ప్రపంచ ప్రముఖ ప్రదేశాల లిస్టులో ‘మనం’ చాక్లెట్
ఇటీవల జాబితా విడుదల చేసిన టైమ్ మ్యాగజైన్
స్వదేశీ చాక్లెట్లకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా కృషి
సాక్షి, సిటీబ్యూరో: మీకు చాక్లెట్లంటే ఇష్టమా..? అసలు చాక్లెట్లు చూస్తేనే నోరూరుతుందా..? డిఫరెంట్ చాక్లెట్లను టేస్ట్ చేయడం మీకు అలవాటా? అయితే మీరు తప్పకుండా నగరంలోని ‘మనం’ చాక్లెట్ కార్ఖానాను ఒక్కసారైనా సందర్శించాల్సిందే. ఎందుకంటే ఇక్కడ దాదాపు 60కి పైగా వెరైటీ చాక్లెట్లు నోరూరిస్తుంటాయి. ఒకే దగ్గర పెరిగిన కోకో చెట్ల నుంచి తయారైన చాక్లెట్లను వీరు విక్రయిస్తున్నారు.
టైమ్ మ్యాగజైన్ జాబితాలో చోటు..
ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ ‘ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల’ జాబితాను ప్రచురించింది. ఆయా రంగాలతో పాటు ప్రపంచంలో ప్రత్యేకంగా నిలిచే 100 అద్భుతమైన ప్రదేశాలు, కంపెనీలను ఇందులో చేర్చింది. హోటళ్లు, క్రూజ్‌లు, రెస్టారెంట్స్, పర్యాటక స్థలాలు, మ్యూజియాలు, పార్క్‌లను గుర్తించింది. పలు మార్గాల్లో స్వదేశీ పదార్థాలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు మనం చాక్లెట్ కార్ఖానా పనిచేస్తోందని కొనియాడింది.
అంతర్జాతీయ గుర్తింపు..
భారత్‌లో పండించిన కోకోతో చాక్లెట్ల తయారీకి ‘మనం చాక్లెట్’ ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఇక్కడ తయారైన చాక్లెట్లకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. 2023 ఆగస్టులో మనం చాక్లెట్ కార్ఖానాను ముప్పల చైతన్య స్థాపించారు. ఆల్మండ్ హౌజ్ మిఠాయి దుకాణం వీరి కుటుంబానికి చెందినది కావడం విశేషం.
ఎన్నో రకాల వెరైటీలు..
డార్క్ చాక్లెట్లు, చాక్లెట్ ట్యాబ్లెట్స్, స్నాక్స్, ఒకే ప్రదేశంలో పండించినవి, అంతర్జాతీయంగా పండించిన కోకో నుంచి తయారైనవి, పాల మిశ్రమంతో చేసినవి ఇలా ఎన్నో రకాల వెరైటీ చాక్లెట్లు ఈ కార్ఖానాలో లభిస్తుంటాయి. పండ్లు, ప్లేన్, వీగన్ వంటి చాక్లెట్ల రకాలు కూడా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన పది రకాల చాక్లెట్లను అవార్డులు కూడా వరించాయి.
వర్క్‌షాప్స్‌తో పిల్లలకు నేరి్పస్తూ..
చాక్లెట్ల తయారీలో మనం చాక్లెట్ కార్ఖానా అప్పుడప్పుడూ వర్క్‌షాప్స్ కూడా నిర్వహిస్తుంటుంది. సొంతంగా క్లస్టర్లు, కేక్ పాప్స్ తయారు చేసే విషయంలో పిల్లలకు శిక్షణ కూడా ఇస్తుంటుంది. కొన్నిసార్లు అసలు చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో తెలుసుకునేలా టూర్ కూడా ఏర్పాటు చేస్తుంటారు. చాక్లెట్ కుకీస్, చాక్లెట్ ఇంక్లూజన్ స్లాబ్స్ తయారీలో 5–10 ఏళ్ల పిల్లలకు మెళకువలు నేర్పిస్తుంటారు.
ఇవి చదవండి: అంతా స్మార్ట్.. ఆరోగ్యంపై ముందస్తు సమాచారం!
Comments
Please login to add a commentAdd a comment