సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ, అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ)కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నందుకుగాను ఎఫ్‌డీసీకి జర్మనీ ఫారెస్ట్ స్టీవర్డ్ కౌన్సిల్ సర్టిఫికెట్ దక్కింది. సేంద్రియ పద్ధతిలో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి లాంటి అటవీ ఉత్పత్తు(ముడిసరుకు)ల నుంచి తయారయ్యే వస్తువులకు ఐదేళ్లపాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్‌డీసీకి కౌన్సిల్ అనుమతినిచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో యూకలిప్టస్, వెదురు, టేకు, జీడిమామిడి చెట్లను ఉన్నత ప్రమాణాలతో సాగు చేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. అయితే కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్లలో సుమారు 45 వేల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటకు ఈ గుర్తింపు దక్కిందని అటవీ అభివృద్ధి సంస్థ అధికారులు మంత్రికి వివరించారు.
దీనివల్ల అంతర్జాతీయంగా ఎఫ్‌డీసీ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందని, ఐకియా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లకు జర్మన్ కౌన్సిల్ ధ్రువీకరించిన కలపను విక్రయించే అవకాశం దక్కిందని వెల్లడించారు. ఐదేళ్లలో రూ.10 కోట్ల అదనపు ప్రయోజనం కలగనుందని, కంపోజిట్ వుడ్‌పేపర్, ప్యాకింగ్ పరిశ్రమల కోసం ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు అధికధర లభిస్తుందన్నారు. అటవీ ఉత్పత్తుల నుంచి చేసిన కాగితం, టెట్రాప్యాక్, మిశ్రమ కలపకు ఎఫ్‌ఎస్సీ ఆమోదం లభించిందని తెలియజేశారు.
గుర్తింపు రావడం గొప్ప విషయం: మంత్రి
అరణ్యభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశంలో భాగంగా ఇలాంటి గుర్తింపు రావడం గొప్ప విషయమన్నారు. మెరుగైన పద్ధతుల్లో సాగు చేస్తుండటం వల్ల మన అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌తోపాటు 30 శాతం రెవెన్యూ పెరిగిందని తెలిపారు.
భవిష్యత్‌లో అటవీ ఉత్పత్తులను మరింత పెంచుకుని, వీటితో వచ్చిన ఆదాయంతో అడవుల సంరక్షణకు మరిన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్ ఆర్.యం.డొబ్రియల్, అటవీ శాఖ అదనపు కార్యదర్శి ఎం. ప్రశాంతి, ఎఫ్‌డీసీ వైస్ చైర్మన్, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు పీసీసీఎఫ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment