అసంఘటిత రంగంలో ఉన్న పేద ప్రజలకు భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ పథకమే అటల్ పెన్షన్ యోజన(ఏపీవై). ఈ పథకం 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) ద్వారా అటల్ పెన్షన్ యోజన నడుస్తుంది. ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు కనీసం 20 సంవత్సరాల పాటు ప్రతి నెల కొత్త మొత్తం పొదుపు చేస్తే ఆ తర్వాత నెలకు రూ. 5,000 పెన్షన్ లభిస్తుంది. అటల్ పెన్షన్ యోజన కింద చందాదారులకు నెలకు రూ.1000 నుంచి రూ. 5000 మధ్య గ్యారెంటీడ్ కనీస నెలవారీ పెన్షన్ అందుతుంది.
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించింది. దీనిలో చేరాలంటే బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా ఉంటే సరిపోతుంది. టెర్మినల్ వ్యాధి లేదా ఖాతాదారుడు మరణించిన పరిస్థితుల్లో మినహా పెన్షన్ ముందస్తుగా చెల్లించడం, ఏపీవై నుంచి నిష్క్రమించడం జరగదు. మీరు ముందుగా చేరితే తక్కువ మొత్తం ప్రతి నెల కట్టాల్సి వస్తుంది కాబట్టి త్వరగా మీ పేరు నమోదు చేసుకుంటే మంచిది. పీఎఫ్‌ఆర్‌డీఏ పెన్షన్ స్కీంలో ఒకటి కంటే ఎక్కువ మంది కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 18 సంవత్సరాలు వయస్సు గల చందాదారులు 60 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నెలకు రూ.210 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
39 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వివాహిత జంటలు విడిగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 60 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత ఈ జంటకు నెలకు రూ.10,000 సామూహిక పెన్షన్ లభిస్తుంది. 30 లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న భార్యాభర్తలు తమ తమ ఏపీవై ఖాతాల్లో నెలకు రూ.577 పొదుపు చేయాల్సి ఉంటుంది. అంటే నెలకు ఇద్దరికీ కలిపి రూ.1154 (రోజుకి 1154/30 = రూ. 38.46) 30 ఏళ్ల వరకు పొదుపు చేస్తే 60 ఏళ్ల తర్వాత ఇద్దరికీ కలిపి ప్రతి నెల రూ. 10 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ఒకవేళ జంటకు 35 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే వారి సంబంధిత ఏపీవై ఖాతాల్లో నెలవారీ కంట్రిబ్యూషన్ రూ.902కు పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment