tobacco crop
-
గుడ్‌న్యూస్: పొగాకు రైతులకు వడ్డీ లేని రుణం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో మాండూస్ తుపాను ప్రభావంతో పొగాకు పంట నష్టపోయిన ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు చెందిన రైతులకు పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి నుంచి రూ.10 వేల చొప్పున వడ్డీ లేని పంట రుణం ఇచ్చేందుకు కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ మంత్రి పియూష్ గోయెల్ ఆమోదించారని పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు చెప్పారు. గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పొగాకు ఉత్పత్తిదారుల సంక్షేమ నిధి సభ్యులు 28,112 మంది రైతులకు రూ.10 వేల చొప్పున రూ.28.11 కోట్లు పంపిణీ చేసేందుకు అనుమతి లభించిందన్నారు. పొగాకు పంట నష్టపోయినట్లు రైతులు సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాజమండ్రిలోని సెంట్రల్ టూబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీటీఆర్ఐ)కి చెందిన ఆరుగురు శాస్త్రవేత్తలు, పొగాకు బోర్డు అధికారులు, సిబ్బందితో కూడిన బృందాలు తుపాను ప్రభావిత పొగాకు పొలాలను సందర్శించి, తక్షణ నష్ట నివారణకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిపారు. సుమారు రూ.25 కోట్ల మేర పొగాకు రైతులు మాండూస్ తుఫాను వల్ల నష్టపోయారని తెలిపారు. ప్రస్తుతం బ్యారన్‌కు ఇచ్చిన రూ.5 లక్షలు రుణంకు అదనంగా మరో రూ.50 వేలు రుణం ఇవ్వాలని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీకి సిఫారసు చేశామని చెప్పారు. అంతేకాకుండా పొగాకు పంట నష్టపోయిన రైతులకు కూడా నష్ట పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామన్నారు. ప్రస్తుతం కర్నాటక రాష్ట్రంలో పొగాకు వేలం జరుగుతోందని, అత్యధికంగా కిలోకు రూ.271 ధర లభిస్తోందని, సగటున కిలోకు రూ.239.16 లభించిందని తెలిపారు. ఏపీలో ఫిబ్రవరి మాసం చివర కానీ, మార్చి మొదటి వారంలో కానీ ఆక్షన్ ప్రారంభమవుతోందని శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇదీ చదవండి: ‘ఉపాధి’ పనులను పరిశీలించిన కేంద్ర బృందం -
‘పంట విరామం’తోనే నాణ్యతకు భరోసా
పొగాకు పంటను స్థిరీకరించడంలో, రైతుకు మంచి లాభాలను అందించడంలో విశేషంగా తోడ్పడిన క్రాప్ హాలిడేను ఇతర వాణిజ్య పంటలకు కూడా వర్తింపచేయాల్సిన అవసరముంది. పొలం నుంచి ఓడరేవుకు చేరుకునేంతవరకు పంటల ఎగుమతి ప్రక్రియలో తప్పనిసరిగా అవసరమైన పంటల నాణ్యతను క్రాప్ హాలిడే ఎంతగానో మెరుగుపరుస్తుంది. పండ్లు, కూరగాయల పెంపకంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వీటిలో 40 శాతం ఇప్పటికీ వినియోగం లేక వృథాగా మిగిలి పోతున్నాయి. ఈ వృథాను అరికట్టడానికి గ్రామీణ ప్రాంతంలో శీతల గిడ్డంగులను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాల కల్పనను సమర్థంగా అమలు చేస్తే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు జనం తిరిగి వలస పోవడానికి వీలు కల్పించినట్లవుతుంది. ఇరవై ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో పొగాకు పంటకు క్రాప్ హాలిడే (పంట విరామం) భావనను నేనే పరిచయం చేశాను. పంట దిగుబడిని క్రమబద్ధీకరించడం, పురుగులు తెగుళ్లను నియంత్రించడం దీని లక్ష్యం. ఏదైనా నిర్దిష్టమైన పంటను ఒక సంవత్సరం పాటు పండించకుండా ఉండటమే క్రాప్ హాలిడే అంటే. పంటను స్థిరీకరించడంలో, రైతులకు మంచి లాభాలను అందించడంలో క్రాప్ హాలిడే విశేషంగా తోడ్పడింది. క్రాప్ హాలిడే విధించిన తదనంతర సంవత్సరాల్లో పంట నాణ్యత కూడా మెరుగైంది. దేశంలో పెరుగుతున్న ఇతర వాణిజ్య పంటలకు కూడా క్రాప్ హాలిడే భావనను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేసి అధికపంటను పొందవచ్చు లేక పురుగులు, తెగుళ్ల కారణంగా పంట దెబ్బతినిపోవడాన్ని నిరోధించవచ్చు. దేశానికి అవసరమైన పంటల గురించి సమగ్ర సర్వేని ప్రారంభించడం ద్వారా క్రాప్ హాలిడే భావనను వర్తింపచేయవచ్చు. పలురకాల పంటల ఉత్పత్తిలో భారత్ ప్రాధాన్య స్థానంలో ఉన్నప్పటికీ, ఆ పంటల ఎగుమతులు మాత్రం నిరుత్సాహకరంగా ఉన్నాయి. అధిక విలువ గల పంటలను పెంచడంలో భారత్ సామ ర్థ్యాన్ని పెంపొందించడానికి వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఒక సమగ్ర పథకం తీసుకునివస్తే అది రైతులకు ప్రయోజనకరంగా ఉండటమే కాదు.. విదేశీ ద్రవ్యమారకం ఆర్జించడంలో దేశానికి కూడా ఉపయోగపడుతుంది. పంటలను గుర్తించి వాటిపై విశేషంగా శ్రద్ధ పెట్టే క్రమంలో ఉత్తమ వ్యవసాయ విధానాల ద్వారా పంటల పరిమాణాన్ని, నాణ్యతను కూడా మెరుగుపర్చవచ్చు. పంట ఎగుమతికి నాణ్యతే కొలమానం ఎగుమతి కోసం ఓడరేవుకు చేరుకునేంత వరకు పంటల పరిమాణం లేక నాణ్యత ఏమాత్రం దెబ్బతినకుండా పంటను నిర్వహించుకోవడానికి అవసరమైనంత శిక్షణను ఈ పంటల ఉత్పత్తిదారులకు అందించాల్సి ఉంది. విధానాలను సరళీకరించి, సబ్సిడీ ధరలకే నాణ్యతా పరీక్షలను కల్పిస్తే ఎగుమతుల పెరుగుదలకు అది తోడ్పడుతుంది. పొలం నుంచి ఓడ రేవు వరకు పంటను తీసుకుపోవడానికి రైతు భరించిన ఖర్చులన్నింటినీ ఓడ రేవుకు పంట చేరుకున్న వెంటనే రైతుకు తిరిగి చెల్లిస్తే మరింత ముందడుగు వేసినట్లవుతుంది. దిగుమతిదారు చెల్లించే సేల్ ప్రోసీడింగ్స్ నుంచి తీసివేసి వాటిని రైతులకు చెల్లించవచ్చు. దిగుమతిదారు నుంచి క్రెడిట్ పొందడానికి వేచి చూస్తున్న రైతుకు దీంతో ఉపశమనం లభిస్తుంది కూడా. అంతేకాకుండా తమ ఉత్పత్తిని ఎగుమతి చేయడానికి పలువురు రైతులకు ఇది ఊతం కల్పిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులందరికీ సింగిల్ విండో సదుపాయాన్ని కల్పిస్తే అవసరమైన డాక్యుమెంటేషన్, లాంఛనాలను రికార్డు సమయంలో పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. రైతు తమ పంటను నిల్వచేయగానే రాష్ట్ర ప్రభుత్వ ఎగుమతుల శాఖ ద్వారా ఆ పంటల ఎగుమతి క్రమాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడైతే తమ పంటల ఎగుమతికి సంబంధించి రైతులు ఒక చోటి నుంచి మరొక చోటికి పరుగుతీయాల్సి వస్తోంది. దీంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయి. కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి కొత్త వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో, కాంట్రాక్టర్, రైతు కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండేందుకు ఒక యంత్రాంగం అవసరం. రైతు లేక స్పాన్సర్ ఎవరో ఒకరు కుదిరిన ఒప్పందాలను అతిక్రమిస్తున్నట్లు అనేక ఉదంతాలు బయటపడ్డాయి. మార్కెట్లో ధరలు చుక్కలంటినప్పుడు, రైతు తమ ఉత్పత్తిని కాంట్రాక్టుకు భిన్నంగా తన ఉత్పత్తిని బయట అమ్ముకుం టాడు. అలాగే తాము కుదుర్చుకున్న ధరకంటే తక్కువ ధరకు లభించే చోటనే వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి కాంట్రాక్టర్ కూడా పూనుకుంటాడు. ఈ క్రమరాహిత్యాన్ని అడ్డుకోవడానికి, కాంట్రాక్టు కంపెనీ/ వ్యక్తి ముందుగానే రైతుకు చెల్లిస్తామని చెప్పిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని రైతుకు చెల్లించివేయాల్సి ఉంది. కాంట్రాక్టు ప్రకారం తన పంటలో సగం భాగాన్ని రైతు సరఫరా చేసిన వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. దీంతో తమ మధ్య కుదిరిన ఒప్పందానికి ఇరుపక్షాలూ కట్టుబడటం సాధ్యపడుతుంది. అక్రమ నిల్వలను అరికట్టడం ఎలా? అత్యవసర సరుకుల చట్టాన్ని రద్దు చేసిన కొత్త బిల్లుకు సంబంధించి చూస్తే పంటల కొనుగోలుదారు తన వద్ద ఉన్న నిల్వ సామర్థ్యం పరిమితులను దాటి తాను కొన్న పంటను నిల్వ చేసుకునే అవకాశం అన్ని వేళలా ఉంటుంది. మరిన్ని గోడౌన్లను లీజుకు తీసుకుని పంటను అధికంగా నిల్వ చేయవచ్చు. దీనిద్వారా అతడు సరుకుల కొరతను సృష్టించి తద్వారా ఆ పంటకు అధిక ధర పొందగలడు. ఇలాంటి పరిస్థితిని నిరోధించడానికి, తమ వద్ద ఉన్న నిల్వ సామర్థ్యం గురించి కొనుగోలుదారులు తప్పనిసరిగా ప్రకటించాలని ఆదేశించాలి. ఇలా అయితే అక్రమ నిల్వలను అరికట్టవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కొనుగోలుదారు అదనపు నిల్వ సామర్థ్యానికి దరఖాస్తు చేసుకుని పంట ఉత్పత్తులను సేకరించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ సేకరణ కార్యకలాపాలన్నీ ఏపీఎమ్‌సీ ప్రాంగణంలో మాత్రమే జరగాలి. అప్పుడు మాత్రమే పంటల రాక, ధరలు, విక్రేతల గుర్తింపును నజావుగా నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రస్తుత మార్కెటింగ్ మౌలిక వ్యవస్థను, మానవ శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సరఫరా స్థాయిలను ప్రభావితం చేసేటటువంటి వాణిజ్యపరంగా ప్రాధాన్యత గల పంటలు, అవి పండే అవకాశమున్న ప్రాంతాలకు సంబంధించి సరుకు పరిస్థితిపై నివేదికలను సిద్ధం చేయాలి. ఈ నివేదికలను నిజ సమయ డేటాతో నవీకరించాలి. ఇది ఒక సరుకు కొరతను, లేక అధిక సరఫరాను గుర్తించడంలో ముందుగానే అవగాహనను కల్పించడమే కాకుండా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలోనూ తోడ్పడుతుంది. సరుకు సరఫరా తక్కువగా ఉన్నప్పుడు లేక అధిక సరఫరా జరిగినప్పుడు దిగుమతి చేసుకోవడం లేక సేకరించడంపై ప్రభుత్వం తగు చర్య తీసుకోవచ్చు. ఇప్పుడయితే ఈ రెండు చర్యలను ప్రభుత్వం చాలా ఆలస్యంగా చేపడుతుండటంతో రైతుల్లో నిస్పృహ ఏర్పడుతోంది. అపరిమిత స్థాయిలో పంటల వృథా! పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశానికి ఉన్న సామర్థ్యాన్ని పరిశీలిస్తే, వీటి ఎగుమతుల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు. తగిన పరిమాణంలో నాణ్యమైన ఉత్పత్తి సాధ్యపడే ప్రాంతాల్లో ఉత్పత్తి సంస్థలకు తగిన పెట్టుబడి, శిక్షణ, సబ్సిడీ మద్దతును కల్పించి మెరుగైన చెల్లింపులు చేసే దేశాలకు ఆ ఎగుమతులను పంపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయల పెంపకంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వీటిలో 40 శాతం ఇప్పటికీ విని యోగం లేక వృధా అవుతున్నాయి. భారత్‌లో ఇలాంటి వృథా ఏ స్థాయిలో ఉంటోందంటే అది ఆస్ట్లేలియా మొత్తం ఉత్పత్తికి సమానంగా ఉంటోంది. ఇలాంటి పంటల వృథాను అరికట్టడానికి గ్రామీణ ప్రాంతం మొత్తంగా శీతల గిడ్డంగులు, కోల్ట్ చైన్స్‌ని విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. రైతుల సంక్షేమానికి, గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి ఏటా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. దీన్నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి అని మదించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికోసం నీతి ఆయోగ్, జాతీయ గణాంకాల సంస్థ, ప్రధాన ఆర్థిక సలహాదారు వంటి వారిని పురమాయించాలి. ఆ విధంగానే ప్రభుత్వం సరైన రీతిలో సంక్షేమ నిధుల ఖర్చు వ్యవహారాలను మదించి ఉత్తమ ఫిలితాలను సాధించవచ్చు. రివర్స్ వలసకు అదే కీలకం గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నత వృత్తివిద్యా కోర్సులను చదివే అవకాశాలను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పొందలేకపోతున్నారు. కాబట్టి దేశంలోని అన్ని వృత్తి విద్యా కళాశాలల్లో కనీసం 15 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించాలని నేను సూచిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో అయిదేళ్లు చదివిన వారు ఈ సీట్లను పొందడానికి పరీక్షలో అర్హత సాధించాలి. పీయూఆర్‌ఏ (గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పన) భావనను ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో అమలు చేయాలి. దీనివల్ల పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తిరిగి వలస పోవడానికి వీలు కల్పించినట్లవుతుంది. (2021–22 బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖామంత్రికి పంపిన సూచనల సారాంశం) వ్యాసకర్త: డాక్టర్ యలమంచిలి శివాజీ, రాజ్యసభ మాజీ ఎంపీ, కిసాన్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు మొబైల్: 98663 76735 -
తగ్గుతున్న నాటు పొగాకు సాగు
ములకలపల్లి: నాటు పొగాకు సాగు క్రమేపీ తగ్గుతోంది. ఒకప్పుడు మండల పరిధిలో ప్రధాన వాణిజ్య పంటగా వేలాది ఎకరాల్లో సాగయ్యేది. ఐతే పెట్టుబడి అధికం కావడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో దీని సాగుపట్ల రైతులు ఆసక్తి చూపడంలేదు. దీంతో పొగాకు సేద్యం ప్రస్తుతం వందల ఎకరాలకు మాత్రమే పరిమితమయింది. ఆంధ్రా పెట్టుబడిదారుల సహకారంతో.. ఈ పంట సాగుకయ్యే ఖర్చును ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు స్థానికుల ద్వారా రైతులకు పెట్టుబడి పెట్టేవారు. మండలం లో దీని పేరున కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ పంటకు ధర దక్కకపోవడం మరో ప్రధాన కారణం. పుట్టి పొగాకు (227 కేజీలు) గత ఏడాది 14,100 రూపాయలుగా ఖరారు చేశారు. ఖర్చు లన్నీ పోను రైతు కష్టం కూడా మిగలని పరిస్థితి. పంట దిగుబడికి వాడే పురుగు మందుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, పంట ధర మాత్రం ఏడాదికేడాదికి తగ్గుతుంది. కంటికి రెప్పలా కాపాడినా.. ఆగష్టు మాసంలో నారు కోసం గింజలు వేసింది మొదలు మార్చి, ఏప్రియల్ నెలల్లో పంట పంపిచే వరకూ కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందే. ఈ కాలంలో అకాల వర్షాలు, అనావృష్టి తదితర సమస్యలు వస్తే పంట దిగుబడి అనూహ్యంగా తగ్గిపోతోంది. పంట కోసిన తరువాత పందిళ్లపై ఆరబెట్టిన సమయంలో కూడా వర్షంలో తడిస్తే, పంటరేటు తగ్గిస్తారు. మిగతా పంటలు కల్లాల్లో ఉండగానే ఖరీదు చేస్తారు. ధర చెల్లించే పద్ధతి మరీ దారుణం.. నాటు పొగాకు సాగు చేసే రైతులది చిత్రమైన పరిస్థితి. పందిళ్లమీద పంటను లారీల్లో లోడు చేసి ఆంధ్రాప్రాంతాలకు మార్చి, ఏప్రిల్ నెలల్లో పంపి స్తారు. ఐతే జూలై, ఆగష్టు నెలల్లో వీటి ధర ప్రకటిస్తారు. సదురు పెట్టుబడిదారులకు అనుకూలంగా పుట్టిధరను నిర్ణయిస్తారు. ఆరంభం నుంచి రైతుకిచ్చిన పెట్టుబడిపోగా మిగతావి విడతలవారీగా రైతులకు ఇస్తారు. దీంతో రైతు కష్టానికి ప్రతిఫలం ఎప్పుడు లభిస్తుందో కూడా తెలియని దుస్థితి. ఇలాంటి విచిత్ర పరిస్థితులతో భవిష్యత్తులో ఈ పంట సాగు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
కదలే చైతన్యం రైతు పెద్దమ్మ!
బలమైన సంకల్పం ఉంటే రైతు కుటుంబంలోని సాధారణ గృహిణి కూడా ఇతరులకూ వెలుగుబాట చూపగలిగేంత ఎత్తుకు ఎదుగుతుందనడానికి రాజ్‌కుమార్ దేవి జీవితమే నిలువుటద్దం. బీహార్‌లోని ముజఫర్‌పుర్ జిల్లాలోని కుగ్రామం ఆనంద్‌పుర్ వాస్తవ్యురాలు. వ్యవసాయం గురించి ఏ కాలేజీలోనూ ఆమె చదువుకోలేదు. తన అత్తింటి వారికి ఉన్న ఎకరం పొలంలో 1980లలో ఒక రోజు స్వయంగా పారను చేతబట్టి స్వేదాన్ని చిందించే క్రమంలోనే ఆ నేల స్వభావాన్ని, ఏయే పంటలు సాగు చేస్తే బతుకులు బాగుపడతాయో అధ్యయనం చేసింది. ఆమె 30 ఏళ్ల క్రితం పొలంలో కాలు మోపే నాటికి వరి, గోధుమ, నాటు పొగాకు తప్ప వేరే పంటలు అక్కడి వారికి తెలియవు. పండించిన నాటు పొగాకును ఊరూరా తిరిగి అమ్మడానికి భర్త బయలుదేరడంతో ఆమె వ్యవసాయంపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. పొగాకు ఒక్కటే పండించడం ఎందుకు? కూరగాయలు, పండ్లు తదితర అనేక పంటలు కలిపి ఎందుకు పండించకూడదని ప్రశ్నించుకుంది. తమ ఎకరం పొలాన్ని మడులుగా విభజించి.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు.. వేర్వేరు పంటలు సాగు చేయడం ప్రారంభించింది. కొన్నాళ్లు గడిచే సరికి రాజ్‌కుమార్ దేవి ఒకటికి నాలుగు పంటలు పండించడంలో ప్రయోజనాలను ఆ ఊళ్లో మహిళా రైతులంతా గమనించారు. ఆమెను అనుసరించారు. వ్యవసాయోత్పత్తులకు విలువను జోడించి పట్టణాలకు పంపడంపై ఆమె దృష్టి పెట్టింది. ఇందుకోసం పదేసి మంది మహిళలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులను సేకరించి పట్టణాలకు తరలించి విక్రయించేందుకు తానే ఒక సంస్థను ప్రారంభించింది. ఇంటిపట్టున ఉండి నెలకు రూ. 3 వేల వరకు మహిళలు సంపాయించుకునే దారి చూపింది. తమ గ్రామంతోపాటు ఇరుగుపొరుగు గ్రామాలకు కూడా సైకిల్‌పైనే వెళ్లి మహిళా రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రాజ్‌కుమార్ దేవిని ‘రైతు పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. బహుళ పంటల సాగుతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విక్రయించడం ద్వారా గ్రామీణ మహిళల జీవితాలలో మార్పు తేవచ్చని లోకానికి చాటిచెబుతున్న ఈ ‘రైతు పెద్దమ్మ’కు ఎవరైనా జేజేలు పలకవలసిందే! నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
తెగుళ్లతో వి‘పత్తి’
పత్తికి పురుగుల బెడద సమయానుకూలంగా మందుల పిచికారి సస్యరక్షణ చర్యలు పాటిస్తే మేలు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ టేక్మాల్: పత్తికి పురుగులు ఆశిస్తే ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని టేక్మాల్ వ్యవసాయ విస్తరణాధికారి సునీల్‌కుమార్ (99499 68674) తెలిపారు. మోతాదుకు మించి మందులను వాడకుండా సమయానుకూలంగా మందులను పిచికారి చేయాలన్నారు. వ్యవసాయాధికారుల సలహా సూచనలు పాటిస్తూ సస్యరక్షణ చర్యలు పాటిస్తే మేలు చేకూరుతుందన్నారు. పత్తిని ఆశించే పురుగుల నివారణకు ఆయన అందించిన సలహా సూచనలు.. పురుగులు సాధారణంగా పత్తి విత్తిన 45-50 రోజుల వరకు రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తామరపురుగు అలాగే పైరు పూత, పిందె, కాయదశల్లో తెల్లదోమ, కాయతొలిచే పురుగులైన నల్లమచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీరంగు పురుగులు ఆశించి ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. రసంపీల్చే పురుగులు: పేనుబంక పురుగు ఆశించిన మొక్కలు 10-20 శాతం, పచ్చదోమలు ఆకుకు 2, తెల్లదోమ తల్లి పురుగులు ఆకుకు 6, పిల్ల పురుగులు 20, తామరపురుగులు తల్లి పురుగులు ఆకుకు 10 ఉంటే ఆయా పురుగుల వలన పంటకు నష్టం అధికంగా ఉంటుంది. రసంపీల్చే పురుగుల నివారణ: పచ్చ, తెల్లదోమలను తట్టుకొనే రకాలను సాగుచేయాలి. కిలో విత్తనానికి తగినంత జిగురు కలిపి 5 గ్రా. ఇమిడాక్ల్రోపిడ్ 70 డబ్ల్యూఎస్ లేక 4 గ్రా, థయోమి«థాక్సామ్తో విత్తనశుద్ధి చేసి విత్తితే 40-45 రోజుల వరకు రసంపీల్చే పురుగులను నివారించవచ్చు. కిలో విత్తనానికి పైవిధంగా 40-50 గ్రా కార్బోసల్ఫాన్తో శుద్ధిచేసి విత్తితే 30 రోజుల వరకు రసంపీల్చే పురుగుల నుండి రక్షణ ఉంటుంది. మోనోక్రోటోఫాస్ లేదా మిథైల్ డెమటాన్, నీరు 1ః4 నిష్పత్తిలో లేక ఇమిడాక్ల్రోపిడ్ 200 ఎస్ఎల్, నీరు 1ః20 నిష్పత్తిలో కలిపిన ద్రావణం విత్తిన 20, 40, 60 రోజుల్లో (పురుగు నష్ట పరిమాణాన్ని దృష్టిలో వుంచుకోని) మొక్క లేత కాండానికి బ్రష్‌తో పూస్తే రసం పీల్చే పురుగులను అదుపులో వుంచవచ్చు. ఈ పద్ధతి వలన పురుగు మందు ఖర్చు తగ్గటమే కాక వాతావరణ కాలుష్యం కూడ తగ్గుతుంది. ప్రత్యేక సూచనలు: ఇమిడాక్ల్రోపిడ్తో విత్తనశుద్ధి చేసిన విత్తనాలను విత్తటానికి ముందు నీళ్లలో నానబెట్టరాదు. రసంపీల్చే పురుగుల నివారణకు తొలిదశలో ఎక్కువ సార్లు పురుగు మందులు పిచికారి చేయరాదు. తెల్లదోమ ఉధృతి ఎక్కువగా వుంటే పసుపురంగు డబ్బాలను జిగురు పూసి వుంచితే అవి ఆకర్షింపబడి జిగురుకు అంటుకుంటాయి. తెల్లదోమ ఆశించినప్పుడు పైరితాయిడ్ మందులు వాడడం వెంటనే నిలిపి వేయాలి. ఎర్రనల్లిని అదుపులో వుంచటానికి లీటరు నీటికి 3 గ్రా, 50 శాతం నీళ్లలో కరిగే గంధకం లేక 5 మి.లీ డైకోఫాల్ కలిపి పిచికారి చేయాలి. పిండినల్లి ఆశించినప్పుడు తొలిదశలోనే గుర్తించి, కాండానికి మందు పూత ద్వారా నివారించుకోవాలి. లీటరు నీటికి 1 మి.లి డైక్లోర్వాస్తో పాటు 2 మి.లీ మిథైల్ పెరాథియాన్ లేక మలాథియన్ లేదా 3 మి.లీ క్వినాల్ఫాస్ కలిపి పిచికారి చేయాలి. కాయతొల్చు పురుగులు 10 శాతం పూతకు నష్టం వాటిల్లినప్పుడు, మొక్కకు ఒక పచ్చ పురుగు గుడ్డు లేదా లార్వా ఉన్నప్పుడు, 10 మొక్కలకు ఒక లద్దె పురుగు, గుడ్ల సముదాయం గమనించినప్పుడు, 10 శాతం గులాబీ రంగు పురుగు ఆశించిన గుడ్డి పూలు గుర్తించినప్పుడు కాయతొల్చు పురుగుల వలన పంటకు నష్టం అధికంగా ఉంటుంది. కాయతొల్చు పురుగుల సమగ్ర సస్యరక్షణ పంట మార్పిడి పద్ధతి అవలంబించాలి. వేసవి దుక్కులు లోతుగా దున్నాలి. 25 శాతం సేంద్రియ ఎరువులు, 75 శాతం రసాయన ఎరువులు వాడాలి. బొబ్బర (అలసంద), కొర్ర, సోయాచిక్కుడు, పెసర, మినుము, గోరుచిక్కుడు 1ః2 నిష్పత్తిలో అంతరపంటలుగా వేయాలి. చేనుచుట్టూ నాలుగు వరుసల జొన్న లేక కంచె పంటగా వేయాలి. లద్దెపురుగును ఆకర్షించడానికి ఎకరాకు 50 ఆముదపు మొక్కలు చేనంతా అక్కడక్కడ పెట్టి, ఆముదపు మొక్కలపై పెట్టిన లద్దెపురుగు గుడ్లను, జల్లెడ ఆకులను ఏరి నాశనం చేయాలి. శనగపచ్చపురుగును ఆకర్షించడానికి ఎకరాకు 100 పసుపు రంగు పూలు పూచే బంతిమొక్కలు పెట్టి మొగ్గలు, పూలలో వున్న పురుగులను ఏరివేయాలి. లద్దెపురుగు వలసను నియంత్రించడానికి చేను చుట్టూ అడుగు లోతున చాలు తీసి ఫాలిడాల్ లేక లిండేన్ పొడి మందు చల్లుకోవాలి. శనగపచ్చ పురుగు, లద్దెపురుగుల ఉనికిని, ఉధృతిని అంచనా వేయటానికి ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టాలి. ప్రతి బుట్టలో కొన్ని రోజులు వరుసగా రోజుకు గులాబి రంగు పురుగులు 8, శనగపచ్చ పురుగులు 10, పొగాకు లద్దె పురుగులు 20, మచ్చల పురుగులు 15 పడిన ఎడల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అక్టోబరు- నవంబరులో శనగపచ్చ పురుగు ఆశించిన యెడల ఎకరాకు 200 లార్వాలను సమానమైన పచ్చపురుగు వైరస్ ద్రావణం, లద్దె పురుగు ఆశిస్తే..200 ఎ.ఇ. లద్దెపురుగు వైరస్ ద్రావణంకు, కిలో బెల్లం ,100 మి.లీ శాండోవిట్ లేదా 50 గ్రా , రాబిన్బ్లూ పౌడరు కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. పురుగులను తినే పక్షులు వాలటానికి వీలుగా ’టి’ ఆకారపు కర్రలను లేక పంగల కర్రలను ఎకరాకు సూమరు 15-20 పెట్టాలి. పచ్చపురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నపుడు మూడవదశ దాటిన పచ్చపురుగును చేతితో ఏరివేసి ఇండాక్సాకార్బ్ లీటరు నీటికి 1 మి.లీ లేదా స్ఫైనోశాడ్ 0.3 మి.లీ లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రా కలిపి పిచికారి చేయాలి. పురుగుల మందు విషప్రభావం పెంచటానికి నువ్వులనూనెను, క్లోరిపైరిఫాస్ లేదా ఫెన్వలొరేటు లేదా సైపర్మెత్రిన్ మందులతో 1ః4 నిష్పత్తిలో కలిపి పిచికారి చేయాలి. పురుగుల నష్ట పరిమాణం దృష్టిలో వుంచుకోని లీటరు నీటికి క్వినాల్ఫాస్ 2.5 లేదా క్లోరిఫైరిఫాస్ 3 మి.లి లేదా ఎసిఫేట్ 1.5 గ్రా పిచికారి చేయాలి. పచ్చపురుగు గుడ్లు ఎక్కువగా వుంటే ప్రొపినోఫాస్ 2 మి.లి లేదా థయోడికార్బ్ 1.5 గ్రా లీటరు నీటి మోతాదులో కలిపి పిచికారి చేయాలి. ఒకేమందు ఎక్కువసార్లు పిచికారి చేయకుండా మందులు మార్చి వాడుకోవాలి. ప్రత్యేక సూచనలు మొక్క లేత ఆకులపైన, మొగ్గలపైన పెట్టే పచ్చపురుగు గుడ్లను గుర్తించి నాశనం చేయాలి. మూడవదశ దాటిన పచ్చపురుగు మీద పురుగు మందులు ఆశించినంత సమర్ధవంతంగా పనిచెయ్యవు. కాబట్టి చేతితో ఏరివేసి సస్యరక్షణ చేపట్టాలి. పంటకాలంలో సింథటిక్ పైరితాయిడ్ మందులు ఒకటి లేక రెండుసార్లు అవసరాన్ని బట్టి పిచికారి చెయ్యాలి. పచ్చపురుగు, తెల్లదోమ ఆశించినప్పుడు సింథటిక్ పైరితాయిడ్ మందులు పిచికారి చేయరాదు. గులాబి రంగు పురుగును మందుల ద్వారా సమర్ధవంతంగా అదుపుచేయుట కష్టతరం కాబట్టి గుడ్డిపూలను ఏరి నాశనం చేయాలి. మందు ద్రావణాన్ని సిఫారసు చేసిన మోతాదులో సిఫార్సు చేసిన సస్యరక్షణ పరికరాలతో సరైన పద్ధతిలో పిచికారి చేయాలి. -
ఆత్మహత్యలొద్దు..ఆదుకుంటాం
-
రూ. 4 లక్షల విలువైన పొగాకు పంట దగ్ధం
కర్నూలు: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో పొగాకు పంట దగ్ధమైంది. వివరాలు...బనగాన పల్లె మండలంలోని జిల్లెల గ్రామానికి చెందిన శివరామిరెడ్డి అనే రైతుకు చెందిన పొగాకు పంటకు బుధవారం ప్రమాదవశాత్తు నిప్పుంటుకుని పూర్తిగా కాలిపోయింది. పంట విలువ రూ.4 లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు. నంద్యాల నుంచి ఫైర్ ఇంజిన్ రాక ఆలస్యం కావడంతో పంట పూర్తిగా కాలిపోయిందని సంబంధిత రైతు వాపోయాడు. (బనగానిపల్లె)