న్యూఢిల్లీ: గత ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం కేసులో దాదాపు రెండు కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ట్రిబ్యూనల్ ఆదేశించింది. రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను మృతుడి తల్లిదండ్రులకు 30 రోజుల్లోగా ఇవ్వాలని ఆదేశించింది.
వివరాలు 2016 ఏప్రిల్ 4న ఢిల్లీలో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. సివిల్స్ లైన్ ప్రాంతంలో ఓ మైనర్ బాలుడు నిర్లక్ష్యంగా మెర్సిడెస్ బెంజ్ కారు నడపడంతో రోడ్డు దాటుతున్న 32 ఏళ్ల సిద్ధార్థ్ శర్మ అనే వ్యక్తి మరణించాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సిద్ధార్థ్‌ను ఢీకొట్టిన తర్వాత కారు ముందు టైర్ పగిలిపోవడంతో దూరంగా వెళ్లి ఆగిపోయింది. ఘటన అనంతరం నిందితుడైన మైనర్ కారును అక్కడే వదిలి తన స్నేహితులతో కలిసి పారిపోయాడు.
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు తేల్చారు. కారు ఢీకొన్న సమయంలో సిద్ధార్థ్ 20 అడుగుల దూరంలో ఎగిరిపడినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. తాజాగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యూనల్ బాధతుడైన సిద్ధార్థ శర్మ తల్లిదండ్రులకు రూ.1.21 కోట్లను పరిహారంగా, 77.61 లక్షలను వడ్డీ రూపంలో.. మొత్తం రూ. 1.98 కోట్లను 30 రోజుల్లోగా ఇవ్వాలని ఇన్సూరెన్స్ కంపెనీని ఆదేశించింది.
అంతేగాక కారు రిజిస్ట్రేషన్ చేసిన మైనర్ తండ్రి నుంచి పరిహారం మొత్తాన్ని రికవరీ చేసుకునేదుకు బీమా కంపెనీకి కోర్టు అనుమతినిచ్చింది. మైనర్ కుమారుడిని మెర్సిడెస్ కారు నడుపడం అడ్డుకోవడంలో తండ్రి విఫలమైనట్లు చెబుతూ అతన్ని కూడా బాధ్యులుగా ట్రిబ్యునల్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment