రాష్ట్రాల చేతికి ‘గిట్టుబాటు ధర’
సందర్భం
బడ్జెట్ గురించి చర్చించడానికి ఏర్పా టైన ఈ సమావేశానికి నన్ను ఆహ్వా నించినందుకు కేంద్ర ఆర్థికమంత్రికి ధన్యవాదాలు చెబుతూ, ఈ సమా వేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను, వెలువడిన సూచనలను పరిగణన లోనికి తీసుకుని విలువనిస్తారని ఆశిస్తున్నాను.
వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తిగా, ప్రధానంగా రాజ్యసభలో వ్యావసాయిక అంశాలు మాట్లాడిన సభ్యునిగా దేశంలో సేద్యం స్థితిగతులను ఈ సమావేశం దృష్టికి తీసుకువస్తున్నాను.
భారత్ వెలిగిపోతున్నదని, ప్రపంచంలోనే అత్యున్నత పెరు గుదల రేటును సాధించిందని మనం గట్టిగా చెప్పవచ్చు. అయినప్పుటికి దేశంలోని చాలా ప్రాంతాలలో రైతులు నిరాశా నిస్పృహలకు లోనవుతూ ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత విషాదకరం. జాతీయ నేరాల నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) ఇచ్చిన వివరాల ప్రకారం 2014లో 5,650 మంది రైతన్నలు బల వన్మరణాలకు పాల్పడ్డారు. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు సరైన వివరాలు ఇవ్వకుండా వాస్తవాలు దాచి పెడుతున్నాయి. రాష్ర్ట ప్రభుత్వాలు చెబుతున్న సంఖ్య కంటే రైతు మరణాలు వాస్తవంగా ఎక్కువే ఉంటాయని నేను కచ్చితంగా నమ్ముతున్నాను.
ఇలా రైతులు ఎందుకు అర్ధంతరంగా జీవితాలను అంతం చేసుకుంటున్నారు? సేద్యం ఏమాత్రం లాభసాటిగా లేకపోవ డమే ఇందుకు ప్రధాన కారణం. స్వాతంత్య్రం సిద్ధించి ఆరు దశాబ్దాలు గడిచిపోతున్నప్పటికీ, సేద్యం అంటే నేటికీ రుతు పవనాలతో ఆడే జూదంగానే మిగిలిపోయింది. దేశంలోని చాలా ప్రాంతాలు అటు దుర్భిక్షంతో లేదా వరదలతో ఏటేటా విధ్వం సకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. పొలాలలో వేసే ఎరువులు, క్రిమిసంహారకాలు, నీటి పారుదల, విద్యుత్ సౌకర్యానికి అయ్యే వ్యయం అపారంగా పెరిగాయి. కానీ అందుకు తగ్గట్టుగా వ్యవ సాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు మాత్రం పెరగడం లేదు. దీని ఫలితంగానే పెద్ద సంఖ్యలో రైతాంగం అప్పుల పాలవు తున్నారు. ఈ రుణ బాధ నుంచి బయటపడే మార్గం కనిపించ కపోవడంతోనే వారు బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారు.
ఈ మొత్తం దుష్పరిణామాలలో మరో విషాదకోణం ఏమి టంటే, రాష్ట్రాల ప్రభుత్వాలు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు నామమాత్రంగా నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. ఎక్కడైనా రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు జరిగితే హుటాహుటిన పరామర్శకు పరుగెత్తే మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు రైతులు ఆత్మహత్య చేసు కుంటే మాత్రం ఏమీ పట్టనట్టు ఉండిపోతున్నారు. రైతాంగానికి భవిష్యత్తు పట్ల ఆశావహమైన మాటలు చెప్పేవారే కరువ వుతున్నారు.
ఇలాంటి వాతావరణాన్ని నివారించడానికి తక్షణమే తీసు కోగలిగిన కొన్ని చర్యల గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. ఉదాహరణకి వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధర ప్రకటన విషయం తీసుకుందాం. 27 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను ప్రకటిస్తుంది. ఈ మద్దతు ధర ప్రకటన వ్యవహారం చాలా అసహజంగా కనిపిస్తుంది. ఉత్పత్తి వ్యయాలు ఒక రాష్ట్రానికీ వేరొక రాష్ట్రానికీ మారడమే కాదు, నిజానికి ఒకే రాష్ట్రంలో కూడా వివిధ ప్రాంతాలలో వేర్వేరుగా ఉంటాయి. దీనికితోడు వరి, గోధుమ, పత్తి పంటలకు ప్రకటించిన మద్దతు ధరలను అమలు చేసే బాధ్యత భారత ఆహార సంస్థ, సీసీఐ (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) చేతులలో ఉంచారు.
పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇవ్వవలసిందని నేను సూచిస్తు న్నాను. ఎందుకంటే కేంద్రం కంటే రాష్ట్రాల ప్రభుత్వాలకే వ్యవసాయోత్పత్తులు జరిగే క్షేత్రాల వివరాలు ఎక్కువగా తెలు స్తాయి. అలాగే ఆ ఉత్పత్తుల ధరలను నిర్ధారించడంలో కేంద్రం కంటే రాష్ట్రాలే మరింత వాస్తవికంగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ కేంద్రం కంటే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర ఎక్కువగా ఉంటే, తమ తమ వనరుల నుంచే రాష్ర్ట ప్రభుత్వాలు చెల్లించే ఏర్పాటు చేయాలి. నిజానికి వ్యవసా యోత్పత్తులలో తీవ్రమైన పతనం ఉంటే కనీస మద్దతు ధర మేరకు ఉత్పత్తుల సేకరణ జరిగినప్పటికీ రైతులు రుణ విముక్తులు కాలేరు. దుర్భిక్షం, వరదలు, తెగుళ్లు, చీడపీడల కారణంగా ఉత్పత్తి తగ్గడానికి ఎప్పుడూ అవకాశాలు పొంచి ఉంటాయి. నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులు వారికి వారే బయటపడాలి. అదే ఒక పరిశ్రమ ఖాయిలా పడితే ఆ పారి శ్రామికవేత్తను, అతడి మీద ఆధారపడిన కార్మికులను ఆదు కోవడానికి ప్రభుత్వమే ముందుకు వస్తుంది. పన్నులు, సుంకాలు మాఫీ చేయడం, ఎంతో కొంత ఒకేసారి బ్యాంకు రుణం చెల్లించే ఏర్పాటు వంటి సౌకర్యాలు ఉంటాయి.
రైతుల విషయంలో ఎంతో ఆడంబరంగా ప్రకటించిన పంటల బీమా పథకం కూడా వారికి అక్కరకు రావడం లేదు. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి పంట ధ్వంసమైన తీరు మీద ఆధా రపడి అది చెల్లిస్తారు. పంటల బీమాను కొంచెం సర్దుబాటు చేయ లేమా? ప్రీమియం చెల్లించిన ప్రతి రైతుకు, పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం చెల్లించడం సాధ్యం కాదా?
అలాగే, వ్యవసాయ కార్యకలాపాలకు ఆటంకం రాని రీతిలో, ఆ రంగానికి కార్మికుల కొరత లేని పద్ధతిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలి. ప్రతి పంచాయతీ కార్మికుల వివరాలను నమోదు చేసుకుంటూ పొలం పనుల సమయంలో రైతులకు ఆ కార్మికులను పంపే ఏర్పాటు చేయవచ్చు. పొలం పనుల సీజన్ ముగిశాక ఇతర పనులకు నియోగించవచ్చు. కార్మికులు ఎవరైనా పొలం పనులకు వెళ్ల డానికి నిరాకరిస్తే వారిని ఈ జాబితా నుంచి తొలగించి, వేరే జీవనోపాధి చూపాలి.
అటు భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కళ్లం దగ్గర పలికిన ధరకూ, మార్కెట్ ధరకు మధ్య వ్యత్యాసాన్ని బాగా తగ్గించాలి. మధ్య దళారుల ప్రమేయాన్ని అదుపు చేయాలి. ఇటీవల ఏం జరిగిందో అంతా గుర్తు చేసుకోవాలి. తృణధాన్యాల ధరలు ఆకాశాన్నంటినప్పటికీ, మార్కెట్‌లో పలికిన ధరలో 20 శాతం కూడా రైతుకు దక్కలేదు.
వస్తువుల తయారీ రంగంలో 1991 నుంచి భారత ప్రభుత్వం లెసైన్స్ రాజ్‌ను పటాపంచలు చేసింది. అయితే సరళీకరణ గాలులు ఇప్పటికీ వ్యవసాయరంగాన్ని తాకలేదు. వ్యవసాయోత్పత్తులకు గిరాకీ ఉన్న మార్కెట్‌లో తమ ఉత్పత్తులను అమ్ముకునే స్వేచ్ఛకు రైతులు ఇప్పటికీ నోచు కోలేదు. అయితే పారిశ్రామికవేత్తలకు ఈ విషయంలో ఎంతో స్వేచ్ఛ ఉంది. మొత్తం భారత మార్కెట్‌ను రైతుల మార్కెట్‌గా గుర్తించాలని కోరుతున్నాను. వినియోగదారుల పేరుతో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు రైతుకు చేటు చేస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతాలలో పాఠశాలలు, ఆస్పత్రులు అందు బాటులోకి తేవడంతో పాటు, పరిశుభ్రమైన తాగునీరు, మంచి పారిశుధ్యం ఏర్పాటు చేసి అక్కడ నుంచి వలసలను అరికట్ట వలసిందిగా రాష్ట్రాలకు కేంద్రం సూచించాలి. వలసలు ఎక్కువ కావడం వల్ల చాలా పట్టణాలు, నగరాలలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. పల్లెలు కేవలం వృద్ధుల ఆవాసాలుగా మిగిలిపోతున్నాయి. గ్రామాలను నివాసయోగ్యాలుగా మలుచు కుంటే తప్ప వలసలను ఆపలేమన్న సంగతిని అంతా గమనించాలి.
(జనవరి 4, 2016న జరిగిన బడ్జెట్ అంచనాల ముందస్తు సమావేశంలో సమర్పించిన పత్రంలోని అంశాలు. రైతుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ పత్రం సమర్పించారు.)
(వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు నేత)
డా॥యలమంచిలి శివాజి