపే విక్రయిస్తే, వచ్చే రాబడులను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15%గా ఉంది. ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్స్‌పై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఈక్విటీ కాకుండా మరే ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లోనో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. వీటిని మూడేళ్ల తర్వాత విక్రయిస్తేనే, వాటిపై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. డెట్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20%గా(ఇండేక్సేషన్ ప్రయోజనాలతో కలుపుకొని) ఉంటుంది. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను మూడేళ్లలోపే విక్రయిస్తే, వీటిపై వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్‌పై డివిడెండ్లపై మ్యూచువల్ ఫండ్ సంస్థలే 25% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, సర్‌చార్జీ, సెస్‌లను ప్రభుత్వానికి చెల్లిస్తాయి. ఈ డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. -
ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛ!
ఏపీవై చందాదారులకు ఇవ్వాలంటున్న పీఎఫ్ఆర్డీఏ న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రభుత్వ ఉద్యోగులకు/చందాదారులకు ఫండ్ మేనేజర్లను ఎంచుకునే స్వేచ్ఛనివ్వాలని పీఎఫ్ఆర్డీఏ భావిస్తోంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్‌ను ఎంచుకునే వెసులుబాటును కూడా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసే వారికి కల్పించాలని పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్ఆర్డీఏ కోరుకుంటోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఆర్డీఏ) చైర్మన్ హేమంత్ జి. కాంట్రాక్టర్ పేర్కొన్నారు. మొత్తం పెట్టుబడుల్లో 5 శాతం వరకూ అల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్)లో ఇన్వెస్ట్ చేయడానికి అనుమతిస్తున్నామని తెలిపారు. దీంట్లో 2 శాతం వరకూ ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌కు చేరుతుందని వివరించారు. -
నేటితో స్వావలంబన్ యోజనకు ముగింపు...
ముంబై: మైక్రో పెన్షన్ స్కీమ్ ‘స్వావలంబన్ యోజన అండ్ ఎన్పీఎస్ లిట్ ’కు గురువారం (మార్చి 31) తెరపడనుంది. ఈ స్కీమ్ చందాదారులు ఏప్రిల్ 1 నుంచీ అతల్ పెన్షన్ యోజన (ఏపీవై)లోకి మారనున్నట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) అధికారి ఒకరు తెలిపారు. ఏపీవైలోకి మారిన తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్) కింద లభించే ఆర్థిక ప్రయోజనం (ప్రభుత్వ కో-కాంట్రిబ్యూషన్) స్వావలంబన్ చందాదారులకూ అందుతుందని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం 2010-11లో ప్రారంభించిన స్వావలంబన్ యోజనకు తగిన స్పందన కొరవడ్డంతో దీనిని కొనసాగించరాదని, ఈ చందాలను ఏపీవైకి మార్చి ఈ స్కీమ్ కింద అందుతున్న ప్రయోజనాలను అందించాలని కేంద్రం నిర్ణయించింది. -
అటల్ పెన్షన్‌కు సవరణలు
న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకానికి చెల్లించే చందా విషయమై కేంద్ర ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తాజా సవరణ ప్రకారం.. ఏపీవై చందాదారులెవరైనా మరణించినా వారి భార్య లేదా భర్త (జీవిత భాగస్వామి) ఈ పెన్షన్ ఖాతాను కొనసాగించవచ్చు. నిర్ణీత గడు వు పూర్తయ్యే వరకూ (చందాదారుడికి 60 ఏళ్లు పూ ర్తయి ఉండే సమయం వరకు) వారు చందా చెల్లిస్తే... వారికి జీవితాంతం నెలనెలా నిర్ధారిత పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు. భాగస్వామి కూడా మరణిం చాక వారి నామినీకి ఏకమొత్తంగా పెన్షన్ సొమ్మును చెల్లిస్తారు. -
అటల్ పెన్షన్ ‘సహాయం’ మార్చి 31 వరకు..
న్యూఢిల్లీ: అటల్ పెన్షన్ యోజన పథకానికి (ఏపీవైకి) కార్మికులు చెల్లించే చందాలో సగం మొత్తాన్ని ప్రభుత్వమే భరించేందుకు ఉద్దేశించిన గడువును కేంద్రం పొడిగించింది. ఈ ఏడాది మార్చి 31 వరకు ఈ పథకంలో చేరే అసంఘటితరంగ కార్మికులకు దీనిని వర్తింపజేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అసంఘటిత రంగ కార్మికుల కోసం ఈ పథకాన్ని తెచ్చారు. ఆ కార్మికులకు నిర్ధారిత రిటైర్మెంట్ వయసు పూర్తయ్యాక నెలకు కనీసం రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు పెన్షన్ అందిస్తారు. గతేడాది జూన్‌లో ఈ పథకాన్ని ప్రకటించిన కేంద్రం... తొలి ఆరు నెలల్లో అంటే గత డిసెంబర్ 31 నాటికి ఈ పథకంలో చేరే కార్మికులు ఏటా చెల్లించే చందాలో 50శాతం లేదా రూ. 1,000లో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని ఐదేళ్లపాటు చెల్లిస్తామంది. ఈ పథకంలో ఇప్పటివరకు దాదాపు 12.5లక్షల మంది కార్మికులు చేరారు. అయితే మరింత మందికి ప్రయోజనం కల్పించేందుకు గడువు పెంచారు. -
అటల్ పెన్షన్ యోజనలో స్వల్ప మార్పులు
న్యూఢిల్లీ: అసంఘటిత కార్మికుల కోసం ఉద్దేశించిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పరిధిని విస్తరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో స్వల్ప మార్పులు చేసింది. ఇప్పటివరకూ చందాదారులు కేవలం నెలవారీ చందా చెల్లించే విధానం మాత్రమే అమల్లో ఉండగా ఇకపై చందాను త్రైమాసిక, అర్ధ వార్షికానికి కూడా చెల్లించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది. -
జూన్ 1 నుంచి 'అటల్ పింఛన్ యోజన'
న్యూఢిల్లీ: పింఛన్‌దారుల కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పింఛన్ యోజన పథకాన్ని జూన్ 1 నుంచి ప్రారంభించనుంది. గత యూపీఏ హయాంలో స్వావలంభన్ యోజనగా ఉన్న ఈ పథకం పేరును ఎన్డీఏ ప్రభుత్వం అటల్ యోజనగా మార్చింది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉన్న కార్మికులు దీనికి అర్హులని ఆర్థిక సేవల కార్యదర్శి హస్ముఖ్ అథియా తెలిపారు. 60 ఏళ్లు దాటిన తరువాత నెలకు రూ.1000 నుంచి 5000 వరకు పింఛన్ లభిస్తుందని ఆయన తెలిపారు. ప్రతీ కార్మికుడు పింఛన్‌కు చెల్లించే సంవత్సర మొత్తంలో సగం లేదా రూ.1000 ఏదీ తక్కువైతే అది ప్రభుత్వం వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు.