దామగుండం... గత పక్షం రోజులుగా తెలంగాణలో ఈ పేరు కలకలం రేపుతోంది. విశ్వనగరం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రక్షిత అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత నావికాదళానికిసంబంధించి ‘లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్’ను నిర్మించడానికి 2900 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ అటవీభూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు.
2007లోనే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం భారత నావికా దళం అధికారులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లారు. అయితే అటవీ భూముల బదలాయింపులకు కావలసిన గ్రామ సభలు, పంచా యతీ తీర్మానాలు వంటి ప్రక్రియలన్నీ గత పదేళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటు న్నారు. అయితే పర్యావరణ ప్రేమి కులు వేసిన ప్రజావాజ్యాలతో కోర్టులో స్టే ఉండడంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు.
కాగా గత జన వరి 24న రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు వెలుగులోకి తేవడంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘ టితం అవుతున్నారు.
దామగుండం సముద్ర తీరప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీభూమిని నావికా దళానికి అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.
అటవీప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60 వేల మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేల కూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింకలు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్ గాయ్, అడవిపందులు, పెద్ద కొమ్ముల సాంబార్ జింకలు, చింకారా జాతిజింకల వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి.
దీనితో పాటు ఈ రాడార్ స్టేషన్ వలన వెలువడే రేడియేషన్ ప్రభావంతో చుట్టుప్రక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సొమాటిక్ లక్షణాలు, ఆందోళన, నిద్ర లేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం, ఎలక్ట్రికల్ షాక్ వంటి సమ స్యలు పొంచివున్నాయి.
దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్ అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి, నల్లగొండ జిల్లా వజీరాబాద్ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల మూసీ నదీ పరివాహక ప్రాంతానికి, ఆ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది.
ఈ దామగుండం అటవీప్రాంతం విశ్వనగరం హైదరాబాద్‌కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలోఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్ వనరులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్న అడవులే. ఇప్పుడు 2,900 ఎకరాలలో పచ్చదనం కోల్పోవడం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్ సిలిండర్ తీసివేస్తున్నట్లే!
ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరి జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆ యా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మా నాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పుడీ దామగుండం పరిరక్షణ పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరియైన దిశానిర్దేశం చేయా ల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపై ఎంతైనా ఉంది.
– మోతె రవికాంత్ ‘ సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment