
కేంద్ర బడ్జెట్(Union Budget) ప్రవేశ పెట్టడానికి ముందు చేపడుతున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో వివిధ పథకాల గురించి చర్చించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వారి సలహాలను కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 3.5-4 శాతం వృద్ధి రేటును సాధించడంపై వర్చువల్ సమావేశంలో చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు.
2023 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా ఉన్న గ్రామీణ పేదరిక రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా 5 శాతం కంటే తక్కువకు పడిపోయిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదికను ఆయన స్వాగతించారు. ప్రభుత్వ సంస్థ ఐసీఏఆర్ పరిశోధనల ద్వారా హెక్టార్‌కు ప్రస్తుతం నమోదవుతున్న ఉత్పత్తిని పెంచడం, కొత్త విత్తన వంగడాలను తయారు చేయడంతోపాటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఆరు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, నూతన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా
పీఎం కిసాన్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, డీఏపీ ఎరువుల సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డు(Credit Card), ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎంఏఏఎస్ఏ) సహా కీలక పథకాల్లో పురోగతి ఉందని చౌహాన్ వివరించారు. వ్యవసాయ రంగంలో నిరంతరం పురోగతి నమోదువుతుందని, దాని కోసం అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.