న్యూఢిల్లీ: ఈక్విటీల పట్ల ఇన్వెస్టర్లలో విశ్వాసం మరింత అధికమైంది. ఇందుకు నిదర్శనంగా మార్చి నెలలో రూ.28,463 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఒక నెలలో వచ్చిన గరిష్ట పెట్టుబడులు ఇవి. మార్కెట్ దిద్దుబాటు నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు రిటైల్, హెచ్‌ఎన్‌ఐ (అధిక నెట్‌వర్త్ ఉన్నవారు) ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిన ఫలితమే ఇదని విశ్లేషకులు అంటున్నారు.
ఇక వరుసగా 13వ నెలలోనూ ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చిన పెట్టుబడులు రూ.19,705 కోట్లుగా ఉంటే, జనవరిలో రూ.14,888 కోట్లు, 2021 డిసెంబర్‌లో రూ.25,077 కోట్ల చొప్పున వచ్చాయి. మార్చి నెలకు సంబంధించిన గణంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది.
మరింత వివరంగా గణాంకాలు..
► 2021–22 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఈక్విటీ పథకాలు రూ.1,64,399 కోట్ల భారీ పెట్టుబడులు ఆకర్షించడం విశేషం. ఎందుకంటే అంతకుముందు సంవత్సరం 2020–21లో రూ.25,966 కోట్లు నికరంగా బయటకు వెళ్లిపోయాయి. ఈక్విటీ పెట్టుబడుల పట్ల మారిన ఇన్వెస్టర్ల వైఖరిని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
► ఈక్విటీ పథకాలు 2021 మార్చి నుంచి నికరంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. కరోనా రెండో విడత మార్కెట్లలో కరెక్షన్‌కు దారితీసింది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు మొగ్గు చూపించారు. దీనికంటే ముందు 2020 జూలై నుంచి 2021 ఫిబ్రవరి వరకు ఎనిమిది నెలల కాలంలో ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.46,791 కోట్లు బయటకు వెళ్లిపోయాయి.
► ఈక్విటీల్లో దాదాపు అన్ని రకాల పథకాలు మార్చి మాసంలో నికరంగా పెట్టుబడులు ఆకర్షించాయి. అత్యధికంగా మల్టీక్యాప్ కేటగిరీ పథకాల్లోకి రూ.9,695 కోట్లు వచ్చాయి. ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ కొత్తగా మల్టీక్యాప్ ఫండ్‌ను ప్రారంభించి రూ.8,170 కోట్లను ఆకర్షించడం అధిక పెట్టుబడుల రాకకు కలిసొచ్చింది.
► లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్‌క్యాప్ ఫండ్స్ విభాగాలు ఒక్కోటీ రూ.3,000 కోట్లకు పైనే ఆకర్షించాయి.
► ఈటీఎఫ్ పథకాల్లోకి ఫిబ్రవరిలో రూ.10,719 కోట్లు వస్తే, మార్చిలో రాక రూ.6,907 కోట్లకు పరిమితమయ్యాయి. ఇండెక్స్, ఈటీఎఫ్ విభాగాలు రెండింటిలోకి కలిపి రూ.19,219 కోట్లు వచ్చాయి.
► డెట్ విభాగం నుంచి నికరంగా రూ.1.15లక్షల కోట్లు బయటకు వెళ్లాయి. ఫిబ్రవరిలో రూ.8,274 కోట్లు నికరంగా ఈ విభాగంలోకి వచ్చాయి.
► లిక్విడ్ ఫండ్స్‌లోకి మార్చి నెలలో రూ.44,604 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ మొత్తం రూ.40,273 కోట్లుగా ఉన్నాయి.
► క్రెడిట్ రిస్క్ పథకాలు రూ.399 కోట్లను ఆకర్షించాయి. ఫిబ్రవరిలో వీటి నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.388 కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం.
► మొత్తం మీద మ్యూచువల్ పండ్ పరిశ్రమ నుంచి మార్చిలో రూ.69,883 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. అంతకు ముందు నెలలో నికర పెట్టుబడి రాక రూ.31,533 కోట్లుగా ఉంది.
► అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) విలువ ఫిబ్రవరి చివరికి ఉన్న రూ.38.56 లక్షల కోట్ల నుంచి మార్చి చివరికి రూ.37.7 లక్షల కోట్లకు తగ్గింది.
సిప్ పెట్టుబడులూ ఆల్‌టైమ్ గరిష్టం
సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలోనూ భారీగా రూ.12,328 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది కూడా నెలవారీగా అత్యధిక పెట్టుబడులు కావడం గమనార్హం. ప్రస్తుత అనిశ్చితుల్లోనూ సిస్ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరడం ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని ప్రతిఫలిస్తోందని నిపుణులు అంటున్నారు.
రిస్క్ తీసుకునే ధోరణి పెరిగింది..
‘‘రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం మార్కెట్లలో అనిశ్చితులకు దారితీసింది. దీంతో అధిక కేటాయింపులు చేసుకునేందుకు, ప్రస్తుత పెట్టుబడుల్లో మార్పులు చేసుకునేందుకు దీన్ని ఇన్వెస్టర్లు సానుకూలంగా తీసుకున్నారు. ఈక్విటీల్లో రిస్క్ ధోరణి గరిష్టానికి చేరింది. ఇది మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు దీర్ఘకాలంలో మంచిది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఏఎంసీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అఖిల్ చతుర్వేది తెలిపారు.
‘‘చమురు ధరలు పెరగడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఫిబ్రవరి చివర, మార్చి మొదట్లో మార్కెట్లో కరెక్షన్ వచ్చింది. దీంతో ఈక్విటీలకు కేటాయింపులు చేసుకునేందుకు ఇన్వెస్టర్ల అవకాశం ఏర్పడింది’’అని మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment