government advisers
-
ప్రభుత్వ సలహాదారుగా శోభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ హోదాలో ఆమె రెండేళ్లపాటు కొనసాగుతారని సీఎస్ సోమేశ్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖల్లో ఇలాంటి నియామకం ఇదే తొలిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కాగా, పదవీ విరమణ సందర్భంగా అరణ్యభవన్‌లో పువ్వులతో అలంకరించిన జీప్‌లో శోభను నిలుచోబెట్టి అటవీశాఖ అధికారులు, సిబ్బంది తాళ్లతో లాగి ఆమెకు వీడ్కోలు పలికారు. అంతకు ముందు జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో శోభను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్‌గా నియమితులైన ఆర్ఎం డోబ్రియల్ తదితరులు అభినందించారు. అడవులతో, అటవీశాఖతో ఎంతో అనుబంధమున్న శోభ సేవలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని, సలహాదారు రూపంలో ఆమె సేవలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. అటవీశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, పీసీసీఎఫ్‌గా బాధ్యతలు నిర్వహించడం ద్వారా శాఖలో అనేక మార్పులకు తాను కారణం కావడం గర్వంగా ఉందని శోభ పేర్కొన్నారు. అటవీ శాఖలో ఆమె అందించిన సహకారం మరువలేనిదని, అనేక అంశాల్లో తమను ప్రోత్సహించారని డోబ్రియల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు. -
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి
సాక్షి, అమరావతి: రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞడు, ప్రఖ్యాత వైద్యుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (సమగ్ర క్యాన్సర్ సంరక్షణ)గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన్ని కేబినెట్ హోదాలో రెండు సంవత్సరాల పదవీకాలంతో సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మంగళవారం సీఎం వైఎస్ జగన్‌ను కలిసి సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని ముఖ్యమంత్రి కోరిన విషయం విదితమే. రేడియేషన్ ఆంకాలజీలో దేశంలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడుకు 43 ఏళ్ల అనుభవం ఉంది. బ్రెస్ట్ సెంటర్, గైనకాలజిక్ ఆంకాలజీ, హెడ్, మెడ, న్యూరో ఆంకాలజీ, థొరాసిక్ ప్రోగ్రాంల కోసం కొత్త టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నిక్లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. న్యూయార్క్ హాస్పిటల్ క్వీన్స్‌లో ఆంకాలజీలో ప్రతి సబ్ స్పెషాలిటీలో ట్యూమర్ కాన్ఫరెన్స్‌లను ప్రారంభించారు. వైద్యరంగంలో ఆయన చేసిన కృషికి 2015లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఆయన సాధించిన విజయాలను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. -
ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్
సాక్షి, అమరావతి: న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. తర్వాత నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్ మంత్రి హోదాలో న్యూఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా ఆదిత్యనాథ్ దాస్ పనిచేయనున్నారని జీఏడీ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఉత్తర్వుల్లో తెలిపారు. -
సలహాదారులకు కేబినేట్ హోదాపై విచారణ
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులకు కేబినెట్ హోదా ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రేవంత్ రెడ్డి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. కేబినెట్ హోదాలో నియమించిన వారికి ఎలాంటి అర్హతలు లేవని , దీనివల్ల వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది ప్రధాన న్యాయమూర్తి ఎదుట వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలు కాదు కాబట్టి వీరి అధికారాలు అర్హతలు తెలపాలంటూ తెలంగాణ అడ్వకేట్ జనరల్‌ను ప్రధాన న్యాయమూర్తి కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి కేసు విచారణను వచ్చేవారానికి వాయిదా వేశారు. -
వారికి కేబినెట్ హోదా తగదు
• ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లపై రేవంత్ • హైకోర్టులో పిల్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, బాలకిషన్, విద్యా సాగర్‌రావు, ఎ.కె.గోయల్, ఎ.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జి.ఆర్. రెడ్డి, దేవులపల్లి ప్రభాకరరావు, పేర్వారం రాములు, కె.ఎం.సహానీ, డాక్టర్ వేణుగో పాలాచారి, రామచంద్రుడు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పిడమర్తి రవి, జి.వివేకానంద, వి.ప్రశాంత్‌రెడ్డి,కొప్పుల ఈశ్వర్‌ను ప్రతివాదులు గా చేర్చారు. 15 శాతానికి మించరాదు... ప్రభుత్వం తమకు కావల్సిన వారికి కేబినెట్ హోదా కల్పించిం దని, ఇది రాజ్యాంగంలోని అధికరణ 164 (1ఎ)కు విరుద్ధమని రేవంత్ పేర్కొన్నారు. ఈ అధికరణ ప్రకారం మొత్తం సభ్యుల్లో కేబినెట్ మంత్రుల సంఖ్య 15 శాతానికి మించకూడదన్నారు. కేబినెట్ హోదాతో సలహాదారులను నియమించే అధికారం ప్రభుత్వానికి లేదన్నా రు. రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ 2న విద్యాసాగర్‌రావుతో సహా ఆరుగురిని ప్రభుత్వ సలహాదారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నా రు. తాను లేవనెత్తిన అంశాలను పరిగణ నలోకి తీసుకుని.. కేబినెట్ హోదా జీవోలను రద్దు చేయాలని రేవంత్ తన పిటిషన్లో కోర్టును కోరారు. -
సలహాదారుల పదవీకాలం ఏడాది పొడిగింపు
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆర్.విద్యాసాగర్‌రావు (నీటిపారుదల), ఏకే గోయల్(ప్రణాళిక, ఇంధన), ఏ.రామలక్ష్మణ్ (సంక్షేమం), బి.వి.పాపారావు (విధాన నిర్ణయాలు, సంస్థాగత అభివృద్ధి), కేవీ రమణాచారి (సాంస్కృతిక పర్యాటక, యువజన, మీడియా విభాగాలు), జీఆర్‌రెడ్డి (ఆర్థిక శాఖ) సలహాదారులుగా ఉన్నారు. ఈ ఆరుగురు సలహాదారులు మరో ఏడాది పాటు ఈ పదవిలోనే కొనసాగుతారు. -
ప్రభుత్వ సలహాదారులకు శాఖల కేటాయింపు!
హైదరాబాద్: ప్రభుత్వ సలహాదారులుగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ప్రభుత్వ అధికారులకు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. ఆర్.విద్యాసాగరరావుకు నీటి పారుదలశాఖ కేటాయించగా, ఏకే.గోయల్ కు ప్రణాళిక, విద్యుత్‌శాఖ.. ఏ.రామ లక్ష్మణ్ కు సంక్షేమశాఖను, బీవీ పాపారావుకు విధానపరమైన విషయాలు, సంస్థాగత అభివృద్ధి శాఖలను, జీఆర్ రెడ్డి-ఆర్ధికశాఖ, కేవీ రమణాచారిలకుసంస్కృతి, పర్యాటకం, దేవాదాయ, యువజన, మీడియా వ్యవహారాల శాఖలను కేటాయించారు.