హ్యాపీగా రిటైర్ అయిపోదాం!! | insurance company retirement plan, Atal Pension Yojana retirement schemes | Sakshi
Sakshi News home page

హ్యాపీగా రిటైర్ అయిపోదాం!!

Published Mon, Oct 10 2016 12:41 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM

హ్యాపీగా రిటైర్ అయిపోదాం!!

హ్యాపీగా రిటైర్ అయిపోదాం!!

స్థిరమైన ఆదాయాన్నిచ్చేందుకు రకరకాల ప్లాన్లు  
కాస్త ముందు నుంచే పెట్టుబడి పెడితే ఉత్తమం
రిటైరయ్యేదాకా విత్‌డ్రా చేయకపోతే కావలసినంత నిధి

అత్యధిక శాతం మంది ప్రైవేటు ఉద్యోగాల్లోనో... స్వయం ఉపాధి మీదో బతుకుతున్న మన దేశంలో రిటైర్మెంట్‌కు ఉండే ప్రాధాన్యం మామూలుది కాదు. ఎందుకంటే ప్రైవేటు ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నుంచి పింఛను వచ్చే అవకాశం ఉన్నా... అది ఏ మూలకూ సరిపోదు. ఇక కంపెనీలైతే పెన్షన్ ఇవ్వవు. మరేంటి దారి? చాలా మందికి ఇదే సమస్య. ఉద్యోగం చేసినన్నాళ్లూ హాయిగా గడిపేసిన తాము... రిటైర్మెంట్ తరవాత పిల్లలపై ఆధారపడాలంటే వారికి సుతరామూ ఇష్టం ఉండదు. కొందరికి పిల్లలపై ఆధారపడే అవకాశమూ ఉండదు. ఇలాంటి వారు చేయాల్సింది ఒక్కటే!!. ముందుచూపుతో పెట్టుబడులు పెట్టాలి. వయసు పెరిగిన తరవాత వైద్య ఖర్చుల వంటివి కూడా జత అవుతాయి కనక... వీటికి తగ్గట్టు రిటైరీలకు తగిన ఆదాయాన్నిచ్చే మార్గాలేమైనా ఉన్నాయా? అవిచ్చే రాబడులేంటి? వాటిపై పన్నులెంత ఉంటాయి? ఈ వివరాలన్నీ తెలియజేసేదే ‘సాక్షి ప్రాఫిట్’ ప్రత్యేక కథనం...  - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం

రిటైర్మెంట్ పథకాలు ప్రధానంగా రెండు రకాలు. ఈపీఎఫ్, పీపీఎఫ్. పన్ను ఆదా బాండ్ల వంటి గ్యారంటీగా రాబడులనిచ్చేవి ఒక రకం. నేషనల్ పెన్షన్ సిస్టమ్, రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్, బీమా సంస్థలు ఆఫర్ చేసే రిటైర్మెంట్ ప్లాన్‌లు వంటి మార్కెట్ ఆధారిత పాలసీలు రెండో రకం. మన ఆదాయం, మనం భరించగలిగే రిస్క్, ఆర్థిక అవసరాలు, మనం పనిచేసే ఉద్యోగం/స్వయం ఉపాధి వంటి అంశాల ఆధారంగా ఏ ఏ ప్లాన్‌లలో ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించుకోవాలి. అయితే మార్కెట్ ఆధారిత ప్లాన్‌లు, గ్యారంటీడ్ ప్లాన్‌లలో సమతూకంతో ఇన్వెస్ట్ చేస్తే చక్కని ప్రయోజనాలు పొందవచ్చన్నది నిపుణుల సలహా.

ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్(ఈపీఎఫ్)...
వేతన జీవులకు తప్పనిసరి రిటైర్మెంట్ ఫండ్ సాధనం ఇది. ఉద్యోగి ప్రతినెలా మూలవేతనం, డీఏ కలిపితే వచ్చే మొత్తంలో 12 శాతాన్ని ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలో డిపాజిట్ చేస్తారు. నెలకు రూ.15,000 వరకూ వేతనం పొందే ఉద్యోగులకు ఇది తప్పనిసరి. అంతకు మించిన వేతనం ఉండే ఉద్యోగుల విషయంలో ఇది ఆప్షనల్.  ఈ నిధిని ఈపీఎఫ్‌ఓ గానీ, కంపెనీకి చెందిన ట్రస్ట్ కానీ నిర్వహిస్తుంది.

రాబడులు: 8 శాతం రేంజ్‌లో ఉంటాయి.

పన్ను అంశాలు: పన్ను ప్రయోజనాల విషయంలో దీనిది అగ్రస్థానమే. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం ఏడాదికి రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. వడ్డీపై గానీ, విత్‌డ్రాయల్స్‌పై గానీ ఎలాంటి పన్ను పోటు ఉండదు.

విత్‌డ్రాయల్స్: 58 సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ వీటిని విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదు. అయితే ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, పెళ్లిళ్ల కోసం కొంత మొత్తంలో విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 

ప్లస్ పాయింట్లు: పన్ను నియమాలు సంతృప్తికరంగా ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు తీసుకొని ఖర్చు చేసే అలవాటున్నవారికి 58 సంవత్సరాల వరకూ ఉన్న లాకిన్ పీరియడ్ కళ్లెం వేస్తుంది.

మైనస్ పాయింట్లు: ప్రభుత్వం తరచూ  నిబంధనలు మారుస్తుండటం.

పన్ను రహిత బాండ్లు...
రిటైర్మెంట్ అవసరాల కోసం డిజైన్ చేయకపోయినా,  10/15/20 ఏళ్ల పాటు స్థిరమైన వడ్డీ రేటు లభిస్తుంది. ఈ పన్ను రహిత బాండ్ల గురించి ఏటా అప్పటి బడ్జెట్లో ఆర్థిక మంత్రి వెల్లడిస్తారు. ఆర్‌ఈసీ, ఎన్‌హెచ్‌ఏఐ, పీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, హడ్కో వంటి ప్రభుత్వ రంగ ఇన్‌ఫ్రా కంపెనీలు ఈ బాండ్లను జారీ చేస్తాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి 3-4 రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇష్యూని బట్టి క్రెడిట్ రిస్క్‌ను మీరే మదింపు చేసుకోవాలి. ప్రభుత్వ సెక్యూరిటీల రేట్లు అధిక స్థాయిలో ఉన్నప్పుడు పన్ను రహిత బాండ్లు రిటైర్మెంట్‌కు మంచి పోర్ట్‌ఫోలియో అని చెప్పవచ్చు.

 రాబడులు: సగటున 7-7.5% రేంజ్‌లో ఉంటాయి.

 పన్ను
ప్రయోజనాలు: మెచ్యూరిటీ వరకూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తే, ఆర్జించే వడ్డీపై  పన్ను రాయితీలు లభిస్తాయి. మెచ్యూరిటీపై కూడా పన్నులేమీ ఉండవు. ప్రారంభ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్ను రాయితీలు లభించవు. మార్కెట్ ద్వారా ఈ బాండ్ల నుంచి వైదొలిగితే మాత్రం 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

విత్‌డ్రాయల్స్: బాండ్ల కాలపరిమితి 10/15/20 ఏళ్లుగా ఉంటుంది. స్టాక్ ఎక్స్చేంజీల్లో ట్రేడవుతాయి. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్‌డ్రాయల్ చేసుకోవచ్చు. 

ప్లస్ పాయింట్లు: క్రెడిట్ రిస్క్‌ను తగ్గించుకోవాలంటే ట్రిపుల్ ఏ రేటింగ్ ఉన్న బాండ్లలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఈ పన్ను రహిత బాండ్ల ద్వారా ఏటా వచ్చే వడ్డీని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తే  రాబడులు వస్తాయి.

మైనస్ పాయింట్లు: ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని రోజులే అందుబాటులో ఉంటాయి. ఏ బాండ్లలో ఇన్వెస్ట్ చేయాలో నిర్ణయించడానికి కొంత హోమ్‌వర్క్ చేయాలి. వీటికి సావరిన్ గ్యారంటీ ఉండదు. స్టాక్ ఎక్స్చేంజీల్లో ఈ బాండ్లు ట్రేడవుతాయి. కానీ లావాదేవీలు స్వల్పంగా ఉంటాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
పోస్టాఫీసుల్లో కానీ, ఎంపిక చేసిన బ్యాంకుల్లో కానీ రూ.100తో ఈ ఖాతాను తెరవవచ్చు. ఏడాదికి కనీ సంగా రూ.500, గరిష్టంగా రూ.లక్షన్నర వరకూ ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ కాలం 15 సంవత్సరాలు. తర్వాత ఐదేళ్ల కాలానికి పొడిగించుకునే వెసులుబాటు  ఉంది.

రాబడులు: ప్రతి మూడు నెలలకొకసారి వడ్డీరేట్లను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 8.1 శాతంగా ఉంది. భవిష్యత్తులో తగ్గే అవకాశాలున్నాయి.

పన్ను ప్రయోజనాలు: ఈపీఎఫ్‌కు వర్తించే పన్ను ప్రయోజనాలే దీనికీ వర్తిస్తాయి.

విత్‌డ్రాయల్స్: ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి ఏడవ ఆర్థిక సంవత్సరం నుంచి పాక్షిక విత్‌డ్రాయల్స్‌ను అనుమతిస్తారు. విత్‌డ్రాయల్ చేసుకుంటున్న ఏడాదికి ముందున్న బ్యాలెన్స్‌లో సగం వరకూ విత్‌డ్రా చేసుకోవచ్చు.

ప్లస్ పాయింట్లు: పన్ను నియమాలు ఓకే.
మైనస్ పాయింట్లు: మూడునెలలకొకసారి వడ్డీరేట్లను మార్చడం, ఒడిదుడుకులకు గురయ్యే ప్రభుత్వ సెక్యూరిటీలతో అనుసంధానించడం,

అటల్ పెన్షన్ యోజన
అసంఘటిత రంగంలోని వ్యక్తుల కోసం భారత ప్రభుత్వం గత ఏడాది అటల్ పెన్షన్ యోజనను ప్రవేశపెట్టింది. 18-40 ఏళ్లలోపు, ఆదాయపు పన్ను పరిధిలోకి రాని వ్యక్తులు అర్హులు. 60 ఏళ్లు వచ్చే వరకూ నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలకు రూ.1,000/2,000/3,000/ 4,000/.5,000 వరకూ పెన్షన్ పొందవచ్చు. వ్యక్తి చెల్లించే ప్రీమియమ్‌ను బట్టి ఈ పెన్షన్ ఉంటుంది. ఉదాహరణకు 18 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.42 చొప్పున 42 సంవత్సరాలు చెల్లిస్తే నెలకు రూ.1,000, రూ.210 చెల్లిస్తే రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. ప్రధాన మంత్రి జన ధన్ యోజన స్కీమ్ కింద ప్రారంభించిన బ్యాంక్ ఖాతాలతో ఈ స్కీమ్‌ను అనుసంధానిస్తారు. ఈ స్కీమ్‌ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ(పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్వహిస్తుంది.

మార్కెట్ ఆధారిత స్కీమ్‌లు... నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్)
మార్కెట్ అనుసంధానిత రిటైర్మెంట్ స్కీమ్ ఇది. ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి రూ.1,000.  ఈక్విటీలు, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఎం తెంత ఇన్వెస్ట్ చేయాలో(అసెట్ అలొకేషన్) మనమే నిర్దేశించవచ్చు. ఈక్విటీలకు గరిష్ట పరిమితి 50 శాతంగా నిర్దేశించారు. నెలవారీ పోర్ట్‌ఫోలియో వివరాల వెల్లడి, రోజువారీ ఎన్‌ఏవీ ఆధారంగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ట్రాక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. మీకు సంతృప్తికరంగా లేకపోతే, ఫండ్ మేనేజర్‌ను, లేదా అసెట్ అలొకేషన్‌ను మార్చుకోవచ్చు.

రాబడులు: మార్కెట్ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పటివరకైతే వివిధ కేటగిరీల మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే ఎన్‌పీఎస్ ప్లాన్‌లు మంచి రాబడులనే ఇచ్చాయని చెప్పొచ్చు.

పన్నులు: ప్రారంభ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి రూ. 2లక్షల వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. కానీ రాబడులపై పన్ను పోటు ఉంటుందని గుర్తించాలి. ఫైనల్ మెచ్యురిటీలో 40 శాతం వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. 40 శాతం సొమ్ములతో యాన్యుటీని (రిటైర్మెంట్ ప్లాన్స్‌ను) కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నెల వారీ ఆదాయంపై మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ని అనుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన 20 శాతం మీ ఆదాయానికి కలిపి పన్ను విధిస్తారు. మీరు కనుక అధిక పన్ను బ్రాకెట్లో ఉంటే మీకు పన్ను పోటు భారీగానే ఉంటుంది.

 విత్‌డ్రాయల్స్: ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రారంభించి పదేళ్లు పూర్తయితే 25 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంది. లేదంటే రిటైర్మెంట్ వయస్సు వరకూ మీ ఇన్వెస్ట్‌మెంట్స్ లాక్ అయి ఉంటాయి.

 ప్లస్ పాయింట్లు: వృత్తిగత ఫండ్ మేనేజర్లు దీనిని నిర్వహిస్తారు. వ్యయాలు తక్కువ.  0.25 శాతం లావాదేవీల, 0.01 శాతం ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజు ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో అయితే ఇది 2-3 శాతం రేంజ్‌లో ఉంటుంది. రాబడులు, వ్యయాలు, పారదర్శకత విషయంలో  ఇది మంచి స్కీమ్.

 మైనస్ పాయింట్లు:  తుది నిధుల వినియోగానికి సంబంధించి నియమనిబంధనలు సంతృప్తికరంగా లేవు. మెచ్యూరిటీలో  60 శాతం వరకూ మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

బీమా సంస్థల రిటైర్మెంట్ ప్లాన్‌లు
బీమా సంస్థలు ఆఫర్ చేసే రిటైర్మెంట్ ప్లాన్‌లు రెండు రకాలుగా ఉంటున్నాయి.

1.సంప్రదాయ/గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్‌లు
2. యులిప్‌లు
రెండు ప్లాన్‌ల్లో స్థిరమైన వార్షిక ప్రీమియమ్‌లు 5/10/15 ఏళ్ల టర్మ్ (లేదా  60 ఏళ్ల వయస్సు వచ్చేవరకూ) చెల్లించాల్సి ఉంటుంది.  మీరు రిటైరైన తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతుంది.

 రాబడులు: సంప్రదాయిక పెన్షన్ ప్లాన్‌లలో గ్యారంటీడ్ ఆడిషన్స్ లభిస్తాయి. వ్యయాలు అధికంగా ఉండడం వల్ల రాబడులు సగటున 4-6% రేంజ్‌లో ఉంటాయి. యులిప్‌లు కూడా అంతంత మాత్రం రాబడులనే ఇస్తాయి.  ప్రీమియమ్ అలొకేషన్, పాలసీ నిర్వహణ, ఫండ్ మేనేజ్‌మెంట్, యొర్టాలిటీ చార్జీలు తదితర ఖర్చులు అధికంగా ఉంటాయి.

 పన్నులు: ఈ ప్లాన్‌లకు చెల్లించిన ప్రీమియమ్‌లకు సెక్షన్ 80 సీసీసీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. మెచ్యూరిటీపై కూడా పన్నులుండవు. నెలా నెలా తీసుకునే యాన్యుటీపై మాత్రం పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

 విత్‌డ్రాయల్స్: సంప్రదాయ ప్లాన్‌ల్లో ముందస్తుగా ఎగ్జిట్ కావడం ఉండదు. సరెండర్ చేస్తే చార్జీలు అధికంగా ఉంటాయి. ఇక యులిప్‌ల విషయానికొస్తే, ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఐదేళ్ల తర్వాత సరెండర్ చేయవచ్చు. చార్జీలు స్వల్పంగా ఉంటాయి.

 ప్లస్ పాయింట్లు: ప్రీమియమ్‌కు పన్ను మినహాయింపులు లభిస్తాయి.

 మైనస్ పాయింట్లు: ఈ ప్లాన్‌ల్లో పెద్దమొత్తంలో పోగుపడిన మీ నిధిని విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఉండదు. ఈ మొత్తంలో మూడో వంతు మాత్రమే విత్‌డ్రా చేసుకునే వీలు ఉంది. మిగిలిన దాంతో యాన్యుటీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్
సెక్షన్ 80 సీ ప్రయోజనాలకనుగుణంగా ఉండేలా పలు మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ప్రత్యేక రిటైర్మెంట్ ఫండ్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. యుటిఐ రిటైర్మెంట్ బెనిఫిట్ యూనిట్ ప్లాన్, ఫ్రాంక్లిన్ ఇండియా పెన్షన్ ప్లాన్, రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ వంటి సీబీడీటీ -నోటిఫై చేసిన ఓపెన్ ఎండెడ్ ఫండ్స్‌లో ఏకమొత్తంలో గానీ, సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసి, రిటైర్మెంట్ నిధిని ఏర్పాటు చేసుకోవచ్చు.

 రాబడులు: ఈ ఫండ్స్ రాబడులు 10-15 శాతం రేంజ్‌లో ఉన్నాయి.

 పన్నులు: స్పెషల్ రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏడాదికి రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపులు లభిస్తాయి. సెక్షన్ 80సీ ప్రకారం. తుది విత్‌డ్రాయల్స్‌పై పన్నులు సాధారణ మ్యూచువల్ ఫండ్స్‌లాగానే ఉంటాయి. మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. డెట్ ఫండ్స్ అయితే 20 శాతం దీర్ఘకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

 విత్‌డ్రాయల్స్: వీటికి లాక్-ఇన్ పీరియడ్ ఐదేళ్లుగా ఉంటుంది. రిటైర్మెంట్ వయస్సుకు ముందే విత్‌డ్రా చేసుకుంటే, 1 శాతం ఎగ్జిట్ లోడ్ చెల్లించాల్సి ఉంటుంది. రిటైరైనప్పుడు ఏక మొత్తంలో సొమ్ములు తీసుకోవచ్చు. లేదా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ద్వారా సొమ్ములను విత్‌డ్రా చేసుకోవచ్చు.

 ప్లస్ పాయింట్లు: ఇతర మార్కెట్ అనుసంధానిత ప్లాన్‌లతో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ ప్లాన్‌లు ఆరోగ్యకరమైన రాబడులనిస్తాయి. లిక్విడీటీ మెరుగ్గా ఉంటుంది. పన్నులు కూడా తక్కువ. మీకు ఇష్టంవచ్చిన రీతిగా మీ సొమ్ములను వాడుకునే వీలుంటుంది.

 మైనస్ పాయింట్లు: ఎన్‌పీఎస్‌తో పోల్చితే వ్యయాలు, ఫీజులు అధికంగా 2.5-3% ఉండడం, కొత్త ప్లాన్‌ల గురించి అంచనాకు రావడానికి ట్రాక్ రికార్డ్ ఉండకపోవడం.

ఈ విషయాలు గమనించండి
ఆరోగ్యకరమైన రిటైర్మెంట్ నిధి ఏర్పాటు చేయాలంటే.

వీలైనంత చిన్న వయసులోనే రిటైర్మెంట్ కోసం మదుపు చేయడం ప్రారంభించండి. ఇలా చేస్తే చక్రవడ్డీ ప్రభావంతో అధిక రాబడులు పొందవచ్చు.

ఇన్వెస్ట్‌మెంట్ విషయాల్లో క్రమశిక్షణను పాటించాలి.  60 ఏళ్లు వచ్చే వరకూ తప్పనిసరి అయితే తప్ప ఒక్క పైసా కూడా తీసుకోకూడదు.

ఒక వేళ మీరు ఉద్యోగస్తులైతే సింహభాగం ఈపీఎఫ్‌కు కేటాయించండి. మీ రిటైర్మెంట్ నిధుల్లో దాదాపు 70 శాతం దానికే కేటాయించండి.

ఆ ఏడాది బడ్జెట్‌ను నిశితంగా పరిశీలించండి. పన్ను రహిత బాండ్ల గురించి ప్రకటనలు ఉన్నట్టైతే, పీపీఎఫ్‌కు తక్కువ మొత్తం కేటాయించండి. పన్ను రహిత బాండ్ల కోసం కేటాయించిన మొత్తాన్ని లిక్విడ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి.  పన్ను రహిత బాండ్లు ఓపెన్ కాగానే వాటికి ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను బదలాయించండి.  ఒక వేళ పన్ను రహిత బాండ్ల ప్రస్తావన లేకుంటే, పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయండి.

{దవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులనిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయండి.

రాబడులు, ఇన్వెస్ట్‌మెంట్స్‌పై పన్నుల విషయమై అవగాహన పెంచుకోండి.

ఈపీఎఫ్ అవకాశం మీకు లేకుంటే, పీపీఎఫ్, పన్ను రహిత బాండ్లలలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి.

మీ ఇన్వెస్ట్‌మెంట్స్ రాబడులు తీరు గమనించండి. కనీసం మూడు నెలలకొకసారైనా మదింపు చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement