
కమల్‌నాథ్ (ఫైల్ ఫోటో)
భోపాల్ : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కిసాన్ ఆందోళన్ ర్యాలీని తప్పుబాట పట్టించాలని బీజేపీ భావిస్తోందని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ పేర్కొన్నారు. మాంద్‌సోర్‌లో రైతులపై గత ఏడాది జరిపిన కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. రైతులు మృతి చెంది ఏడాది గడిచిన సందర్భంగా జూన్ ఆరవ తేదీన మాంద్‌సోర్‌లో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీని చేపట్టనుందని ప్రకటించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్‌పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరై అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని కమల్‌నాథ్ తెలిపారు.
కిసాన్ ర్యాలీని నిర్వహించకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తే ర్యాలీపై బీజేపీకి ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించి తీరుతుందని కమల్‌నాథ్ ఆశాభావం వ్యక్తం చేశారు. శివరాజ్‌సింగ్ ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, మద్దతు ధరకోసం ఆందోళన చేసిన మాంద్‌సోర్ రైతులను కాల్చిచంపారని సీఎంపై ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment