మ్యూచువల్ ఫండ్స్ పనితీరుపై ఏటా సంవత్సరం ఆరంభంలో పలు సంస్థలు విశ్లేషణా నివేదికలను ప్రకటిస్తుంటాయి. మంచి రాబడులు ఇచ్చినవి, బలహీన, చెత్త పనితీరు చూపించిన వివిధ విభాగాల్లోని మ్యూచువల్ ఫండ్స్‌పై ఇన్వెస్టర్లకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంటాయి. నిజానికి ఈ సమాచారం ఇన్వెస్టర్లు ఫోమో (మంచి పనితీరు చూపించే వాటిని కోల్పోతామనే వెర్రి) బారిన పడేందుకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. వివిధ విభాగాల్లో మంచి పనితీరు చూపించిన టాప్ మ్యూచువల్ ఫండ్స్ సమాచారం చూసినప్పుడు.. ఇన్వెస్టర్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని బలహీన రాబడులు ఇచ్చిన పథకాలపై సమీక్ష మొదలవుతుంది.
2020 మార్చి కనిష్టాల నుంచి చూసినప్పుడు 200 శాతానికి పైగా రాబడులు ఇచ్చిన పథకాలను గుర్తించొచ్చు. అటువంటప్పుడు ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో కేవలం 20–40 శాతం రాబడులనే ఇచ్చిన పథకాలను చూస్తే అసహనానికి గురికావచ్చు. ఇది ఆకర్షణీయమైన పథకంలోకి పెట్టుబడులను మళ్లించేలా ప్రేరణ కల్పించొచ్చు. తక్కువ రాబడులు ఇచ్చిన పథకాలు లేదా స్టాక్స్ నుంచి మీ పెట్టుబడులను వెనక్కి తీసేసుకుని, గడిచిన ఏడాది, రెండేళ్లుగా మంచి రాబడులతో దూసుకుపోతున్న పథకాలు లేదా స్టాక్స్ వెంట పడడం ఫోమోనే అవుతుంది. ఇలా ఒక పథకం లేదా స్టాక్స్‌లో పెట్టుబడులను విక్రయించే ముందు ఇన్వెస్టర్లు కేవలం రాబడులనే ప్రామాణికంగా తీసుకోకూడదు. పెట్టుబడులపై నిర్ణయం తీసుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన కీలక అంశాలను వివరించే కథనం ఇది..
పెట్టుబడులను తరచూ మదింపు వేయడం మంచి విధానం కాదు. పెట్టుబడి పెట్టిన తర్వాత కొన్ని నష్టాలు చూడొచ్చు. కొన్ని వెంటనే లాభాల క్రమంలో నడవొచ్చు. ఇలా నష్టాలు చూపిస్తున్నవి సరైన ఎంపిక కాదని భావించి వాటిని విక్రయించేసి, లాభాలు చూపిస్తున్న వాటిల్లోకి పెట్టుబడులు మళ్లించే ఇన్వెస్టర్లు చాలా మందే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలా చేయడం వల్ల స్వల్పకాలంలో మంచి లాభాలను కళ్లజూస్తారు. కానీ ఆచరణలో ఇలా తరచుగా (ఏడాది, రెండేళ్లలోపు) చేయడం అది అంతిమంగా నష్టాలకు దారితీయవచ్చు. అప్పటి వరకు నష్టాలు చూపించిన వాటిని వదిలించుకుని, లాభాలు కురిపిస్తున్న వాటిల్లోకి ప్రవేశించడం వల్ల ఒక రిస్క్ ఉంది. ఒక ఫండ్ లేదా స్టాక్ అనేది ఎన్నో పరిణామాల ప్రభావంతో మార్కెట్లో ఆటుపోట్ల మధ్య ప్రయాణం చేస్తుంటుంది. కొంత కాలం ర్యాలీ చేయడం కొంత కాలం దిద్దుబాటుకు గురికావడం లేదంటే కొంత కాలం ఒక శ్రేణి పరిధిలో స్థిరీకరణ చెందడం సర్వ సాధారణం. ఒక ఒక వర్గం ఇన్వెస్టర్లు కొంత ర్యాలీ చేసిన ఫండ్స్ లేదా స్టాక్స్‌లో లాభాలను స్వీకరిస్తుంటారు. వీరు ఎక్కువ కాలం పాటు కొనసాగరు. వీరి చర్యతో ఆ ఫండ్ లేదా స్టాక్ అమ్మకాల ఒత్తిడితో అక్కడి నుంచి నష్టపోతుంది. అమ్మకాల ఒత్తిడి తగ్గిన తర్వాత స్థిరీకరణ చెందుతాయి. కొంత కాలం స్థిరీకరణ తర్వాత కనిష్ట స్థాయిల వద్ద వాటిల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ముందుకు రావడం వల్ల అవి తిరిగి ర్యాలీ బాట పడతాయి.
చదవండి👉 ఈ చెట్టు లేకపోతే ప్రపంచంలో కూల్‌డ్రింక్స్ తయారీ కంపెనీల పరిస్థితి ఏంటో?
ర్యాలీ చేస్తున్నాయని చెప్పి పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి బుల్లిష్ మూమెంటమ్ ఉన్నవాటిల్లో పెట్టేశారనుకోండి. ఆ తర్వాత అవి కరెక్షన్‌కు లోనైతే అప్పుడు అవి కూడా నష్టాలను చూపిస్తాయి. నష్టాలకు ఓర్చుకోని తత్వం వల్ల ఇన్వెస్టర్లు వాటిని కూడా విక్రయించేందుకు మొగ్గు చూపొచ్చు. ఇలా విక్రయించిన మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో తిరిగి ర్యాలీ చేయడం మొదులు పెడతాయి. అందుకని లాభాలనే ప్రామాణికంగా తీసుకుని తరచూ పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పులు చేయకూడదు. దీన్ని ప్రణాళిక లేని పెట్టుబడిగా పేర్కొంటారు. మరో రకం ఇన్వెస్టర్లు కొంత లాభానికే (షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్లు) విక్రయాలు చేస్తుంటారు. దీనివల్ల లాభంపై 15 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాలన్న విషయాన్ని వారు మర్చిపోతుంటారు. పెట్టుబడులు ఎప్పుడూ కూడా నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. పైగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్స్ అనేవి ఐదేళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసమే ఎంపిక చేసుకోవాలని నిపుణులు తరచూ సూచిస్తుంటారు. దీర్ఘకాలం కోసం ఎంపిక చేసుకున్నవి స్వల్పకాలంలో మార్కెట్లలో అస్థితరల వల్ల నష్టాలను చూపించొచ్చు. అటువంటప్పుడు స్థిరత్వాన్ని ప్రదర్శించాలి. అంతేకానీ, తరచూ పోర్ట్‌ఫోలియోను గందరగోళంగా మార్చేయకూడదు. 2020 మార్చి నుంచి ఇలా మార్పులు చేసిన వారికి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. చేసిన తప్పుకు మూల్యం కూడా చెల్లించాల్సి వచ్చింది.
ఉదాహరణకు యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ 2021లో 21 శాతం రాబడులను ఇవ్వగా, 2022లో 6 శాతం నష్టాలను ఇచ్చింది. గడిచిన ఏడాది కాలంలో ఈ ఫండ్ ఎలాంటి రాబడులు ఇవ్వలేదు. కానీ, గత మూడేళ్లలో సగటున చూస్తే వార్షికంగా 15 శాతం రాబడులు ఇచ్చింది. అందుకే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వృద్ధి చెందడానికి తగినంత సమయం ఇవ్వాలి. నేడు పెట్టుబడులు పెట్టి రేపు లేదా వచ్చే నెల సమీక్షిస్తామంటే అది సరైన విధానం అనిపించుకోదు. అదే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ 2020లో 22 శాతం రాబడులు ఇవ్వగా, 2021లో 37 శాతం, 2022లో 15 శాతం చొప్పున రాబడులు తెచ్చి పెట్టింది. హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీక్యాప్ పథకం పనితీరు బాగోలేదని చెప్పి 2021లో పెట్టుబడులు విక్రయించేసి ఉంటే, 2022లో విచారించాల్సి వచ్చేది. ఎందుకంటే 2022లో ఈ పథకం 17 శాతం రాబడులు తెచ్చి పెట్టింది. ఇలా ఒక్కో పథకం పనితీరు ఒక్కో మాదిరిగా ఉంటుంది. ప్రభుత్వరంగ సంస్థలు, ఇన్‌ఫ్రా కంపెనీలు 2020 వరకు ప్రతికూల రాబడులనే ఇచ్చాయి. కానీ, ఆ తర్వాత నుంచి ర్యాలీ చేస్తున్నాయి. గత పదేళ్లలో డైవర్సిఫైడ్ ఈక్విటీ విభాగంలో మంచి ఫండ్ ఏటా 21 శాతం కాంపౌండెడ్‌గా రాబడిని ఇవ్వగా, బలహీన పథకం ఏటా 11 శాతం రాబడిని తెచ్చి పెట్టింది. అంటే బలహీన పథకం కూడా దీర్ఘకాలంలో డెట్ సాధనాల కంటే మెరుగైన రాబడులు
ఇచ్చినట్టు తెలుస్తోంది.
మినహాయింపులు..
బలహీన పనితీరు చూపించే మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెట్టుబడులతో బయటకు రావాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. మీరు పెట్టుబడులు పెట్టడానికి ముందు ఆశించిన మేర రాబడులను మ్యూచువల్ ఫండ్ ఇవ్వడంలో విఫలమైతే (మూడేళ్లకు మించిన కాలంలో), లేదా బెంచ్ మార్క్ (సూచీ) పనితీరు కంటే మెరుగైన పనితీరు చూపించలేనప్పుడు ఆ పథకం నుంచి తప్పుకోవచ్చు. ఎందుకంటే బెంచ్‌మార్క్‌తో సమానంగా రాబడులు ఇచ్చే నిఫ్టీ 50, నిప్టీ నెక్టŠస్ 50, నిఫ్టీ 100 తదితర తక్కువ ఖర్చుతో వచ్చే ఇండెక్స్ పథకాలు నేడు ఎన్నో ఉన్నాయి. కనుక సూచీల కంటే తక్కువ రాబడులు ఇచ్చే పథకాల్లో కొనసాగాల్సిన అవసరం లేదు.
బెంచ్ మార్క్‌ను చూడాలి..
ఒక మ్యూచువల్ ఫండ్ రాబడులను సమీక్షించే సమయంలో, ఆయా మ్యూచువల్ ఫండ్ విభాగం అనుసరించే ప్రామాణిక సూచీ (బెంచ్‌మార్క్/ఇండెక్స్) పనితీరు ఎలా ఉందో గమనించాలి. బెంచ్‌మార్క్ కంటే తాను ఇన్వెస్ట్ చేసిన పథకం పనితీరు బాగోలేదా? అన్నది చూడాలి. ఆయా విభాగం వారీ సగటు రాబడులు అంత కచ్చితమైనవి కావు. ఒక పథకం అదే విభాగం సగటు రాబడులతో పోలిస్తే భిన్నమైన పనితీరు చూపించడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఫండ్ మేనేజర్ పోటీ పథకాలతో పోలిస్తే తక్కువ రిస్క్ తీసుకోవచ్చు. లేదా మైక్రోకాŠయ్‌ప్ స్టాక్స్ లేదా మూమెంటమ్ బ్రేకవుట్ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్ మేనేజర్ నిర్ణయాలతో బుల్ మార్కెట్లో పరుగులు పెట్టిన ఫండ్స్.. మార్కెట్ కరెక్షన్లలో అంతే మేర నష్టపోతుంటాయి.
ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసి, పోర్ట్‌ఫోలియో కాన్సంట్రేషన్ తక్కువగా ఉంటే (అధిక పెట్టుబడులు ఒకే చోట పెట్టకపోవడం) లేదా మార్కెట్లు పట్టించుకోని స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటే గనుక, ఈ రిస్క్ తగ్గించే విధానాల ఫలితంగా బుల్ మార్కెట్లో ఆయా పథకాలు మంచి రాబడులు తెచ్చి పెడతాయి. 2021 వరకు కాంట్రేరియన్, వ్యాల్యూ ఫండ్స్ గ్రోత్ ఫండ్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంతో వెనుక ఉన్నాయి. వడ్డీ రేట్లు రికార్డు కనిష్టాలకు చేరడం గ్రోత్ స్టాక్స్‌కు ఎంతో అనుకూలించింది. కానీ, వడ్డీ రేట్లు తిరిగి పెరగడం మొదలైన తర్వాత అప్పుడు వ్యాల్యూ, కాంట్రేరియన్ ఫండ్స్‌కు కలిసొచ్చింది. అవి మంచి పనితీరు చూపించడం ఆరంభమైంది. ఇలా ఒక తరహా పథకాల నుంచి మరో తరహా పథకాల మధ్య పెట్టుబడులు మారుస్తూ ఉండడం కంటే, ఇన్వెస్టర్ తన రాబడుల ఆకాంక్షలు, రిస్క్ సామర్థ్యాలకు అనుకూలమైన పథకాలు లేదా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైన విధానం అవుతుంది. అంతేకాదు, అవి రాబడులు ఇచ్చే వరకూ ఓపిక పట్టాలి. ఓ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టే ముందు ఫండ్ మేనేజర్‌ను కూడా చూడాలి. ఎన్నో మార్కెట్ సైకిల్స్ (బుల్, బేర్) చూసిన ఫండ్ మేనేజర్ అయితే ఆ పథకం స్వల్ప కాలంలో వెనుకబడ్డా.. ఆ తర్వాత రాబడుల్లో మెరుగైన స్థానానికి తిరిగి చేరుకోగలదు. ఆయా సందర్భాల్లో నిపుణుల సూచనలూ తీసుకోవాలి.
లక్ష్యాలకు అనుకూలం
ఉదాహరణకు ఏటా 15 శాతం కాంపౌండెడ్ వార్షిక రాబడి (సీఏజీఆర్) ఆశించి ఒక ఫ్లెక్సీక్యాప్ పథకంలో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. అప్పుడు మీ పథకం గత మూడేళ్ల కాలంలో 20 శాతం సీఏజీఆర్ రాబడిని ఇచ్చింది. కానీ అదే కాలంలో 38 శాతం సీఏజీఆర్ రాబడిని ఇచ్చిన క్వాంట్ ఫ్లెక్సీక్యాప్ పథకం చూసి ఆందోళన చెందకూడదు. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం ఇచ్చిన 20 శాతం సీఏజీఆర్ రాబడి అనేది బీఎస్‌ఈ 500 రాబడి కంటే ఎక్కువ. పైగా మీరు ఆశించిన దానికి మించిన పనితీరును పథకం చూపించింది. కనుక పోర్ట్‌ఫోలియో కోసం ఎంపిక చేసుకున్న మ్యూచువల్ ఫండ్స్ అనుకున్న విధంగా మంచి పనితీరు చూపిస్తున్నప్పుడు.. ఇతర పథకాల పనితీరు చూసి వాటిని విక్రయించే నిర్ణయం తీసుకోవడం సరైనది అనిపించుకోదు. ఒక పథకం నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునే ముందు పాయింట్ టు పాయింట్ వాస్తవ రాబడులను చూడాలి. సరైన రాబడులు ఇస్తున్నప్పుడు ఆ పెట్టుబడిని ఏమీ చేయకుండా వదిలి పెట్టడమే మంచి నిర్ణయం అవుతుంది. మీ లక్ష్యాలకు, మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఫండ్ పనితీరు ఉందా, లేదా అన్నదే ముఖ్యం కానీ, మీరు ఇన్వెస్ట్ చేసిన పథకం టాప్‌లోనే ఉండాలని కోరుకోవద్దు.
చదవండి👉 ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు!
Comments
Please login to add a commentAdd a comment