శోభను అభినందిస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ హోదాలో ఆమె రెండేళ్లపాటు కొనసాగుతారని సీఎస్ సోమేశ్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖల్లో ఇలాంటి నియామకం ఇదే తొలిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కాగా, పదవీ విరమణ సందర్భంగా అరణ్యభవన్‌లో పువ్వులతో అలంకరించిన జీప్‌లో శోభను నిలుచోబెట్టి అటవీశాఖ అధికారులు, సిబ్బంది తాళ్లతో లాగి ఆమెకు వీడ్కోలు పలికారు.
అంతకు ముందు జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో శోభను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్‌గా నియమితులైన ఆర్‌ఎం డోబ్రియల్ తదితరులు అభినందించారు. అడవులతో, అటవీశాఖతో ఎంతో అనుబంధమున్న శోభ సేవలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని, సలహాదారు రూపంలో ఆమె సేవలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు.
అటవీశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, పీసీసీఎఫ్‌గా బాధ్యతలు నిర్వహించడం ద్వారా శాఖలో అనేక మార్పులకు తాను కారణం కావడం గర్వంగా ఉందని శోభ పేర్కొన్నారు. అటవీ శాఖలో ఆమె అందించిన సహకారం మరువలేనిదని, అనేక అంశాల్లో తమను ప్రోత్సహించారని డోబ్రియల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment