తొలిసారిగా బయోపాలిమర్ ఆధారిత సీడ్ కోటింగ్
భూమిలోని సూక్ష్మజీవులు,పోషకాలు నాశనమైన నేపథ్యంలో పరిశోధన
మొక్కల ఎదుగుదల, పంట దిగుబడి పెంచేందుకు ‘బయోపాలిమర్’దోహదం
శ్రీకర్, ఎదుక అగ్రిటెక్‌లతో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: రసాయన, పురుగు మందుల వ్యవసాయంతో భూమిలోని సూక్ష్మజీవులు, పోషకాలు నాశనమై జీవవైవిధ్యం కోల్పోయిన పరిస్థితుల్లో భారతీయ నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) సరికొత్త ఆవిష్కరణను మార్కెట్‌లోకి తీసుకొచి్చంది. మొక్కల పెరుగుదల, అధిక దిగుబడికి తోడ్పడేలా సూక్ష్మ పోషకాలు, క్రిమి, శిలీంధ్ర సంహారక మందులు విత్తనాలపై ప్రయోగించడానికి ఐసీఏఆర్–ఐఐఓఆర్ శాస్త్రవేత్తలు దేశంలో తొలిసారిగా బయోపాలిమర్ ఆధారిత సీడ్ కోటింగ్ విధానాన్ని అభివృద్ధి చేశారు.
ఈ నూతన ఆవిష్కరణకు పేటెంట్ లభించిన నేపథ్యంలో రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమానికి హాజరైన ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీఆర్.శర్మ, ఐఐఓఆర్ డైరెక్టర్ ఆర్‌కే.మాథూర్‌లతో శ్రీకర్ అగ్రిటెక్ సీఎండీ లింగా శ్రీనివాసరావు, యాదుకా అగ్రిటెక్ ఎండీ ఆదిత్యలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా బయో పాలిమర్‌తో లభించే ప్రయోజనాలను వివరించే ప్రదర్శన ఏర్పాటు చేశారు.
2015 నుంచి ప్రయోగాలు
ఇప్పటి వరకు విత్తనాలకు రసాయనాలతో కూడిన సింథటిక్ పాలిమర్‌తో సీడ్ కోటింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత ఆయా కంపెనీలు విత్తన ప్యాకెట్లను మార్కెట్లోకి తీసుకొచ్చేవి. అయితే సింథటిక్ పాలిమర్ కోటింగ్‌తో వచ్చిన విత్తనాలను రైతులు విత్తినా, సరైన ఎదుగుదల లేకపోవడం, దిగుబడి రాకపోవడాన్ని నూనెగింజల పరిశోధన సంస్థ (ఐఐఓఆర్) గుర్తించింది. సుమారు 60 ఏళ్లుగా సాగుతున్న రసాయన వ్యవసాయం వల్ల భూమి లో పోషకాలు, సూక్ష్మ జీవులు నశించిపోయాయని తేల్చారు. జీవవైవిధ్యం కోల్పోయి నిస్సారంగా మారిన భూమిని విత్తనాల ద్వారానే తిరిగి పునరుజ్జీవం చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. తద్వారా కనీసం 35 శాతం దిగుబడిని పెంచాలని భావించారు.
ఈ మేరకు ఐఐఓఆర్ ప్రధాన శాస్త్రవేత్త ఆర్‌డి.ప్రసాద్, మరో శాస్త్రవేత్త పూర్ణ చంద్రిక 2015లో బయోపాలిమర్ ఆధారిత కోటింగ్ విధానంపై ప్రయోగాలు ప్రారంభించారు. గత ఏడాది కొత్తగా బయోపాలిమర్‌ను ఆవిష్కరించిన వీరు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా పొందారు. ఈ బయోపాలిమర్‌ను వినియోగించి విత్తనాలను అభివృద్ధి చేసేందుకు శ్రీకర్ అగ్రిటెక్, యాదుక అగ్రిటెక్ ముందుకు రావడంతో ఆ సంస్థలతో కలిసి పనిచేశారు ఈ బయో పాలిమర్ ఆధారిత విత్తనాలు వచ్చే నెల నుంచి రైతులకు అందుబాటులోకి వస్తాయని శ్రీకర్ అగ్రిటెక్ సీఎండీ లింగా శ్రీనివాస్‌రావు తెలిపారు. వేరుశనగ, సన్‌ఫ్లవర్, కుసుమ, నువ్వులు వంటి నూనె గింజెలతోపాటు కందులు, శనగలు, వరి వంగడాలను కూడా ఈ బయోపాలిమర్ కోటింగ్ ద్వారా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రి ఇన్నోవేట్ ఇండియా సీఈవో ప్రవీణ్ మాలిక్, ఆర్‌ఏసీ చైర్మన్ ఎస్‌కే.రావు తదితర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment