అటల్ పెన్షన్ యోజనకు పన్ను మినహాయింపు ఉందా? | dheerendra kumar advice's and sollution's | Sakshi
Sakshi News home page

అటల్ పెన్షన్ యోజనకు పన్ను మినహాయింపు ఉందా?

Published Mon, Jul 18 2016 1:53 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

అటల్ పెన్షన్ యోజనకు పన్ను మినహాయింపు ఉందా?

అటల్ పెన్షన్ యోజనకు పన్ను మినహాయింపు ఉందా?

నేను అవైవ యంగ్ స్కాలర్ ఆడ్వాండేజ్ ప్లాన్‌ను 2011లో తీసుకున్నాను. అప్పటి నుంచి నెలకు రూ.4,000 చొప్పున చెల్లిస్తూ వచ్చాను. ఇప్పటివరకూ మొత్తం రూ.2.6 లక్షల వరకూ చెల్లించాను. ఆ ఫండ్ విలువ ప్రస్తుతానికి రూ.2.63 లక్షలుగా ఉంది. ఆశించిన స్థాయిలో ఈ ఫండ్ పనితీరు లేదు.  నేను ఇప్పుడు ఏమి చేయాలి? - సాయి కార్తీక, హైదరాబాద్

 పిల్లలకు సంబంధించిన ప్లాన్‌లు బీమా పాలసీల్లాంటివే. వీటిల్లో మీ జీవితానికి కవర్ ఉంటుంది. నామినీగా బిడ్డ పేరు ఉంటుంది. ఈ చిల్డ్రన్స్ ప్లాన్‌లు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సంప్రదాయబద్ధమైనవి, రెండోవి యూనిట్ లింక్డ్ ప్లాన్స్. మీరు తీసుకున్న అవైవ యంగ్ స్కాలర్ అడ్వాండేజ్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ ప్లాన్. ఈ తరహా ప్లాన్‌ల్లో సదరు సంస్థ మీరు చెల్లించిన ప్రీమియం నుంచి జీవిత బీమా (మొరాలిటీ చార్జీలు), నిర్వహణ వ్యయాలు, ఫండ్ మేనేజర్ చార్జీలు తదితర చార్జీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తాయి.  ఈచార్జీలన్నీ పోనూ ఇన్వెస్ట్ చేసే మొత్తం తక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ తరహా ప్లాన్‌లు సరైన రాబడులనివ్వలేవు. మార్కెట్ బాగా ఉన్నప్పుడు కూడా తగిన రాబడులు రావు. అయితే ఏజెంట్లకు ఆకర్షణీయ కమిషన్లు వస్తాయి.

కాబట్టి ఏజెంట్లు ఉన్నవి, లేనివి అన్నీ కల్పించి ఈ తరహా ప్లాన్‌లను ఇన్వెస్టర్లకు అంటగడతారు. ఇక మీ విషయానికొస్తే, భవిష్యత్ నష్టాలను తగ్గించుకోవడానికి గానూ, మీరు ఈ ప్లాన్‌ను తక్షణం సరెండర్ చేయండి. ఈ ప్లాన్‌కు 5 సంవత్సరాల లాక్-ఇన్-పీరియడ్ ఉంటుంది. మీ పాలసీకి ఈ లాక్-ఇన్ పీరియడ్ పూర్తయింది. కాబట్టి మీరు ఎలాంటి సరెండర్ చార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఈ పాలసీని సరెండర్ చేయడం వల్ల మీపై ఎలాంటి పన్ను బాధ్యత ఉండదు. మీరు సరెండర్  చేసే నాటికి ఫండ్ విలువ ఎంత ఉంటుందో, అదే మీకు వచ్చే సరెండర్ వేల్యూ.

ఇక భవిష్యత్తులో బీమా, ఇన్వెస్ట్‌మెంట్ కలగలసిన ఈ తరహా ప్లాన్స్‌ల్లో ఎన్నడూ ఇన్వెస్ట్ చేయకండి. జీవిత బీమా పాలసీ కోసం టర్మ్ పాలసీలు తీసుకోండి. వీటికి చెల్లించాల్సిన ప్రీమియమ్‌లు తక్కువగా ఉంటాయి. బీమా కవర్ అధికంగా ఉంటుంది. పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయడమంటే, అది దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కిందకు వస్తుంది. ఇలాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల సాధన కోసం మంచి బ్యాలెన్స్‌డ్ లేదా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను రెండు లేదా మూడింటిని ఎంచుకోండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి.

 నేను నెలవారీ వేతనం పొందే ఉద్యోగాన్ని చేస్తున్నాను. అటల్ పెన్షన్ యోజన(ఏపీవై)లో చేరితే, పన్ను ఆదా ప్రయోజనాలు లభిస్తాయా? ఆ వీలు ఉంటే ఏపీవైకు సంబంధించి ఏ ఆప్షన్ కింద ఎంత మొత్తంలో నాకు పన్ను ఆదా అవుతుందో చెప్పండి.    
- కరీముల్లా, నిజామాబాద్

 అటల్ పెన్షన్ యోజన(ఏపీవై) అనేది భారత పౌరులకు ముఖ్యంగా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసేవారి కోసం ఉద్దేశించినది. నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)లో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి పన్ను ప్రయోజనాలు లభిస్తాయో, ఏపివైలో ఇన్వెస్ట్ చేసినా కూడా అలాంటి పన్ను ప్రయోజనాలే లభిస్తాయి. ఈ స్కీమ్ కింద చెల్లించిన ప్రీమియమ్‌కు  ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80సీసీడీ కింద మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 80సీసీడీ కింద పన్ను మినహాయింపు రూ.50,000గా ఉంది. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.5 లక్షల పరిమితికి అదనం. ఇక ఏపీవై విత్‌డ్రాయల్స్ పెన్షన్ రూపంలో అందుతాయి.

వీటిపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి మీరు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఏ భారత పౌరుడైనా 18-40 సంవత్సరాల వయస్సులో ఉంటే అటల్ పెన్షన్ యోజనలో చేరవచ్చు. ఈ స్కీమ్ కింద ఇన్వెస్ట్ చేసిన వారికి  60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ. 1,000/2,000/3,000/4,000/5,000 చొప్పున పెన్షన్ వస్తుంది (మీరు పెట్టే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బట్టి). మీ వయస్సు, మీరు ఎంత పెన్షన్ కోరుకుంటున్నారు. ఎంత కాలం ఇన్వెస్ట్ చేస్తారు అన్న దానిని బట్టి మీరు ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలో ఆధారపడి ఉంటుంది.

 నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆదాయపు పన్ను చెల్లించకుండా ఉండాలంటే వాటిని ఎప్పుడు విక్రయించాలి ?
- హరినాధ్, విశాఖపట్టణం

మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే, మీరు కొనుగోలు చేసిన ఫండ్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే, వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్ దీర్ఘకాలిక  మూలధన లాభాలపై ప్రస్తుతం ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఇక వీటిని ఏడాదిలోపే విక్రయిస్తే, వచ్చే రాబడులను  స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఫండ్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15%గా ఉంది. ఇక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్స్‌పై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక ఈక్విటీ కాకుండా మరే ఇతర మ్యూచువల్ ఫండ్స్‌లోనో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. వీటిని మూడేళ్ల తర్వాత విక్రయిస్తేనే, వాటిపై వచ్చే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు.

డెట్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 20%గా(ఇండేక్సేషన్ ప్రయోజనాలతో కలుపుకొని) ఉంటుంది. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను మూడేళ్లలోపే విక్రయిస్తే, వీటిపై వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలను మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీకు వర్తించే ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్‌పై డివిడెండ్లపై మ్యూచువల్ ఫండ్ సంస్థలే 25% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, సర్‌చార్జీ, సెస్‌లను ప్రభుత్వానికి చెల్లిస్తాయి. ఈ డివిడెండ్లపై ఇన్వెస్టర్లు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement