ప్రభుత్వ ఉద్యోగి గానీ...ఈపీఎఫ్ చందాదారుడైన ప్రైవేటు కంపెనీ ఉద్యోగి గానీ పదవీ విరమణ చేసిన తర్వాత..నిర్దిష్టమైన మొత్తం పింఛన్ రూపంలో అందుతుంది. వారి జీవనానికి ఆసరా లభిస్తుంది. మరి అసంఘటిక రంగంలో ఉన్న వారి పరిస్థితి ఏమిటి..? సంపాదించే వయస్సు పూర్తయిన తర్వాత వారికి ఆసరా ఏమిటీ..? అందుకే కేంద్ర ప్రభుత్వం అలాంటి వారికోసమే అటల్‌పెన్షన్ యోజన (ఏపీవై) పథకం తీసుకువచ్చింది. ఈ సామాజిక భద్రత పథకంలో చేరిన వారికి ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తూ...అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ అందిస్తోంది.
అనంతపురం, రాయదుర్గం టౌన్: అటల్ పెన్షన్ యోజన... గతంలో ఉన్న స్వావలంబన యోజన స్థానంలో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అటల్ పెన్షన్ యోజనను పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో దీన్ని అమలు చేస్తున్నారు.
అటల్ పెన్షన్ యోజనకు అర్హత (ఏపీవై)
అటల్ పెన్షన్ యోజనకు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉన్న భారతీయ పౌరులు అర్హులు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తికి బ్యాంకు లేదా పొదుపు ఖాతా ఉండాలి.
చెల్లింపులు ఇలా...
ఏపీవై చందాను ఈ పథకం లబ్ధిదారుడికి ఖాతా నుంచి నిర్ణీత తేదీన బ్యాంకులు విత్‌డ్రా చేస్తాయి. ఈ పథకం ప్రీమియం నెలవారీ/త్రైమాసిక/అర్ధ సంవత్సరం/వార్షిక చెల్లింపు చేయవచ్చు. చెల్లింపు తేదీకి చందా మొత్తానికి సరిపడే నగదు సంబంధిత వ్యక్తి పొదుపు ఖాతాలో ఉంచాలి.
రూ. 5 వేల వరకు పెన్షన్
లబ్ధిదారుడు చెల్లించే ప్రీమియాన్ని బట్టి రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ వస్తుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి 60 సంవత్సరాల నుంచి నెలకు రూ.వెయ్యి పెన్షన్ కోరుకుంటే ప్రతి నెల రూ.42 చొప్పున 42 సంవత్సరాల పాటు చెల్లించాల్సి ఉంటుంది. అదే రూ.2 వేలు పెన్షన్ కావాలనుకుంటే ప్రతి నెల రూ.84 చెల్లించాలి. రూ. 3 వేలు కావాలనుకుంటే రూ.126, రూ. 4 వేలు కావాలనుకుంటే రూ.168, రూ. 5 వేలు కావాలనుకుంటే రూ.210 చొప్పున నెల వారీ చందా చెల్లించాలి.
ఏపీవై నుంచి నిష్క్రమణ
సాధారణ సందర్భాల్లో ఈ పథకం నుంచి వైదొలగడానికి అవకాశం లేదు. చందాదారుడు మరణించినా..లేదా మరణానికి దారి తీసే వ్యాధికి గురైనప్పుడు మాత్రమే ఈ పథకం నుంచి వైదొలడానికి అవకాశం ఇస్తారు.
ఆదాయ పన్ను ప్రయోజనం
ఈ పెన్షన్ పథకంలో ఉన్న వారికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)కు ఉన్న ఆదాయ పన్ను ప్రయోజనాలే వర్తిస్థాయి. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీసీడీ(బీ1) కింద ఇది పొందవచ్చు. 2018 నాటికి ఈ పెన్షన్ కింద ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి రూ. 50 వేలుగా నిర్ణయించారు.
చందా చెల్లింపులో విఫలమైతే
ఈ పథకానికి చందా చెల్లింపులో విఫలమైతే రూ.100 చందాకు నెలకు ఒక రూపాయి జరిమానా ఉంటుంది. రూ.101 నుంచి రూ.500 చందాకు రూ.2లు జరిమానా, రూ.501 నుంచి రూ.1000 చందాకు రూ.5లు, రూ.1000 పైబడిన చందా మొత్తానికి నెలకు రూ.10 చొప్పున జరిమానా వసూలు చేస్తారు. వరుసగా ఆరు నెలలు చందా చెల్లించకపోతే ఆ పింఛను ఖాతాను స్తంభింపచేస్తారు. 12 నెలలు దాటితే ఖాతా డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల తర్వాత ఖాతాను మూసివేస్తారు.
ఐదేళ్ల పాటు ప్రభుత్వ వాటా
ఎలాంటి సామాజిక భద్రత పథకాల్లో సభ్యులు కాని వారు. ఈపీఎఫ్ వంటి స్కీములో లేనివారు, అవ్యవస్థీకృత రంగంలోని వారికి వార్షిక చందాలో సగం లేదా రూ.వెయ్యి ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు అందిస్తుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి రూ.5 వేల పెన్షన్ కోసం నెలనెలా రూ.210 చెల్లించినట్లయితే ఏడాదికి ఇది రూ.2,520 అవుతుంది. ఇందులో సగం వాటా అంటే రూ.1230... దీనికంటే రూ.వెయ్యి తక్కువ గనుక అంత మేర ప్రభుత్వం తన వాటా కింద ఏటా పింఛన్ జమ చేస్తుంది.
60 ఏళ్ల వయస్సు రాగానే
ఎంపిక చేసుకున్న ఆప్షన్ ప్రకార నెలనెల పెన్షన్ అందుతుంది. అయితే అప్పటి వరకు సమకూరిన పెట్టుబడులను వెనక్కి ఇవ్వరు. దానిపై వడ్డీ పింఛన్‌గా అందిస్తారు. చందాదారుడు లేదా అతని భాగస్వామి జీవించి ఉన్నంత వరకు పింఛను అందుతుంది. 60 ఏళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల్లో పింఛనుదారుడు మరణిస్తే జీవిత భాగస్వామికి నెలనెల పెన్షన్ అందిస్తారు. దంపతులిద్దరూ మరణిస్తే వారికి నామినీకి కార్పస్ మొత్తాన్ని ఇచ్చేస్తారు. రూ.1000 పింఛను చందాదారుల కార్పస్ 60 ఏళ్లు వచ్చే సరికి రూ.1.7 లక్షలకు చేరుతుంది. అదే రూ.2 వేలు పింఛను అందుకునే వారికి కార్పస్ రూ.3.4 లక్షలు, రూ. 3 వేలు పెన్షన్ వారికి కార్పస్ రూ.5.1 లక్షలు, రూ. 4 వేలు పెన్షన్ అందుకునే వారికి కార్పస్ రూ.6.8 లక్షలు, రూ.5 వేలు పెన్షన్ అందుకునే వారికి కార్పస్ç ఫండ్ రూ.8.5 లక్షలు ఉంటుంది. మరణానంతరం నామినీలకు ఈ మొత్తాన్ని అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment