నకిలీ పొటాష్‌ కలవరం..! | Fake Potash bags Caught in Prakasam | Sakshi
Sakshi News home page

నకిలీ పొటాష్‌ కలవరం..!

Published Fri, Jan 11 2019 11:36 AM | Last Updated on Fri, Jan 11 2019 11:36 AM

Fake Potash bags Caught in Prakasam - Sakshi

అసలు, నకిలీ పొటాష్‌ను నీటిలో పరీక్షలు చేస్తున్న అధికారుల బృందం

త్రిపురాంతకం/ ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో నకిలీ పొటాష్‌ వ్యవహారం కలవరం సృష్టిస్తోంది. వందల టన్నుల నకిలీ పొటాష్‌ నిల్వలు బయటపడుతుండటం రైతులను ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్నాయి. ఈ నకిలీ పొటాష్‌ అక్రమ నిల్వలు అటు జిల్లాలోని వ్యవసాయ శాఖ, విజిలెన్స్‌ అధికారుల పనితీరుకు దర్పంగా నిలిచింది. నకిలీ పొటాష్‌ కర్ణాటక రాష్ట్రం మైసూరు, బళ్ళారి ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా జిల్లాకు వచ్చినట్లు అధికారులు పరిశీలనలో తేలింది. పొటాష్‌ ఎరువు క్వింటా ధర రూ.950 ఉండటంతో రైతులు తక్కువ ధరకు వచ్చే నకిలీ పొటాష్‌ కొనుగోలు చేసి నిలువునా మోసపోయారు.  

కొనసాగుతున్న దాడులు
ఎరువుల దుకాణాల గోడౌన్‌లపై ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా దాడులను నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ ఏఎస్పీ రజనీ, వ్యవసాయశాఖ జేడీఏ శ్రీరామమూర్తి తెలిపారు. ప్రకాశం, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో ఈ నకిలీ పొటాష్‌ అమ్మకాలు భారీగా జరిగినట్లు గుర్తించారు. ఈ నకిలీ పొటాష్‌ కుంభకోణంలో రైతులు భారీగా నష్టపోయారు. తనిఖీల్లో నకిలీ పొటాష్‌ను విక్రయించిన త్రిపురాంతకంలోని సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, రాఘవేంద్ర ట్రేడర్స్‌ హోల్‌సేల్‌ డీలర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆరు షాపులపై కేసులు నమోదు చేసి ఎరువుల అమ్మకాలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 799 నకిలీ పొటాష్‌ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఐపీఎల్‌ కంపెనీ వారితో పాటు రసాయన పరీక్షల ద్వారా నిర్ధారించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో మార్కాపురం, దోర్నాల, చీరాల తదితర ప్రాంతాల్లో ఇప్పటికే దాడులు నిర్వహించామని తెలిపారు. గుంటూరు జిల్లాలో అమ్మకాలు జరుగుతున్న పొటాష్‌ను ముందుగా గుర్తించడంతో అక్కడ డీలర్లు త్రిపురాంతకం నుంచి సరఫరా అయినట్లు నిర్ధారించారని, దీంతో ఈ ప్రాంతంలో దాడులు చేసినట్లు పేర్కొన్నారు.  ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురంలో ఈ అమ్మకాలు జరగడంతో విజిలెన్స్‌ డీజీ ఆదేశాల మేరకు అన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని వివరించారు. ఈ పొటాష్‌ కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌ ప్రాంతం నుంచి సరఫరా అవుతున్నట్లు విచారణలో తెలిసిందని, వ్యవసాయ శాఖ కమిషనర్‌ ద్వారా ఆ రాష్ట్ర కమిషనర్‌తో చర్చించినట్లు అధికారులు తెలిపారు.నకిలీ పొటాష్‌ సరఫరా చేసిన వారి వివరాలు విచారణలో తేలుతాయన్నారు. దాడుల్లో విజిలెన్స్‌ సీఐలు బీటీ నాయక్, భూషణంలు, జాని, ఉమాపతి, ఏడీఏ సుదర్శనరాజు ,ఏఓ బాలాజీనాయక్, జవహర్‌   ఉన్నారు.

 పెద్దల ప్రమేయంపై విమర్శలు
నకిలీ పొటాష్‌ ఎరువుల వ్యవహారంలో వ్యవసాయ శాఖ అధికారులపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎరువులు, పురుగుమందుల దుకాణాలను తరచూ తనిఖీ చేయాల్సిన అధికారులు నకిలీ ఎరువులు ఉన్నాయన్న సమాచారం వ్యవసాయ అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ప్రచారమూ సాగుతోంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో నకిలీ పొటాష్‌ వ్యవహారం బయట పడటంతో త్రిపురాంతకం వ్యవసాయ అధికారితో పాటు పలువురు అధికారులపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. అక్రమ నిల్వలు ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో కాకుండా బయట గోడౌన్లు తీసుకొని అక్రమంగా నిల్వలు చేపట్టారు. కనీసం మండల వ్యవసాయాధికారులకు ఏఏ గ్రామంలో అక్రమ గోడౌన్లు ఉన్నాయి, రైతులు ఎక్కడెక్కడ ఎరువులు తీసుకెళుతున్నారన్న పూర్తి సమాచారం వ్యవసాయ అధికారులకు తెలుసు. కానీ మామూళ్లకు తలొగ్గి తెలిసీ, తెలియనట్లు వ్యవహరించటం వల్లనే వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా దాడులు జరుగుతున్న సమయంలో  అధికార పార్టీకి చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి అధికారులకు ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్లు విమర్శలు ఉన్నాయి.

 తాళాలు పగులుగొట్టి గోడౌన్లు తెరిచి ..
త్రిపురాంతకంలో ఐదు గోడౌన్లు, సోమేపల్లిలో మూడు చోట్ల అక్రమంగా నిల్వ ఉంచిన పొటాష్‌ 799 బస్తాలను గుర్తించినట్లు తెలిపారు. నకిలీ పొటాష్‌ నిల్వలపై అధికారులు దాడులు కొనసాగిస్తుండటంతో వ్యాపారులు అందుబాటులో లేరు. వ్యాపారుల కోసం ప్రయత్నం చేసిన అధికారులు గోడౌన్లను రెవెన్యూ శాఖ ద్వారా తాళాలు పగులగొట్టి  తనిఖీ చేశారు. నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయించిన వ్యాపారులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నకిలీ పొటాష్‌తో మటాష్‌
నకిలీ పొటాష్‌ రైతులను నిలువునా ముంచింది. అధిక ధరలు చెల్లించి నకిలీ పొటాష్‌ను కొనుగోలు చేసి మోసపోయామని రైతులు వాపోతున్నారు. సాగర్‌ నీటి వసతి ఉన్న ప్రాంతంలో అన్ని జిల్లాల్లోనూ ఈ పొటాష్‌ అమ్మకాలు జరిగినట్లు నిర్ధారించారు. దీన్ని బట్టి ఈ స్కాం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తవ్విన కొద్ది నకిలీ పొటాష్‌ విక్రయాల్లో కొత్త కోణాలు బయటపడటం అధికారులనే విస్మయానికి గురిచేస్తుంది. గుంటూరు, ప్రకాశంతో పాటు చుట్టు ఉన్న రాయలసీమ జిల్లాల్లోను ఈ అమ్మకాలు జోరుగా సాగాయి. చిత్తూరు జిల్లాల్లో ఈ పొటాష్‌ వాడిన చేపల చెరువులో చేపలు చనిపోయినట్లు అధికారులకు సమాచారం. ఇక వరి పంటలో అధిక దిగుబడుల కోసం దీనిని వినియోగిస్తుంటారు.  ఈ దిగుబడులు పూర్తిగా తగ్గిపోవడానికి ఈ నకిలీ పొటాషే కారణమని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ పొటాష్‌ను రైతులకు భారీగా విక్రయించినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement