నకిలీ పొటాష్‌తో అప్రమత్తంగా ఉండాలి | Farmers Carefull With Fake Potash | Sakshi
Sakshi News home page

నకిలీ పొటాష్‌తో అప్రమత్తంగా ఉండాలి

Published Sat, Jan 12 2019 12:16 PM | Last Updated on Sat, Jan 12 2019 12:16 PM

Farmers Carefull With Fake Potash - Sakshi

ఒంగోలు: నకిలీ పొటాష్‌ పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అదనపు ఎస్పీ ఎం.రజని సూచించారు. శుక్రవారం ఉదయం తన కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. అదనపు ఎస్పీ రజని మాట్లాడుతూ ప్రస్తుతం తాము సీజ్‌ చేస్తున్న పొటాష్‌కు అసలు పొటాష్‌ను సరిపోల్చడం కష్టంగా ఉందని చెప్పారు. బ్యాగుపై అన్ని రకాల ముద్రలు ఒకే రకంగా ఉన్నాయని, రెండు బ్యాగులను పక్కపక్కన ఉంచితే నకిలీది ఏదో గుర్తించడం కష్టమన్నారు. బ్యాగు లోపలి పొటాష్‌ నకిలీనా...కాదా అనేది నిర్థారించేందుకు చిన్న పరీక్ష ఉందన్నారు. పొటాష్‌ బ్యాగు కొనాలనుకుంటున రైతులు అందులోని కొద్దిపాటి పొటాష్‌ను ముందుగా ఒక గ్లాసుడు నీటిలో పరీక్షించుకోవాలని సూచించారు. 

గుర్తించింది ఇలా..
ప్రతినెలా కొన్ని షాపులపై తనిఖీలు నిర్వహించి శాంపిల్స్‌ తీస్తుంటామని, అందులో భాగంగా ఈ సారి త్రిపురాంతకం మండలంలో శాంపిల్స్‌ తీసినట్లు రజనీ వివరించారు. ఈ నెల 3న వెంకట రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్, బాల త్రిపుర సుందరి ఫెర్టిలైజర్స్, శ్రీవెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్‌పై తనిఖీలు చేసినప్పుడు రికార్డులో ఉండాల్సిన నిల్వలకు, షాపులో ఉన్న వాస్తవ నిల్వలకు వ్యత్యాసాలపై 6(ఎ) కేసులు నమోదు చేశామన్నారు. శ్రీవెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్‌పై తనిఖీలు చేసి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని వివరించారు. ఈ మూడు షాపుల్లో సీజ్‌చేసిన మొత్తం 54.40 మెట్రిక్‌ టన్నుల్లో పొటాష్‌తో పాటు డీఏపీ తదితర ఎరువులు కూడా ఉన్నాయన్నారు. 6వ తేదీ గుంటూరులో నకిలీ పొటాష్‌ విషయం వెలుగులోకి రావడంతో ఆ తర్వాత తాము పొటాష్‌పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 7వ తేదీ త్రిపురాంతకంలోని శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్‌లో 40 బ్యాగుల పొటాష్, 8వ తేదీ శ్రీలక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీస్‌లో 80 బ్యాగుల పొటాష్, 9వ తేదీ త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో దూళ్ల పెద సుబ్బారావు దుకాణంలో 484 బ్యాగుల పొటాష్, అదే గ్రామంలో నీలంపాటి అమ్మవారు పెస్టిసైడ్స్‌లో 140 బ్యాగులు, శ్రీ వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్‌కు చెందిన రెండు గోడౌన్లలో తనిఖీలు నిర్వహించి 170 బ్యాగుల పొటాష్, శ్రీమథ్‌ బాల త్రిపుర సుందరి దుకాణంలో 70 బ్యాగుల పొటాష్‌ను సీజ్‌ చేశామని రజని వివరించారు. మొత్తంగా 984 బ్యాగుల పొటాష్‌ను సీజ్‌ చేసి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, ల్యాబ్‌ నుంచి నివేదికలు రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు.

కేసుల నమోదు
రిజిస్టర్‌ ప్రకారం వాస్తవ నిల్వలకు తేడా ఉన్న వెంకట రాఘవేంద్ర ఫెర్టిలైజర్స్, బాలత్రిపుర సుందరి, శ్రీ వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీలక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీలపై 6(ఎ) కేసులు నమోదు చేశామని, వాటిలో శ్రీ వెంకట సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, శ్రీవెంకటేశ్వర ట్రేడర్స్, శ్రీలక్ష్మీ శ్రీనివాస ఏజెన్సీల వద్ద ఉన్న పొటాష్‌ నిల్వల శాంపిల్స్‌ కూడా తీసి ల్యాబ్‌కు పంపామని వివరించారు. దూళ్ల పెద్ద సుబ్బారావు ఇంట్లో గుర్తించిన 24.20 మెట్రిక్‌ టన్నుల ఎరువులకు సంబంధించి దోగిపర్తి సోమసుందరగుప్తా, ముసునూరి కనకయ్యలపై, నీలంపాటి అమ్మవారు పెస్టిసైడ్స్‌కు సంబంధించి దోగిపర్తి సుబ్బారావు, దోగిపర్తి సోమసుందర గుప్తాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని ఏఎస్పీ వివరించారు. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్‌కు సంబంధించి, లడ్డు శ్రీను గోడౌన్‌ను లీజుకు తీసుకొని అందులో అక్రమంగా ఎరువులు నిల్వ ఉంచిన అన్న సుబ్రహ్మణ్యంపై, శ్రీమథ్‌బాల త్రిపుర సుందరి దుకాణానికి సంబంధించి తమ్మినేని మల్లికార్జునరెడ్డిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశామన్నారు. మొత్తంగా సీజ్‌ చేసిన ఎరువుల్లో కేవలం పొటాష్‌ పరిమాణం 984 బ్యాగులు ఉందని, వాటి విలువ రూ.20,16,980లుగా ఉందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అదనపు ఎస్పీ ఎం.రజని వివరించారు.

రైతులు ముందుకు రావాలి
ఇప్పటి వరకు దుకాణాల్లో ఉన్న నిల్వలను మాత్రమే సీజ్‌ చేశామని, పరారీలో ఉన్న నిందితుల గుట్టురట్టు కావాలంటే రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రైతులు తాము ఎవరి వద్ద ఎంత సరుకు కొనుగోలు చేశామనేది వివరిస్తే నిందితుడి ఆచూకీ త్వరగా బహిర్గతం అవుతుందని భావిస్తున్నామన్నారు. పొటాష్‌ను ఎక్కువుగా వరి పండే ప్రాంత రైతులు వినియోగిస్తారని, సాగర్‌ ప్రాంతంలో వరిపండించే త్రిపురాంతకం, కృష్ణా వెస్ట్రన్‌ డెల్టా ప్రాంతంలో పొటాష్‌ను విక్రయించేందుకు దృష్టి సారించారన్నారు. గతంలోలా ధరలో కూడా వ్యత్యాసం రాకుండా బ్రాండెడ్, నకిలీ రెండింటిని ఒకే ధరకు విక్రయిస్తుండటంతో రైతులు అనుమానించలేకపోయారని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మైసూరు కేంద్రంగా ఈ రాకెట్‌ నడుస్తోందని భావిస్తున్నామని, ప్రధాన నిందితుడి కోసం దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

నకిలీ పొటాష్‌ వ్యవహారంపై విచారణ
ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో సంచలనం రేపిన నకిలీ పొటాష్‌ వ్యవహారంలో డిపార్ట్‌మెంటల్‌ ఎంక్వయిరీ (విచారణ)కి కమిటీని నియమించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ పీవీ శ్రీరామ్మూర్తి తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. త్రిపురాంతకం మండలంలో నకిలీ పొటాష్‌కు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమించినట్లు తెలిపారు. జిల్లాలోని భూ సంరక్షణ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నన్న విజయ నిర్మల, జేడీ కార్యాలయంలో ఏడీఏ(పీపీ)గా పనిచేస్తున్న ఈ.మాలకొండారెడ్డిని విచారణాధికారులుగా నియమించామన్నారు. అక్రమాలకు పాల్పడిన డీలర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ కమిటీ విచారణ చేపడుతుందన్నారు. డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వ్యవసాయ అధికారులకు నకిలీ పొటాష్‌ రాకెట్‌తో సంబంధాలు ఉన్నాయా అన్న దానిపై లోతుగా విచారణ చేపడుతున్నామని జేడీ వివరించారు. 

నకిలీ పొటాష్‌పై కొనసాగుతున్న విచారణ  
త్రిపురాంతకం: నకిలీ పొటాష్‌ కోసం గోడౌన్లపై దాడులు  కొనసాగుతున్నాయి. వ్యవసాయశాఖ డీడీఏ ఎం. విజయనిర్మల వివిధ షాపుల్లో శనివారం తనిఖీలు  చేశారు. ఇప్పటి వరకు పట్టుబడిన సరుకు, నకిలీ, అసలు బస్తాలను పరిశీలించారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. వివిధ షాపుల్లో సుమారు తొమ్మిది లక్షల రూపాయల ఖరీదు చేసే 988 నకిలీ పొటాష్‌ బస్తాలను ఆమె నిర్ధారించారు. సుబ్రహ్మణ్యేశ్వర ట్రేడర్స్, రాఘవేంద్ర ట్రేడర్స్, నడిగడ్డ మాధవి ట్రేడర్స్‌కు చెందిన హోల్‌సేల్‌ డీలర్ల వద్ద ఎక్కువ స్టాకు గుర్తించారు. శ్రీలక్ష్మి శ్రీనివాస ట్రేడర్, శ్రీమత్‌ బాలాత్రిపురసుందరీ ట్రేడర్స్‌ రిటైల్‌ డీలర్లు వద్ద స్టాకు గుర్తించి అమ్మకాలు పూర్తిగా నిలిపేసినట్లు ఆమె తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరుగుతోందని, డీలర్ల అమ్మకాలపై ఆరా తీస్తున్నట్లు వివరించారు. అసలు, కల్తీ పొటాష్‌ల నమూనాలను రెండు గ్లాసుల నీటిలో వేసి పరీక్ష చేశారు. అదే విధంగా ఐపీఎల్‌ కంపెనీ బ్యాగ్‌లు పరిశీలించారు. కేవలం నీటిలో వేసిన అనంతరం మాత్రమే దీన్ని నిర్థారించే  అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. బ్యాగ్‌లు పరిశీలించినా అసలు, నకిలీలు తేల్చలేని పరిస్థితి కనిపిస్తుంది. విజిలెన్స్‌ అధికారులు, వ్యవసాయశాఖ అధికారుల దాడులతో ఎరువుల దుకాణాలు వారం రోజులుగా మూతపడుతున్నాయి. పొటాష్‌ అమ్మకాల కారణంగా  ఎరువుల వ్యాపారుల్లో భయం నెలకొంది. హోల్‌సేల్‌ వ్యాపారులు ప్రస్తుతం అందుబాటులో లేరు. పూర్తిస్థాయిలో దాడుల్లో పట్టుబడిన నకిలీ పొటాష్‌ గోడౌన్లు అధికారుల ఆధీనంలోనే ఉన్నాయి. అసలు సరఫరా దారుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. తనిఖీల్లో వ్యవసాయశాఖ ఏడీఏ సుదర్శనరాజు, ఏఓ బాలాజీనాయక్, జవహర్‌లాల్‌ నాయక్‌ ఉన్నారు.

విచారణ చేయిస్తాం:
జిల్లాలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు నకిలీ గుట్టు బట్టబయలు చేస్తే వ్యవసాయశాఖ ఏం చేస్తోందంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ జేడీ టీవీ శ్రీరామ్మూర్తి తర్జనభర్జన పడ్డారు. తమ అధికారులు ఫీల్డులో పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరి ఎందుకు నకిలీని గుర్తించలేకపోయారు, దీనివల్ల ఇప్పటికే పొటాష్‌ను పెద్ద మొత్తంలో వినియోగించి మోసపోయిన రైతాంగానికి ఏం స«మాధానం చెబుతారంటూ ప్రశ్నించడంతో డిపార్టుమెంట్‌ పరంగా కూడా విచారణ జరుపుతామని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ డీఎస్పీ అంకయ్య, సీఐలు టీఎక్స్‌ అజయ్‌కుమార్, బీటీ నాయక్, ఎంపీడీవో నారాయణరెడ్డి, ఏఓ ఉమాపతి, తహసీల్దార్‌ పాల్‌ పాల్గొన్నారు.శ్రీరామ్మూర్తి, జేడీ, వ్యవసాయ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement