తెగుళ్లతో వి‘పత్తి’ | tobacco full of pests | Sakshi
Sakshi News home page

తెగుళ్లతో వి‘పత్తి’

Published Wed, Aug 31 2016 9:13 PM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM

టేక్మాల్‌ మండలంలో సాగవుతున్న పత్తి

టేక్మాల్‌ మండలంలో సాగవుతున్న పత్తి

  • పత్తికి పురుగుల బెడద
  • సమయానుకూలంగా మందుల పిచికారి
  • సస్యరక్షణ చర్యలు పాటిస్తే మేలు
  • వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి
  • టేక్మాల్‌ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్‌
  • టేక్మాల్‌: పత్తికి పురుగులు ఆశిస్తే ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని టేక్మాల్‌ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్‌ (99499 68674) తెలిపారు. మోతాదుకు మించి మందులను వాడకుండా సమయానుకూలంగా మందులను పిచికారి చేయాలన్నారు. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటిస్తూ సస్యరక్షణ చర్యలు పాటిస్తే మేలు చేకూరుతుందన్నారు. పత్తిని ఆశించే పురుగుల నివారణకు ఆయన అందించిన సలహా సూచనలు..
     

    పురుగులు
    సాధారణంగా పత్తి విత్తిన 45-50 రోజుల వరకు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామరపురుగు అలాగే పైరు పూత, పిందె, కాయదశల్లో తెల్లదోమ, కాయతొలిచే పురుగులైన నల్లమచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీరంగు పురుగులు ఆశించి ఎక్కువ  నష్టం కలుగజేస్తాయి.

    రసంపీల్చే పురుగులు: పేనుబంక పురుగు ఆశించిన మొక్కలు 10-20 శాతం, పచ్చదోమలు ఆకుకు 2, తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు 6, పిల్ల పురుగులు 20, తామరపురుగులు తల్లి పురుగులు ఆకుకు 10 ఉంటే ఆయా పురుగుల వలన పంటకు నష్టం అధికంగా ఉంటుంది.

    రసంపీల్చే పురుగుల నివారణ: పచ్చ, తెల్లదోమలను తట్టుకొనే రకాలను సాగుచేయాలి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5 గ్రా. ఇమిడాక్ల్రోపిడ్‌ 70 డబ్ల్యూఎస్‌ లేక 4 గ్రా, థయోమి«థాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసి విత్తితే 40-45 రోజుల వరకు రసంపీల్చే పురుగులను నివారించవచ్చు. కిలో విత్తనానికి పైవిధంగా 40-50 గ్రా కార్బోసల్ఫాన్‌తో శుద్ధిచేసి విత్తితే 30 రోజుల వరకు రసంపీల్చే పురుగుల నుండి రక్షణ ఉంటుంది. మోనోక్రోటోఫాస్‌ లేదా మిథైల్‌ డెమటాన్‌, నీరు 1ః4 నిష్పత్తిలో లేక ఇమిడాక్ల్రోపిడ్‌ 200 ఎస్ఎల్, నీరు 1ః20 నిష్పత్తిలో కలిపిన ద్రావణం విత్తిన 20, 40, 60 రోజుల్లో (పురుగు నష్ట పరిమాణాన్ని దృష్టిలో వుంచుకోని) మొక్క లేత కాండానికి బ్రష్‌తో పూస్తే రసం పీల్చే పురుగులను అదుపులో వుంచవచ్చు. ఈ పద్ధతి వలన పురుగు మందు ఖర్చు తగ్గటమే కాక వాతావరణ కాలుష్యం కూడ తగ్గుతుంది.

    ప్రత్యేక సూచనలు:

    • ఇమిడాక్ల్రోపిడ్‌తో విత్తనశుద్ధి చేసిన విత్తనాలను విత్తటానికి ముందు నీళ్లలో నానబెట్టరాదు.
    • రసంపీల్చే పురుగుల నివారణకు తొలిదశలో ఎక్కువ సార్లు పురుగు మందులు పిచికారి చేయరాదు.
    • తెల్లదోమ ఉధృతి ఎక్కువగా వుంటే పసుపురంగు డబ్బాలను జిగురు పూసి వుంచితే అవి ఆకర్షింపబడి జిగురుకు అంటుకుంటాయి.
    • తెల్లదోమ ఆశించినప్పుడు పైరితాయిడ్‌ మందులు వాడడం వెంటనే నిలిపి వేయాలి.
    • ఎర్రనల్లిని అదుపులో వుంచటానికి లీటరు నీటికి 3 గ్రా, 50 శాతం నీళ్లలో కరిగే గంధకం లేక 5 మి.లీ డైకోఫాల్‌ కలిపి పిచికారి చేయాలి.
    • పిండినల్లి ఆశించినప్పుడు తొలిదశలోనే గుర్తించి, కాండానికి మందు పూత ద్వారా నివారించుకోవాలి. లీటరు నీటికి 1 మి.లి డైక్లోర్‌వాస్‌తో పాటు 2 మి.లీ మిథైల్‌ పెరాథియాన్‌ లేక మలాథియన్‌ లేదా 3 మి.లీ క్వినాల్‌ఫాస్‌ కలిపి పిచికారి చేయాలి.

    కాయతొల్చు పురుగులు
    10 శాతం పూతకు నష్టం వాటిల్లినప్పుడు, మొక్కకు ఒక పచ్చ పురుగు గుడ్డు లేదా లార్వా ఉన్నప్పుడు, 10 మొక్కలకు ఒక లద్దె పురుగు, గుడ్ల సముదాయం గమనించినప్పుడు, 10 శాతం గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి పూలు గుర్తించినప్పుడు కాయతొల్చు పురుగుల వలన పంటకు నష్టం అధికంగా ఉంటుంది.

    కాయతొల్చు పురుగుల సమగ్ర సస్యరక్షణ

    • పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి.
    • వేసవి దుక్కులు లోతుగా దున్నాలి.
    • 25 శాతం సేంద్రియ ఎరువులు, 75 శాతం రసాయన ఎరువులు వాడాలి.
    • బొబ్బర (అలసంద), కొర్ర, సోయాచిక్కుడు, పెసర, మినుము, గోరుచిక్కుడు 1ః2 నిష్పత్తిలో అంతరపంటలుగా వేయాలి. చేనుచుట్టూ నాలుగు వరుసల జొన్న లేక కంచె పంటగా వేయాలి.
    • లద్దెపురుగును ఆకర్షించడానికి ఎకరాకు 50 ఆముదపు మొక్కలు చేనంతా అక్కడక్కడ పెట్టి, ఆముదపు మొక్కలపై పెట్టిన లద్దెపురుగు గుడ్లను, జల్లెడ ఆకులను ఏరి నాశనం చేయాలి.
    • శనగపచ్చపురుగును ఆకర్షించడానికి ఎకరాకు 100 పసుపు రంగు పూలు పూచే బంతిమొక్కలు పెట్టి మొగ్గలు, పూలలో వున్న పురుగులను ఏరివేయాలి. లద్దెపురుగు వలసను నియంత్రించడానికి చేను చుట్టూ అడుగు లోతున చాలు తీసి ఫాలిడాల్‌ లేక లిండేన్‌ పొడి మందు చల్లుకోవాలి.
    • శనగపచ్చ పురుగు, లద్దెపురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేయటానికి ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. ప్రతి బుట్టలో కొన్ని రోజులు వరుసగా రోజుకు గులాబి రంగు పురుగులు 8, శనగపచ్చ పురుగులు 10, పొగాకు లద్దె పురుగులు 20, మచ్చల పురుగులు 15 పడిన ఎడల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
    • అక్టోబరు- నవంబరులో శనగపచ్చ పురుగు ఆశించిన యెడల ఎకరాకు 200 లార్వాలను సమానమైన పచ్చపురుగు వైరస్‌ ద్రావణం, లద్దె పురుగు ఆశిస్తే..200 ఎ.ఇ. లద్దెపురుగు వైరస్‌ ద్రావణంకు, కిలో బెల్లం ,100 మి.లీ శాండోవిట్‌ లేదా 50 గ్రా , రాబిన్‌బ్లూ పౌడరు కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి.
    • పురుగులను తినే పక్షులు వాలటానికి వీలుగా ’టి’ ఆకారపు కర్రలను లేక పంగల కర్రలను ఎకరాకు సూమరు 15-20 పెట్టాలి.
    • పచ్చపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు మూడవదశ దాటిన పచ్చపురుగును చేతితో ఏరివేసి ఇండాక్సాకార్బ్‌ లీటరు నీటికి 1 మి.లీ లేదా స్ఫైనోశాడ్‌ 0.3 మి.లీ లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.5 గ్రా కలిపి పిచికారి చేయాలి.
    • పురుగుల మందు విషప్రభావం పెంచటానికి నువ్వులనూనెను, క్లోరిపైరిఫాస్‌ లేదా ఫెన్‌వలొరేటు లేదా సైపర్‌మెత్రిన్‌ మందులతో 1ః4 నిష్పత్తిలో కలిపి పిచికారి చేయాలి.
    • పురుగుల నష్ట పరిమాణం దృష్టిలో వుంచుకోని లీటరు నీటికి క్వినాల్‌ఫాస్‌ 2.5 లేదా క్లోరిఫైరిఫాస్‌ 3 మి.లి లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా పిచికారి చేయాలి. పచ్చపురుగు గుడ్లు ఎక్కువగా వుంటే ప్రొపినోఫాస్‌ 2 మి.లి లేదా థయోడికార్బ్‌ 1.5 గ్రా లీటరు నీటి మోతాదులో కలిపి పిచికారి చేయాలి. ఒకేమందు ఎక్కువసార్లు పిచికారి చేయకుండా మందులు మార్చి వాడుకోవాలి.

    ప్రత్యేక సూచనలు

    •  మొక్క లేత ఆకులపైన, మొగ్గలపైన పెట్టే పచ్చపురుగు గుడ్లను గుర్తించి నాశనం చేయాలి.
    • మూడవదశ దాటిన పచ్చపురుగు మీద పురుగు మందులు ఆశించినంత సమర్ధవంతంగా పనిచెయ్యవు. కాబట్టి చేతితో ఏరివేసి సస్యరక్షణ చేపట్టాలి.
    • పంటకాలంలో సింథటిక్‌ పైరితాయిడ్‌ మందులు ఒకటి లేక రెండుసార్లు అవసరాన్ని బట్టి పిచికారి చెయ్యాలి.
    • పచ్చపురుగు, తెల్లదోమ ఆశించినప్పుడు సింథటిక్‌ పైరితాయిడ్‌ మందులు పిచికారి చేయరాదు.
    • గులాబి రంగు పురుగును మందుల ద్వారా సమర్ధవంతంగా అదుపుచేయుట కష్టతరం కాబట్టి గుడ్డిపూలను ఏరి నాశనం చేయాలి.
    • మందు ద్రావణాన్ని సిఫారసు చేసిన మోతాదులో సిఫార్సు చేసిన సస్యరక్షణ పరికరాలతో సరైన పద్ధతిలో పిచికారి చేయాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement