పొగాకు పంటను స్థిరీకరించడంలో, రైతుకు మంచి లాభాలను అందించడంలో విశేషంగా తోడ్పడిన క్రాప్ హాలిడేను ఇతర వాణిజ్య పంటలకు కూడా వర్తింపచేయాల్సిన అవసరముంది. పొలం నుంచి ఓడరేవుకు చేరుకునేంతవరకు పంటల ఎగుమతి ప్రక్రియలో తప్పనిసరిగా అవసరమైన పంటల నాణ్యతను క్రాప్ హాలిడే ఎంతగానో మెరుగుపరుస్తుంది. పండ్లు, కూరగాయల పెంపకంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వీటిలో 40 శాతం ఇప్పటికీ వినియోగం లేక వృథాగా మిగిలి పోతున్నాయి. ఈ వృథాను అరికట్టడానికి గ్రామీణ ప్రాంతంలో శీతల గిడ్డంగులను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాల కల్పనను సమర్థంగా అమలు చేస్తే పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు జనం తిరిగి వలస పోవడానికి వీలు కల్పించినట్లవుతుంది.
ఇరవై ఏళ్ల క్రితం అంటే 2000 సంవత్సరంలో పొగాకు పంటకు క్రాప్ హాలిడే (పంట విరామం) భావనను నేనే పరిచయం చేశాను. పంట దిగుబడిని క్రమబద్ధీకరించడం, పురుగులు తెగుళ్లను నియంత్రించడం దీని లక్ష్యం. ఏదైనా నిర్దిష్టమైన పంటను ఒక సంవత్సరం పాటు పండించకుండా ఉండటమే క్రాప్ హాలిడే అంటే. పంటను స్థిరీకరించడంలో, రైతులకు మంచి లాభాలను అందించడంలో క్రాప్ హాలిడే విశేషంగా తోడ్పడింది. క్రాప్ హాలిడే విధించిన తదనంతర సంవత్సరాల్లో పంట నాణ్యత కూడా మెరుగైంది. దేశంలో పెరుగుతున్న ఇతర వాణిజ్య పంటలకు కూడా క్రాప్ హాలిడే భావనను వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేసి అధికపంటను పొందవచ్చు లేక పురుగులు, తెగుళ్ల కారణంగా పంట దెబ్బతినిపోవడాన్ని నిరోధించవచ్చు. దేశానికి అవసరమైన పంటల గురించి సమగ్ర సర్వేని ప్రారంభించడం ద్వారా క్రాప్ హాలిడే భావనను వర్తింపచేయవచ్చు.
పలురకాల పంటల ఉత్పత్తిలో భారత్ ప్రాధాన్య స్థానంలో ఉన్నప్పటికీ, ఆ పంటల ఎగుమతులు మాత్రం నిరుత్సాహకరంగా ఉన్నాయి. అధిక విలువ గల పంటలను పెంచడంలో భారత్ సామ ర్థ్యాన్ని పెంపొందించడానికి వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఒక సమగ్ర పథకం తీసుకునివస్తే అది రైతులకు ప్రయోజనకరంగా ఉండటమే కాదు.. విదేశీ ద్రవ్యమారకం ఆర్జించడంలో దేశానికి కూడా ఉపయోగపడుతుంది. పంటలను గుర్తించి వాటిపై విశేషంగా శ్రద్ధ పెట్టే క్రమంలో ఉత్తమ వ్యవసాయ విధానాల ద్వారా పంటల పరిమాణాన్ని, నాణ్యతను కూడా మెరుగుపర్చవచ్చు.
పంట ఎగుమతికి నాణ్యతే కొలమానం
ఎగుమతి కోసం ఓడరేవుకు చేరుకునేంత వరకు పంటల పరిమాణం లేక నాణ్యత ఏమాత్రం దెబ్బతినకుండా పంటను నిర్వహించుకోవడానికి అవసరమైనంత శిక్షణను ఈ పంటల ఉత్పత్తిదారులకు అందించాల్సి ఉంది. విధానాలను సరళీకరించి, సబ్సిడీ ధరలకే నాణ్యతా పరీక్షలను కల్పిస్తే ఎగుమతుల పెరుగుదలకు అది తోడ్పడుతుంది. పొలం నుంచి ఓడ రేవు వరకు పంటను తీసుకుపోవడానికి రైతు భరించిన ఖర్చులన్నింటినీ ఓడ రేవుకు పంట చేరుకున్న వెంటనే రైతుకు తిరిగి చెల్లిస్తే మరింత ముందడుగు వేసినట్లవుతుంది. దిగుమతిదారు చెల్లించే సేల్ ప్రోసీడింగ్స్ నుంచి తీసివేసి వాటిని రైతులకు చెల్లించవచ్చు. దిగుమతిదారు నుంచి క్రెడిట్ పొందడానికి వేచి చూస్తున్న రైతుకు దీంతో ఉపశమనం లభిస్తుంది కూడా. అంతేకాకుండా తమ ఉత్పత్తిని ఎగుమతి చేయడానికి పలువురు రైతులకు ఇది ఊతం కల్పిస్తుంది.
వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులందరికీ సింగిల్ విండో సదుపాయాన్ని కల్పిస్తే అవసరమైన డాక్యుమెంటేషన్, లాంఛనాలను రికార్డు సమయంలో పూర్తి చేసుకోవడానికి వీలవుతుంది. రైతు తమ పంటను నిల్వచేయగానే రాష్ట్ర ప్రభుత్వ ఎగుమతుల శాఖ ద్వారా ఆ పంటల ఎగుమతి క్రమాన్ని పూర్తి చేయాలి. ఇప్పుడైతే తమ పంటల ఎగుమతికి సంబంధించి రైతులు ఒక చోటి నుంచి మరొక చోటికి పరుగుతీయాల్సి వస్తోంది. దీంతో సమయం, డబ్బు వృథా అవుతున్నాయి.
కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి కొత్త వ్యవసాయ బిల్లుల నేపథ్యంలో, కాంట్రాక్టర్, రైతు కుదుర్చుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉండేందుకు ఒక యంత్రాంగం అవసరం. రైతు లేక స్పాన్సర్ ఎవరో ఒకరు కుదిరిన ఒప్పందాలను అతిక్రమిస్తున్నట్లు అనేక ఉదంతాలు బయటపడ్డాయి. మార్కెట్లో ధరలు చుక్కలంటినప్పుడు, రైతు తమ ఉత్పత్తిని కాంట్రాక్టుకు భిన్నంగా తన ఉత్పత్తిని బయట అమ్ముకుం టాడు. అలాగే తాము కుదుర్చుకున్న ధరకంటే తక్కువ ధరకు లభించే చోటనే వ్యవసాయ ఉత్పత్తులను కొనడానికి కాంట్రాక్టర్ కూడా పూనుకుంటాడు. ఈ క్రమరాహిత్యాన్ని అడ్డుకోవడానికి, కాంట్రాక్టు కంపెనీ/ వ్యక్తి ముందుగానే రైతుకు చెల్లిస్తామని చెప్పిన మొత్తంలో 50 శాతం మొత్తాన్ని రైతుకు చెల్లించివేయాల్సి ఉంది. కాంట్రాక్టు ప్రకారం తన పంటలో సగం భాగాన్ని రైతు సరఫరా చేసిన వెంటనే ఈ మొత్తాన్ని చెల్లించాలి. దీంతో తమ మధ్య కుదిరిన ఒప్పందానికి ఇరుపక్షాలూ కట్టుబడటం సాధ్యపడుతుంది.
అక్రమ నిల్వలను అరికట్టడం ఎలా?
అత్యవసర సరుకుల చట్టాన్ని రద్దు చేసిన కొత్త బిల్లుకు సంబంధించి చూస్తే పంటల కొనుగోలుదారు తన వద్ద ఉన్న నిల్వ సామర్థ్యం పరిమితులను దాటి తాను కొన్న పంటను నిల్వ చేసుకునే అవకాశం అన్ని వేళలా ఉంటుంది. మరిన్ని గోడౌన్లను లీజుకు తీసుకుని పంటను అధికంగా నిల్వ చేయవచ్చు. దీనిద్వారా అతడు సరుకుల కొరతను సృష్టించి తద్వారా ఆ పంటకు అధిక ధర పొందగలడు. ఇలాంటి పరిస్థితిని నిరోధించడానికి, తమ వద్ద ఉన్న నిల్వ సామర్థ్యం గురించి కొనుగోలుదారులు తప్పనిసరిగా ప్రకటించాలని ఆదేశించాలి. ఇలా అయితే అక్రమ నిల్వలను అరికట్టవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కొనుగోలుదారు అదనపు నిల్వ సామర్థ్యానికి దరఖాస్తు చేసుకుని పంట ఉత్పత్తులను సేకరించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ సేకరణ కార్యకలాపాలన్నీ ఏపీఎమ్‌సీ ప్రాంగణంలో మాత్రమే జరగాలి. అప్పుడు మాత్రమే పంటల రాక, ధరలు, విక్రేతల గుర్తింపును నజావుగా నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రస్తుత మార్కెటింగ్ మౌలిక వ్యవస్థను, మానవ శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. సరఫరా స్థాయిలను ప్రభావితం చేసేటటువంటి వాణిజ్యపరంగా ప్రాధాన్యత గల పంటలు, అవి పండే అవకాశమున్న ప్రాంతాలకు సంబంధించి సరుకు పరిస్థితిపై నివేదికలను సిద్ధం చేయాలి. ఈ నివేదికలను నిజ సమయ డేటాతో నవీకరించాలి. ఇది ఒక సరుకు కొరతను, లేక అధిక సరఫరాను గుర్తించడంలో ముందుగానే అవగాహనను కల్పించడమే కాకుండా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలోనూ తోడ్పడుతుంది. సరుకు సరఫరా తక్కువగా ఉన్నప్పుడు లేక అధిక సరఫరా జరిగినప్పుడు దిగుమతి చేసుకోవడం లేక సేకరించడంపై ప్రభుత్వం తగు చర్య తీసుకోవచ్చు. ఇప్పుడయితే ఈ రెండు చర్యలను ప్రభుత్వం చాలా ఆలస్యంగా చేపడుతుండటంతో రైతుల్లో నిస్పృహ ఏర్పడుతోంది.
అపరిమిత స్థాయిలో పంటల వృథా!
పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశానికి ఉన్న సామర్థ్యాన్ని పరిశీలిస్తే, వీటి ఎగుమతుల నుంచి మరింత ప్రయోజనం పొందవచ్చు. తగిన పరిమాణంలో నాణ్యమైన ఉత్పత్తి సాధ్యపడే ప్రాంతాల్లో ఉత్పత్తి సంస్థలకు తగిన పెట్టుబడి, శిక్షణ, సబ్సిడీ మద్దతును కల్పించి మెరుగైన చెల్లింపులు చేసే దేశాలకు ఆ ఎగుమతులను పంపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయల పెంపకంలో భారత్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ వీటిలో 40 శాతం ఇప్పటికీ విని యోగం లేక వృధా అవుతున్నాయి. భారత్‌లో ఇలాంటి వృథా ఏ స్థాయిలో ఉంటోందంటే అది ఆస్ట్లేలియా మొత్తం ఉత్పత్తికి సమానంగా ఉంటోంది. ఇలాంటి పంటల వృథాను అరికట్టడానికి గ్రామీణ ప్రాంతం మొత్తంగా శీతల గిడ్డంగులు, కోల్ట్ చైన్స్‌ని విస్తృత స్థాయిలో ఏర్పాటు చేయడం ఎంతైనా అవసరం.
రైతుల సంక్షేమానికి, గ్రామీణాభివృద్ధి కోసం ప్రతి ఏటా కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. దీన్నుంచి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి అని మదించాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికోసం నీతి ఆయోగ్, జాతీయ గణాంకాల సంస్థ, ప్రధాన ఆర్థిక సలహాదారు వంటి వారిని పురమాయించాలి. ఆ విధంగానే ప్రభుత్వం సరైన రీతిలో సంక్షేమ నిధుల ఖర్చు వ్యవహారాలను మదించి ఉత్తమ ఫిలితాలను సాధించవచ్చు.
రివర్స్ వలసకు అదే కీలకం
గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నత వృత్తివిద్యా కోర్సులను చదివే అవకాశాలను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పొందలేకపోతున్నారు. కాబట్టి దేశంలోని అన్ని వృత్తి విద్యా కళాశాలల్లో కనీసం 15 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించాలని నేను సూచిస్తున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో అయిదేళ్లు చదివిన వారు
ఈ సీట్లను పొందడానికి పరీక్షలో అర్హత సాధించాలి. పీయూఆర్‌ఏ (గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పన) భావనను ముఖ్యంగా విద్య, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో అమలు చేయాలి. దీనివల్ల పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తిరిగి వలస పోవడానికి వీలు కల్పించినట్లవుతుంది.
(2021–22 బడ్జెట్ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థిక శాఖామంత్రికి పంపిన సూచనల సారాంశం)
వ్యాసకర్త: డాక్టర్ యలమంచిలి శివాజీ, రాజ్యసభ మాజీ ఎంపీ, కిసాన్ ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు
మొబైల్: 98663 76735
Comments
Please login to add a commentAdd a comment