shivaraj singh chouhan
-
మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అలజడి.. వెలుగులోకి భారీ స్కాం?
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన పోషకాహార పథకంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది. రేషన్ సరుకులను తరలించేందుకు వినియోగించిన ట్రక్కుల నంబర్లు బైకులుగా తేలటం నుంచి.. లబ్ధిదారుల వాస్తవానికి దూరంగా ఉండటం వరకు భారీ స్థాయిలో అవినీతి వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంతో చిన్నారులు, మహిళలు పోషకాహారలోపానికి గురికావటంతో పాటు పన్ను చెల్లింపుదారుల కోట్లాది రూపాయలు అవినీతిపరుల చేతిలోకి వెళ్లినట్లు రాష్ట్ర ఆడిటర్ గుర్తించారు. పాఠశాల చిన్నారులకు ఉచిత ఆహారం పథకంలో అవినీతి జరిగినట్లు మధ్యప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ రూపొందించిన 36 పేజీల నివేదికలోని పలు అంశాలు బయటకి రావటం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో అలజడి సృష్టిస్తోంది. 2021కి సంబంధించిన టేక్ హోమ్ రేషన్ పథకంలో దాదాపు 24 శాతం మంది లబ్ధిదారుల వివరాలను పరిశీలించినట్లు నివేదిక తెలిపింది. ఈ పథకం ద్వారా 34.69 లక్షల మంది 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు పిల్లలు, 14.25 లక్షల గర్భిణీ మహిళలు, పాలిచ్చే తల్లులు, 0.64 లక్షల మంది పాఠశాల మానేసిన బాలికలకు పోషకాహారం అందించారు. నకిలీ ట్రక్కులు.. పోషకాహార పథకంలో భాగంగా వివిధ ఉత్పత్తి ప్లాంట్ల నుంచి సుమారు 1,125.64 మెట్రిక్ టన్నుల రేషన్ సరుకులను సరఫరా చేశారు. రవాణా కోసం ట్రక్కులకు రూ.6.94 కోట్లు ఖర్చు చేశారు. అయితే, ట్రక్కులుగా లెక్కలో చూపిన వాహనాలు బైకులు, కార్లు, ఆటోలు, ట్యాంకర్లుగా రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. దీంతో సరుకుల రవాణాలోనే కోట్లాది రూపాయలు దారిమళ్లినట్లు స్పష్టమవుతోంది. 9వేలు ఉండాల్సింది.. 36.08 లక్షలు రేషన్ తీసుకునేందుకు అర్హులైన పాఠశాల మానేసిన బాలికల వివరాలను 2018, ఏప్రిల్‌లోపు సేకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే, 2021, ఫిబ్రవరి వరకు ఆ వివరాలను సేకరించలేకపోయింది మహిళా, శిశుసంక్షేమ శాఖ. మరోవైపు.. పాఠశాల విద్యా విభాగం రాష్ట్రంలో స్కూల్ మానేసిన బాలికలు 2018-19 మధ్య 9వేల మంది ఉంటారని అంచనా వేసింది. అయితే, మహిళా, శిశు సంక్షేమ శాఖ ఎలాంటి సర్వే నిర్వహించకుండానే 36.08 లక్షల మందిగా తేల్చింది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రతినిధులను ప్రశ్నించగా ఎలాంటి స్పందన లేదని పలు మీడియాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: ‘రామన్ మెగసెసె’ అవార్డు తిరస్కరించిన కేరళ మాజీ ఆరోగ్య మంత్రి -
ఉప ఎన్నికల్లో బీజేపీ హవా
ఆ ఇద్దరు పెద్దలు ఇక ఢిల్లీకి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే కాంగ్రెస్ నాయకులు తమ ఓటమిని అంగీకరించినట్లే అన్నారు రాష్ట్ర మంత్రి నరోత్తం మిశ్రా. ఇక దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్ ఢిల్లీకి వెళ్లాల్సిందే అన్నారు. మధ్యప్రదేశ్‌లో గెలుపు తమదే అని స్పష్టం చేశారు. యూపీలో అధిక్యంలో కొనసాగుతున్నబీజేపీ లక్నో: మద్యప్రదేశ్తోపాటు గుజరాత్లో 8 స్థానాలకు, ఉత్తరప్రదేశ్‌లో 7, మణిపూర్‌లో 4, జార్ఖండ్‌లో 2, కర్ణాటకలో 2, నాగాలాండ్‌లో 2, ఒడిశాలో 2, ఛత్తీస్‌గఢ్‌లో 1, హర్యానాలో 1 ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఇక ప్రస్తుతం యూపీలో 4 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగతుండగా.. ఎస్పీ 2 స్థానాల్లో.. బీఎస్పీ 1 చోట ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. గుజరాత్లో బీజేపీ 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కమల్‌నాథ్ కౌంటింగ్ జరుగుతున్నందున మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. మధ్యప్రదేశ్‌లోని 28 సీట్లలో 18 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. బీజేపీ 18 స్థానాల్లో.. కాంగ్రెస్ 8, బీఎస్పీ 2 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి 9 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగతున్న బీజేపీ మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ 9 స్థానాలోల ఆధిక్యంలో కొనసాగుతుండగా.. కాంగ్రెస్ ఒక్క చోట ఆధిక్యంలో ఉంది. భోపాల్: మధ్యప్రదేశ్‌లోనూ 28 శాసనసభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏడు నెలల క్రితం జ్యోతిరాదిత్య సింధియా.. కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చి.. తన వర్గంతో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం బీజేపీ తరపున 107, కాంగ్రెస్ పార్టీ తరపున 87మంది ఎమ్మెల్యేలున్నారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకోవాలంటే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ మరో 8 సీట్లు గెలుచుకోవాలి. ఒకవేళ 28 స్థానాల్లో ఎక్కువ చోట్ల కాంగ్రెస్ నెగ్గితే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే అవకాశముంటుంది. వీటిలో 27 చోట్ల ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. -
బై పోల్స్: ఫలితం ప్రభుత్వాన్ని కూల్చుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉప ఎన్నికలు ప్రధాన పార్టీల నడుమ మరోసారి రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. 94 అసెంబ్లీ స్థానాలకు బిహార్‌లో రెండోదశ పోలింగ్ ప్రారంభమవ్వగా.. ఈ స్థానాలు జేడీయూ, ఆర్జేడీకి ఎంతో ముఖ్యమైనవి. ఎన్డీయే తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో పాటు కేంద్రమంత్రులు సైతం ఆయా నియోజకవర్గల్లో సుడిగాలి పర్యటన చేశారు. జేడీయూ-బీజేపీ అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి రెండోదశ పోలింగ్ అత్యంత కీలమైనది. కూటమి తరుఫున తేజస్వీ అన్నీ తానై ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. ఇక 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి ఇప్పటికే తొలిదశ పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. మరోవైపు మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రత్యేక దృష్టికి ఆకర్షించాయి. కమల్‌నాథ్ సర్కార్‌ను కూల్చి బీజేపీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యే రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మరో మూడు స్థానాలు కలుపుకుని మొత్తం 28 స్థానాలకు పోలింగ్ ఇదివరకే మొదలైంది. ఈ ఎన్నికను అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 28 స్థానాల్లో తొమ్మిదింటిలో గెలిస్తే శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉంటుంది. అలాగే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన జ్యోతిరాధిత్య సింధియాకూ ఈ ఎన్నిక కీలకమైనది. ఆయన వర్గంగా భావిస్తున్న ఎమ్మెల్యేలంతా పోటీలో ఉండటంతో బీజేపీ నాయకత్వంలో వారి గెలుపు బాధ్యతను యువ నేతపై మోపింది. కాంగ్రెస్ నుంచి అవమానానికి గురై తిరుగుబాటు చేసిన సింధియా ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలని కసితో రగిలిపోతున్నారు. అదే స్థాయిలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం సైతం జోరుగా నిర్వహించారు. మరోవైపు చేతిలో ఉన్న అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న 28 సీట్లు గెలిచినా మ్యాజిక్ ఫిగర్‌కు ఒక్క అడుగు దూరంలో ఆ పార్టీ నిలిచిపోతుంది. అయినప్పట్టికీ స్వతంత్రుల మద్దతులో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమల్‌నాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని మారుస్తాయా? లేక ఏకపక్ష తీర్పు రానుందా అనేది వేచి చూడాలి. కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలే ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగటం గమనార్హం. మరోవైపు గుజరాత్(8), కర్ణాటక(2), చత్తీస్‌గఢ్(1), ఉత్తర ప్రదేశ్(7), జార్ఖండ్(2), నాగాలాండ్(2), హరియాణా(1), ఒడిశా(2), తెలంగాణ (దుబ్బాక)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. -
మధ్యప్రదేశ్‌లో చౌహాన్ ఏలుబడి
కరోనా వైరస్‌పై దేశమంతా పోరాడుతున్న వేళ మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్‌చౌహాన్ నేతృత్వాన ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని గెలుచుకుంది. తన పక్షానికి చెందిన 22మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన కారణంగా అర్ధాంతరంగా అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించడంతో తీర్మానం మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా కలవరం గణనీయంగానే వుంది. చౌహాన్ ప్రమాణస్వీకారానికి ఈ కారణంగానే ఢిల్లీ పెద్దలెవరూ హాజరుకాలేదు. బీజేపీ పరిశీలకులు అరుణ్‌సింగ్, వినయ్ సహస్రబుధేలిద్దరూ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో ఇంతవరకూ 15 కరోనా కేసులు బయటపడగా, ఏడు జిల్లాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు కారణంగా సీఎం పదవి నుంచి తప్పుకున్న కమల్‌నాథ్ ఈ నెల 20న మీడియా సమావేశం పెట్టినప్పుడు దాదాపు 200 మంది ప్రతినిధులు హాజరుకాగా, ఆ తర్వాత వారిలో ఒకరు కరోనా వ్యాధిగ్రస్తుడిగా తేలారు. వారంతా ఇప్పుడు వైద్య పర్యవేక్షణలో ఉంటున్నారు. వేరే రాష్ట్రాల తరహాలోనే మధ్యప్రదేశ్ కూడా ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుందో దీన్నిబట్టి అర్ధమవుతుంది. కానీ అధికారం కోసం నువ్వా నేనా అన్నట్టు పోరాడుతున్న పార్టీలకు ఇవి పట్టలేదు. అధికారాన్ని ఎలాగైనా నిలుపుకుందామని కాంగ్రెస్, ఆ పార్టీని సాధ్యమైనంత త్వరగా సాగనంపాలని బీజేపీ పోటాపోటీగా పనిచేశాయి. కరోనా సమస్యపై దృష్టి కేంద్రీకరించాల్సిన సమయంలో రాజకీయ సంక్షోభం ఏర్పడటం అందరినీ కలవరపెట్టింది. క్లిష్ట సమయంలో అధికార యంత్రాంగానికి మార్గదర్శకత్వంవహించి, వారిని సరైన దిశగా కదల్చాల్సిన రాజకీయ నాయకత్వం ఇలా అధికార కుమ్ములాటల్లో పడటం మంచిది కాదని అందరూ భావించారు. ఏమైతేనేం...ఇదంతా త్వరగానే సద్దుమణిగిందనుకోవాలి. అయితే శివరాజ్‌సింగ్ చౌహాన్ సగటు రాజకీయ నాయకుల్లాంటివారు కాదు. ఆయన సచ్చీలుడని, ఉన్నత విలువలు పాటించేవారని అందరికీ విశ్వాసం వుంది. ఆయన్ను మెతక స్వభావి, వివాదరహితుడు అని కూడా అంటారు. చౌహాన్ మూడు దఫాల ఏలుబడిలో మధ్యప్రదేశ్ రూపురేఖలు మారాయని, ఆయనందించిన సమర్ధవంతమైన పాలనే ఇందుకు కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ‘వ్యాపమ్’ కుంభకోణం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించినా, అందులో చౌహాన్ ప్రమేయం వున్నట్టు ఎక్కడా రుజువు కాలేదు. ఆ కుంభకోణంలో దోషులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయడంలో ఆయన మరింత పకడ్బందీగా వ్యవహరించి వుండాల్సిందన్న విమర్శలైతే వున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఆయన అందించిన పాలనే ఆ రాష్ట్రంలో బీజేపీకి వరస విజయాలు సాధించిపెట్టింది. 2018 చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కూ, బీజేపీకి మధ్య అయిదారు స్థానాల వ్యత్యాసమే వుంది. తల్చుకుంటే అప్పుడే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడేది. కానీ శివరాజ్‌సింగ్ చౌహాన్ అలాంటి రాజకీయ ఎత్తుగడలకు తావివ్వలేదు. ప్రజలు తమను ప్రతిపక్షంలో కూర్చోమని ఆదేశించారు గనుక ఆ తీర్పును శిరసావహిస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు. దీన్నందరూ ప్రశంసించారు. వేరే రాష్ట్రాల్లో తగినంత మెజారిటీ రాని స్థితిలో సైతం రాజకీయ చాణక్యంతో అధికారాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధపడే బీజేపీ కేవలం ఆయన నిర్ణయం కారణంగానే మధ్యప్రదేశ్‌లో ఆ మార్గాన్ని అనుసరించలేదు. కానీ 14 నెలలు గడిచేసరికి పరిస్థితి మారిపోయింది. చౌహాన్ తన వైఖరిని మార్చుకున్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ తన అంతర్గత వ్యవహారాలను సకాలంలో చక్కదిద్దుకుని వుంటే బీజేపీ కొత్త ఎత్తుగడ ఫలించేది కాదు. వేరే రాష్ట్రాల తరహాలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంతంగా బీజేపీ వైపు వెళ్లే సాహసం చేయలేదు. ఎందుకంటే గెలిచినవారంతా దాదాపు మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరో మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, మొన్నీమధ్య బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియా శిబిరాల్లో వున్నారు. ఆ నేతలు కనుసైగ చేస్తే తప్ప వీరెవరూ ఫిరాయించే రకం కాదు. కనుకనే ఈ సంక్షోభానికి ముందు ఎనిమిదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ వెళ్లి ఓ హోటల్లో బసచేసి పార్టీపై అసంతృప్తి ప్రకటించినప్పుడు దాన్ని చల్లార్చడంలో దిగ్విజయ్ సింగ్ విజయం సాధించారు. ఆ ఎమ్మెల్యేల తిరుగుబాటులో జ్యోతిరాదిత్య ప్రమేయం వున్నదన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత 22 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు రిసార్ట్‌కు వెళ్లి కాంగ్రెస్ నుంచి తప్పుకున్నారు. ఆ రెండు ఉదంతాలతోనూ తమకు సంబంధం లేదని, అవి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల కారణంగా జరుగుతున్నవేనని బీజేపీ ప్రకటించింది. జ్యోతిరాదిత్యను కాంగ్రెస్ అధిష్టానం సకాలంలో బుజ్జగించివుంటే గురుగ్రామ్ ఉదంతం తరహాలోనే ఆ 22మంది కూడా వెనక్కు వచ్చేవారేమో! కానీ అది జరగలేదు. దింపుడు కళ్లం ఆశలా దిగ్విజయ్ తదితరులు బెంగళూరు వెళ్లి భంగపడ్డారు. వారంతా జ్యోతిరాదిత్య వర్గం కావడమే ఇందుకు కారణం. అయితే చౌహాన్ అసలు బలనిరూపణ ముందుంది. ఈ కరోనా సంక్షోభం సమసిపోయాక మొత్తం 24 స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సివుంది. అందులో విజయం సాధించడంపైనే ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడివుంది. ప్రస్తుతం 230మంది సభ్యుల అసెంబ్లీలో రాజీనామాలు చేసిన వారిని మినహాయిస్తే 206మంది మాత్రమే వున్నారు. కనుక ప్రభుత్వం ఏర్పర్చడానికి కావలసిన బలం 104 మాత్రమే. సభలో బీజేపీకి ప్రస్తుతం 107మంది సభ్యులుండగా, 22మంది రాజీనామాలతో కాంగ్రెస్ బలం 92కి పడిపోయింది. జరగబోయే ఉప ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ జవసత్వాలు పుంజుకుని తన సత్తా చాటుకుంటుందా లేక ఈ ఒరవడిలోనే కొట్టుకుపోతుందా అన్నది చూడాలి. -
ప్రభుత్వాన్ని కూలిస్తే ఎమ్మెల్యేకు రూ.45కోట్లు
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ భారతీయ జనతా పార్టీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.25కోట్ల నుంచి రూ.45కోట్ల లంచం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, నరోత్తమ్ మిశ్రా వ్యూహాలు పన్నుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండడం ఇష్టం లేక బహిరంగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని దిగ్విజయ్ పేర్కొన్నారు. చదవండి: పొత్తులపై క్లారిటీ.. నితీష్‌ను టార్గెట్ చేసిన ప్రశాంత్ అయితే ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే ఇప్పటికిప్పుడు రూ.5కోట్లు.. బలనిరూపణ సమయంలో మిగిలిన డబ్బును అందించనున్నట్లు బీజేపీ సంప్రదింపులు జరిపిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని దిగ్విజయ్ తెలిపారు. అయితే మధ్యప్రదేశ్‌ని కర్ణాటకలా మార్చాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 109, కాంగ్రెస్ 114 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ పార్టీ నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చదవండి: ఢిల్లీ అల్లర్లపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు -
డాన్సింగ్ వీడియో : సీఎంకు చేదు అనుభవం
భోపాల్ : గత రెండురోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ.. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా ఆకర్షించిన డాన్సింగ్ అంకుల్ ఎవరో తెలిసిపోయింది. అయన పేరు సంజీవ్ శ్రీవాస్తవ. గోవిందా వీరాభిమాని అయిన సంజీవ్ మధ్యప్రదేశ్‌లోని విదిశకు చెందినవారు. మధ్యప్రదేశ్‌లోని బాబా యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సంజీవ్‌కు.. వాళ్ల అమ్మ నుంచి ఈ నృత్యకళ అబ్బిందని తెలిపారు. ‘నా డాన్సింగ్ వీడియో ఇంతలా వైరల్ అవుతుందని అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. నన్ను సపోర్టు చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు అంటూ’ సంజీవ్ వ్యాఖ్యానించారు. అయితే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఈ డాన్సింగ్ అంకుల్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంజీవ్‌ను పొగడుతూ చేసిన ట్వీట్ ఆయన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ‘మా విదిశలోని భోపాల్‌లో పనిచేసే ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ డాన్స్ భారత్ మొత్తానికి వినోదం పంచుతోంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా సరే.. మధ్యప్రదేశ్ నీళ్లలోనే ఏదో మహత్తు, ప్రత్యేకత ఉన్నాయి’అంటూ శివరాజ్ సింగ్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందనగా.. ‘ మధ్యప్రదేశ్ నీళ్లల్లో ప్రత్యేకత ఉన్నప్పటికీ పాపం ఎందుకనో అన్నదాతల కష్టాలు తీరడం లేదు. మరి వారి కష్టాలకు కారణం ఎవరో అంటూ’ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. ‘ మధ్యప్రదేశ్‌లో అందరూ, అన్నీ ప్రత్యేకమైనవే.. ఒక్క మీరు తప్ప.. మీ శ్రద్ధ కాస్త రైతుల మీదకి కూడా మళ్లిస్తే మంచిది’ అంటూ మరొకరు వ్యంగంగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా రైతుల పట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, వ్యాపమ్ కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. हमारे विदिशा के भोपाल में कार्यरत प्रोफ़ेसर श्री संजीव श्रीवास्तव जी की ज़िंदादिली ने पूरे भारत में इंटरनेट पर तहलका मचा दिया है। मानो या ना मानो मध्यप्रदेश के पानी में कुछ तो ख़ास बात है... pic.twitter.com/8qM15uZVXF — ShivrajSingh Chouhan (@ChouhanShivraj) June 1, 2018 -
‘ఆ మూడు రాష్ట్రాల్లో విజయం మాదే’
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కిసాన్ ఆందోళన్ ర్యాలీని తప్పుబాట పట్టించాలని బీజేపీ భావిస్తోందని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ పేర్కొన్నారు. మాంద్‌సోర్‌లో రైతులపై గత ఏడాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. రైతులు మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా జూన్ ఆరవ తేదీన మాంద్‌సోర్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని చేపట్టనుందని ప్రకటించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్‌పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరై అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని కమల్‌నాథ్ తెలిపారు. కిసాన్ ర్యాలీని నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తే ర్యాలీపై బీజేపీకి ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించి తీరుతుందని కమల్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాజ్‌సింగ్ ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, మద్దతు ధరకోసం ఆందోళన చేసిన మాంద్సోర్ రైతులను కాల్చిచంపారని సీఎంపై ధ్వజమెత్తారు. -
మధ్యప్రదేశ్ సీఎంతో హరీష్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని బృందం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశమయింది. మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ నాలుగో దశ ప్రాజెక్ట్, పునాస లిఫ్ట్ ఇరిగేషన్ లలో పైప్ లైన్ ల ద్వారా ఆయకట్టుకు నీటిని సరఫరా చేస్తున్న విధానంపై ఈ సమావేశంలో చర్చించారు. మద్యప్రదేశ్ భోపాల్ లోని నర్మద వ్యాలి డెవలప్మెంట్ అథారిటి (ఎన్‌వీడీఏ) కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సాగునీటిని విజయవంతంగా పైప్ లైన్ ల ద్వారా రైతులకు ఇస్తున్న తీరు తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ గురించి ఈ సమావేశం సందర్భంగా మధ్యప్రదేశ్ సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిషన్ కాకతీయ నడుస్తున్న తీరును స్వయంగా పరిశీలించాడానికి త్వరలో తెలంగాణ రాష్ట్రానికి వస్తానని శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రి హరీష్ రావు తో అన్నారు.